వెబ్ స్పెషల్: తెలంగాణలో మరో ఎన్నికల సమరం జరగబోతుంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్‌ఎంసీ, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో పాటు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దుబ్బాకతో పాటు నిజామాబాద్ ఎమ్మెల్సీ, గ్రేటర్ ఎన్నికల్లో ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విపక్షాల నుంచి కొంతమేర పోటీ ఉన్నా.. అధికార టీఆర్‌ఎస్‌కు పెద్ద ఇబ్బంది ఎదురుకాకపోవచ్చు. ఇక పట్టభద్రుల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను టీఆర్‌ఎస్‌తో పాటు విపక్షాలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కరోనాతో పాటు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని నిరుద్యోగులు గుర్రుమీద ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలపై ప్రధాన పార్టీలన్నీ తమ దృష్టిని కేంద్రీకరించాయి.
ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లాలు ఒక నియోజకవర్గం, హైదరాబాద్-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలను మరో నియోజకవర్గంగా విభజించారు. ఈ రెండు నియోజకవర్గాల్లోని పట్టభద్రులు ఆయా పార్టీలు బలపరిచిన ప్రధాన అభ్యర్థులను తమ ఓటు హక్కుతో ఎన్నుకోనున్నారు. అయితే పట్టభద్రల కోటాలో జరిగే ఎన్నికకు ఎవరు అర్హులు, అనర్హులు అనేదానిపై ఇప్పటికీ కొంతమందిలో సందేహాలు మొదలుతున్నాయి. అర్హులంతా ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తాజాగా ఎన్నికల సంఘం కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఓటు హక్కు ఎలా నమోదు చేసుకోవాలి అనేదానిపై ఈసీ గతంలోనే పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. (‘మండలి’ కసరత్తు..!)
అర్హులు ఎవరు..?
పట్టభద్రుల కోటాలో జరిగే ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవాలని అనుకునే వారు ఖచ్చితంగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఏడాది నవంబర్ నాటికి డిగ్రీ పాస్ అయ్యి మూడేళ్లు పూర్తి చేసి ఉండాలి. వారు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ఖమ్మం-వరంగల్-నల్గొండతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్‌నగర్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల పదవీకాలం 2021 మార్చి 29 నాటికి పూర్తి కానుంది. గడువు ముగిసేలోపే ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు నమోదు కార్యక్రమానికి ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అర్హులైన వారు నమోదు చేసుకోవాలని పేర్కొంది. 2015 ఎన్నికల్లో ఓటర్ల జాబితాను పూర్తిగా రద్దు చేశారు. కనుక 2017 నాటికి పట్టభద్రులైన వారు అక్టోబర్ 1వ తేదీనుంచి దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. (ఈసీ గ్రీన్ సిగ్నల్ : కవిత గెలుపు వ్యూహాలు)
ఎలా నమోదు చేసుకోవాలి..?
నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తై ఉన్నవాళ్లు అక్టోబర్ 1వ తేదీ నుంచి ఓటరుగా నమోదు చేసుకోవాలి. వ్యక్తిగతంగా గానీ, ఆన్‌లైన్ ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో అధికారులు పోలింగ్ కేంద్రాల వారిగా అధికారులను నియమిస్తున్నారు. అర్హులైన వారు వారి వద్ద నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు, డిగ్రీ పట్టాతో పాటు మరికొన్ని ఇతర పత్రాలు జతచేయాల్సి ఉంటుంది. అలాగే ఆల్‌లైన్ ద్వారా కూడా ఓటరుగా నమోదు చేసుకునే వెసులుబాటు కూడా ఎన్నికల సంఘం కల్పించింది.
ఆన్‌లైన్‌లో ceotelangana.nlc.in లేదా http://www.nvsp లింక్ ద్వారా ఫారం 18ను పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిని భర్తీ చేసిన అనంతరం రెండు ద్రువపత్రాలు స్కాన్‌చేసి అప్‌లోడ్ చేయాలి. దీనికి నవంబర్ 11వ తేదీ వరకు గడువు ఉంది. డిసెంబర్ 1న ఓటరు ముసాయిదాను ప్రకటిస్తారు. తుది ఓటర్లు జాబితాను జనవరి 18 ప్రకటించనున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో ఓటు హక్కును నమోదు చేసుకున్న వారుసైతం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శంశక్ గోయల్ తెలిపారు. దీంతో పాతవారు సైతం మరోసారి ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవాల్సిన అవసరముంది.
కాగా ఈ ఎన్నికలను టీఆర్‌ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ స్థానానికి ప్రస్తుత సిట్టింగ్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని మరోసారి బరిలో నిలిపే అవకాశం ఉంది. ఆయనపై విపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థిగా తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండరాంను నిలబెట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. కాంగ్రెస్ మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని తెలపలేదు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానానికి మేయర్ బొంతు రామ్మోహన్‌ను పరిశీలిస్తున్నట్టు టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. గత ఆరేళ్లుగా అడపాదడపా ఉద్యోగ నియామక నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నా నిరుద్యోగులు మాత్రం ప్రభుత్వంపై పీకల్లోతు కోపంతో రగిలిపోతున్నారు.
మరోవైపు కరోనా వైరస్ విజృంభణ నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. చాలామంది జీవితాలు తలకిందులు అయ్యాయి. కష్ట సమయంలో ప్రభుత్వం నుంచి తమను ఆదుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీఆర్‌ఎస్ గెలుపు గుర్రాల బాధ్యతను మంత్రి కేటీఆర్ భుజానకెత్తుకున్నారు. ఇప్పటికే నియోజవర్గాల్లో వారిగా సమీక్షలు చేపట్టారు. టీఆర్‌ఎస్ పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, ఇందులో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరినీ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే పట్టభద్రుల ఓటరు నమోదులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అర్హతను బట్టి తమ ఇంటి నుంచే నమోదు ప్రక్రియను ప్రారంభించాలని నేతలకు ఆదేశాలు జారీచేసింది.
తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జన సమితి, యువ తెలంగాణ పార్టీ లు ఇప్పటికే ఎన్నికల ముందస్తు కార్యాచరణలోకి దిగాయి. నల్గొండ జిల్లాకు చెందిన ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తాను పోటీ చేస్తున్నానని ఇప్పటికే ప్రకటించారు. ఇంకో వైపు సీపీఐ కూడా ఈ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిని పోటీకి పెట్టాలని నిర్ణయించుకుని క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తోంది. సీపీఐ కూడా ఈనెల 30వ తేదీన తమ అభ్యర్థి పేరును ప్రకటించనుందని అంటున్నారు. అయితే తమకు మద్దతు ఇవ్వాలని కోదండరాం కోరుతున్నారు. రాజకీయ వర్గాల సమాచారం మేరకు ఖమ్మం, నల్గొండ స్థానానికి విపక్షాలు కోదండరాంను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తే విజయం సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యువతో ఫాలోయింగ్‌తో పాటు ప్రభుత్వ వ్యతిరేకత కొంతమేర లబ్ధిచేకూరే అవకాశం ఉంది. ఇక దీనిపై అధికార టీఆర్‌ఎస్ ఎలాంటి ఎత్తులు వేస్తోందో వేచి చూడాలి. ఇక ఈ ఎన్నికలు కేటీఆర్‌కు సవాలు లాంటిదేనని నిరుద్యోగులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment