AmruthaRamam
-
2020 మూవీ రివ్యూ: ఓటీటీలో హిట్టు, ఫట్టు ఇవే
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీని దెబ్బకు యావత్ ప్రపంచం చిగురుటాకులా వణికిపోయింది. అన్ని రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు అయితే గట్టి దెబ్బ కొట్టింది. 2020లోకి ఎంటరైన మూడు నెలలకే సినిమా థీయేటర్లు మూతపడ్డాయి. దీంతో వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలు బేల చూపులు చూశాయి. దసరా, దీపావళి పండగలు బోసిగా వెళ్లిపోయాయి. ఇక లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జనాలు.. టీవీలో సీరియల్స్, సినిమాలు చూసి బోర్‌గా ఫీలయ్యారు. ఇలాంటి తరుణంలో కొత్త సినిమాలతో దూసుకువచ్చాయి ఓటీటీ వేదికలు. (చదవండి : కలిసిరాని 2020.. కళ తప్పిన ‘సినీ’ పండగ) అప్పటికే వెబ్ సిరీస్‌లతో వినోదాన్ని అందిస్తున్న ఓటీటీలు.. లాక్డౌన్ పుణ్యమా అని కొత్త సినిమాలను విడుదల చేసే చాన్స్ కొట్టేశాయి. ఇక థియేటర్లు మూతపడటంతో దర్శక- నిర్మాతలకు కూడా ఓటీటీ వేదికలు ఆపద్భావుడిలా కనిపించాయి. వడ్డీల భారం నుంచి బయట పడేందుకు నిర్మాతలకు సరైన మార్గం దొరికింది. తమ చిత్రాలను ప్రేక్షుల దగ్గరకు తీసుకెళ్లేందుకు ఓటీటీ వేదికలు ఉపయోగపడ్డాయి. అలా అన్ని భాషల చిత్రాలు ఓటీటీలో సందడి చేశాయి. తెలుగులో కూడా పలు చిత్రాలు ఓటీటీ వేదిక ద్వారా విడుదలై, ప్రేక్షకులను పలకరించాయి. అలా తెలుగులో ఓటీటీ వేదిక ద్వారా విడుదలైన చిత్రాలేవో, అవి ఎంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో.. సమగ్ర సమాచారం మీకోసం. ధైర్యం చేసిన ‘అమృతరామమ్’ లాక్డౌన్ సమయంలో ఓటీటీ వేదికగా విడుదలైన తొలి తెలుగు చిత్రం ‘అమృతరామమ్’.కొత్త దర్శకుడు సురేందర్ కొంటడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ మిట్టకంటి, అమితా రంగనాథ్ నటించారు. ఈ చిత్రం ఎప్రిల్ 29న జీ5 వేదికగా విడుదలైంది. యూత్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని రాబట్టలేకపోయింది. బెడిసికొట్టిన ‘మహానటి’ ప్రయోగం ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ నటించిన `పెంగ్విన్` జూన్ 19న అమేజాన్ ప్రైమ్‌లో వచ్చింది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈసినిమా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తి ఓ బిడ్డకు తల్లిగా, గర్భంతో ఉన్న మహిళగా విలక్షణ పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఆమె ప్రయోగం ఫలించలేదు. వినోదాన్ని పంచడంలో విఫలమయింది. లీల చేసిన ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’ హీరో రానా సమర్పణలో సంజయ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’. ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమాలో సిద్దు జొన్నగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని నటించారు. రానా సమర్పించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగాయి. అయితే ఇది మరీ పెద్దగా హిట్ కాకపోయినా.. యూత్‌ని మాత్రం బాగా ఆకట్టుకుంది. మెప్పించిన ‘బానుమతి రామకృష్ణ’ల ప్రేమ నవీన్ చంద్ర, సలోని లుత్రా నటించిన ‘భానుమతి రామకృష్ణ’ సినిమా ‘ఆహా’ వేదికగా విడుదలైన యూత్‌ని మెప్పించింది. మెచ్యూరిటీ కలిగిన ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సత్యదేవ్ ఖాతాలో మరో హిట్ సత్యదేవ్ హీరోగా కంచరపాలేం ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రతీకారం, చిన్నచిన్న ఎమోషన్స్‌తో రూపొందిన ఈ సినిమాలో సత్యదేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ‘ఆహా’ను ఆదుకున్న ‘జోహార్’ ‘ఆహా’ లో రిలీజ్ అయినా మరో చిత్రం జోహార్. ప్రస్తుత రాజకీయాల ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకర్షించింది. స్వార్థ రాజకీయాల కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించాడు. మంచి లాభాలు తీసుకొచ్చింది విజయానికి దూరంగా ‘వి’ నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం సెప్టెంబర్ 5న భారీ అంచనాలతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. నాని 25వ సినిమా కావడం, తొలిసారి ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నటించడంతో అభిమానులో ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమా చూశారు. కానీ వారి అంచనాలు ‘వి’ అందుకోలేకపోయింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. ‘నిశ్శబ్ధం’గా వెళ్లిన అనుష్క అనుష్క శెట్టి, మాధవన్ జంటగా ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ తెరకెక్కించిన నిశ్శబ్ధం దారుణంగా నిరాశ పరిచింది. అమెరికాలో భారీగా రూపొందించిన ఈ చిత్రం అత్యంత దారుణంగా ఫ్లాప్ అయింది. నవ్వులు పూయించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా...’. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు కొండా విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కాసులు కురిపించిన ‘కలర్ ఫోటో’ ఆహాలో విడుదలైన ‘కలర్ ఫోటో’ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. సుహాస్, చాందిని చౌదరి జంటగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను నవ్వించి, కవ్వించి... చివర్లో అందరి చేత కంటతడి పెట్టించింది. ఈ చిత్రాన్ని సందీప్ రాజ్ తెరకెక్కించాడు. సునీల్ విలన్‌గా నటించాడు. ఆహాకు మంచి లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. మిస్‌ఫైర్ అయిన ‘మిస్ ఇండియా’ కీర్తి సురేష్ నుంచి వచ్చిన మరో ఓటిటి సినిమా మిస్ ఇండియా. నరేంద్ర నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ట్రోలింగ్ కూడా జరిగింది. అమెరికాలో ఛాయ్ అమ్మడం కాన్సెప్టు బాగున్నా స్క్రీన్ ప్లే లేకపోవడంతో తేలిపోయింది మిస్ ఇండియా. ‘గతం’మెరిసింది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా ‘గతం’. కొత్త దర్శకుడు కిరణ్ కొండమాడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 6న విడుదలైంది. రిలీజ్ అయిన తర్వాత మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ పేరు తెచ్చుకుంది. ఇండియన్ పనోరమాకు ఈ చిత్రం ఎంపికైంది. హృదయానికి హత్తుకున్న‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించిన సినిమా మిడిల్ క్లాస్ మెలొడీస్. నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ చిత్రానికి తొలిరోజే మంచి టాక్ వచ్చింది. పల్లెటూరు నుంచి గుంటూరు సిటీలో హోటల్ పెట్టుకోవాలనుకునే మధ్యతరగతి కుర్రాడి కథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. సూర్యకి హిట్ ఇచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ సూర్య హీరోగా సుధ కొంగర తెరకెక్కించిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సూర్యకు చాలా రోజుల తర్వాత వచ్చిన అద్భుతమైన విజయం ఇది. ‘డర్టీ హరి’కి యావరేజ్ టాక్ సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా మారిన చేసిన సినిమా డర్టీ హరి. ఎరోటిక్ సస్పెన్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ నటించారు. డిసెంబర్ 18న ఫ్రైడే మూవీస్ యాప్‌లో విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది. -
అమృతరామమ్ సినిమా రివ్యూ
టైటిల్: అమృతరామమ్ నటీనటులు: రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్, శ్రీజిత్ గంగాధరన్, జేడీ చెరుకూరు దర్శకుడు: సురేందర్ కోటండి నిర్మాత: ఎస్ ఎన్ రెడ్డి సంగీతం: ఎన్ ఎస్ ప్రసు బ్యానర్: పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సినిమావాలా ప్రెజెంటర్: సురేశ్ ప్రొడక్షన్స్ ప్రేమ ఉగాది పచ్చడి లాంటిది. కేవలం ఆనందం ఒక్కటే ఉండదు. సంతోషాలు, దు:ఖాలు అన్నీ ఒకదానివెంట ఒకటి అలల మాదిరిగా తోసుకుంటూ వస్తాయి. అయితే చివరిదాకా ఈదగలిగితేనే ఆ ప్రేమ విజయవంతం అయినట్టు. ఒక్కోసారి అలా ఈదే క్రమంలో జడివానలు, సుడిగుండాలు వంటి ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. కానీ ప్రేమ కోసం ప్రాణం పెట్టే ప్రేమికులు వేటినీ లెక్కచేయరు. అయితే సీరియస్‌గా, సిన్సియర్‌గా, చివరిదాకా అబ్బాయిలే ప్రేమిస్తారనుకుంటారు చాలామంది. కానీ ఒక్కసారి మనసిచ్చారంటే ఏడు సముద్రాలనైనా ఈదగలమంటూ, ప్రాణం పోయేవరకు నీడగా ఉంటామని కొత్త ధైర్యంతో, కొనితెచ్చుకున్న ఆత్మవిశ్వాసంతో బాసలు చేస్తారు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన అమ్మాయిలు. అలాంటి ఓ ప్రేమికురాలి కథే "అమృతరామమ్: దేర్ ఈజ్ నో లవ్ వితౌట్ పెయిన్". నటీనటులు: పాత నీరు పోయి కొత్త నీరు చేరినట్లు.. ఈ మధ్య ఇండస్ట్రీలో కొత్త సరుకుకు డిమాండ్ భారీగా పెరిగింది. చిన్న సినిమాలే బాక్సాఫీస్ హిట్ కొడుతూ ప్రజలకు చేరువవుతున్నాయి. అలా వచ్చిందే అమృతరామమ్. ఈ సినిమాలో దాదాపుగా అందరూ కొత్తవారే. విశేషమేంటంటే.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజవుతున్న తొలి తెలుగు సినిమా ఇది. ఇందులో అమృత, రామ్ మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. సహజమైన నటనతో మిమ్మల్ని కూడా సినిమా వెంట తీసుకెళతారు. కథ: హీరోయిన్ అమృత(అమిత రంగనాథ్) విద్య కోసం విదేశాలకు వెళుతుంది. అక్కడ తొలి చూపులోనే రామ్(రామ్ మిట్టకంటి)తో ప్రేమలో పడుతుంది. అది పిచ్చి ప్రేమగా మారుతుంది. ఎంతలా అంటే అతనితో ఎవరు సన్నిహితంగా మెలిగినా భరించలేనంతగా! రామ్ నుంచి కొన్నింటిని వేరు చేసేందుకు ఆమె విశ్వప్రయత్నాలు చేస్తుంది. దీంతో అతని అహం దెబ్బతిని గొడవ మొదలవుతుంది. అది కాస్తా తారాస్థాయికి చేరడంతో ఆమెతో విడిపోవడానికి సిద్ధమవుతాడు. కాళ్లా వేళ్లా పడ్డా కనికరించడు. కానీ అవన్నీ ప్రేమతోనే చేసిందని తెలుసుకుని తనను వెతుక్కుంటూ వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇద్దరూ కలిశారా? లేదా? సడన్‌గా హీరోకు ఏం జరుగుతుంది? అతను ప్రాణాపాయ స్థితిలో ఉండటానికి కారణం ఎవరు? వీటన్నింటికీ సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే. నటన: తొలిసారి వెండితెరపై హీరోగా నటించిన రామ్ మిట్టకంటి ఇంకా తన నటనను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. అమితా రంగనాథన్ పాత్రలో లీనమై అమ్మాయిల మనసు దోచుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అనుభవం ఉన్నదానిలా నటించి ప్రశంసలు దక్కించుకుంటుంది. ముఖ్యంగా హీరోయిన్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. హీరోహీరోయిన్లు విడిపోయే సమయంలో ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారు. ఆ సమయంలో హీరోయిన్ నటన, ఆమె పడే మానసిక వేదన తారాస్థాయిలో ఉంటుంది. మిగిలినవి కొద్ది పాత్రలే అయినా తమకు తగ్గ స్థాయిలో బాగానే నటించారు. విశ్లేషణ: సినిమా మొత్తం ఆస్ట్రేలియా బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ప్రేమికులకు నచ్చుతుంది. దర్శకుడు కథను నడిపించిన విధానంలో పెద్దగా కొసమెరుపులు ఉండవు. ఫస్టాఫ్ ఆసక్తికరంగా అనిపించదు. భారంగా, నెమ్మదిగా కొనసాగుతుంది. మొదటి భాగాన్ని ఎలాగోలా నెట్టుకురాగా రెండో భాగం కాస్త ఆసక్తికరంగా మలిచారు. దీంతో సగటు ప్రేక్షకుడు అప్పుడు ట్రాక్‌లోకి వచ్చి సినిమాలో లీనమైపోతారు. కథ చివర్లో మాత్రం అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. కానీ క్లైమాక్స్ ఇదివరకే ఎక్కడో చూశామే అన్న ఆలోచన రాక మానదు. చివరగా చెప్పాలంటే.. ఈ సినిమా అక్కడక్కడా "ఏం మాయ చేశావే"ను గుర్తు చేయడం ఓ పెద్ద మైనస్. మొత్తానికి ఈ సినిమా లవ్ మంత్రంతో పాస్ మార్కులతో బయటపడింది. సినిమా పూర్తయిన తర్వాత కూడా ప్రేమికులు ఆ సంగీతంలో నుంచి అంత ఈజీగా బయటపడరు. ప్రేమలో ఏదో ఓనమాలు నేర్చుకున్నట్లుగా ఫీలవుతారు. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. దర్శకుడు సురేందర్ కథాకథనంలో తడబడిన విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మ్యాజిక్ చేద్దామనుకున్నాడు కానీ ఆ పాచిక పారలేదనే చెప్పాలి. సంగీతమే ఈ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచింది. ఎన్ ఎస్ ప్రసు అందించిన సంగీతానికి గేయ రచయిత మధుసూదన్ నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ఈ పాటలు సినిమాను ఓ మెట్టు పైకి ఎక్కించాయనే చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సంతోష్ శానమోనీ కెమెరా పనితనం ఈ సినిమాకు సరిగ్గా సరిపోయింది. రెండు గంటల నిడివి అయినప్పటికీ ఇంకా పూర్తవలేదేంటా అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు వస్తుంది. ఫస్టాఫ్‌లో మరింత ఎడిటింగ్ చేయాల్సింది. ప్లస్ పాయింట్స్ కథ అమిత రంగనాథ్ నటన పాటలు క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ స్లో నెరేషన్ ఎలాంటి కొసమెరుపులు లేకపోవడం ఎడిటింగ్ లోపాలు -
‘అమృతరామమ్’ ఎప్పుడంటే?
రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘అమృతరామమ్’. ‘దేర్ ఈజ్ నో లవ్ వితౌట్ పెయిన్’ అనేది ఉప శీర్షిక. సురేందర్ కొంటడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అయితే పలు కారణాలతో చిత్ర విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ‘అమృతరామమ్’ రిలీజ్ డేట్‌పై చిత్ర బృందం అధికారక ప్రకటన చేసింది. ఉగాది కానుకగా మార్చి25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తెలిపింది. త్వరలోనే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించనున్నట్లు కూడా పేర్కొంది. ఇప్పటికే ‘అమృతరామమ్’ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్లు ప్రేమికులకు కనెక్ట్ అవడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి. ముఖ్యంగా ‘ప్రేమంటే ఇంతేనా యదలోని వ్యధలేనా..’ అంటూ సాగే ఓ ప్రేయసి విరహ గీతం సంగీత శ్రోతలను కట్టిపడేసింది. ఈ పాటను అనన్య భట్ ఆలపించగా.. రామదుర్గం మధుసుధన్ హార్ట్ టచింగ్ లిరిక్స్ అందించారు. ఎన్.ఎస్. ప్రసు సంగీతాన్ని అందించారు. ట్రైలర్‌లోని డైలాగ్స్ కూడా ఆకట్టుకోవడంతో పాటు ఆలోచించే విధంగా ఉన్నాయి. శ్రీజిత్ గంగాధర్, ఎమిలి మార్టిన్, సారా జోన్స్, శుక్రుతి నారాయణ్, చెరుకూరి జగదీశ్వర్‌రావ్, వంశీ దావులూరి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల అవుతోంది. చదవండి: కరోనా ఎఫెక్ట్.. మాస్క్‌తో ప్రభాస్ యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న‘నీలి నీలి ఆకాశం..’ -
ప్రేమికులను కట్టిపడేస్తున్న ‘ఊహకు ఊపిరి పోసి’
రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ జంటగా సురేందర్ కొంటడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అమృత రామమ్’. దేర్ ఈజ్ నో లవ్ వితౌట్ పెయిన్’ అనేది ఉప శీర్షిక. టైటిల్‌తోనే ఈ సినిమాపై పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ఓ రేంజ్లో ఉన్నాయి. ముఖ్యంగా ‘ప్రేమంటే ఇంతేనా’సాంగ్ లిరిక్స్ యూత్‌ను ముఖ్యంగా ప్రేమికులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ పాటతో పాటు ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. మూవీ ట్రైలర్లో రోజురోజుకి డ్రగ్‌లా ఎక్కేస్తున్నావురా అనే డైలాగ్లాగానే పాటలు, ట్రైలర్‌తో జనాలకు రోజురోజుకు కిక్ ఎక్కేస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాట ఆస్త్రాన్ని చిత్ర బృందం వదిలింది. ‘ప్రేమంటే ఇంతేనా యెదలోని వ్యధలేనా..’ అంటూ సాగే ఓ ప్రేయసి విరహ గీతం సంగీత శ్రోతలను కట్టిపడేయగా.. తాజాగా ‘ఊహకు ఊపిరి పోసి..’ అంటూ ఓ ప్రేమికుడు తన ప్రేయసిని గుర్తుచేసుకునే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రామదుర్గం మధుసూదన్ అందించిన లిరిక్స్ హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. ఇషాక్ ఆలపించిన ఈ పాటను ఎన్.ఎస్. ప్రసు అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ పాట ట్యూన్‌తో పాటు లిరిక్స్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో యూత్‌కు ఈ సాంగ్ తెగ నచ్చేసింది. దీంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఒక గాఢమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎన్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీజిత్ గంగాధర్, ఎమిలి మార్టిన్, సారా జోన్స్, శుక్రుతి నారాయణ్, చెరుకూరి జగదీశ్వర్‌రావ్, వంశీ దావులూరి ముఖ్య పాత్రలు పోషించారు. సుకుమార్ చేతుల మీదుగా.. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పలాస ‘1978’. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో సుధామీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. 1978లో జరిగిన యదార్థ కథ ఆధారంగా తెరకెక్కుతుండటంతో ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇక ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని పాత్రలను యానిమేటడ్ బుక్ రూపంలో చిత్ర బృందం విడుదల చేసింది. వినూత్నంగా ఆవిష్కరించిన ఈ బుక్ చూపరులను ఆకర్షించింది. తాజాగా ఈ సినిమాలోని ‘నీ పక్కన పడ్డది లేదు చూడు పిల్ల నాది నక్కిలిసు గొలుసు’అంటూ సాగే ఉత్తరాంధ్ర జానపద గీతాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేశారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్నాడు. -
‘డ్రగ్‌లా ఎక్కేస్తున్నావ్, అడిక్ట్ అవుతున్నాను’
ప్రేమ గురించి ఎన్ని సినిమాలు వచ్చినా ఇంకా దాని గురించి చెప్పడానికి ఏదో మిగిలే ఉంటుంది. ప్రేమలోతును, అందులో మునిగినవారి పరిస్థితిని చెప్పడానికి ‘అమృతరామమ్’ సినిమా సిద్ధమైంది. ‘దేర్ ఈజ్ నో లవ్ విత్ అవుట్ పెయిన్’ అనే క్యాప్షన్‌తో సినిమా ఏంటనేది ఒక్క ముక్కలో చెప్పకనే చెప్పారు. మనిషిలో ఏదో మూలన మిగిలి ఉన్న ప్రేమను తట్టిలేపేందుకు ఈ ప్రేమకావ్యం త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. హీరో హీరోయన్లు రామ్ మిట్టకంటి, అమితా రంగనాథ్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. ప్రేమలో ఉండే అన్ని కోణాలను స్పృశించేందుకు ప్రయత్నించిందీ చిత్రం. కాకపోతే ఈ సారి ప్రేమకోసం పరితపించింది, ప్రేమకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడింది ప్రేమికుడు కాదు, ప్రేయసి. అదే ఈ సినిమాలోని ప్రత్యేకత. ‘తన ప్రేమని నువ్వు గెలవాలంటే ముందు నువ్వు ఓడిపోవాలి’, ‘ప్రేమలో సంతోషాలే కాదు, త్యాగాలు కూడా ఓ భాగమే’ ‘రోజురోజుకీ నాకు డ్రగ్‌లా ఎక్కేస్తున్నావ్, నేను నీకు అడిక్ట్ అవుతున్నాను’ ‘ఈ ప్రపంచంలో చావుకంటే నరకం ఏంటో తెలుసా... ఓ మనిషిని పిచ్చిగా ప్రేమించడం’ వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రేమించినవాడి కోసం అమ్మాయి పడే వేదనని కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా ఇప్పటికే విడుదలైన ప్రేమగీతాలు సినిమాకు ఆయువుపట్టుగా మారాయి. ఈ చిన్న సినిమా సురేష్‌బాబు లాంటి పెద్ద నిర్మాతను ఆకట్టుకుంది. ఈ సినిమాకు దర్శకుడు: సురేందర్ కొంటడ్డి. నిర్మాత: ఎస్ఎన్ రెడ్డి. సంగీత దర్శకుడు: ఎన్ఎస్ ప్రసు. గేయరచయిత: చైతన్యప్రసాద్, మధుసూదన్ రామదుర్గం, కృష్ణ చైతన్య.