AmruthaRamam Movie Review, in Telugu | అమృత‌‌రామ‌మ్ మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

అమృత‌‌రామ‌మ్ సినిమా రివ్యూ

Published Wed, Apr 29 2020 1:08 PM | Last Updated on Tue, May 26 2020 3:14 PM

AmruthaRamam Movie Review In Telugu - Sakshi

టైటిల్‌: అమృత‌‌రామ‌మ్‌
న‌టీన‌టులు‌:  రామ్ మిట్ట‌కంటి, అమిత రంగ‌నాథ్‌, శ్రీజిత్ గంగాధ‌ర‌న్‌, జేడీ చెరుకూరు
ద‌ర్శ‌కుడు: సురేంద‌ర్ కోటండి
నిర్మాత‌: ఎస్ ఎన్ రెడ్డి
సంగీతం: ఎన్ ఎస్ ప్ర‌సు
బ్యాన‌ర్‌: ప‌ద్మ‌జ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సినిమావాలా
ప్రెజెంట‌ర్‌: సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌

ప్రేమ ఉగాది ప‌చ్చ‌డి లాంటిది. కేవ‌లం ఆనందం ఒక్క‌టే ఉండ‌దు. సంతోషాలు, దు:ఖాలు అన్నీ ఒక‌దానివెంట ఒక‌టి అల‌ల మాదిరిగా తోసుకుంటూ వ‌స్తాయి. అయితే చివ‌రిదాకా ఈద‌గ‌లిగితేనే ఆ ప్రేమ విజ‌య‌వంతం అయిన‌ట్టు. ఒక్కోసారి అలా ఈదే క్ర‌మంలో జ‌డివాన‌లు,  సుడిగుండాలు వంటి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర‌వుతాయి. కానీ ప్రేమ కోసం ప్రాణం పెట్టే ప్రేమికులు వేటినీ లెక్క‌చేయ‌రు. అయితే సీరియ‌స్‌గా, సిన్సియ‌ర్‌గా, చివ‌రిదాకా అబ్బాయిలే ప్రేమిస్తార‌నుకుంటారు చాలామంది. కానీ ఒక్క‌సారి మ‌న‌సిచ్చారంటే ఏడు స‌ముద్రాల‌నైనా ఈద‌గ‌ల‌మంటూ, ప్రాణం పోయేవ‌ర‌కు నీడ‌గా ఉంటామ‌ని కొత్త ధైర్యంతో, కొనితెచ్చుకున్న ఆత్మ‌విశ్వాసంతో బాస‌లు చేస్తారు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయిన‌ అమ్మాయిలు. అలాంటి ఓ ప్రేమికురాలి క‌థే "అమృత‌‌రామ‌మ్: దేర్‌ ఈజ్‌ నో లవ్‌ వితౌట్‌ పెయిన్"‌.

న‌టీన‌టులు: పాత నీరు పోయి కొత్త నీరు చేరిన‌ట్లు.. ఈ మ‌ధ్య ఇండ‌స్ట్రీలో కొత్త స‌రుకుకు డిమాండ్ భారీగా పెరిగింది. చిన్న సినిమాలే బాక్సాఫీస్ హిట్ కొడుతూ ప్ర‌జ‌ల‌కు చేరువ‌వుతున్నాయి. అలా వ‌చ్చిందే అమృత‌రామ‌మ్‌. ఈ సినిమాలో దాదాపుగా అంద‌రూ కొత్త‌వారే. విశేష‌మేంటంటే.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ‌వుతున్న తొలి తెలుగు సినిమా ఇది. ఇందులో అమృత, రామ్ మ‌ధ్య కెమిస్ట్రీకి ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవుతారు. స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో మిమ్మ‌ల్ని కూడా సినిమా వెంట తీసుకెళ‌తారు.

క‌థ‌:
 హీరోయిన్‌ అమృత‌(అమిత రంగ‌నాథ్‌) విద్య కోసం విదేశాల‌కు వెళుతుంది. అక్క‌డ తొలి చూపులోనే రామ్‌(రామ్ మిట్ట‌కంటి)తో ప్రేమ‌లో పడుతుంది. అది పిచ్చి ప్రేమ‌గా మారుతుంది. ఎంత‌లా అంటే అత‌నితో ఎవ‌రు స‌న్నిహితంగా మెలిగినా భ‌రించ‌లేనంత‌గా!  రామ్ నుంచి కొన్నింటిని వేరు చేసేందుకు ఆమె విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంది. దీంతో అత‌ని అహం దెబ్బ‌తిని గొడ‌వ మొద‌లవుతుంది. అది కాస్తా తారాస్థాయికి చేర‌డంతో ఆమెతో విడిపోవ‌డానికి సిద్ధ‌మవుతాడు. కాళ్లా వేళ్లా ప‌డ్డా క‌నిక‌రించ‌డు. కానీ అవ‌న్నీ ప్రేమతోనే చేసింద‌ని తెలుసుకుని త‌న‌ను వెతుక్కుంటూ వెళ‌తాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? ఇద్ద‌రూ క‌లిశారా? లేదా? స‌డ‌న్‌గా హీరోకు ఏం జ‌రుగుతుంది? అత‌ను ప్రాణాపాయ స్థితిలో ఉండ‌టానికి కార‌ణం ఎవ‌రు? ‌వీట‌న్నింటికీ స‌మాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.

న‌ట‌న‌: తొలిసారి వెండితెర‌పై హీరోగా న‌టించిన‌ రామ్ మిట్ట‌కంటి ఇంకా త‌న న‌ట‌న‌ను మెరుగుప‌ర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అమితా రంగ‌నాథ‌న్ పాత్ర‌లో లీన‌మై అమ్మాయిల మ‌నసు దోచుకుంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్ప‌టికే అనుభ‌వం ఉన్న‌దానిలా న‌టించి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటుంది. ముఖ్యంగా హీరోయిన్ చెప్పే డైలాగులు ఆక‌ట్టుకుంటాయి.  హీరోహీరోయిన్లు విడిపోయే స‌మ‌యంలో ప్రేక్ష‌కులు భావోద్వేగానికి లోన‌వుతారు. ఆ స‌మ‌యంలో హీరోయిన్ న‌ట‌న, ఆమె ప‌డే మానసిక వేద‌న‌‌ తారాస్థాయిలో ఉంటుంది.  మిగిలిన‌వి కొద్ది పాత్ర‌లే అయినా త‌మ‌కు త‌గ్గ స్థాయిలో బాగానే న‌టించారు.

విశ్లేష‌ణ‌:  సినిమా మొత్తం ఆస్ట్రేలియా బ్యాక్‌డ్రాప్‌లో కొన‌సాగుతుంది. ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ ప్రేమికుల‌కు న‌చ్చుతుంది. ద‌ర్శ‌కుడు క‌థ‌ను న‌డిపించిన విధానంలో పెద్ద‌గా కొస‌మెరుపులు ఉండ‌వు.  ఫ‌స్టాఫ్ ఆస‌క్తిక‌రంగా అనిపించ‌దు. భారంగా, నెమ్మ‌దిగా కొన‌సాగుతుంది. మొద‌టి భాగాన్ని ఎలాగోలా నెట్టుకురాగా రెండో భాగం కాస్త ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. దీంతో స‌గ‌టు ప్రేక్ష‌కుడు అప్పుడు ట్రాక్‌లోకి వ‌చ్చి సినిమాలో లీన‌మైపోతారు. క‌థ చివ‌ర్లో మాత్రం అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. కానీ క్లైమాక్స్ ఇదివ‌ర‌కే ఎక్క‌డో చూశామే అన్న ఆలోచ‌న రాక మాన‌దు. చివ‌ర‌గా చెప్పాలంటే..‌ ఈ సినిమా అక్క‌డ‌క్కడా "ఏం మాయ చేశావే"ను గుర్తు చేయ‌డం ఓ పెద్ద మైన‌స్‌. మొత్తానికి ఈ సినిమా ల‌వ్ మంత్రంతో పాస్ మార్కుల‌తో బ‌య‌ట‌ప‌డింది. సినిమా పూర్త‌యిన త‌ర్వాత కూడా ప్రేమికులు ఆ సంగీతంలో నుంచి అంత ఈజీగా బ‌య‌ట‌ప‌డ‌రు. ప్రేమ‌లో ఏదో ఓన‌మాలు నేర్చుకున్న‌ట్లుగా ఫీల‌వుతారు.

సాంకేతిక నిపుణుల విష‌యానికొస్తే.. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ క‌థాక‌థ‌నంలో త‌డ‌బ‌డిన విష‌యం ప్ర‌స్ఫుటంగా క‌నిపిస్తుంది. మ్యాజిక్ చేద్దామ‌నుకున్నాడు కానీ ఆ పాచిక పార‌లేద‌నే చెప్పాలి. సంగీత‌మే ఈ సినిమాకు ఆయువు ప‌ట్టుగా నిలిచింది. ఎన్ ఎస్ ప్ర‌సు అందించిన సంగీతానికి గేయ ర‌చ‌యిత‌ మ‌ధుసూద‌న్ నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ఈ పాట‌లు సినిమాను ఓ మెట్టు పైకి ఎక్కించాయ‌నే చెప్ప‌వ‌చ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆక‌ట్టుకుంటుంది. సంతోష్ శాన‌మోనీ కెమెరా ప‌నిత‌నం ఈ సినిమాకు స‌రిగ్గా స‌రిపోయింది. రెండు గంటల నిడివి అయిన‌ప్ప‌టికీ ఇంకా పూర్త‌వలేదేంటా అన్న ఫీలింగ్ ప్రేక్ష‌కుల‌కు వ‌స్తుంది. ఫ‌స్టాఫ్‌లో మ‌రింత ఎడిటింగ్ చేయాల్సింది.

ప్లస్‌ పాయింట్స్‌
క‌థ‌
అమిత రంగ‌నాథ్‌ నటన
పాట‌లు
క్లైమాక్స్

మైనస్‌ పాయింట్స్‌
స్లో నెరేషన్
ఎలాంటి కొస‌మెరుపులు లేక‌పోవ‌డం
ఎడిటింగ్ లోపాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement