Recap 2020: List Telugu Movie Released on OTT Platforms, Hits, Flops | Telugu Movie Reviews in 2020 - Sakshi
Sakshi News home page

2020 సినిమా రివ్యూ: ఓటీటీలో మెరిసిందెవరు?

Published Wed, Dec 23 2020 6:12 PM | Last Updated on Wed, Dec 30 2020 1:32 PM

Recap 2020: Telugu Movies Released In OTT - Sakshi

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీని దెబ్బకు యావత్‌ ప్రపంచం చిగురుటాకులా వణికిపోయింది. అన్ని రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు అయితే గట్టి దెబ్బ కొట్టింది. 2020లోకి ఎంటరైన మూడు నెలలకే సినిమా థీయేటర్లు మూతపడ్డాయి. దీంతో వేస‌విలో విడుద‌ల కావాల్సిన సినిమాలు బేల చూపులు చూశాయి. ద‌స‌రా, దీపావ‌ళి పండ‌గ‌లు బోసిగా వెళ్లిపోయాయి. ఇక లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన జనాలు.. టీవీలో సీరియల్స్‌, సినిమాలు చూసి బోర్‌గా ఫీలయ్యారు. ఇలాంటి తరుణంలో కొత్త సినిమాలతో దూసుకువచ్చాయి ఓటీటీ వేదికలు. 
(చదవండి : కలిసిరాని 2020.. కళ తప్పిన ‘సినీ’ పండగ)

అప్పటికే వెబ్‌ సిరీస్‌లతో వినోదాన్ని అందిస్తున్న ఓటీటీలు.. లాక్‌డౌన్‌ పుణ్యమా అని కొత్త సినిమాలను విడుదల చేసే చాన్స్‌ కొట్టేశాయి. ఇక థియేటర్లు మూతపడటంతో దర్శక- నిర్మాతలకు కూడా ఓటీటీ వేదికలు ఆపద్భావుడిలా కనిపించాయి. వడ్డీల భారం నుంచి బయట పడేందుకు నిర్మాతలకు సరైన మార్గం దొరికింది. తమ చిత్రాలను ప్రేక్షుల దగ్గరకు తీసుకెళ్లేందుకు ఓటీటీ వేదికలు ఉపయోగపడ్డాయి. అలా అన్ని భాషల చిత్రాలు ఓటీటీలో సందడి చేశాయి. తెలుగులో కూడా పలు చిత్రాలు ఓటీటీ వేదిక ద్వారా విడుదలై, ప్రేక్షకులను పలకరించాయి. అలా తెలుగులో ఓటీటీ వేదిక ద్వారా విడుదలైన చిత్రాలేవో, అవి ఎంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో.. సమగ్ర సమాచారం మీకోసం​. 

ధైర్యం చేసిన ‘అమృతరామమ్‌’
లాక్‌డౌన్‌ సమయంలో ఓటీటీ వేదికగా విడుదలైన తొలి తెలుగు చిత్రం ‘అమృతరామమ్‌’.కొత్త దర్శకుడు సురేందర్ కొంటడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ మిట్టకంటి, అమితా రంగనాథ్ నటించారు. ఈ చిత్రం ఎప్రిల్ 29న జీ5 వేదికగా విడుదలైంది. యూత్‌ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

బెడిసికొట్టిన ‘మహానటి’ ప్రయోగం
‘మహానటి’ ఫేమ్‌ కీర్తి సురేష్ న‌టించిన `పెంగ్విన్‌` జూన్‌ 19న అమేజాన్ ప్రైమ్‌లో వ‌చ్చింది. థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సాగిన ఈసినిమా ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకుంది. ఈశ్వర్‌ కార్తిక్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తి ఓ బిడ్డకు తల్లిగా, గర్భంతో ఉన్న మహిళగా  విలక్షణ పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఆమె ప్రయోగం ఫలించలేదు. వినోదాన్ని పంచడంలో  విఫలమయింది. 

లీల చేసిన ‘కృష్ణ అండ్‌ హీజ్‌ లీలా’
హీరో రానా సమర్పణలో సంజయ్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కృష్ణ అండ్‌ హీజ్‌ లీలా’. ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమాలో సిద్దు జొన్నగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, షాలిని నటించారు. రానా సమర్పించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగాయి. అయితే ఇది మరీ పెద్దగా హిట్‌ కాకపోయినా.. యూత్‌ని మాత్రం బాగా ఆకట్టుకుంది. 

