తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. ఆరోపణలు, చాలెంజ్‌లు! | Political Heat In Telangana: Allegations, Challenges Between Leaders | Sakshi
Sakshi News home page

తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. ఆరోపణలు, చాలెంజ్‌లు!

Published Sat, Sep 25 2021 4:45 PM | Last Updated on Sat, Sep 25 2021 5:50 PM

Political Heat In Telangana: Allegations, Challenges Between Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ–ప్రతివ్యూహాలు, ఆరోపణలు–ప్రత్యారోపణలు, సవాళ్లు–ప్రతిసవాళ్లలో నిమగ్నమయ్యాయి. డ్రగ్స్‌ ఆరోపణలు మొదలు వైట్‌ చాలెంజ్‌లు, చివరకు కోర్టులను ఆశ్రయించే వరకు పరిస్థితులు చేరుకున్నాయి. ట్విట్టర్‌ ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ విమర్శలు, వ్యాఖ్యానాలూ పెరిగిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగానే సమయమున్నా అన్ని పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పాదయాత్రలు, జాతీయస్థాయి నేతల బహిరంగ సభలు వంటి వాటితో బిజీ అయిపోయాయి. అధికార టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్, బీజేపీలు విమర్శల వాడిని పెంచాయి.

తాజాగా కాంగ్రెస్‌ నేతృత్వంలో లెఫ్ట్, టీజేఎస్, టీడీపీ తదితర మొత్తం 19 పార్టీలు ఒక వేదికపైకి వచ్చాయి. అటు కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్నీ, ఇటు రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కార్‌నూ ఓడించాలనే ‘డబుల్‌ ఆపరేషన్‌’ను తెరమీదకు తెచ్చాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన పార్టీల మధ్య త్రిముఖæ పోటీ తప్పదనేది స్పష్టమవుతోంది. ఇంతదాకా టీఆర్‌ఎస్‌కు నిజమైన ప్రత్యామ్నాయంగా తామే రూపొందుతామని భావిస్తూ వచ్చిన బీజేపీకి మరో రూపంలో కొత్త ప్రత్యర్థులు ఎదురౌతున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థి,  ప్రత్యామ్నాయం ఎవరో తేల్చుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్, బీజేపీలపై పడింది.
చదవండి: పంజాబ్‌ ముగిసింది.. ఇక రాజస్తాన్‌పై కాంగ్రెస్‌ దృష్టి

ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ కూడా ఈ రెండుపార్టీలను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. కిందిస్థాయి నుంచి వివిధ కమిటీల నియామకం ద్వారా సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే కార్యాచరణలో నిమగ్నమైంది. రాష్ట్రంలో రాజుకుంటున్న రాజకీయ వేడికి హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం మలుపు తిప్పి, పార్టీల భవిష్యత్‌ వ్యూహాలను నిర్దేశించే అవకాశాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

పోటాపోటీ సభలు 
సెప్టెంబర్‌ 17న నిర్మల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభ నిర్వహించిన నాడే గజ్వేల్‌లో కాంగ్రెస్‌ సభను నిర్వహించింది. గతంలో లేనివిధంగా ఎన్నికలకు ఎంతో ముందుగానే రెండు ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ సభలు జరిగాయి. దీంతో ప్రజల్లో ఎక్కువ స్పందన దేనికి వచ్చింది, ఏ సభకు ఎక్కువమంది హాజరయ్యారనే పోలిక అనివార్యంగానే ముందుకొచ్చింది. గత నెల 28 నుంచి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్వహిస్తున్న ‘ప్రజాసంగ్రామయాత్ర’ మొదటి దశ అక్టోబర్‌ 2న ముగియనున్న సందర్భంగా హుజురాబాద్‌లో నిర్వహించనున్న రోడ్‌షోలో ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి స్మృతీఇరానీ పాల్గొంటారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అదేరోజు సిరిసిల్లలో బహిరంగసభ నిర్వహించనున్నట్టు ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రకటించింది.
చదవండి: జగ్గారెడ్డి తీరుపై గాంధీభవన్‌లో వాడివేడి చర్చ

దీంతో మళ్లీ ఈ రెండు పార్టీల మధ్య పోటాపోటీ కార్యక్రమాలు జరగనుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలాఉండగా, నిర్మల్‌లో అమిత్‌షా హెలికాప్టర్‌లో సభావేదిక వద్ద దిగినప్పటి నుంచి తిరుగు ప్రయాణమయ్యే దాకా కూడా పార్టీ ముఖ్యనేతలకు ప్రాధాన్యం, సమన్వయం వంటివి సరిగా లేవనే అభిప్రాయాన్ని కమల నాయకులు కొందరు వ్యక్తం చేస్తున్నారు. సంజయ్‌ పాదయాత్ర ఏర్పాట్లలో పూర్తిస్థాయిలో నిమగ్నమైన వారికి తగిన ప్రాధాన్యత లభించలేదని, కొందరు కనీసం వేదికపైకి రాలేకపోవడాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. దీంతో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ సైతం తన వ్యూహాలను మార్చుకునేందుకు సిద్ధమౌతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement