
కొన్ని సినిమాలు చూసినప్పుడు అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? ఒకవేళ వచ్చిన ఎలా తీసారబ్బా అని మనం అనుకుంటాం. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోనూ రిలీజైన ఓ మూవీ చూస్తే సరిగ్గా ఇదే అనిపిస్తుంది. చెబితే బుతులా ఉంటుంది కానీ చూస్తుంటే తెగ నవ్వొస్తుంది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి)
కథేంటి?
పరంధామయ‍్య ఓ పెద్దమనిషి. ఇతడికి స్వామి (సునీల్), దొర (వైభవ్) అని ఇద్దరు కొడుకులు. వీళ్లకు పెళ్లిళ్లు కూడా అయిపోయింటాయి. ఓ రోజు టీవీ చూస్తూ పరంధామయ్య చనిపోతాడు. కాకపోతే ఆయన విషయంలో బయటకు చెప్పుకోలేని ఓ సంఘటన జరుగుతుంది. అలా ఎందుకో జరిగిందో కుటుంబ సభ్యులకు అర్థం కాదు. దీంతో చావు గురించి బయటకు చెప్పలేని పరిస్థితి. మరి కుటుంబ పరువు ప్రతిష్టలు పోకుండా అంత్యక్రియలు ఎలా నిర్వహించారు? అనేదే మిగతా స‍్టోరీ.

ఎలా ఉందంటే?
'పెరుసు' అంటే తెలుగులో పెద్దాయన అని అర్థం. ఊరికి పెద్దమనిషిలా ఉండే ఒకతను చనిపోతాడు. కాకపోతే అతడి శరీరంలో జరిగిన చిన్న మార్పు వల్ల కుటుంబానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. దాన్ని కవర్ చేసి ఎలా అంత్యక్రియలు చేశారనేదే స్టోరీ.
చెబితే బూతులా అనిపిస్తుంది కానీ ఇలాంటి పాయింట్ తీసుకుని సినిమా తీయడమే షాకింగ్ అంటే.. దాన్ని కామెడీగా చెప్పాలనుకోవడం మరింత పెద్ద షాకిస్తుంది. ఎందుకంటే ఏ మాత్రం తేడా కొట్టినా నవ్వుల పాలైపోవడం గ్యారంటీ. కానీ దర్శకుడు చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు.
(ఇదీ చదవండి: స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. ముద్దు ఫోటోలు వైరల్)
సినిమా మొదలైన ఐదు నిమిషాలకే కథలో కాన్ ఫ్లిక్ట్ పాయింట్ వస్తుంది. అక్కడి నుంచి తొలి 45 నిమిషాల పాటు శవం చుట్టూ జరిగే కామెడీ తెగ నవ్విస్తుంది. ఆ తర్వాత మాత్రం చాలాచోట్ల సాగతీతగా అనిపిస్తుంది. మళ్లీ చివరకొచ్చేసరికి క్లైమాక్స్ సర్ ప్రైజ్ చేస్తుంది.
శవంతో కామెడీ చేయడం ఏంట్రా బాబు అనుకుంటే మాత్రం సినిమా అస్సలు చూడకండి. ఎందుకంటే ప్రతి సీన్ బూతులానే అనిపిస్తుంది. అడల్ట్ కామెడీ సినిమాలంటే ఇష్టముంటేనే దీన్ని చూడండి. లేదంటే మాత్రం ఒంటరిగా చూసేందుకు ప్రయత్నించండి. ఫ్యామిలీతో చూశారా మీరు బుక్ అయిపోతారు.
ఎవరెలా చేశారు?
పెద్దాయన కొడుకులుగా చేసిన వైభవ్, సునీల్ తమ తమ పాత్రల్లో జీవించేశారు. ఏ మాత్రం ఎక్కువ చేయకుండా కామెడీ భలే పండించారు. వీరికి తోడు భార్యలుగా నటించిన నిహారిక, చాందిని ఆకట్టుకున్నారు. రెడిన్ కింగ్ స్లీ, వీటీవీ గణేశ్ తదితరులు కూడా నవ్వించారు. మిగిలిన పాత్రధారులు కూడా జీవించేశారనే చెప్పాలి.
సినిమా టెక్నికల్ గా భలే తీశారు. ఎందుకంటే రెండు గంటల సినిమాలో దాదాపు సీన్లన్నీ ఒక ఇంటిలో పెద్దాయన శవంతోనే ఉంటాయి. కానీ బోర్ కొట్టిన సందర్భాలు చాలా తక్కువ. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. చివరకు డైరెక్షన్ గురించి చెప్పాలి. ఇళంగో రామ్.. బూతులా అనిపించే విషయాన్ని చాలా చాకచక్యంగా తీశాడు.
మరి వీకెండ్ ఏదైనా డిఫరెంట్ గా ఉండే కామెడీ సినిమా చూద్దామనుకుంటే 'పెరుసు' ట్రై చేయండి. కాకపోతే ఒంటరిగానే చూడండి.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: 'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ))