V Movie
-
నాని ‘వీ’ చిత్రంపై కోర్టుకెక్కిన నటి..
బాలీవుడ్ ‘సోను కే టిటు కీ స్వీటీ’ చిత్రంలోని ‘బామ్ డిగ్గీ డిగ్గీ’ అనే పాటతో సాక్షి ప్రాచుర్యంలోకి వచ్చారు నటి, మోడల్ సాక్షి మాలిక్. ఇటీవల ఆమె టాలీవుడ్ హీరో నాని నటించిన వీ చిత్రంపై కోర్టుకెక్కారు. ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిన ఈ చిత్రంలో అనుమతి లేకుండా తన ఫోటోను ఉపయోగించారని ఆరోపిస్తూ నిర్మాతపై బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి ప్రధాన పాత్రలో నటించిన వీ చిత్రంలో.. మొబైల్ ఫోన్లో కమర్షియల్ సెక్స్ వర్కర్ ఫొటోను వేరే వ్యక్తికి చూపించే సన్నివేశం ఉంది. అయితే ఆ ఫొటో తనదేనని ఆరోపిస్తూ సాక్షి మాలిక్ కోర్టుకెక్కారు. దీనిపై స్పందించిన బాంబే కోర్టు.. ‘వి’ చిత్రం స్ట్రీమింగ్ అవుతోన్న ఓటీటీ ప్లాట్‌ఫాంకు ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా వేరే వ్యక్తుల ఫోటోలను, ముఖ్యంగా ప్రైవేట్ ఇమేజ్ను ఉపయోగించడం చట్ట విరుద్ధమని, ఇలా వాడటం వల్ల తమ పరువుకు నష్టం కలింగించవచ్చని పేర్కొంది. సాక్షి మాలిక్ అభ్యంతరం తెలిపిన సినిమాలోని సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఆదేశించింది, సీన్స్ డిలీట్ చేసిన తర్వాతనే సినిమాను తిరిగి అప్లోడ్ చేయాలని ప్రొడక్షన్ హౌజ్‌ను ఆదేశించింది. అదే విధంగా తిరిగి అప్లోడ్ చేసేముందు సాక్షికి చూపించాలని పేర్కొంది. దీంతో ఇప్పటికే ‘వి’ సినిమాను ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి తొలగించారు. కాగా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజ్ నిర్మించిన ఈ చిత్రం గతేడాది సెప్టెంటర్ 5న ఓటీటీలో విడుదలైంది. చదవండి: నాని నో చెప్పాడు.. వైష్ణవ్ ఓకే చేశాడు -
2020 మూవీ రివ్యూ: ఓటీటీలో హిట్టు, ఫట్టు ఇవే
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీని దెబ్బకు యావత్ ప్రపంచం చిగురుటాకులా వణికిపోయింది. అన్ని రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు అయితే గట్టి దెబ్బ కొట్టింది. 2020లోకి ఎంటరైన మూడు నెలలకే సినిమా థీయేటర్లు మూతపడ్డాయి. దీంతో వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలు బేల చూపులు చూశాయి. దసరా, దీపావళి పండగలు బోసిగా వెళ్లిపోయాయి. ఇక లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జనాలు.. టీవీలో సీరియల్స్, సినిమాలు చూసి బోర్‌గా ఫీలయ్యారు. ఇలాంటి తరుణంలో కొత్త సినిమాలతో దూసుకువచ్చాయి ఓటీటీ వేదికలు. (చదవండి : కలిసిరాని 2020.. కళ తప్పిన ‘సినీ’ పండగ) అప్పటికే వెబ్ సిరీస్‌లతో వినోదాన్ని అందిస్తున్న ఓటీటీలు.. లాక్డౌన్ పుణ్యమా అని కొత్త సినిమాలను విడుదల చేసే చాన్స్ కొట్టేశాయి. ఇక థియేటర్లు మూతపడటంతో దర్శక- నిర్మాతలకు కూడా ఓటీటీ వేదికలు ఆపద్భావుడిలా కనిపించాయి. వడ్డీల భారం నుంచి బయట పడేందుకు నిర్మాతలకు సరైన మార్గం దొరికింది. తమ చిత్రాలను ప్రేక్షుల దగ్గరకు తీసుకెళ్లేందుకు ఓటీటీ వేదికలు ఉపయోగపడ్డాయి. అలా అన్ని భాషల చిత్రాలు ఓటీటీలో సందడి చేశాయి. తెలుగులో కూడా పలు చిత్రాలు ఓటీటీ వేదిక ద్వారా విడుదలై, ప్రేక్షకులను పలకరించాయి. అలా తెలుగులో ఓటీటీ వేదిక ద్వారా విడుదలైన చిత్రాలేవో, అవి ఎంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో.. సమగ్ర సమాచారం మీకోసం. ధైర్యం చేసిన ‘అమృతరామమ్’ లాక్డౌన్ సమయంలో ఓటీటీ వేదికగా విడుదలైన తొలి తెలుగు చిత్రం ‘అమృతరామమ్’.కొత్త దర్శకుడు సురేందర్ కొంటడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ మిట్టకంటి, అమితా రంగనాథ్ నటించారు. ఈ చిత్రం ఎప్రిల్ 29న జీ5 వేదికగా విడుదలైంది. యూత్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని రాబట్టలేకపోయింది. బెడిసికొట్టిన ‘మహానటి’ ప్రయోగం ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ నటించిన `పెంగ్విన్` జూన్ 19న అమేజాన్ ప్రైమ్‌లో వచ్చింది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈసినిమా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తి ఓ బిడ్డకు తల్లిగా, గర్భంతో ఉన్న మహిళగా విలక్షణ పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఆమె ప్రయోగం ఫలించలేదు. వినోదాన్ని పంచడంలో విఫలమయింది. లీల చేసిన ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’ హీరో రానా సమర్పణలో సంజయ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’. ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమాలో సిద్దు జొన్నగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని నటించారు. రానా సమర్పించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగాయి. అయితే ఇది మరీ పెద్దగా హిట్ కాకపోయినా.. యూత్‌ని మాత్రం బాగా ఆకట్టుకుంది. మెప్పించిన ‘బానుమతి రామకృష్ణ’ల ప్రేమ నవీన్ చంద్ర, సలోని లుత్రా నటించిన ‘భానుమతి రామకృష్ణ’ సినిమా ‘ఆహా’ వేదికగా విడుదలైన యూత్‌ని మెప్పించింది. మెచ్యూరిటీ కలిగిన ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సత్యదేవ్ ఖాతాలో మరో హిట్ సత్యదేవ్ హీరోగా కంచరపాలేం ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రతీకారం, చిన్నచిన్న ఎమోషన్స్‌తో రూపొందిన ఈ సినిమాలో సత్యదేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ‘ఆహా’ను ఆదుకున్న ‘జోహార్’ ‘ఆహా’ లో రిలీజ్ అయినా మరో చిత్రం జోహార్. ప్రస్తుత రాజకీయాల ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకర్షించింది. స్వార్థ రాజకీయాల కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించాడు. మంచి లాభాలు తీసుకొచ్చింది విజయానికి దూరంగా ‘వి’ నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం సెప్టెంబర్ 5న భారీ అంచనాలతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. నాని 25వ సినిమా కావడం, తొలిసారి ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నటించడంతో అభిమానులో ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమా చూశారు. కానీ వారి అంచనాలు ‘వి’ అందుకోలేకపోయింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. ‘నిశ్శబ్ధం’గా వెళ్లిన అనుష్క అనుష్క శెట్టి, మాధవన్ జంటగా ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ తెరకెక్కించిన నిశ్శబ్ధం దారుణంగా నిరాశ పరిచింది. అమెరికాలో భారీగా రూపొందించిన ఈ చిత్రం అత్యంత దారుణంగా ఫ్లాప్ అయింది. నవ్వులు పూయించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా...’. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు కొండా విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కాసులు కురిపించిన ‘కలర్ ఫోటో’ ఆహాలో విడుదలైన ‘కలర్ ఫోటో’ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. సుహాస్, చాందిని చౌదరి జంటగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను నవ్వించి, కవ్వించి... చివర్లో అందరి చేత కంటతడి పెట్టించింది. ఈ చిత్రాన్ని సందీప్ రాజ్ తెరకెక్కించాడు. సునీల్ విలన్‌గా నటించాడు. ఆహాకు మంచి లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. మిస్‌ఫైర్ అయిన ‘మిస్ ఇండియా’ కీర్తి సురేష్ నుంచి వచ్చిన మరో ఓటిటి సినిమా మిస్ ఇండియా. నరేంద్ర నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ట్రోలింగ్ కూడా జరిగింది. అమెరికాలో ఛాయ్ అమ్మడం కాన్సెప్టు బాగున్నా స్క్రీన్ ప్లే లేకపోవడంతో తేలిపోయింది మిస్ ఇండియా. ‘గతం’మెరిసింది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా ‘గతం’. కొత్త దర్శకుడు కిరణ్ కొండమాడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 6న విడుదలైంది. రిలీజ్ అయిన తర్వాత మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ పేరు తెచ్చుకుంది. ఇండియన్ పనోరమాకు ఈ చిత్రం ఎంపికైంది. హృదయానికి హత్తుకున్న‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించిన సినిమా మిడిల్ క్లాస్ మెలొడీస్. నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ చిత్రానికి తొలిరోజే మంచి టాక్ వచ్చింది. పల్లెటూరు నుంచి గుంటూరు సిటీలో హోటల్ పెట్టుకోవాలనుకునే మధ్యతరగతి కుర్రాడి కథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. సూర్యకి హిట్ ఇచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ సూర్య హీరోగా సుధ కొంగర తెరకెక్కించిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సూర్యకు చాలా రోజుల తర్వాత వచ్చిన అద్భుతమైన విజయం ఇది. ‘డర్టీ హరి’కి యావరేజ్ టాక్ సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా మారిన చేసిన సినిమా డర్టీ హరి. ఎరోటిక్ సస్పెన్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ నటించారు. డిసెంబర్ 18న ఫ్రైడే మూవీస్ యాప్‌లో విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది. -
థమన్ కాపీ కొట్టలేదు: వి దర్శకుడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "అల వైకుంఠపురం" మ్యూజికల్ హిట్ కావడంతో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ కెరీర్‌పరంగా ఓమెట్టు పైకి ఎక్కారు. కానీ నాని 25వ సినిమా 'వి'తో రెండు మెట్లు కిందకు దిగారు. ఈ సినిమాకు థమన్ కేవలం బ్యాక్‌గ్రౌండ్ సంగీతం మాత్రమే అందించారు. అతను ఇచ్చిన బీజీఎమ్ అదిరిపోయింది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ సంగీతం రాక్షసన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సహా మరికొన్ని సినిమాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను గుర్తు చేస్తోంది. దీంతో థమన్ మరోసారి కాపీ చేశాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ ఆరోపణలపై వి దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ స్పందించారు. (చదవండి: నాని.. 'వి' సినిమా రివ్యూ) ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ "అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్లు కూడా ఆల్రెడీ ఉన్న మ్యూజిక్‌నే వాడుతున్నారేంటి? అని అడిగారు. నిజానికి రాక్షసన్‌లో వచ్చే బీజీఎమ్, 'వి'లో థమన్ వాడిన బీజీఎమ్ రెండూ ఒకేలా కనిపించినా అది వేర్వేరు. కాకపోతే మనవాళ్లకు సంగీత పరిజ్ఞానం లేకపోవడంతో కాపీ అంటున్నారు. ఈ ఒక్క సినిమానే కాదు వేరే సినిమాల్లో కూడా సంగీత దర్శకులు కాపీ కొట్టకపోయినా వారిపై కాపీ నిందలు వేస్తారు. అతను సితార్ వాడాడు.. ఇతను సితార్ వాడాడు.. అతను వయొలిన్ వాయించాడు, ఇతను వయొలిన్ వాయించాడు.. సౌండ్స్ సేమ్ అనిపిస్తే చాలు.. కాపీ అనేస్తారు. థమన్ ఎంతో ప్రతిభావంతుడు. అతను కాపీ చేయకపోయినా ఇంత గొడవ చేస్తున్నారు. అలాంటిది నిజంగా చేసుంటే ఊహించలేమేమో" అని ఇంద్రగంటి చెప్పుకొచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలను ఇంద్రగంటి ఖండించినందుకు తమన్ సంతోషంగా ఫీల్ అయ్యారు. సంగీత దర్శకులు కూడా ఇంత చక్కగా వివరణ ఇవ్వలేరని, లవ్యూ సర్.. అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: పట్టు పట్టు ట్రెండే పట్టు.. మనసులు కొల్లగొట్టు!) -
ఎంతసేపు కనిపించామన్నది ముఖ్యం కాదు
‘‘ఈ లాక్డౌన్లో తెలుగు నేర్చుకుంటున్నాను. అలాగే ఈ ఆరు నెలలు సహనంతో ఎలా ఉండాలి? దయగా ఎలా ఉండాలి? అనేది నేర్పించాయి’’ అంటున్నారు అదితీ రావ్ హైదరీ. శుక్రవారం రాత్రి అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘వి’ చిత్రంలో ఆమె ఒక హీరోయిన్గా నటించారు. నాని విలన్‌గా, సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించారు. ఆదివారం అదితీ రావ్ హైదరీ మీడియాతో మాట్లాడుతూ – ‘‘వి’ సినిమాలో నానీతో నా ప్రేమకథ చాలా ఉద్వేగంగా ఉంటుంది. సినిమాకు హార్ట్ లాంటి పాత్రలో నటించటం చాలా ఆనందంగా ఉంది. సినిమాలోని నా పాత్ర నిడివి తక్కువగా ఉండటం గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఓ సినిమాలో ఎన్ని నిమిషాలు కనబడ్డాం అనేది ముఖ్యం కాదు.. ఆ పాత్రలో ఎంత బాగా నటించాం? దానికి ఎంత పేరొచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇంద్రగంటి మోహనకృష్ణగారే నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేశారు. ఆయన దర్శకత్వంలో సినిమా చేయటం బావుంటుంది. ఆయన సినిమాలో క్యారెక్టర్స్ మాట్లాడే విధానం కొత్తగా ఉంటుంది. ‘వి’ సినిమాని థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి చూద్దామనుకున్నాను. అది మిస్సయ్యాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని డిజిటల్లో రిలీజ్ చేయాలన్నది మంచి నిర్ణయమే. ప్రస్తుతం నేను బాలీవుడ్ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను. మేం ఉంటున్న కార్వ్యాన్స్ను గంటకోసారి శానిటైజ్ చేయడంతో పాటు షూటింగ్ టైమ్‌లో తక్కువ మంది సెట్లో ఉండేటట్లు ప్లా¯Œ చేశారు. ప్రస్తుతం నా చేతిలో మూడు హిందీ సినిమాలు, రెండు తమిళ్ సినిమాలు, ఒక తెలుగు సినిమా.. మొత్తం ఆరు సినిమాలు ఉన్నాయి’’ అన్నారు. -
నాని.. 'వి' సినిమా రివ్యూ
టైటిల్: వి జానర్: క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తారాగణం: నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు దర్శకుడు: ఇంద్రగంటి మోహనకృష్ణ నిర్మాత: దిల్ రాజు సంగీతం: అమిత్ త్రివేది నేపథ్య సంగీతం: థమన్ సినిమాటోగ్రఫీ: పి.జి. విందా విడుదల తేదీ: 5-9-2020, అమెజాన్ ప్రైమ్ 'అష్టా చమ్మా' చిత్రంతో హీరో నాని ప్రస్థానం మొదలైంది. తొలి చిత్రంతోనే నానికి బంపర్ హిట్‌ను అందించారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అయితే అనూహ్యంగా మళ్లీ ఆయన డైరెక్షన్లోనే నాని 25వ సినిమా చేయడం విశేషం. ఇక ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలకే మొగ్గు చూపే నాని ఈ సారి ప్రతినాయక పాత్రలో కనిపించడంతో 'వి' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 5న) అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయింది. లాక్డౌన్ తర్వాత ఓటీటీలో విడుదలైన భారీ తెలుగు చిత్రం ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో యంగ్ హీరో సుధీర్‌బాబు, విలన్ ఛాయలున్న పాత్రలో నాని ప్రేక్షకులను మెప్పించారా? లేదా? ఈ ఇద్దరిలో చివరికి ఎవరు హీరో అయ్యారో చూసేద్దాం... కథ: డీసీపీ ఆదిత్య(సుధీర్ బాబు) దమ్మున్మ పోలీసాఫీసర్. గ్యాలంటరీ మెడల్ సహా ఎన్నో అవార్డులు అందుకున్న ఆయనకు అత్యంత కిరాతకంగా హత్యలు చేసే కిల్లర్ విష్ణు(నాని) దమ్ముంటే తననాపమని సవాలు విసురుతాడు. అతని డిపార్ట్మెంట్లోని ఓ పోలీసును ఆయన ఇంట్లోనే హత్య చేస్తాడు. ఆ తరువాత ఒక్కొక్కరిని రకరకాలుగా చంపుతూ నెక్స్ట్ ఏంటి? అనేది క్లూ ఇస్తాడు. ఈ క్లూ తెలుసుకోగలిగితే నేరస్థుడిని పట్టుకోవచ్చని డీసీపీ తన ప్రేయసి అపూర్వ (నివేదా థామస్) సాయం కోరతాడు. కానీ చివరికి అతని మెదడులోనే మెరుపులాంటి ఆలోచన చేరి అతనే పజిల్ విప్పుతాడు. వెంటనే నేరస్థుడిని, అదే నానిని పట్టుకునేందుకు పరుగెత్తుతాడు. కానీ విలన్ అంత వీక్ కాదు.. చిక్కినట్లే చిక్కి తప్పించుకుని మళ్లీ హత్యలు చేస్తుంటాడు. అసలు వీ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? డీసీపీ ఆదిత్యకు ఎందుకు చాలెంజ్ విసిరాడు? ఆదిత్య కిల్లర్‌ను పట్టుకున్నాడా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే! (చదవండి: నేను హ్యాపీ అని ‘దిల్’రాజు అన్నారు) విశ్లేషణ: సుధీర్‌బాబు ఎంట్రీ సీన్‌తోనే పోలీస్‌గా పర్ఫెక్ట్గా సూటయ్యారనిపిస్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ హత్యతో కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు మోహనకృష్ణ. హంతకుడు ఎంతో సులువుగా ఒక్కొక్కరినీ చంపుకుంటూ వెళ్లడం, అతడి కోసం డీసీపీ గాలించడం వంటి సన్నివేశాలతోనే ఫస్టాఫ్ నడుస్తుంది. డీసీపీకి హంతకుడు కనిపించి, తప్పించుకోవడంతో ప్రథమార్థం ముగుస్తుంది. ద్వితీయార్థం మరింత రక్తికట్టిస్తారనుకుంటే అలా జరగలేదు. ఇక్కడ కథనం నెమ్మదించింది. హత్యల వెనక కారణాన్ని తెలుసుకునేందుకు డీసీపీ ప్రయత్నాలు మొదలు పెడతాడు. (చదవండి: పెంగ్విన్ మూవీ రివ్యూ) అలా విష్ణు ఫ్లాష్‌బ్యాక్ వస్తుంది.. ఇక్కడ సస్పెన్స్ రివీల్ కావడంతో సినిమా అంత ఆసక్తిగా సాగదు. ఇక హంతకుడి ఒప్పందం ప్రకారం అతడిని పట్టుకోనందుకు డీసీపీ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఆ తర్వాత క్లైమాక్స్‌లో వస్తుంది అసలు ట్విస్ట్. హత్యల వెనక కారణాన్ని హంతకుడే తెలియజేస్తాడు. కానీ ఈ తరహా కారణాలు చాలా సినిమాల్లో కనిపించాయి. అయితే అన్ని మెడల్స్ సాధించి, పెద్ద పేరు గడించిన డీసీపీ.. నేరస్థుడు క్లూ వదిలినా పట్టుకోలేకపోవడం కొంత లాజిక్‌గా అనిపించదు. దర్శకుడు రాసుకున్న కథ బాగానే ఉన్నా కథనం అంత బలంగా లేదు. క్రైమ్ థ్రిల్లర్ చిత్రం కాబట్టి కామెడీ చొప్పించే ప్రయత్నం చేయలేదు. కాకపోతే సీరియల్ కిల్లర్‌గా భయపెట్టిన నాని అక్కడక్కడా చిలిపి నానిగా కనిపించారు. ప్రతినాయక పాత్రలోనూ నాని సులువుగా నటించారు. హత్యలు చేసేటప్పుడు వచ్చే డైలాగులు బాగున్నాయి. చివరి రెండు హత్యలు వెన్నులో వణుకుపుట్టిస్తాయి. నవలా రచయితగా, డీసీపీ ఆదిత్య ప్రేయసిగా అపూర్వ పాత్రలో నివేదా థామస్ రాణించారు. కథకు మూలమైన సాహెబ్ పాత్రలో అదితిరావు హైదరి బాగా నటించారు. మిగతావారు తమ పాత్రలకు న్యాయం చేశారు. కొన్నిచోట్ల వచ్చే సంగీతం 'రాక్షసుడు' థీమ్ మ్యూజిక్‌ను గుర్తు చేస్తుంది. పాటలు పర్వాలేదు. పి.జి. విందా సినిమాటోగ్రఫీకి తిరుగులేదు. (చదవండి: ‘వి’ తర్వాత అభిమానులు పెరుగుతారనుకుంటున్నా!) ప్లస్: నాని, సుధీర్‌బాబుల నటన ఫస్టాఫ్ మైనస్: కథనం బలహీనంగా ఉండటం సెకండాఫ్ నెమ్మదించడం ఒక్కమాటలో: ఎక్స్పెక్టేషన్స్కు మ్యాచ్ అవలేదు. -
‘వి’ తర్వాత అభిమానులు పెరుగుతారనుకుంటున్నా!
నాని, సుధీర్‌బాబు, అదితీ రావు హైదరీ, నివేధా థామస్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శనివారం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్న సందర్భంగా నాని చెప్పిన విశేషాలు. ► కొత్త కంటñ ంట్‌తో వచ్చే సినిమా చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ టైమ్‌లో ‘వి’ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం రావటం అదృçష్టంగానే భావించాలి. ఇంత మంచి సినిమాని థియేటర్లో చూస్తే బావుండేదే అనిపిస్తుంది. కానీ, తప్పదు. ఓటీటీ ఓ కొత్త ఎక్స్పీరియన్స్. నా ప్రతి సినిమాని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఉదయం 8.45 షోను కర్టెన్ పక్కన నిలబడి చూసేవాణ్ణి. అది మిస్ కాకూడదని థియేటర్ ఫీలింగ్ కోసం మా ఫ్యామిలీకి ఓ షో వేస్తున్నాను. ► ఇంద్రగంటిగారితో నా ఫస్ట్ సినిమా ‘అష్టా చమ్మా’ చేశాను. ఈ పన్నెండేళ్లలో నేను, ఆయన వ్యక్తిగతంగా కొంచెం కూడా మారలేదు. కానీ వృత్తిపర ంగా దర్శకునిగా ఇంద్రగంటిగారు, నటునిగా నేను, కెమెరామేన్‌గా విందా చాలా గొప్పగా ఎదిగాం అనిపించింది. ఈ ‘వి’ సినిమాకి హీరో ఇంద్రగంటిగారే. మా ‘అష్టా చమ్మా’ రిలీజ్ రోజునే ఈ సినిమా కూడా విడుదలవ్వటం అనుకోకుండా జరుగుతోంది. ► ‘వి’ సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాత వస్తాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుందనుకుంటున్నా (న వ్వుతూ). ఇప్పుడు జనరేషన్ ఆడపిల్లలు బ్యాడ్బాయ్స్నే ఇష్టపడుతున్నారు. కావాలంటే చూడండి రానా, సోనూ సూద్‌లకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ‘వి’ కథ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. చాలామంది చివరికి వచ్చేసరికి నాని హీరో అవుతాడు, సుధీర్ విలనవుతాడని రాస్తున్నారు. అసలు అలాంటిదేం లేదు. లైఫ్ అంతా సాఫీగా నడుస్తోన్న ఒక సెలబ్రిటీ పోలీస్ లైఫ్‌లోకి ఒకడొచ్చాడు. ఇంతే సినిమా. సినిమా చూసిన ప్రేక్షకులు ఆ పాత్రలకు కనెక్ట్ అయి చిన్న ఎమోషన్ ఫీలవుతారు. ► ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాను ఇలా (ఓటీటీలో) విడుదల చేస్తున్నందుకు ‘దిల్’ రాజుగారు చాలామందికి సమాధానం చెప్పాలి. ఆయన కూడా ఓ డిస్ట్రిబ్యూటర్. రాజుగారూ.. మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీతో పాటు మేమున్నాం అని నావైపు నుండి పూర్తిగా సపోర్ట్ చేశాను. నిర్మాతకు నష్టం రాకుండా చూసుకోవటం మన బాధ్యత. ► లాక్డౌన్ ముందు రాజమండ్రిలో 20 రోజులు, పళనిలో 15 రోజులు షూటింగ్ చేశాను. షూటింగ్ చేసొచ్చిన ప్రతిసారీ మా అబ్బాయి జున్ను కొత్తగా కనిపిస్తుంటాడు. త్వరగా పెరిగిపోతున్నాడే, ఇలాంటి క్యూట్ ఏజ్‌ను మిస్ అవుతున్నానే అనుకునేవాణ్ణి. ఈ లాక్డౌన్లో 24 గంటలూ వాడితో టైమ్ స్పెండ్ చేస్తున్నాను. ► నటులందరూ బాధ్యతగా ఉండి నిర్మాతకు డబ్బు రాకపోతే అసలు రూపాయి కూడా తీసుకోకుండా పని చేయొచ్చు. అంతేకానీ ఒక్కో నటునికి 20 శాతం, 30 శాతం కట్ చేయాలని చాంబర్ రూల్ పెట్టిందని కాకుండా ఎవరికి వారు తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. అంతేకానీ ఈ సమస్యను జనరలైజ్ చెయ్యకూడదు. ► ‘టక్ జగదీష్’ సినిమా 50 శాతం పూర్తయింది. అక్టోబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ‘శ్యామ్‌సింగరాయ్’ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ‘టక్ జగదీష్’ పూర్తవ్వగానే అది మొదలవుతుంది. మరో రెండు కథలు ఓకే చేశాను. ఒకటి కొత్త దర్శకుడు, మరోటి ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్‌తో చేస్తాను. ► జనరల్‌గా నేను ఫిట్నెస్ మీద పెద్దగా శ్రద్ధ పెట్టను కాబట్టి ఇప్పుడొచ్చిన గ్యాప్‌లో ఫుల్‌గా ఫిట్నెస్ పెంచుకుని సిక్స్‌ప్యాక్ చేద్దామనుకున్నాను. అలాగే పియానో నేర్చుకుందామనుకున్నాను. మా అమ్మ దగ్గర వంట నేర్చుకుందామనుకున్నాను. కానీ ఏమీ చేయలేదు. తినడం.. పడుకోవటం.. మా జున్నుతో ఆడుకోవటంతోనే ఆరు నెలలు గడిచిపోయాయి. -
బ్రాడ్ పిట్లా ఉండాలన్నారు
నాని, సుధీర్‌బాబు నటించిన మల్టీస్టారర్ సినిమా ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు చెప్పిన విశేషాలు ► ‘వి’ సినిమా రాక్షసునికి, రక్షకునికి మధ్య జరిగే పోరాటం. నేను హీరో, నాని విలన్. ఇద్దరం కొలతలేసుకుని నటించలేదు, క్యారెక్టర్ల ప్రకారం నడుచుకున్నాం. రెండు పాత్రలకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది. నేను ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయ్యేటప్పటికే అక్కడ రాక్షసుడు (అప్పటికే నాని ఈ పాత్రకు కన్ఫార్మ్ అయ్యారు) ఉన్నాడు. అందుకే నేను రక్షకుడు అయ్యాను. ఒకవేళ రెండు పాత్రలు నాకు చెప్పి నన్ను ఎన్నుకోమన్నా నేను పోలీసాఫీసర్ పాత్రనే ఎన్నుకునేవాణ్ణి. అంటే... ఇదే బెటర్ రోల్ అని చెప్పడంలేదు. కానీ నాకు ఇది కొత్త, నానీకి అది కొత్తగా ఉంటుంది. ► ఇంద్రగంటి గారంటే మహేశ్‌గారికి ఫుల్ నమ్మకం. ‘సమ్మోహనం’ సమయంలో రాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసి ఈ సినిమా బావుంటుందని ధైర్యం చెప్పారు. మొన్నీ మధ్య మహేశ్‌గారిని కలిసినప్పుడు కూడా ‘వి’లో యాక్షన్ సీక్వెన్స్ బాగుంది, యాక్షన్ కొరియోగ్రఫీ ఎవరు? అని అడిగారు. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు మహేశ్. ఇందగ్రంటిగారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఫైట్స్ నేచురల్‌గా ఉండాలనుకుంటున్నాను అని నా బాడీ ఎలా ఉండాలో చెప్పారు. చూడటానికి లావుగా ఉండకూడదు, కానీ చొక్కా విప్పితే కండలు ఉండాలని చెప్పారు. ఉదాహరణకి బ్రాడ్ పిట్లా ఉండాలన్నారు. అదే నాకు మోటివేషన్‌లా అనిపించింది. ► లాక్డౌన్లో అందరిలానే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. చూడాలనుకున్న చాలా సినిమాలు చూసే తీరిక దొరికింది, చూశాను. అలానే చాలా కథలు విన్నాను. అందులో రెండు కథలకి ఓకే చెప్పాను. ఈ డిసెంబర్ నుండి పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లో నటిస్తున్నాను. ఇది ప్యాన్ ఇండియా సినిమా. -
థ్రిల్లింగ్‌గా ‘వి’ సినిమా ట్రైలర్
దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘వి’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా నాని కెరీర్లో 25 వది కావడం విశేషం. బుధవారం ‘వి’ ట్రైలర్‌ని నాని ట్విటర్లో విడుదల చేశారు. అంచనాలకు తగ్గట్టుగా సినిమా ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. నాని, సుధీర్‌బాబు మధ్య యాక్షన్, ఛేజింగ్ సీన్స్ థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా వయెలెంట్‌గా ఉండనుందని ట్రైలర్లో నాని డైలాగ్స్‌ని బట్టి అర్థమవుతోంది. నివేదా థామస్, అదితీ రావ్ హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’రాజు, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి సినిమాని నిర్మించారు. సినిమా సెప్టెంబరు 5న ఓటీటీలో (అమెజాన్ ప్రైమ్)లో ఈ సినిమా విడుదల కానుంది. -
వి ఇంటికి వస్తోంది
‘‘పన్నెండేళ్లుగా నా కోసం మీరు థియేటర్‌కు వచ్చారు. ఇప్పుడు నేను మీ కోసం, మీకు ధన్యవాదాలు చెప్పేందుకు మీ ఇంటికే వస్తున్నాను. మీ స్పందన తెలుసుకోవాలనే ఉత్సుకతతో పాటు.. ‘వి’ సినిమా రిలీజ్ విషయంలో కొంచెం నెర్వస్‌గానూ అనిపిస్తోంది’’అంటూ హీరో నాని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. సుధీర్‌బాబు, నాని, నివేదా థామస్, అదితీ రావ్ హైదరి ముఖ్య పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వి’. ‘దిల్’రాజు, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా థియేటర్లో విడుదలవుతుందా? ఓటీటీలోనా? అనే సందిగ్ధం చాలా రోజులుగా ఉండేది. అయితే ‘వి’ సినిమా సెప్టెంబరు 5న ఓటీటీలోనే (అమెజాన్ ప్రైమ్) విడుదల కానున్నట్లు నాని స్పష్టం చేశారు. తన సోషల్ మీడియాలో నాని ఓ లేఖను షేర్ చేశారు.. దాని సారాంశం ఇలా... ‘‘నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన 25వ చిత్రం డిజిటల్ ఫార్మెట్లో విడుదలవుతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇలా డిజిటల్ ఫార్మెట్లో విడుదల కావడం నాకు గొప్ప మధురానుభూతిగా మిగిలిపోయేలా సెలబ్రేట్ చేసుకుందాం (అభిమానులను ఉద్దేశించి). థియేటర్లు తెరుచుకోగానే ‘టక్ జగదీశ్’ సినిమాతో సిద్ధంగా ఉంటా.. ఒట్టు’’ అని నాని పేర్కొన్నారు. -
ఓటీటీలో విడుదల
థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. ఒకవేళ ఓపెన్ అయినా ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా? అనేది పెద్ద డౌట్. ఆల్రెడీ చిన్న సినిమాలు మెల్లిగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. హిందీలో కొన్ని పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టాయి. కానీ తెలుగులో పెద్ద సినిమా ఏదీ ఓటీటీలో విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం నేరుగా ఓటీటీలో (అమెజాన్ ప్రైమ్) విడుదల కానున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే వారం రానుందని తెలిసింది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించారు. దాదాపు 35 కోట్ల వ్యయంతో ఈ సినిమా రూపొందినట్టు సమాచారం. సౌత్ లో ఇంత వ్యయంతో రూపొంది, ఓటీటీలో విడుదలవుతున్నతొలి భారీ చిత్రమిదే అవుతుంది. అదితీ రావ్ హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నాని విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇది ఆయన కెరీర్ లో 25వ చిత్రం. -
‘వి’ డైరెక్టర్‌తో చైతూ చిత్రం?
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ‘వి’చిత్రం విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత డైరెక్టర్ మరో సినిమాను ప్రకటించలేదు. అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా గురించి అప్డేట్ వస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విభిన్న చిత్రాల డైరెక్టర్ తన తదుపరి చిత్రం అక్కినేని నాగ చైతన్యతో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. వాస్తవానికి నాగచైతన్యతో సినిమా తీయాలని మోహన్‌కృష్ణ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారని టాలీవుడ్ టాక్. అయితే ఈమధ్య చైతూకు కథ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వకంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంతో నాగచైతన్య బిజీగా ఉన్నారు. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్న విషయం తెలిసిందే. అన్నీ కుదరితే ‘లవ్ స్టోరీ’ తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కె అవకాశం ఉంది. ఇక తన ప్రతీ సినిమాలో హీరోయిజాన్ని కొత్తగా చూపించే ఈ డైరెక్టర్ చైతూను ఎలా చూపిస్తాడో వేచి చూడాల్సిందే. చదవండి: ‘మా కోసం గడపదాటి వచ్చావయ్యా!’ క్రికెటర్ టు స్టూడెంట్! -
అప్పుడు నిర్మాతగా.. ఇప్పుడు హీరోగా?
అటు హీరోగా ఇటు నిర్మాతగా ఫుల్ జోష్‌లో ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో నటించిన ‘వి’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అయితే ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ‘వి’ తర్వాత తన తదుపరి చిత్రాలు ‘టక్ జగదీష్’, ‘శాం సింగరాయ్’ అంటూ ప్రకటించాడు. వీటితో పాటు ‘బ్రోచేవారెవరురా’ఫేం వివేక్ ఆత్రేయతో ఓ సినిమాను పట్టాలెక్కించే పనిలో నాని ఉన్నట్లు టాలీవుడ్ టాక్. అయితే తాజాగా ‘హిట్’ఫేం శైలేష్ కొలనుతో నాని ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ మధ్య నానికి ఓ ఆసక్తికర పాయింట్‌ను శైలేష్ వినిపించాడని, అది నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేయమన్నాడని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అంతా సవ్యంగా జరిగితే... హిట్ సినిమా దర్శకుడితో నాని హీరోగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వక్ సేన్ ‘హిట్’ చిత్రానికి నానినే నిర్మాత అన్న విషయం తెలిసిందే. నిర్మాతగా నానికి విజయాన్ని అందించిన శైలేష్ మరి హీరోగా నానిని తెరపై ఎలా చూపిస్తాడో చూడాలి. అయితే వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం లాక్డౌన్ సమయాన్ని వీర్దిదరు కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నారు. చదవండి: చైనా కావాలనే ఇలా చేసింది : హీరో నిఖిల్ కరోనా.. సీసీసీకి కాజల్ విరాళం -
విడుదల వాయిదా
తన 25వ చిత్రాన్ని ఈ నెల 25న ఆడియన్స్‌కు చూపించాలనుకున్నారు నాని. అయితే ప్లాన్ మారింది. కరోనా వైరస్ కారణంగా ‘వి’ చిత్రం విడుదల వాయిదా పడింది. నాని, సుధీర్‌బాబు, అదితీ రావ్ హైదరీ, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించారు. ఇది నాని కెరీర్లో 25వ సినిమా. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు నాని. ఉగాది రోజున ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను ఏప్రిల్‌కు వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘మార్చిలో కరోనాను చంపేద్దాం. ఏప్రిల్ నెలలో ఉగాదిని జరుపుకుందాం’’ అని ట్వీట్ చేశారు నాని. -
నాని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ (కోవిడ్-19) ఎఫెక్ట్ నాని సినిమాపై పడింది. ఈ మహమ్మారి కారణంగా నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు నటించిన 'వి' సినిమా విడుదల వాయిదా పడింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు,శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వ వహించారు. మల్టీస్టారర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేదా థామస్, అదితి రావు హైదరి కథానాయికలుగా నటించారు. (చదవండి : ఆసక్తికరంగా ‘వి’ టీజర్) సినిమాను విడుదలను వాయిదా వేస్తున్నట్టు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఉగాది సందర్భంగా మార్చి 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించినప్పటికీ, కరోనా వైరస్ కారణంగా మూవీని ఏప్రిల్‌కి వాయిదా వేశారు. కరోనా నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు శనివారం తెలంగాణ ఫిల్మ్ చాంబర్లో నిర్మాతల మండలి భేటి అయింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్ల మూసివేతపై చర్చించారు. ప్రభుత్వం ఎప్పుడు చెబితే అప్పుడు థియేటర్లు మూసివేయడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మాతల మండలి పేర్కొంది. -
నాని సినిమాకు కరోనా ఫీవర్
నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘వి’. నివేదా థామస్, అదితిరావు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘అష్టాచమ్మా’, ‘జెంటిల్మన్’ సినిమాల దర్శకుడు మోహన్‌కృష్ణ ఈ సినిమాతో మరోసారి నానీతో జోడీ కట్టాడు. ఇది నానికి 26వ సినిమా. ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఈ పాటికే ప్రకటించింది. అయితే ప్రస్తుతం దేశమంతటా కరోనా టెన్షన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో సినిమా రిలీజ్ చేస్తే.. వైరస్ దెబ్బకు జనాలు థియేటర్ వరకు వస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఇప్పటికే విడుదలైన నాని విలన్ లుక్, వి టీజర్‌కు మంచి స్పందన వస్తోంది (అష్టాచమ్మాలో నానికి అవకాశం ఎలా వచ్చిందంటే...) ఇలాంటి సమయంలో సినిమా రిలీజ్ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకని నిర్మాత దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎందుకైనా మంచిదని, కాస్త కరోనా ఫీవర్ తగ్గిన తర్వాతే సినిమా విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం ఉగాదికి కాకుండా మరికొద్ది రోజులు ఆలస్యంగా విడుదల కానుంది. కొత్త రిలీజ్ డేట్ తెలియాంటే చిత్ర యూనిట్ మరో డేట్‌ను ప్రకటించేవరకు ఓపిక పట్టాల్సిందే. కగా ఈ సినిమా నుంచి రిలీజైన ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా..’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సీతారామ శాస్త్రి రచించిన ఈ పాటను అమిత్ త్రివేది, శ్రేయా ఘోషల్ ఆలపించారు. (నాని విలన్ లుక్!) -
‘సోదాపు.. దమ్ముంటే నన్నాపు’
‘సోదాపు.. దమ్ముంటే నన్నాపు’ అంటూ సుధీర్ బాబుకు సవాల్ విసురుతున్నాడు నాని. నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబులు నటిస్తున్న చిత్రం ‘వి’. అదితిరావు హైదరి, నివేదా థామస్ కథానాయికలుగా కనిపిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పోలీసు ఆఫిసర్‌గా సుధీర్ బాబు.. నెగటీవ్ షేడ్స్ ఉన్న రాక్షసుడు పాత్రలో నాని కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై ఎంతో ఆసక్తిని పెంచిన నేపథ్యంలో తాజాగా నేడు(సోమవారం) ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో నాని, సుధీర్ల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. (చదవండి : నాని, సుధీర్‌లకు పోటీగా రాజ్ తరుణ్?) ‘ పూల్స్ మాత్రమే రూల్స్ గుట్టిగా ఫాలో అవుతారు సార్. అప్పుడప్పుడు నాలాంటోడు కొద్దిగా రూల్స్ బ్రేక్ చేస్తాడు అంతే’ అంటూ సుధీర్ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. టీజర్ చివర్లో సుధీర్‌ను ఉద్దేశిస్తూ నాని ‘న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడడానికి నువ్వు వస్తున్నావనగానే విజిల్స్ వేయడానికి నేనేమి నీ ఫ్యాన్ కాదురా’,, ‘సోదాపు దమ్ముంటే నన్నాపు’ అని చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానుంది. -
‘టీజర్ ఎప్పుడు వస్తుందో చెప్పిన నాని’
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబులు నటిస్తున్న చిత్రం ‘వి’. అదితిరావు హైదరి, నివేదా థామస్ కథానాయికలుగా కనిపిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఓ రేంజ్లో ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ను చిత్ర బృందం తెలిపింది. ‘వి’ చిత్ర టీజర్‌ను రేపు(సోమవారం) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని హీరో నానితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు తమ ట్విటర్ ద్వారా తెలిపారు. నాని తన 25వ చిత్రంలో పూర్తి నెగటీవ్ షేడ్స్ ఉన్న రాక్షసుడు పాత్రలో కనిపిస్తుండగా.. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రక్షకుడిగా సుధీర్ బాబు మెప్పించనున్నాడు. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానుంది. చదవండి: నాని, సుధీర్‌లకు పోటీగా రాజ్ తరుణ్? నాని ‘రాక్షసుడు’.. అదిరిపోయింది -
నాని, సుధీర్‌లకు పోటీగా రాజ్ తరుణ్?
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఫుల్ అండ్ ఫుల్ అండ్ ఎంటర్టైనర్గా తెరెకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అయితే అదే రోజు నాని, సుధీర్ బాబుల ‘వి’ చిత్రం కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫ్లాఫ్లతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ తన చిత్రాన్ని అదే తేదీన విడుదల చేస్తాడో లేదో వేచి చూడాలి. ఇక కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ అ తర్వాత వరుస అపజయాలతో వెనకబడ్డాడు. ఏడాదికి రెండు మూడు చిత్రాలతో పలకరించే ఈ యంగ్ హీరో ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో కొండా విజయకుమార్ దర్శకత్వంలో యూత్ ఎంటర్టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాన్ని చేస్తున్నారు. మాళవిక నాయర్‌తో పాటు హెబ్బా పటేల్ కూడా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పాత్ర చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్. ఇప్పటివరకు రాజ్ తరుణ్-హెబ్బాల కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో వారిద్దిరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఈ చిత్రంపై కూడా అందరిలోనూ అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూబ్ రుబెన్స్ సంగీతమందిస్తున్నారు. చదవండి: క్యాన్సర్ కదా... అందుకే: నటుడి భావోద్వేగం! ‘అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా?’ -
ఉగాదికి రెడీ
నానీతో ‘అష్మాచమ్మా, జెంటిల్మన్’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి వారిద్దరి కలయికలో తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘వి’. అదితీరావు హైదరీ, నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేష¯Œ ్స పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 17న విడుదల చేస్తున్నారు. సినిమాను ఉగాది సందర్భంగా మార్చి 25న రిలీజ్ చేస్తున్నారు. నాని 25వ చిత్రం ‘వి’. ఇందులో నాని రాక్షసుడి తరహా పాత్రలో కనిపించనున్నారు. ఆయన బారి నుంచి అందర్నీ కాపాడే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్‌బాబు నటించారు. ఇటీవల వీరిద్దరి పాత్రల లుక్స్‌ను విడివిడిగా విడుదల చేసిన చిత్రబృందం ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది. సుధీర్‌బాబు స్టైలిష్ లుక్‌తో కనబడుతుంటే.. నాని మెలితిప్పిన మీసాలతో రగ్డ్ లుక్‌లో కనబడుతున్నారు. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు త్వరలో పూర్తి కానున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, నేపథ్య సంగీతం: తమన్, కెమెరా: పి.జి.విందా. -
నాని ‘రాక్షసుడు’.. అదిరిపోయింది
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో రూపోందుతున్న చిత్రం ‘వి’. అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ‘అష్టా చమ్మా’, ‘నాని జెంటిల్మన్’ వంటి హిట్ చిత్రాలను నానికి అందించిన మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జెంటిల్మన్ తరహాలో నాని నెగటీవ్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. తన 25వ చిత్రంలో నేచరల్ స్టార్ రాక్షసుడుగా కనిపించనున్నారని చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ‘వి’ చిత్రంలోని నాని రాక్షసుడుకు సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన లుక్‌లో నాని గడ్డంతో రఫ్ లుక్ లో కనిపిస్తూ... చేతిలో కత్తెర, చేయి మీద నుండి కారుతున్న రక్తంతో అదిరింది. ఈ లుక్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే విడుదలైన సుధీర్ బాబు రక్షకుడుకు సంబంధించిన లుక్ నెటిజన్లను ఆకట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా నాని లుక్ కూడా డిఫరెంట్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌కు వెళ్లాయి. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. Hi 😈#VTheMovie pic.twitter.com/6sQWGu7yOl — Nani (@NameisNani) January 28, 2020 -
శర్వా కూల్.. గన్ పట్టిన సుధీర్
యంగ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళ చిత్రం ‘96’రీమేక్ విడుదలకు సిద్దం అవుతుండగానే మరో సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. నూతన డైరెక్టర్ కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘శ్రీకారం’అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాకు సంబంధించిన శర్వా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. కలర్ ఫుల్ షర్ట్, లుంగీ ఎత్తి కట్టి, నల్ల తువ్వాల భుజంపై వేసుకుని పొలాల్లో నడిచి వస్తున్న శర్వా లుక్ వావ్ అనిపించేలా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘శతమానంభవతి’ తర్వాత పల్లెటూరు నేపథ్యంలో చేస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రంలో శర్వా రైతుగా కనిపించనున్న విషయం తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈసినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నారు. సుధీర్‌బాబు ‘రక్షకుడు’ నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి కీలక పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘వి’. విభిన్నచిత్రాల డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో నాని నెగటీవ్ రోల్ పోషిస్తుండటంతో ఈ చిత్రంపై అంచానలు ఓ రేంజ్లో పెరిగాయి. ఇక ‘కృష్ణుడు గీతలో ఎప్పుడో చెప్పారు.. ‘రాక్షసుడు’ ఎదిగిన నాడు ఒకడొస్తాడని.. వాడే ఇప్పుడొస్తున్నాడు.. రక్షకుడు వస్తున్నాడు’అంటూ చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ చిత్రంలోని ‘రక్షకుడు’ సుధీర్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. చేతిలో గన్ పట్టుకుని టెరిఫిక్ గా ఉన్న సుధీర్ బాబు లుక్ సినిమాపై పాజిటీవ్ వైబ్స్‌ను క్రియేట్ చేశాయి. “తప్పు జరిగితే యముడొస్తాడనేది నమ్మకం.. వీడొస్తాడనేది మాత్రం నిజం.. సుధీర్ బాబు క్యారెక్టర్‌ను తెలయజేస్తూ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ఇక ఈ చిత్రంలోని ‘రాక్షసుడు’ నానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం రేపు(మంగళవారం) విడుదల చేయనుంది. అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల కానుంది. తప్పు జరిగితే యముడు వస్తాడనేది నమ్మకం .... వీడొస్తాడనేది మాత్రం నిజం !!! #rakshakudu , the #saViour from #VTheMovie is here ... Believe the hype ... to live the hype 🔥✌️👊 Mark the date .. March 25 - 2020. @mokris_1772 @NameisNani @i_nivethathomas @aditiraohydari @SVC_official pic.twitter.com/R6ZY5dWktV — Sudheer Babu (@isudheerbabu) January 27, 2020 Here’s the first look of #Sreekaram. Summer 2020 Release!#Sharwanand #KishoreB @MickeyJMeyer #Sharwa29 pic.twitter.com/ECi4xustlD — ram achanta (@RaamAchanta) January 27, 2020 చదవండి: మాయల్లేవ్..మంత్రాల్లేవ్..ప్రయత్నించానంతే! ‘చివరికి ఆ టైటిల్‌నే ఫిక్స్ చేశారు’ -
వయొలెన్స్ కావాలన్నారుగా.. : నాని
వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలను సాధించి తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు హీరో నాని. తాజాగా ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో నాని ‘వి’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది నాని 25వ చిత్రం. నాని ఎక్కువగా యాక్షన్ సీన్స్ ఉండే సినిమాలు చేయడని.. కొందరు ఆయనపై విమర్శలు కూడా చేస్తుంటారు. అలాంటి వారి కోసమే నాని చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటుంది. వయొలెన్స్ కావాలన్నారుగా, ఇస్తా ఉగాదికి సాలిడ్‌గా ఇస్తా అని నాని ట్వీట్ చేశారు. అంతేకాకుండా గన్స్‌తో కూడిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌పై ‘ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు’ అని విలియం షేక్స్పియర్ కోట్స్‌ను ఉంచారు. వచ్చే ఏడాది ఉగాది కానుగా మార్చి 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్నట్టు సమాచారం. కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. మరో హీరో సుధీర్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అదితిరావు హైదరీ, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. Violence kavalannaru ga :) Istha... UGADI ki SOLID ga istha ...🔥#VTheMovie ✌🏼@mokris_1772 @isudheerbabu @i_nivethathomas @aditiraohydari @ItsAmitTrivedi @SVC_official pic.twitter.com/Rc4KKAWhVD — Nani (@NameisNani) November 4, 2019 -
నాని విలన్ లుక్!
ఇప్పటికే విభిన్న పాత్రలతో నేచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాని తన 25వ సినిమాలో మరో ప్రయోగం చేస్తున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వి సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ పనుల్లో బిజీగా ఉన్న నాని, వి సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. ఆదివారం వి షూటింగ్‌కు హాజరయ్యాడు నాని. ఈ సినిమాలో నాని లుక్ సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో సుధీర్ బాబు మరో కీలక పాత్రలో నటిస్తుండగా అదితిరావ్ హైదరీ, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సైరా ఫేం అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నా నాని గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.