తెలంగాణలో రాజకీయ వేడి అంతకంతకు పెరిగిపోతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో తమ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. కాషాయ పార్టీకి అనేక చోట్ల కేడర్ ఉన్నా సరైన నాయకత్వం లేదు. దీంతో ఆపరేషన్ ఆకర్షతో సీనియర్ నాయకులకు గాలం వేస్తోంది. ఇప్పటికే అనేక మందికి కాషాయ తీర్థం ఇచ్చింది. ఇంకా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత బీజేపీనీ వేధిస్తోంది.
అయితే నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్‌లో కూడా అక్కడున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలకు సరితూగే అభ్యర్థిని రెడీ చేసుకుంటోంది. క్రమంగా జిల్లాలో పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తోంది కమలం పార్టీ. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా కొంతమేర పట్టు బిగించింది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కీలకంగా ఉన్న నేతలకు పార్టీ కండువా కప్పేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. గత ఉప ఎన్నికల్లో పోయిన పరువును రాబట్టుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు పక్కా ప్రణాళికతో నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేత గట్టు శ్రీకాంత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంది.
కమలం ఎందుకు తలకిందులయింది?
హుజూర్ నగర్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సైదిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రూపంలో బలమైన అభ్యర్థులు ఉన్నారు. అయితే వారికి పోటీనిచ్చే స్థాయి నేత లేక ఇన్నాళ్లు బీజేపీ తల పట్టుకుంది. గత ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయంటే అక్కడ బీజేపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే హుజూర్ నగర్‌లో పట్టు సాధించేందుకు శ్రీకాంత్ రెడ్డి రూపంలో కాషాయ పార్టీకి బలమైన నేత దొరికినట్లు అయింది.
నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అనుచరవర్గం ఉండటంతో పాటు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతను ధీటుగా ఎదుర్కొన్న అనుభవం కూడా శ్రీకాంత్‌రెడ్డికి ఉంది. ఇది తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. ఇప్పటికే నియోజవర్గంలో పట్టు సాధించేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటూ.. అక్కడ కార్యక్రమాలు సాగిస్తూ వస్తోంది. మఠంపల్లి మండలం గుర్రంబోడు గిరిజన తండా భూముల విషయం రాష్ట్ర స్థాయిలో పెద్ద చర్చను తీసుకురావడంతో పాటు... దాని వెనుక ఎవరి పాత్ర ఉందో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ఉద్యమించింది. ఇది గిరిజన రైతుల్లో ఆ పార్టీ పట్ల సానుభూతిని పొందేందుకు ఉపయోగపడిందని భావిస్తున్నారు. బండి సంజయ్ ధాన్యపు రాశుల పరిశీలన పేరుతో చేసిన హంగామా కూడా ప్రజల్లోకి బాగానే వెళ్లింది. అయితే ఎటొచ్చి దీన్ని కొనసాగించేందుకు ఇన్నాళ్లు ఆ పార్టీకి బలమైన నేత లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీలో చేరడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమని అంటున్నారు.
సవాల్ ప్రతి సవాల్
ఇన్నాళ్లు అక్కడ ద్విముఖ పోరు మాత్రమే సాగింది. ఇప్పుడు ఒక్కసారిగా ముక్కోణపు పోరుగా మారింది. ఇప్పటికే మరోసారి గెలవాలని సైదిరెడ్డి, ఎలా అయినా గెలవాలని ఉత్తమ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. సవాళ్ల మీద సవాళ్లు విసురుకుంటున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే శ్రీకాంత్ రెడ్డి మాత్రం సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల 30 వేల ఓట్లలో 55 నుంచి 60 వేలు ఓట్లు తెచ్చుకుంటే చాలు అన్నట్లు ఆయన ప్లాన్ చేసుకుని చాపకింద నీరులా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోనూ యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు గతంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలనే ప్లాన్‌లో శ్రీకాంత్ రెడ్డి ఉన్నారట. అయితే శ్రీకాంత్ రెడ్డికి బొబ్బా భాగ్యారెడ్డి అనే నేత రూపంలో తలనొప్పులు వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఆయన కూడా టికెట్ ఆశిస్తుండటంతో తనకు సహకరిస్తారో లేదో అని శ్రీకాంత్ రెడ్డి అనుమానపడుతున్నారని సమాచారం. మొత్తానికి కాంగ్రెస్, కారు పార్టీలకు గట్టి పట్టున్న హుజూర్ నగర్‌లో ఎలక్షన్ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి. ఆ రెండు పార్టీలకు బీజేపీ పోటీ ఏ రేంజ్‌లో ఉంటుంది? ముక్కోణపు పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
Comments
Please login to add a commentAdd a comment