సాక్షి, సిటీబ్యూరో: నగర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. సీనియర్ నేతల వలసలతో గ్రేటర్‌లో ఆ పార్టీ కకావికలమవుతోంది. వరుస ఓటములతో సంస్థాగతంగా బలహీనపడటంతో పాటు దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోవడంతో మరింత దిగజారింది. తమ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఇతర పార్టీలకు క్యూ కడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తొమ్మిదేళ్ల క్రితం వరకు నగరంలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ప్రాతినిధ్యం కలిగి ఎదురులేని శక్తిగా ఉన్న నగర కాంగ్రెస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం గులాబీ ఆకర్ష్‌తో నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు పార్టీకి గుడ్‌బై చెప్పగా, తాజాగా కమలం ఆకర్ష్‌లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పార్టీని వీడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో గ్రేటర్ కాంగ్రెస్ ముఖ్య నేతలపై వల విసరడంలో కమలనాథులు సఫలీకృతమవుతున్నట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి, పార్టీ సనత్‌నగర్ ఇన్‌చార్జి మర్రి శశిధర్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించడంలో విజయవంతమైంది. మిగిలిన అసంతృప్త వాదులను సైతం చేర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ గ్రేటర్‌పై దృష్టి కేంద్రీకరించలేదన్న అపవాదును మూటగట్టుకొంటోంది. ముఖ్యనేతలు ఒక్కొక్కరు జారుకోవడంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది.
కమలం ఆకర్ష్..
తాజాగా కమలం ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా కాంగ్రెస్ కీలక నేతలు ఒక్కొక్కరు పార్టీ వీడుతున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర ప్రభావం చూపింది. మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుటుంబం పార్టీకి గుడ్‌బై చెప్పగా, వారితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, ద్విత్రీయ శ్రేణి నేతలు బీజేపీలో చేరారు. ఆ తర్వాత కుత్బుల్లాపుర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్, పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ కాంగ్రెస్‌ను వీడారు. తాజాగా మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ వైపు మొగ్గారు. దాసోజు శ్రవణ్ మాత్రం కేవలం రెండు మాసాలకే బీజేపీని కూడా వీడి టీఆర్‌ఎస్‌లోచేరారు. మరో ముఖ్యనేత మైనారిటీ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది
రెండేళ్లుగా రథసారథి కరువు
రాష్ట్ర రాజధానిగా రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న మహా నగరంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కరువైంది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ పదవికి రాజీనామా చేయడంతో నగర సారథి లేకుండా పోయారు. రెండేళ్లుగా కమిటీ లేని నగర కాంగ్రెస్‌ను ఆరు నెలల క్రితం మూడు జిల్లాలుగా విభజించి కమిటీలు వేయాలన్న పీసీసీ నిర్ణయం సైతం అటకెక్కింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీలో జవసత్వాలు నింపే ప్రయత్నం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది.
వరుస ఓటములతో..
రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలుకాగా, అప్పట్లో గ్రేటర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార పక్షంలో చేరిపోయారు. ఆ తర్వాత రెండోసారి జరిగిన శాసనసభ ఎన్నికల అనంతరం కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. శివారు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిలు అధికార పార్టీలో చేరిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. తాజాగా పార్టీ కీలక నేతలు బీజేపీలోకి జారుకోవడంతో కాంగ్రెస్‌కు మింగుడు పడటంలేదు.
Comments
Please login to add a commentAdd a comment