మెప్పించిన ‘బానుమతి రామకృష్ణ’ల ప్రేమ
నవీన్‌ చంద్ర, సలోని లుత్రా నటించిన ‘భానుమతి రామకృష్ణ’ సినిమా ‘ఆహా’ వేదికగా విడుదలైన యూత్‌ని మెప్పించింది. మెచ్యూరిటీ కలిగిన ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

సత్యదేవ్‌ ఖాతాలో మరో హిట్‌
సత్యదేవ్ హీరోగా కంచరపాలేం ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రతీకారం, చిన్నచిన్న ఎమోషన్స్‌తో రూపొందిన ఈ సినిమాలో సత్యదేవ్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

‘ఆహా’ను ఆదుకున్న ‘జోహార్‌’
‘ఆహా’ లో రిలీజ్ అయినా మరో చిత్రం జోహార్‌.  ప్రస్తుత రాజకీయాల ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకర్షించింది. స్వార్థ రాజకీయాల కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించాడు. మంచి లాభాలు తీసుకొచ్చింది

విజయానికి దూరంగా ‘వి’
నాని, సుధీర్‌ బాబు నటించిన ‘వి’ చిత్రం సెప్టెంబర్ 5న భారీ అంచనాలతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. నాని 25వ సినిమా కావడం, తొలిసారి ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నటించడంతో అభిమానులో ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమా చూశారు. కానీ వారి అంచనాలు ‘వి’ అందుకోలేకపోయింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది.

 ‘నిశ్శబ్ధం’గా వెళ్లిన అనుష్క
అనుష్క శెట్టి, మాధవన్ జంటగా ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ తెరకెక్కించిన నిశ్శబ్ధం దారుణంగా నిరాశ పరిచింది. అమెరికాలో భారీగా రూపొందించిన ఈ చిత్రం అత్యంత దారుణంగా ఫ్లాప్ అయింది.

నవ్వులు పూయించిన ‘ఒరేయ్ బుజ్జిగా’
యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా...’. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌కు కొండా విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

కాసులు కురిపించిన ‘కలర్‌ ఫోటో’
ఆహాలో విడుదలైన ‘కలర్‌ ఫోటో’ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. సుహాస్, చాందిని చౌదరి జంటగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను నవ్వించి, కవ్వించి... చివర్లో అందరి చేత కంటతడి పెట్టించింది.  ఈ చిత్రాన్ని సందీప్ రాజ్ తెరకెక్కించాడు. సునీల్ విలన్‌గా నటించాడు. ఆహాకు మంచి లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. 

మిస్‌ఫైర్‌ అయిన ‘మిస్‌ ఇండియా’
కీర్తి సురేష్ నుంచి వచ్చిన మరో ఓటిటి సినిమా మిస్‌ ఇండియా. నరేంద్ర నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ట్రోలింగ్ కూడా జరిగింది. అమెరికాలో ఛాయ్ అమ్మడం కాన్సెప్టు బాగున్నా స్క్రీన్ ప్లే లేకపోవడంతో తేలిపోయింది మిస్ ఇండియా.

‘గతం’మెరిసింది
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా ‘గతం’. కొత్త దర్శకుడు కిరణ్ కొండమాడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 6న విడుదలైంది. రిలీజ్ అయిన తర్వాత మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ పేరు తెచ్చుకుంది. ఇండియన్ పనోరమాకు ఈ చిత్రం ఎంపికైంది.

హృద‌యానికి హ‌త్తుకున్న‘మిడిల్ క్లాస్ మెలొడీస్’
ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించిన సినిమా మిడిల్ క్లాస్ మెలొడీస్. నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ చిత్రానికి తొలిరోజే మంచి టాక్ వచ్చింది. ‌పల్లెటూరు నుంచి గుంటూరు సిటీలో హోట‌ల్ పెట్టుకోవాల‌నుకునే మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుర్రాడి క‌థ నేప‌థ్యంలో ఈ సినిమా సాగుతుంది.

సూర్యకి హిట్‌ ఇచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’
సూర్య హీరోగా సుధ కొంగర తెరకెక్కించిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. సూర్యకు చాలా రోజుల తర్వాత వచ్చిన అద్భుతమైన విజయం ఇది.

‘డర్టీ హరి’కి యావరేజ్‌ టాక్‌
సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా మారిన చేసిన సినిమా డర్టీ హరి. ఎరోటిక్ సస్పెన్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ నటించారు. డిసెంబర్ 18న ఫ్రైడే మూవీస్ యాప్‌లో  విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement