పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు 2020 సంవత్సరం నేర్పిన పాఠమిది. తిరుగులేదనుకున్న టీఆర్‌ఎస్‌కు ఏడాది చివర్లో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. దుబ్బాక మింగుడుపడని చేదు అనుభవాన్ని మిగల్చగా... ‘గ్రేటర్’షాకిచ్చింది. మరోవైపు బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగగలుగుతామనే ఆత్మవిశ్వాసాన్ని మెండుగా ఇచ్చింది. దుబ్బాకలో అనూహ్య విజయం, గ్రేటర్‌లో మంచి ప్రదర్శన బీజేపీ శ్రేణుల్లో నయా జోష్ నింపాయి. మాటల తూటాలు, మహామహుల ప్రచారంతో ఏడాది చివర్లో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఈ ఏడాదిలో వరుస ఓటములు, వలసలతో మరింత డీలా పడిపోయింది. మరోవైపు కాంగ్రెస్ ‘మార్కు’అంతర్గత కుమ్ములాటలు... వెరసి ఎటుపోతోందో తెలియని స్థితిలో ఉంది. - సాక్షి, హైదరాబాద్
టీఆర్‌ఎస్ దూకుడుకు దుబ్బాక బ్రేక్
టీఆర్‌ఎస్‌కు 2020 సంవత్సరం మిశ్రమ అనుభూతులను మిగిల్చింది. మున్సిపల్ ఎన్నికలు టీఆర్‌ఎస్ బలాన్ని చాటగా... ఏడాది చివరిలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు అందని రీతిలో టీఆర్‌ఎస్ ఏకపక్ష విజయాలు సాధించింది. 122 మున్సిపాలిటీలతో పాటు పది మున్సిపల్ కార్పొరేషన్లలో టీఆర్‌ఎస్ పాగా వేసింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో జరిగిన సహకార ఎన్నికల్లో రాష్ట్రంలోని 9 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు అన్నీ టీఆర్‌ఎస్ ఖాతాలోనే చేరాయి.
ఇక టీఆర్‌ఎస్ శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఈ ఏడాది నవంబర్‌లో దుబ్బాక ఉపఎన్నిక జరిగింది. రామలింగారెడ్డి భార్య సుజాత టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేయగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు వేయికి పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇది నాలుగో అసెంబ్లీ ఉప ఎన్నిక కాగా, టీఆర్‌ఎస్ తొలిసారిగా ఓటమి పాలైంది. ఈ ఏడాది చివరలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ మిశ్రమ ఫలితాన్ని సాధించింది. 150 డివిజన్లకు గాను 56 చోట్ల మాత్రమే గెలుపొందింది. గట్టి ఎదురుదెబ్బ తగిలినా.. అతిపెద్ద పార్టీగా అవతరించడం కాస్తలోకాస్త ఊరట. (చదవండి: రివైండ్ 2020: పరిశోధన ఆగలేదు!)
నిజామాబాద్ నుంచి మండలికి కవిత
- లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడ్డ నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరిగాయి. మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మొత్తం 824 ఓట్లకు గాను... 728 ఓట్లు సాధించి భారీ మెజారిటీతో మండలిలో అడుగుపెట్టారు.
- రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న గరికపాటి మోహన్‌రావు, కేవీపీ రామచంద్రరావుల పదవీ కాలం ముగియడంతో ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర కోటాలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టీఆర్‌ఎస్ తరపున పార్టీ సెక్రటరీ జనరల్ డాక్టర్ కె.కేశవరావు వరుసగా రెండో పర్యాయం, ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన కేఆర్ సురేశ్‌రెడ్డి ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.
- శాసనమండలికి గవర్నర్ కోటాలో ముగ్గురిని నామినేట్ చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఈ ఏడాది నవంబర్‌లో తీర్మానం చేసింది. ప్రజా కవి గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, బోగారపు దయానంద్ గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా నియమితులయ్యారు.
- నవంబర్ 28న ఎల్బీ స్టేడియంలో జరిగిన గ్రేటర్ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్... డిసెంబర్ 10న సిద్దిపేట జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించి ఆందోళనల్లో పాల్గొంది. ఇవి మినహా 2020లో కరోనా కారణంగా పార్టీపరంగా పెద్దగా కార్యక్రమాలేవీ లేవు.
కమలంలో కొత్త ‘జోష్’
ఈ ఏడాది రాజకీయంగా రాష్ట్ర బీజేపీకి బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా ఏడాది చివర్లో జరిగిన దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయాలు ఆ పార్టీకి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. ఈ ఏడాదిలోనే రాష్ట్ర పార్టీలో సంస్థాగత మార్పులు కూడా జరగడం, వెంటనే మంచి విజయాలు రావడంతో కమలనాథుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన బండి సంజయ్ పార్టీలో ఊపు తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన మాజీ మంత్రి డి.కె.అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి హోదా దక్కగా, గత అధ్యక్షుడు డాక్టర్. కె.లక్ష్మణ్‌కు ఓబీసీ సెల్ జాతీయ చైర్మన్ పదవి దక్కింది.
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న కమలం పార్టీ నేతలు 2020 ఇచ్చిన ఉత్సాహంతో 2021కి సిద్ధమవుతూ... 2023లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామనే ధీమాతో ఉన్నారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత తెలంగాణపైనే బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టిందనే చర్చ కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లపై కమలదళం గురిపెట్టి పనిచేస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ అనుకూల ఫలితాలే రావడం.... తెలంగాణలో కూడా సానుకూల ఫలితాలు వస్తుండటంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో పెద్ద రాజకీయ శక్తిగా అవతరిస్తామనే ధీమా రాష్ట్ర బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్: వరుస ఓటములు, వలసలు
కాంగ్రెస్ పార్టీకి 2020 సంవత్సరం కూడా చేదు అనుభవాలనే మిగిల్చింది. గత ఆరేళ్లుగా చెప్పుకోదగ్గ విజయాలు లేక అల్లాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాదిలో మరింత నష్టాన్ని చవిచూసింది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా పోగొట్టుకోగా, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమనే పేరును కూడా కోల్పోయే స్థాయిలో 2020లో కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. పార్టీ నుంచి వలసలు కూడా ఆగకుండా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలతో పాటు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న విజయశాంతి కూడా బీజేపీలో చేరారు. గంపెడాశలు పెట్టుకుని రాష్ట్ర బలగమంతా పనిచేసిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో వచ్చిన ఫలితం ఓ రకంగా కాంగ్రెస్‌ను కుదేలు చేసింది.
అక్కడ ద్వితీయ స్థానం పోయింది... డిపాజిట్ కూడా రాలేదు. అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించి మరీ బీజేపీ గెలవడం రాజకీయ సమీకరణాలను బాగా ప్రభావితం చేసేదే. ఈ ఎన్నిక అయిపోగానే జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కనీసం 20 స్థానాల్లో అయినా గెలుపొందుతామని ఆశించినా కేవలం రెండు స్థానాలకే పరిమితం కావడం, మరోవైపు బీజేపీ ఏకంగా 48 చోట్ల విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. ఇక, టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామక వ్యవహారం ఈ ఏడాది కూడా తేలకపోగా, ఈ పదవి పేరుతో జరుగుతున్న అంతర్గత కలహాలు, పరిణామాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతల్లో అసంతృప్తి లేకుండా ఉండేందుకు గాను కమిటీల పేరుతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ పరిస్థితుల్లో కొత్త ఏడాదిలో జరిగే వరుస ఎన్నికలపైనా కాంగ్రెస్ శ్రేణులకు బెంగ పట్టుకుంది.
జూమ్ వేదికగా ‘లెఫ్ట్’..
కమ్యూనిస్టుపార్టీలు అనగానే ప్రజా సమస్యలపై ఆందోళనలు, నిరసనలు నిర్వహించే రాజకీయపక్షాలుగా ఎన్నో ఏళ్లుగా గుర్తింపు పొందాయి. అయితే ఈ ఏడాది కరోనా మూలంగా లెఫ్ట్ పార్టీలు సీపీఎం, సీపీఐ సైతం ఆన్‌లైన్ బాటపట్టాయి. క్షేత్రస్థాయిలో పోరాడుతూనే... జూమ్‌లో గళం వినిపించాయి. సీపీఎం ఆధ్వర్యంలోనూ వివిధ సమస్యలపై ఆందోళనలు, నిరసనలతో పాటు జూమ్ యాప్ ద్వారా కార్యక్రమాలు, పార్టీపరంగా సమావేశాలు నిర్వహించింది. ఆన్‌లైన్ సమావేశాలు, జూమ్ కాన్ఫరెన్స్‌లు, మీడియా సమావేశాలు మొదలు అగ్రనేతల స్మారకోపన్యాసాలు, నిరసన సభలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు వంటివి ఈ రెండుపార్టీలు నిర్వహించాయి.
అయితే కేంద్రం ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయచట్టాలు, విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో రైతుసంఘాలు చేపట్టిన ఉద్యమానికి సంఘీభావంగా ఇక్కడా రాష్ట్రంలోనూ ఈ రెండుపార్టీలు నెలరోజులకు పైగా వివిధ రూపాల్లో నిరసన, ఆందోళనా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి ముందే సీపీఐ రాష్ట్రపార్టీ నిర్మాణ మహాసభలను పూర్తిచేసుకుంది. పార్టీ కేంద్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో వివిధ నిరసనలతో పాటు రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా 29 డివిజన్లలో పోటీచేసినా అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయి నిరాశాజనకమైన ఫలితాలను సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment