టీడీపీ కథ కంచికే! | TDP Is Going To Merge In TRS Very Soon | Sakshi
Sakshi News home page

టీడీపీ కథ కంచికే!

Published Thu, Jan 10 2019 2:42 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

TDP Is Going To Merge In TRS Very Soon - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ కంచికి చేరడం ఖాయమైంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోపే టీడీపీ అడ్రస్‌ గల్లంతు చేసేందుకు అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహం రూపొందించింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ను మళ్లీ మొదలుపెడుతోంది. ముందుగా టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకుని ఆ తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై నజర్‌ పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీఆర్‌ఎస్‌ మిగిలిన పార్టీల వారిని చేర్చుకునే విషయంలోనూ వేగంగానే నిర్ణయాలు తీసుకోనుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ 88 స్థానాల్లో విజయం సాధించింది.

ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరపున గెలిచిన కోరుకంటి చందర్‌ (రామగుండం), స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన లావుడ్య రాములునాయక్‌ (వైరా) ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆకర్ష్‌లో భాగంగా మొదట టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వర్‌రావు (అశ్వారావు పేట)లను ఒకేసారి పార్టీలో చేర్చుకోవాలని యోచిస్తోంది. గత అసెంబ్లీలో చేసినట్లుగా ఈసారి టీడీపీ శాసనసభా పక్షాన్ని అధికార పక్షంలో విలీనం చేసేలా వ్యూహం రచించింది. సండ్రకు మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్, మెచ్చాకు గిరిజన ఆర్థిక సహకార సంస్థ (ట్రైకార్‌) చైర్మన్‌ పదవులు ఇచ్చేందుకు అవకాశముందని సమాచారం.

ఉత్సాహం.. ఊగిసలాట
వాస్తవానికి, తెలంగాణలో టీడీపీ లేకుండా చేయాలనే వ్యూహంతోనే మొదట్నుంచీ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పావులు కదిపారు. తాజా ఎన్నికల్లో మహాకూటమితో కలిసి 13 చోట్ల పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిని పార్టీలో చేర్చుకుంటే అసెంబ్లీ నిబంధనల ప్రకారం కూడా అధికారికంగా టీడీపీ పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం అవుతుంది. అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అధికార పార్టీ రంగంలోకి దిగి చర్చలు ప్రారంభించింది. దీంతో సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమంటూ 15రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. మరో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కూడా చర్చలు జరుగుతున్నాయని, అయితే, ఆయన కొంత ఊగిసలాటలో ఉన్నారని చర్చ జరిగింది. ఆ తర్వాత కూడా టీఆర్‌ఎస్‌ నేతల సంప్రదింపులతో మెత్తబడ్డారని తెలుస్తోంది.

చంద్రబాబు ఒత్తిడి తెచ్చినా!
టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మొదట్నుంచీ సిద్ధంగానే ఉన్న సండ్ర మంత్రి పదవి లభిస్తే బాగుంటుందని భావించారు. తనతో పాటు మెచ్చాను కూడా టీఆర్‌ఎస్‌లోకి తీసుకెళ్లడం ద్వారా కేసీఆర్‌ నుంచి ఆ మేరకు హామీ తీసుకోవచ్చనుకున్నారు. తన నియోజకవర్గంలో కార్యకర్తలు, నేతలతో సమావేశమై వారిని కూడా పార్టీ మారేందుకు మానసికంగా సిద్ధం చేశారు. కానీ, మెచ్చా మొదట్లో ససేమిరా అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోనే ఉంటానంటూ అమరావతికి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి వచ్చారు. పార్టీ మారొద్దంటూ మెచ్చాపై చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చారు.

సండ్ర వెళ్లినా టీడీపీలోనే ఉంటే ఆయన స్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యునిగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో మెచ్చా కొంత మెత్తబడ్డట్టు కనిపించింది. అయితే, టీఆర్‌ఎస్‌ నేతల చర్చలతో పాటు నియోజకవర్గ నేతలు కూడా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలని, అయితే, ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగానే పార్టీలోకి వెళ్లాలని మెచ్చాకు సూచించారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతల సూచన, ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల ఒత్తిడి మేరకు ఆయన కూడా చివరకు ఓకే చెప్పేశారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతుండడం గమనార్హం. 

8 మంది కాంగ్రెస్‌ సభ్యులు కూడా..
టీడీపీ శాసనసభ పక్షం విలీనం పూర్తి కాగానే.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై చేరిక వ్యూహాన్ని అమలు చేసేందుకు అధికార పార్టీ అంతా సిద్ధం చేసింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ 19 స్థానాలు గెలుచుకుంది. వీరిలో 8మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అధిష్టానంతో సంప్రదింపులు జరుగుతున్నారు. అయితే ఒక్కొక్కరు చొప్పన కాకుండా ఒకేసారి కాంగ్రెస్‌ శాసనసభ పక్షాన్ని విలీనం చేసే దిశగా టీఆర్‌ఎస్‌ వ్యూహం రచించింది. కాంగ్రెస్‌ తరుపున గెలిచిన వారిలో 13 మంది ఒకేసారి టీఆర్‌ఎస్‌లో చేరితే న్యాయపరమైన ఇబ్బందులు లేమీ ఉండవు. దీంతో ఒకేసారి ఆ మేరకు టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేలా ప్రణాళిక పూర్తవుతోంది. జనవరి 17నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఆలోపే.. టీడీపీ ఎమ్మెల్యేల చేరిక జరగొచ్చని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్‌ సమావేశాలలోపు కాంగ్రెస్‌ శాసనసభ పక్షం విలీనం జరగొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎంపీ సీట్ల గెలుపు లక్ష్యం
జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమార్పు లక్ష్యంగా కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ను నిర్మించే పనిలో ఉన్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లలో మజ్లిస్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్‌ మినహా మిగిలిన 16 స్థానాలను గెలుచుకోవాలని టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలలో మాత్రమే టీఆర్‌ఎస్‌ వెనుకబడింది. ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో ఒక్క స్థానం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో మూడు స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ రెండు లోక్‌సభ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ ఎనిమిది, టీడీపీ రెండు అసెంబ్లీ స్థానాలను గెలచుకున్నాయి.

16 ఎంపీ సీట్లలో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్‌ఎస్‌కు ఈ రెండు లోక్‌సభ సెగ్మెంట్లలో ఇబ్బందులున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలోని కాంగ్రెస్‌కు చెందిన 8మంది ఎమ్మెల్యేలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ సభ్యులను చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీరితోపాటు మిగిలిన జిల్లాల్లోని 5గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే సాంకేతికంగా ఇబ్బందులు ఉండబోవని భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికలలో గెలుపు లక్ష్యంగా వీలైనంత త్వరగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల చేరికను పూర్తి చేసేందుకు టీఆర్‌ఎస్‌ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement