ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో బుల్.. లాభాలతో బేర్ ఆపరేటర్లపై కాలు దువ్వుతోంది. దీంతో వరుసగా ఐదో రోజు మార్కెట్లు పరుగు తీశాయి. సెన్సెక్స్ 553 పాయింట్లు జంప్ చేసి 41,893 వద్ద నిలిచింది. తద్వారా 42,000 పాయింట్ల మైలురాయికి చేరువలో ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్లు జమ చేసుకుని 12,264 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు 9 నెలల గరిష్టాలకు చేరాయి. ఈ ఏడాది జనవరి 24న మాత్రమే మార్కెట్లు ఈ స్థాయిలో కదిలాయి. ఫలితంగా జనవరిలోనే నమోదైన చరిత్రాత్మక గరిష్టాలకు మార్కెట్లు కేవలం 2 శాతం దూరంలో నిలవడం విశేషం. ఐదు రోజుల్లోనే సెన్సెక్స్ 2,300 పాయింట్లు పురోగమించడం విశేషం. ఇంట్రాడేలో సెన్సెక్స్ 41,955 వద్ద, నిఫ్టీ 12,280 వద్ద గరిష్టాలను తాకాయి.
కారణాలున్నాయ్
మార్కెట్ల జోరుకు పలు కారణాలున్నట్లు స్టాక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా అమెరికాసహా ప్రపంచ మార్కెట్లు ర్యాలీ చేయడం, తాజాగా ఫెడరల్ రిజర్వ్ ప్యాకేజీలకు మొగ్గు చూపడం, స్టిములస్ కు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 190 బిలియన్ డాలర్లను పెంచడం, ఎఫ్ఐఐలు దేశీయంగా పెట్టుబడులు కుమ్మరించడం వంటి అంశాలు సెంటిమెంటుకు జోష్ నిస్తున్నట్లు తెలియజేశారు. దేశీ స్టాక్స్ లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా 8,530 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. అక్టోబర్లోనూ రూ. 14,537 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే.
ఫార్మా వీక్
ఎన్ఎస్ఈలో ప్రైవేట్ బ్యాంక్స్ 2.2 శాతం జంప్ చేయగా.. రియల్టీ, ప్రభుత్వ బ్యాంక్స్, ఐటీ, మెటల్ 1-0.5 శాతం మధ్య బలపడ్డాయి. ఫార్మా 0.7 శాతం వెనకడుగు వేసింది. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్ఐఎల్, బజాజ్ ఫిన్, ఇండస్ ఇండ్, హెచ్డీఎఫ్సీ ద్వయం, కొటక్ బ్యాంక్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా 3.6-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్ లో మారుతీ, గెయిల్, ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్, నెస్లే, బీపీసీఎల్, సన్ ఫార్మా 3-1 శాతం మధ్య బలహీనపడ్డాయి.
ఎఫ్అండ్ వో..
డెరివేటివ్స్ లో ఐబీ హౌసింగ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, మదర్ సన్, అపోలో టైర్, ఆర్ఐఎల్, ఆర్బీఎల్ బ్యాంక్, శ్రీరామ్ ట్రాన్స్, బంధన్ బ్యాంక్, ముత్తూట్, పేజ్ 5.2- 2.5 శాతం మధ్య జంప్ చేశాయి. అయితే కంకార్, అంబుజా, బాష్, ఏసీసీ, కేడిలా, లుపిన్, ఎల్ఐసీ హౌసింగ్, టొరంట్ ఫార్మా, భెల్ 7-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,512 లాభపడగా.. 1,112 నష్టాలతో నిలిచాయి.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) 5,368 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,208 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు స్వల్పంగా రూ. 146 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు కేవలం రూ. 8 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment