huzurnagar constituency
-
హుజుర్నగర్లో పొలిటికల్ హీట్.. బీజేపీకి బలమైన నేత దొరికాడా?
తెలంగాణలో రాజకీయ వేడి అంతకంతకు పెరిగిపోతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో తమ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. కాషాయ పార్టీకి అనేక చోట్ల కేడర్ ఉన్నా సరైన నాయకత్వం లేదు. దీంతో ఆపరేషన్ ఆకర్షతో సీనియర్ నాయకులకు గాలం వేస్తోంది. ఇప్పటికే అనేక మందికి కాషాయ తీర్థం ఇచ్చింది. ఇంకా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత బీజేపీనీ వేధిస్తోంది. అయితే నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్లో కూడా అక్కడున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు సరితూగే అభ్యర్థిని రెడీ చేసుకుంటోంది. క్రమంగా జిల్లాలో పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తోంది కమలం పార్టీ. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా కొంతమేర పట్టు బిగించింది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కీలకంగా ఉన్న నేతలకు పార్టీ కండువా కప్పేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. గత ఉప ఎన్నికల్లో పోయిన పరువును రాబట్టుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు పక్కా ప్రణాళికతో నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేత గట్టు శ్రీకాంత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. కమలం ఎందుకు తలకిందులయింది? హుజూర్ నగర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సైదిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రూపంలో బలమైన అభ్యర్థులు ఉన్నారు. అయితే వారికి పోటీనిచ్చే స్థాయి నేత లేక ఇన్నాళ్లు బీజేపీ తల పట్టుకుంది. గత ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయంటే అక్కడ బీజేపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే హుజూర్ నగర్లో పట్టు సాధించేందుకు శ్రీకాంత్ రెడ్డి రూపంలో కాషాయ పార్టీకి బలమైన నేత దొరికినట్లు అయింది. నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అనుచరవర్గం ఉండటంతో పాటు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతను ధీటుగా ఎదుర్కొన్న అనుభవం కూడా శ్రీకాంత్‌రెడ్డికి ఉంది. ఇది తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. ఇప్పటికే నియోజవర్గంలో పట్టు సాధించేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటూ.. అక్కడ కార్యక్రమాలు సాగిస్తూ వస్తోంది. మఠంపల్లి మండలం గుర్రంబోడు గిరిజన తండా భూముల విషయం రాష్ట్ర స్థాయిలో పెద్ద చర్చను తీసుకురావడంతో పాటు... దాని వెనుక ఎవరి పాత్ర ఉందో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ఉద్యమించింది. ఇది గిరిజన రైతుల్లో ఆ పార్టీ పట్ల సానుభూతిని పొందేందుకు ఉపయోగపడిందని భావిస్తున్నారు. బండి సంజయ్ ధాన్యపు రాశుల పరిశీలన పేరుతో చేసిన హంగామా కూడా ప్రజల్లోకి బాగానే వెళ్లింది. అయితే ఎటొచ్చి దీన్ని కొనసాగించేందుకు ఇన్నాళ్లు ఆ పార్టీకి బలమైన నేత లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీలో చేరడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమని అంటున్నారు. సవాల్ ప్రతి సవాల్ ఇన్నాళ్లు అక్కడ ద్విముఖ పోరు మాత్రమే సాగింది. ఇప్పుడు ఒక్కసారిగా ముక్కోణపు పోరుగా మారింది. ఇప్పటికే మరోసారి గెలవాలని సైదిరెడ్డి, ఎలా అయినా గెలవాలని ఉత్తమ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. సవాళ్ల మీద సవాళ్లు విసురుకుంటున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే శ్రీకాంత్ రెడ్డి మాత్రం సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల 30 వేల ఓట్లలో 55 నుంచి 60 వేలు ఓట్లు తెచ్చుకుంటే చాలు అన్నట్లు ఆయన ప్లాన్ చేసుకుని చాపకింద నీరులా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోనూ యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు గతంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలనే ప్లాన్‌లో శ్రీకాంత్ రెడ్డి ఉన్నారట. అయితే శ్రీకాంత్ రెడ్డికి బొబ్బా భాగ్యారెడ్డి అనే నేత రూపంలో తలనొప్పులు వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఆయన కూడా టికెట్ ఆశిస్తుండటంతో తనకు సహకరిస్తారో లేదో అని శ్రీకాంత్ రెడ్డి అనుమానపడుతున్నారని సమాచారం. మొత్తానికి కాంగ్రెస్, కారు పార్టీలకు గట్టి పట్టున్న హుజూర్ నగర్లో ఎలక్షన్ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి. ఆ రెండు పార్టీలకు బీజేపీ పోటీ ఏ రేంజ్లో ఉంటుంది? ముక్కోణపు పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
Etela: కౌశిక్‌రెడ్డి తీరుతో ఇరకాటంలో కాంగ్రెస్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటోంది. మంత్రివర్గం నుంచి అవమానకర రీతిలో బర్తరఫ్‌నకు గురైన ఈటల రాజేందర్‌కు కాంగ్రెస్ బడా నేతలు మద్దతుగా నిలుస్తుంటే.. స్థానికంగా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఎదుర్కొనే విషయంలో ఈటలకు ఇప్పటికే కాంగ్రెస్ నేతల నుంచి మద్దతు లభించింది. కానీ.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఈటలను తూర్పార పట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తరువాత ఈటలకు వ్యతిరేకంగా భూ కుంభకోణాల పేరుతో హల్చల్ చేస్తున్న నాయకుడు కౌశిక్‌రెడ్డి ఒక్కరే. ఈటలను భూకబ్జాదారుడిగా, వేల కోట్ల అధిపతిగా చూపించేందుకు కౌశిక్ రెడ్డి మీడియా సమావేశాలు, టీవీ లైవ్‌షోల్లో పాల్గొంటుండడం కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడడం లేదు. ఈ పరిస్థితిపై ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో కేసీఆర్‌ను వ్యతిరేకించే కాంగ్రెస్ పెద్ద నేతలు తల పట్టుకొంటున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు.. మెదక్ జిల్లా అసైన్డ్ భూములు, దేవరయాంజిల్ దేవాలయ భూముల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పెద్దలు ఈటలపై అస్త్రాలు సంధించారు. మంత్రివర్గం నుంచి తొలగించారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్‌లోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈటలకు మద్దతుగా నిలిచింది. జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డితోపాటు ఎంపీలు ఎ.రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర నాయకులు వి.హన్మంతరావు, దాసోజు శ్రవణ్ తదితరులు ఈటలకు మద్దతుగా తమ వాణి వినిపించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కేసీఆర్‌ను వ్యతిరేకించే విపక్ష నేతల మద్దతు కోసం ఈటల కూడా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కను కలిశారు. ఈటల పోరాటానికి ఆయన సంఘీభావం తెలిపారు. అదే సమయంలో టీఆర్ఎస్లో ప్రాధాన్యత కోల్పోయిన వారు, బీజేపీ నాయకులతోపాటు మరికొందరు కాంగ్రెస్ నేతలను కలిసి మద్దతు కోరే ప్రయత్నాల్లో ఈటల ఉన్నారు. ఉమ్మడి శత్రువు టీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు ఈటలకు అండగా నిలుస్తామని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కలిసొచ్చే ప్రతీ అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందని, హుజూరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ‘సాక్షి’కి చెప్పారు. బలమైన శత్రువును ఎదుర్కొనే క్రమంలో మిగతా వారంతా ఒక్కటవడం కొత్త కాదని ఆయన అన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. హుజూరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు ఆపార్టీ పెద్దలకు అర్థం కావడం లేదు. టీఆర్ఎస్కు అస్త్రంగా మారిన కౌశిక్ తీరు భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత టీఆర్ఎస్కు చెందిన జిల్లా మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈటలపై విమర్శలు గుప్పించారు. సాంకేతికంగా ఈటల ఇప్పటికీ టీఆర్ఎస్లోనే కొనసాగుతుండడంతో ఆ పార్టీ నేతలెవరూ ఆయనపై విమర్శలు చేయడం లేదు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ నేతల నుంచి ఈటలకు మద్దతు లభిస్తోంది. ఈ పరిస్థితుల్లో హుజూరాబాద్‌లో ఓడిపోయిన కౌశిక్‌రెడ్డి ఈటలపై చేస్తున్న విమర్శలే ఇప్పుడు టీఆర్ఎస్కు బలాని్నస్తున్నాయి. మరోవైపు కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని ఒక్క మాట అనకుండా ఈటలనే విమర్శించడాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా జీర్ణించుకోలేదు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నేరెళ్ల మహేందర్ గౌడ్ ఇటీవల కరీంనగర్లో మీడియా సమావేశం ఏర్పాటుచేసి కౌశిక్‌రెడ్డి తీరును విమర్శించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ముఖ్య నాయకుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మౌత్‌పీస్‌గా కౌశిక్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళుతున్నట్లు చెప్పారు. ప్రగతిభవన్ వాయిస్‌ను కౌశిక్ రెడ్డి వినిపిస్తున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో ‘పాడి కౌశిక్‌రెడ్డి అన్న టీం’ పేరిట ‘ఈటల కోవర్టులు’గా కాంగ్రెస్ నాయకులను పేర్కొంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు దర్శనమిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, వీహెచ్‌లు ఈటల అవినీతి గురించి ప్రశ్నించకుండా ఎందుకు మద్దతిస్తున్నారని పేర్కొనడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీలోని మితివీురిన అంతర్గత ప్రజాస్వామ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈటలను తూర్పార పడుతున్న కౌశిక్ రెడ్డి 2018 ఎన్నికల్లో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పాడి కౌశిక్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి దగ్గరి బంధువు. ఈటల ఎపిసోడ్ వెలుగులోకి వచ్చిన తరువాత పార్టీ పెద్ద నేతలంతా మాజీ మంత్రికి మద్దతుగా నిలవగా.. కౌశిక్ రెడ్డి మాత్రం ఘాటైన విమర్శలతో తెరపైకి వచ్చారు. ఈటల మంత్రిగా బర్తరఫ్ అయిన తరువాత మేడ్చల్ మండలం రావల్‌కోల్‌లో ఈటల కొడుకు నితిన్‌రెడ్డి 31 ఎకరాల భూముల కొనుగోలు, ఈటల బినామీగా సాదా కేశవరెడ్డిని పేర్కొంటూ ఆయన కొనుగోలు చేసిన 36 ఎకరాల గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ‘ఈటల రాజేందర్ రెడ్డి’గా రావల్కోల్ భూమి పట్టా పాస్పుస్తకంపై ఉన్న పేరును ప్రస్తావిస్తూ, బీసీ నాయకుడిగా ఆయనకున్న పేరును చెరిపేసే ప్రయత్నం చేశారు. తాజాగా మంగళవారం మీడియా సమావేశంలో ఈటలకు రూ.600 కోట్ల విలువైన 700 ఎకరాల భూములున్నాయని, వాటిపై విచారణ జరపాలని సీఎంను కోరారు. సీలింగ్ చట్టాన్ని అతిక్రమించిన ఈటల నుంచి భూములను స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై బుధవారం ఓ టీవీ ఛానెల్ జరిపిన డిబేట్లో మాట్లాడుతూ ఈటలను భూకబ్జాదారుడిగా పేర్కొన్నారు. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతోంది. చదవండి: అన్నాడీఎంకేకు మరో షాక్: చేజారనున్న ‘పెద్దరికం’ చదవండి: టీచర్ నుంచి స్పీకర్‌గా ఎదిగిన అపావు -
టీఆర్ఎస్లో హుజూర్ జోష్
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో 43వేల పైచిలుకు భారీ మెజారిటీతో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి, నియోజకవర్గ కేంద్రంలో శనివారం ‘కృతజ్ఞత సభ’పేరిట బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17న పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాల్గొనాల్సిన బహిరంగ సభ వర్షం మూలంగా చివరి నిమిషంలో రద్దయింది. సుమారు పది రోజులక్రితం నిర్మించిన సభా వేదికను తొలగించక పోవడంతో శనివారం జరిగే బహిరంగ సభను అదే ప్రదేశంలో నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉప ఎన్నిక ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు శుక్రవారం బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్‌కు చేరుకుని, సాయంత్రం ఐదు గంటలకు జరిగే ‘కృతజ్ఞత సభ’లో ప్రసంగిస్తారు. హుజూర్నగర్ విజయంపై ఎమ్మెల్యే సైదిరెడ్డి, పార్టీ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఫోన్లో అభినందించిన కేసీఆర్, తనను కలిసేందుకు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేదని, శనివారం జరిగే సభకు సంబంధించిన ఏర్పాట్లను చూసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హుజూర్నగర్ పర్యటనకు వస్తున్న కేసీఆర్‌కు భారీ స్వాగతం చెప్పేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. సమన్వయ కమిటీలు..సామాజిక కోణాలు హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి వరుసగా మూడు పర్యాయాలు టీఆర్ఎస్ పోటీ చేసినా.. పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహం రూపొందించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెప్టెంబర్ చివరివారంలో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కొందరు ఎంపిక చేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ప్రచార వ్యూహం అమలు, సమన్వయ బాధ్యతలను అప్పగిస్తూ సుమారు 70 మంది ఇన్‌చార్జీలకు ఉపఎన్నికల బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీలతో పాటు కొన్ని ప్రధాన సామాజిక వర్గాల ఓట్లను రాబట్టేందుకు ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ స్థాయిలో తొమ్మిది మందితో కూడిన కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న వివిధ సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేందుకు కమిటీల ఏర్పాటు వ్యూహం టీఆర్ఎస్కు కలిసి వచ్చింది. పార్టీ వ్యూహం ఫలితాన్ని ఇవ్వడంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేసీఆర్ అభినందించగా, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదితరులను శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. మున్సిపోల్స్‌లోనూ ఇదే తరహా వ్యూహం క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణుల సమన్వయం, ఇతర పార్టీల నుంచి చేరికలు తదితరాలతో భారీ మెజారిటీ సాధించిన టీఆర్ఎస్, త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. తమ నియోజకవర్గాల పరిధిలో మున్సిపాలిటీలు లేని ఎమ్మెల్యేలతో పాటు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ప్రచారం, సమన్వయం బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావిస్తోంది. మున్సిపాలిటీలు, వార్డుల వారీగా ఇతర పార్టీల్లో క్రియాశీలంగా ఉండే కార్యకర్తలు, నాయకులను గుర్తించి.. వారిని పార్టీ గూటికి చేర్చే బాధ్యతను కూడా ఇన్‌చార్జీలకు అప్పగిస్తారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై కేటీఆర్ పార్టీ మున్సిపల్ ఇన్‌చార్జీలతో త్వరలో సమావేశం కానున్నారు. -
‘ఉత్తమ్ ఉత్త మెంటల్ కేస్’
సాక్షి, నల్గొండ: తెలంగాణలోని హుజూర్నగర్ శాసనసభ స్థానానికి అక్టోబర్ 21న ఉప ఎన్నిక జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మీడియాతో మాట్లాడారు. హుజుర్నగర్లో టీఆర్ఎస్సే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్ ఉత్త మెంటల్ కేసని..మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండడని ఆరోపించారు. ఆమె ప్రజలకు అందుబాటులో ఉండదని తెలిసే.. పద్మావతిని కోదాడలో ఓడించారని పేర్కొన్నారు. పద్మావతి ఓడిపోతుందని.. ఆమెను గెలిపిస్తామన్న నేతలకు కూడా తెలుసని లింగయ్య స్పష్టం చేశారు. ఇక పోతే హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి ఖరారయినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
రేవంత్ వ్యాఖ్యలపై దుమారం
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : ఉప ఎన్నిక ముంగింట్లో కాంగ్రెస్ పార్టీలో హుజూర్నగర్ అభ్యర్థిత్వంపై కయ్యం తారస్థాయికి చేరింది. ‘అభ్యర్థిగా పద్మావతిని.. ఉత్తమ్ ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారు’ అని పార్టీ వర్కింVŠ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆపార్టీ జిల్లా శ్రేణుల్లో దుమారం లేపాయి. ఆయన వ్యాఖ్యలపై హుజూర్నగర్, సూర్యాపేటలో పార్టీ నేతలు మండిపడ్డారు. అయితే జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఆపార్టీలో జరిగిన పరిణామాలను టీఆర్ఎస్ నిశితంగా పరిశీలిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. రేవంత్‌ను టార్గెట్ చేసి విమర్శలు.. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లాలో ఆపార్టీ ముఖ్య నేతలు.. నేరుగా ఆయన్ను టార్గెట్ చేసి ఘాటుగా విమర్శలు సంధించారు. పార్టీ అగ్రనేతల నిర్ణయం మేరకే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్.. పద్మావతిని హుజూర్నగర అభ్యర్థిగా ప్రకటించారని, దీనికి రేవంత్‌రెడ్డి అభ్యంతరం ఎందుకు చెబుతారని ప్రశ్నించారు. రేవంత్‌పై విమర్శలు గుప్పించడంపై.. ఆయనతో పాటు పార్టీలోకి వచ్చిన జిల్లా ముఖ్య నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. హుజూర్నగర్ వేదికగా ఆపార్టీలో జరిగిన పరిణామాలు జిల్లాలో పాత.. కొత్త నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు తీసుకొచ్చాయి. ఇదిలా ఉండగా హుజూర్నగర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో రూ.వేల కోట్లు ఖర్చు చేశాడని, ఆయన సతీమణి పద్మావతికి టికెట్ ఇస్తే గెలిపిస్తామన్నారు. ఆమెకు టికెట్ ఇస్తే కేడర్ ఎటూ వెళ్లదన్నారు. ఎక్కడి వారినో ఇక్కడికి తీసుకొచ్చి పోటీ చేయిస్తే గెలవడం అసాధ్యమన్నారు. యూత్ కాంగ్రెస్ నేతలు.. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి.. ఉత్తమ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఉప ఎన్నికల్లో పద్మావతే తమ పార్టీ అభ్యర్థి అన్నారు. ఈ నియోజకవర్గ ఉప ఎన్నిక రేవంత్‌రెడ్డికి సంబంధం లేదన్నారు. హుజూర్నగర్ టికెట్‌పై రేవంత్‌రెడ్డి జోక్యం మంచి పద్ధతి కాదని, ఆయన నియోజకవర్గానికే పరిమితం కావాలని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకటన్నయాదవ్ విలేకరుల సమావేశంలో.. రేవంత్‌పై ధ్వజ మెత్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీని విమర్శించడం సమంజసం కాదన్నారు. గులాబీలో చర్చ.. కాంగ్రెస్ పార్టీలో హుజూర్నగర్ అభ్యర్థిత్వంపై జరుగుతున్న కయ్యాన్ని టీఆర్ఎస్ ముఖ్య నేతల గణం నిశితంగా పరిశీలిస్తోంది. కాంగ్రెస్‌లో ఈ పరిణామాలు ఎటు వైపు వెళ్తాయోనని అంచనా వేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి ఎవరన్నది త్వరలో ప్రకటిస్తే నోటిఫికేషన్ రాకున్నా దూకుడుగా ప్రచారానికి వెళ్లొచ్చని ఆపార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. గత నెల రోజులుగా మంత్రి జగదీశ్‌రెడ్డి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు ఇంకా ప్రకటించలేదు. ఈ స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రకటించనున్నారు. అయితే కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలపై మంత్రి జగదీశ్‌రెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌లో గలాటాను టీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో హుజూర్నగర్ నియోజకవర్గంలో ఏయే మండలాల్లో నేతలు అసంతృప్తిగా ఉన్నారని పార్టీ ముఖ్య నేతలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
‘హుజూర్నగర్’ తర్వాతే?
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో ఉండదా..? త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు ఉంటాయనే ప్రభుత్వ సంకేతాలు... ఆరు నెలల్లో హుజూర్నగర్ అసెంబ్లీకి అనివార్యంగా జరగాల్సిన ఉప ఎన్నిక నేపథ్యంలో అవి పూర్తయిన తర్వాతే ఉత్తమ్‌ను మారుస్తారా..? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. ఇప్పటికిప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సిన పనిలేదని, ఎన్నికలకు ముందు అధ్యక్షుడిని మారిస్తే పార్టీలో సమన్వయానికి కొంత ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తును అధిష్టానం ప్రస్తుతానికి నిలిపివేసినట్టు తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే సోమవారం విలేకరులతో మాట్లాడిన కుంతియా ఇప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండదని, రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలా?.. వద్దా?.. అన్నది తేలిన తర్వాతే మార్పులుంటాయని చెప్పడం గమనార్హం. ఎన్నికలకు ముందు ఎందుకు..? రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ నుంచి జరుగుతున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 స్థానాలు, లోక్‌సభ ఎన్నికల్లో 3 స్థానాలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికల్లో 20–25 శాతం స్థానాలు మాత్రమే గెలుచుకున్న ఆ పార్టీకి త్వరలోనే జరుగుతాయని భావిస్తున్న మున్సిపల్ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయంతో బీజేపీ దూకుడు మీద ఉండటం, 32 జిల్లా పరిషత్‌ల్లో ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ గెలుచుకోకపోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో కంటితుడుపు విజయమైనా ఆ పార్టీకి అనివార్యం కానుంది. కనీసం జిల్లాకు ఒకటో, రెండో మున్సిపాలిటీల్లోనైనా గెలవకపోతే పట్టణ ప్రాంతాల్లో ఘోరంగా దెబ్బతినే అవకాశముంది. దీంతో మున్సిపల్ ఎన్నికలపై కసరత్తును కాంగ్రెస్ అప్పుడే ప్రారంభించింది కూడా. ఇక, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్నగర్ అసెంబ్లీకి ఆరు నెలల్లో ఏ క్షణంలోనైనా ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ గెలుపోటములు కూడా కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడి మార్పు ప్రక్రియ జరిగితే సమన్వయం దెబ్బతింటుందని, ఈ రెండు ఎన్నికల తర్వాతే అధ్యక్షుడిని మారిస్తే బాగుంటుందని చాలా మంది నేతలు సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా సోమవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పడం గమనార్హం. పెరుగుతున్న జాబితా.. ఇక టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆసక్తి కలిగిస్తోంది. రేవంత్ రెడ్డి, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, విజయశాంతి, దామోదర రాజనర్సింహ, సంపత్ పేర్లు రేసులో వినిపిస్తుండగా ఇప్పుడు జగ్గారెడ్డి కూడా ఆ జాబితాలో చేరారు. నిన్నటివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలని అడిగిన జగ్గారెడ్డి ఆదివారం కుంతియాను కలసి తనకు కూడా టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. దీనికి తోడు అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని అధికారంలోకి తెచ్చే మెడిసిన్ తన వద్ద ఉందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటే జూలైలో ఉంటుందని, లేదంటే మరో ఏడాది కూడా ఉత్తమే అధ్యక్షుడిగా ఉంటారనే చర్చ పార్టీలో జరుగుతోంది. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కొసాగుతారు: కుంతియా పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనసాగుతారని ఏఐసీసీ ఇంచార్జీ కుంతియా స్పష్టం చేశారు. కొత్త అధ్యక్షుని నియామకంపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని ఆయన అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ‘రాజగోపాల్ రెడ్డికి పార్టీ చాలా గౌరవం ఇచ్చింది. కానీ ఆయన ఎందుకు అలా చేస్తున్నారో తెలియడం లేదు. అతని మీద క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది. ఎవరు క్రమశిక్షణ తప్పినా ఉపేక్షించేది లేదు’అని హెచ్చరించారు. రాహుల్‌గాంధీ ఏఐసీసీ అధ్యక్షునిగా కొనసాగాలని, ఆయన మంచి ఫైటర్ అన్న విషయం మొన్నటి ఎన్నికల్లో తేలిందన్నారు. 29న సాగర్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ నెల 29న నాగార్జునసాగర్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని కుంతియా తెలిపారు. ఈ ఎన్నికల వ్యూహరచన కోసం పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీ వేసినట్లు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 34 శాతానికి పెంచాలని కుంతియా డిమాండ్ చేశారు. ఇకపై ప్రతి నెల 1, 2, 3 తేదీల్లో మండల, జిల్లా, బ్లాక్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని, జూలై మొదటివారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో భేటీ ఉంటుందన్నారు. పార్టీ ఓటమిపై క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుని బలోపేతానికి కృషి చేస్తామని వివరించారు. -
హుజూనగర్ నుంచి ప్రొ.కోదండరామ్ పోటీ !
ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరామ్ హుజూర్నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా గెలుపొందిన తరువాత ఎమ్మెల్యేగా రాజీనామా అనంతరం ఖాళీ అయిన ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కోదండరామ్ పోటీ చేయనున్నారు. ఆయన గెలుపు కోసం ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు, టీవీయూవీ, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు ప్రచారం చేయనున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే ఎమ్మెల్యేలు ప్రస్తుతం లేనందున కోదండరామ్ గెలుపుకోసం కృషి చేస్తామని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు నిజ్జన రమేష్ముదిరాజ్ తెలిపారు. హుజుర్నగర్లో త్వరలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. -
అందరిచూపు హుజూర్నగర్ వైపు..
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : ఆర్నేళ్లలోపు హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్లమెంట్‌కు పోటీ చేసి గెలుపొందడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఉత్తమ్ తన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శి చారికి అందజేశారు. రాజీనామా ఆమోదం పొందిన తర్వాత ఈ స్థానాన్ని ఖాళీగా ప్రకటిస్తూ ఎన్నికల కమిషన్ ఎన్నికలకు వెళ్లనుంది. ఉప ఎన్నికల జరగనుండడంతో ఈ స్థానం నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అసెంబ్లీకి ఐదు పర్యాయాలు విజయం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ నియోజకవర్గం నుంచి 1999, 2004లో, హుజూర్నగర్ నుంచి 2009, 2014, 2018లో మొత్తం ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒక చట్టసభకు ఎన్నికై ఇదే సమయంలో మరో చట్టసభకు పోటీ చేసి ఎన్నికైన వారు.. ఏదైనా ఒక ప దవికి 14 రోజుల్లో రాజీనామా చేయాలి. దీని ప్రకారం గత నెల 23న ఎంపీగా విజయం సాధించిన ఉత్తమ్ సరిగ్గా 13వ రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ, హుజుర్నగర్ నియోజకవర్గాల ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని, ఎంపీగా కూడా గెలిపించి వారి అభిమానాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. ఎంపీగా ఈరెండు నియోజవర్గాలతో పాటు మరో ఐదు నియోజకవర్గాల ప్రజలకు సేవ చేసే అవకాశం ఉందని, ఇది అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అందరిచూపు హుజూర్నగర్ వైపు.. ఉత్తమ్ ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్రస్థాయిలో ప్రధాన పార్టీలచూపు ఈ నియోజకవర్గంపై పడింది. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తారని చర్చసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు ఇక్కడ 12 వేల పైచిలుకు మెజార్టీ వచ్చింది. దీంతో ఈ స్థానంపై ప్రత్యేక శ్రద్ధ పెడితే తమ ఖాతాలో వేసుకోవచ్చని టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఈ స్థానంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. హుజూర్‌నగర్‌పై సీఎం మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, నేతలతో చర్చించడం, ప్రచార బాధ్యతలు అప్పుడే మంత్రి కేటీఆర్‌కు అప్పగించినట్లు చర్చ సాగుతోంది. గట్టిగా ప్రయత్నిస్తే ఈ స్థానంలో విజయం సాధిస్తామని సీఎం జిల్లా ప్రజాప్రతినిధులకు చెప్పడంతో విజయం కోసం ఇక టీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించనుంది. టీఆర్ఎస్ పార్టీ ఈస్థానంపై దృష్టి పెట్టడంతో ఉత్తమ్ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆపార్టీ ముఖ్య నేతలకు ఉత్తమ్ ఇక్కడ ప్రచార బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నేతలతో పాటు కోదాడ, హుజూర్నగర్ ఈ రెండు నియోజవర్గాల నేతలు ఉప ఎన్నికలో ఎవరి బలాబలాలు ఎలా ఉంటోయోనని చర్చించుకుంటున్నారు. అభ్యర్థులెవరో..? ఈ స్థానంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి అభ్యర్థులుగా ఎవరు బరిలోకి దిగుతారని రాజకీయంగా ఆసక్తికర చర్చసాగుతోంది. ఇటీవల అభ్యర్థి ఎంపికపై సీఎం కేసీఆర్ సమక్షంలో శానంపూడి సైదిరెడ్డితో పాటు గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్లు చర్చకు వచ్చా యి. గుత్తాకు గతంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారంతో చివరకు శానంపూడినే ఇక్కడినుంచి బరిలోకి దింపుతారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌పై.. శానంపూడి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఈసా రి అతనిపై సానుభూతి కూడా ఉంటుం దని తమదే విజయమని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీఆ ర్ఎస్ నుంచి ఇటీవల అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందిన ముఖ్య నేతలను కూడా ఇక్కడి నుంచి బరిలోకి దింపుతారని ప్రచారం జరుగుతోంది. ఇక హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ సతీమణి పద్మావతినే బరిలోకి దింపాలని ఆపార్టీ యోచిస్తోంది. కోదాడలో ఆమె 756 ఓట్ల తేడాతో ఓటమిపాలు కావడంతో హుజుర్నగర్లో పార్టీ, ఉత్తమ్ చరిష్మాతో సునాయాసంగా గట్టెక్కుతామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీనే తమ గెలుపునకు నాంది కాబో తుందని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గ నేతలు కూడా ఆమెనే బరిలోకి దింపాలని ఉత్తమ్‌కు చెప్పారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ విజయం సాధిస్తే తమకు తిరుగులేదని టీఆర్ఎస్ భావిస్తుండగా.. ఉత్తమ్ ఇలాఖాలో విజ యం తమకు సునాయాసం అవుతుందని కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. -
ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గతేడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉత్తమ్ హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్ నల్గొండ ఎంపీగా గెలుపొందారు. దీంతో ఉత్తమ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఎంపీగా ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని.. కుటుంబ సభ్యులలో ఒకరిగా ఎంతో ప్రేమగా చూసుకున్నారని పేర్కొన్నారు. వారి అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎంపీగా గెలిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. ఎంపీగా ఆ రెండు నియోజకవర్గాలతో పాటు మరో 5 నియోజకవర్గాల ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందని భావిస్తున్నట్టు చెప్పారు. తన ప్రాణం ఉన్నంతకాలం ప్రజాసేవ చేస్తానని స్పష్టం చేశారు. కాగా, ఉత్తమ్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004లలో కోదాడ నుంచి, 2009, 2014, 2018లలో హుజూర్నగర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్‌గా, 610 జీవో హౌస్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019లో నల్గొండ ఎంపీగా విజయం సాధించారు. -
జీ ‘హుజూర్’.. ఎవరో?
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించనున్నారు. ఎంపీగా ఎన్నికైన నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలసి హుజూర్నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇవ్వనున్నారు. ఆయన రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. దీంతో హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గా ఉత్తమ్ స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. సతీమణే వారసురాలా..? ఉత్తమ్ రాజీనామా అనివార్యం కావడంతో ఆ స్థానం ఏర్పాటైన నాటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ వారసత్వం ఎవరికి వస్తుందన్నది నియోజకవర్గంలోనూ, రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. నియోజకవర్గవ్యాప్తంగా గట్టి కేడర్, అనుచరులున్న ఉత్తమ్ స్థానంలో ఎవరికి అవకాశం వస్తుందన్న దానిపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈసారి అక్కడి నుంచి కోదాడ మాజీ ఎమ్మెల్యే, ఉత్తమ్ సతీమణి పద్మావతిరెడ్డి బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఆమెకు కూడా నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలున్నాయి.టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ బిజీగా ఉంటే నియోజకవర్గంలో ఆమె పర్యటించి ప్రజాసమస్యల్ని పరిష్కరిస్తుంటారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోని నేతలను ఆమె గుర్తుపట్టి పలకరించగలిగేంత సంబంధాలున్నాయి. అయితే, ఈ దఫా పోటీకి ఆమె ఆసక్తిగా లేరని తెలుస్తోంది. తనకూ ఓ నియోజకవర్గం ఉన్నందున దాన్ని వదులుకుని భర్త ప్రాతినిధ్యం వహించిన స్థానానికి వెళ్లడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులొస్తాయనే ఆలోచనతో ఆమె పోటీకి నిరాకరిస్తున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో పద్మావతి కోదాడలో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయినా నల్లగొండ లోక్‌సభ ఎన్నికల్లో తన భర్తకు మంచి మెజార్టీ సాధించిపెట్టారు. హుజూర్నగర్ నుంచి ఆమె పోటీ చేయబోరని ఉత్తమ్ కుటుంబ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మరి ఎవరు..? ఉత్తమ్ పద్మావతి ఉప ఎన్నిక బరిలో లేకపోతే ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గ నేతలకే చాన్సిస్తారా...లేక జిల్లాకు చెందిన బిగ్షాట్స్ను ఎవరినయినా తీసుకువస్తారా.. అన్నది ఇప్పుడు హుజూర్నగర్ నియోజకవర్గంలో హాట్‌టాపిక్ అయింది. ఉత్తమ్ కూడా దీనిపై సీరియస్‌గా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. కొత్తవారిని బరిలో దింపాల్సి వస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై ఆయన అంతర్గతంగా లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దేశంలో చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచారని, ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు జరగాలంటే కనీసం మూడు, నాలుగు నెలల సమయం ఉన్నందున ఉత్తమ్‌కు ప్రత్యామ్నాయం ఎవరనే విషయం ఇంకా చర్చకు రాలేదని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోట కావడంతోపాటు టీపీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపుతామని అంటున్నాయి. ఈ నేపథ్యంలో పద్మావతి చివరకు పోటీకి ఒప్పుకుంటారా... ఉత్తమ్ వారసత్వాన్ని కొత్త నేతలు తీసుకుంటారా.. అన్నది ఉపఎన్నిక నోటిఫికేషన్ తర్వాతే తేలనుంది. -
టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా : శ్రీకాంతాచారి తల్లి
-
అందరికీ మేలు చేసిన నాయకుడు వైఎస్
నల్లగొండ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల ఐదో రోజు ఆరు కుటుంబాలకు పరామర్శ తెలంగాణ తల్లి విగ్రహానికిపూలమాల వేసిన షర్మిల సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘తన, పర భేదం లేకుండా.. ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అని చూడకుండా ప్రతి వర్గానికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మేలు చేశారు. తెలుగు ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకున్నారు.. ప్రతి పేదవాడినీ మనస్ఫూర్తిగా గౌరవించారు. అందుకే ఆయన రాజన్న అయ్యారు.. ఇన్నాళ్ల తర్వాత కూడా కోట్లాది మంది ప్రజలు వైఎస్‌ను తమ గుండెల్లో పెట్టుకున్నారంటే కారణం అదే..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పేర్కొన్నారు. ఐదోరోజు పరామర్శయాత్రలో భాగంగా ఆమె ఆదివారం నల్లగొండ జిల్లా కోదాడ నియోజకవర్గంలో పర్యటించారు. ఆ నియోజకవర్గ పరిధిలోని ఆరు కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ కుటుంబం వారికి అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. యాత్ర మార్గమధ్యంలో చిలుకూరు, బేత వోలు గ్రామాల్లో వైఎస్ విగ్రహానికి షర్మిల పూలమాలలు వేసి నివాళులర్పించి... అక్కడికి భారీ సంఖ్యలో వచ్చిన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఐదేళ్లలోనే ఎన్నో పథకాలు: వైఎస్సార్ అందరి గుండెల్లో బతికే ఉన్నాడని, ఆయనకు మరణం లేదని షర్మిల పేర్కొన్నారు. రాజన్న చేసిన మంచి పనులు, ఆయన మంచి మనసు కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయాయని.. అధికారంలో ఉన్న ఐదేళ్లలోనే ప్రతి ఒక్కరి మనసు గెలుచుకున్నారని ఆమె చెప్పారు. ‘‘మహిళలు, రైతులు, విద్యార్థులు, పేదలందరికీ మేలు చేసే కార్యక్రమాలు వైఎస్ చేపట్టారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో అద్భుత పథకాలను అమలుచేసి చూపించారు. ఇన్ని చేసినా ఏ ఒక్కరోజూ ఎలాంటి పన్నులు, చార్జీలు పెంచలేదు. ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు, ఆర్టీసీ చార్జీ పెరగలేదు. ఏ పన్ను పెంచినా తన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లపై భారం పడుతుందనే ఆలోచనతోనే పేదలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలూ ఆయనను విమర్శించలేవు..’’ అని షర్మిల పేర్కొన్నారు. ప్రతి మహిళను లక్షాధికారిగా చేయాలన్న తపనతో అప్పటివరకు మహిళా సంఘాలకు రుణాలపై ఉన్న రూపాయి పావలా వడ్డీని పావలా వడ్డీకి తగ్గించారని, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడ్డారని తెలిపారు. వైఎస్ పాలనలోని అన్ని పథకాలను, రాజన్న ఆశయాలను కొనసాగించుకునేందుకు, కాపాడుకునేందుకు చేయిచేయి కలిపి ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెచ్చుకోవాలన్నారు. ఐదోరోజు ఆరు కుటుంబాలకు పరామర్శ యాత్ర ఐదోరోజైన ఆదివారం షర్మిల కోదాడ నియోజకవర్గంలోని ఆరు కుటుంబాలను కలిశారు. తొలుత కోదాడ మండలం తొగర్రాయికి వెళ్లి మందా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత కోదాడలో సురభి శ్రీనివాస్, వల్లంశెట్ల రాంప్రసాద్ కుటుంబాలను కలిశారు. అనంతరం భోజన విరామం తీసుకున్నాక చిలుకూరు మండలం ఆచార్యులగూడెంలో అలవాల ముత్తయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. షర్మిల తమ ఇంటికి వచ్చిందన్న ఉద్వేగంతో ముత్తయ్య భార్య నాగలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత మునగాల మండలం గణపవరంలో సారెడ్డి జితేంద ర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి.. మునగాల మండలం వెంకట్రాంపురంలో మునుకుంట్ల గురవయ్య కుటుంబాన్ని కలిసి.. వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల.. పరామర్శ యాత్రలో భాగంగా కోదాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి షర్మిల పూలమాల వేశారు. అంతకు ముందు పలు చోట్ల ఆమె వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. షర్మిల వెంట పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, యెర్నేని వెంకటరత్నంబాబు, గున్నం నాగిరెడ్డి, శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర కార్యదర్శి ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, ఆకుల మూర్తి, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్ణారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తాబ్ అహ్మద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెండెం జయరాజ్, కార్యదర్శి షర్మిలా సంపత్, సహాయ కార్యదర్శి ఇరుగు సునీల్, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మామిడి శ్యాం సుందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
అభిమానానికి జీ హుజూర్
దిర్శించర్ల.. బ్రహ్మరథం పట్టగా.. కాల్వపల్లి.. ఎదురేగి స్వాగతం పలకగా..సుందర్‌నగర్.. స్వాగత సుమాంజలులు తెలపగా.. హరిజన కాలనీ.. అక్కున చేర్చుకుంది..కందిబండ.. అండగా నిలిచింది.. వైఎస్ తనయ షర్మిలకు జీ‘హుజూర్’ అంటూ అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. పరామర్శయాత్రలో భాగంగా షర్మిల శనివారం హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని ఐదు కుటుంబాలను ఓదార్చారు..వారి బాధలను పంచుకున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జననీరాజనం... ఆత్మీయ స్వాగతం.. మేళతాళాలు, మంగళహారతులు... నుదుట తిలకాలు, కరచాలనానికి పోటాపోటీలు... ఏ గ్రామానికి వెళ్లినా జనమే జనం... జై జగన్, వైఎస్సార్ అమర్హ్రే నినాదాలు... నాట్లు వేసే కూలీలు, ఇటుక బట్టీల్లో పనిచేసే మహిళలు పరుగున వచ్చి వైఎస్సార్ తనయకు బ్రహ్మరథం.. స్థూలంగా ఇదీ షర్మిల హుజూర్నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన పరామర్శయాత్ర. పరామర్శ యాత్రలో భాగంగా శనివారం నాలుగోరోజు షర్మిల హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని దిర్శించర్ల, కాల్వపల్లి, హుజూర్నగర్, మేళ్లచెరువు, కందిబండ గ్రామాలకు వెళ్లి తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబాలకు చెందిన వారితో ఆత్మీయంగా మాట్లాడిన షర్మిల వారిని పేరుపేరునా పలకరించారు. తన తండ్రి కోసం చనిపోయిన వారి కుటుంబాలకు తన కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, తమ కుటుంబ పెద్దను కోల్పోయి ఐదేళ్లు దాటిన తర్వాత కూడా తమపై అభిమానంతో తమను చూసేందుకు షర్మిల రావడం పట్ల వృుతుల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇచ్చిన మాట మీద నిలబడే కుటుంబంగా వైఎస్ కుటుంబం తన పేరు నిలబెట్టుకుందని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్ల తర్వాత కూడా తమ వద్దకు వచ్చి తమ స్థితిగతులను విచారించిన షర్మిలకు, ఆమె సోదరుడు జగన్మోహన్రెడ్డి, తల్లి విజయమ్మలకు కృృతజ్ఞతలు తెలిపారు. శనివారం పర్యటనలో భాగంగా షర్మిల గరిడేపల్లి కీతవారిగూడెంలో ఏర్పాటుచేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాలుగోరోజు పర్యటన సాగిందిలా... పరామర్శ యాత్రలో భాగంగా శనివారం ఉదయం నేరేడుచర్ల సమీపంలోని సిటీసెంట్రల్ స్కూల్ నుంచి షర్మిల బయలుదేరారు. అక్కడే ఉన్న స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులతో ఆమె కొంతసేపు ముచ్చటించారు. విద్యార్థులతో కరచాలనం చేసి వారిని ‘హాయ్’ అంటూ పలకరించారు. అనంతరం విద్యార్థులే ప్రపంచానికి వెలుగుదివ్వెలని, చిమ్మచీకట్లు ఉన్నా చిన్న వెలుగు ఎంత కాంతినిస్తుందో అంతటి శక్తిమంతులని చెప్పారు. అక్కడి నుంచి విద్యార్థుల వీడ్కోలు తీసుకుని నేరుగా మండలంలోని దిర్శించర్ల గ్రామానికి వెళ్లారు. అక్కడ తురక లింగయ్య కుటుంబాన్ని సందర్శించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. లింగయ్య భార్య వెంకటమ్మ షర్మిలకు తన కష్టసుఖాలను చెప్పుకున్నారు. ఆ కుటుంబానికి భరోసానిచ్చిన షర్మిల అక్కడి నుంచి గరిడేపల్లి మండలం కాల్వపల్లికి బయల్దేరారు. మధ్యలో నేరేడుచర్లలో ప్రజలనుద్దేశిం చి ప్రసంగించారు. అక్కడి నుంచి మార్గమధ్యంలో గ్రామగ్రామాన ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. జననీరాజనం మధ్య షర్మిల కీతవారిగూడెంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేశారు. అక్కడ గ్రామస్తులతో మాట్లాడి కాల్వపల్లికి వెళ్లారు. అక్కడ వెంకటగిరి జయమ్మ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. జయమ్మ భర్త సత్యనారాయణ, కూతుళ్లతో మాట్లాడి ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పారు. అక్కడి నుంచి హుజూర్నగర్ బయల్దేరిన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. షర్మిల హుజూర్‌నగర్‌కు చేరుకునే సరికి ఆమెకు పెద్ద ఎత్తున స్వాగతం లభించింది. స్థానిక ఇందిరాసెంటర్‌లో తన కోసం వేచి ఉన్న ప్రజలకు అభివాదం ప్రసంగించిన తర్వాత అక్కడే ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి స్థానిక సుందరయ్య నగర్లో లింగంపాండు కుటుంబాన్ని పరామర్శించారు. పాండు భార్య నాగమ్మను అడిగి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న షర్మిల ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత హుజూర్నగర్ గ్రామశివారులో సాయంత్రం 4:45 గంటల సమయంలో ఆమె భోజనం చేశారు. అక్కడినుంచి బయలుదేరి మేళ్లచెరువులో చల్లాపూర్ణయ్య కుటుంబం వద్దకు వెళ్లారు. అక్కడ పూర్ణయ్య భార్య అరుణ షర్మిలకు తన కుటుంబ పరిస్థితులను వివరించారు. అనంతరం షర్మిల అక్కడి నుంచి కందిబండకు వెళ్లి పేరుపంగు లింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. లింగయ్య భార్య శంభమ్మ షర్మిలతో మాట్లాడి తన కుటుంబ స్థితిగతులను చెప్పారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పిన షర్మిల అక్కడి నుంచి కోదాడ నియోజకవర్గంలోనికి వెళ్లిపోయారు. జన‘జాతర’.. ఒక్కమాటలో చెప్పాలంటే షర్మిల పర్యటన సందర్భంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో జనజాతర నెలకొంది. ఉదయం పర్యటన ప్రారంభమైనప్పటి నుంచి రాత్రి ముగిసేంతవరకు ఆమె వెంట జనమే జనం. వైఎస్ అభిమానులు, జగన్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తోడు గ్రామగ్రామాన స్థానికులు ఆమెకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. నేరేడుచర్ల మండలంలోని చింతకుంట్ల సమీపం నుంచి బయలుదేరిన షర్మిలకు రాంనగర్, నేరేడుచర్ల, నర్సయ్యగూడెం, దిర్శించర్లలలో ఘనస్వాగతం లభించింది. దిర్శించర్లలో తురక లింగయ్య కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఊరుఊరంతా ఆ ఇంటి ముందే ఉంది. నేరేడుచర్ల మీదుగా గరిడేపల్లి మండలం కాల్వపల్లికి వస్తున్న సందర్భంగా ఎల్బీనగర్, అప్పన్నపేట, గరిడేపల్లి, కీతవారిగూడెం, రాయినిగూడెం, కాల్వపల్లి, గోపాలపురంలలో జనం ప్రభంజనమై కదిలారు. ఇక, హుజూర్నగర్ ఇందిరాసెంటర్ అయితే జనసంద్రాన్ని తలపించింది. అక్కడి నుంచి భోజనం ముగించుకుని వెళుతున్న షర్మిలకు వేపలసింగారం, మిట్టగూడెంలలో ప్రజలు ఆత్మీయంగా సాదర స్వాగతం పలికారు. వేపలసింగారంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత మేళ్లచెరువు వెళ్లిన షర్మిలకు జనహారతులు పట్టారు. మేళ్లచెరువు సెంటర్ జనంతో నిండిపోయింది. అక్కడినుంచి కందిబండకు వెళ్లిన షర్మిలకు అక్కడ కూడా ఘన స్వాగతం లభించింది. మొత్తంమీద నాలుగోరోజు పరామర్శయాత్ర హుజూర్నగర్ నియోజకవర్గంలో జననీరాజనం నడుమ ప్రభంజనంలా సాగింది. మేళ్లచెరువు కాదు... జన చెరువు నాలుగోరోజు యాత్రలో మేళ్లచెరువులో జరిగిన బహిరంగ సభ హైలెట్‌గా నిలిచింది. షర్మిలకు హుజూర్నగర్ నుంచే ఘనస్వాగతం పలికిన మండల ప్రజలు మేళ్లచెరువులో వైఎస్ కుటుంబంపై తమకున్న అభిమానాన్ని చాటిచెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే మేళ్లచెరువు ఊరంతా రోడ్డెక్కింది. పెట్రోల్‌బంకు నుంచి మేళ్లచెరువు మెయిన్‌సెంటర్ జనసంద్రమైంది. షర్మిలను చూసేందుకు, ఆమె మాటలు వినేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చారు. పిల్లాపాపలను ఎత్తుకున్న తల్లుల నుంచి పండు ముదుసలి వరకు, యువకుల నుంచి వృద్ధుల వరకు, విద్యార్థులు షర్మిలను చూసేందుకు ఎగబడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుమార్తెతో కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు. ఈ సందర్భంగా మేళ్లచెరువులో షర్మిల చేసిన ప్రసంగానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. పరామర్శయాత్రలో షర్మిల వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్.గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశరావు, గున్నం నాగిరెడ్డి, భీష్వ రవీందర్, పి.సిద్దార్థరెడ్డి, ఆకుల మూర్తి, మెండెం జయరాజ్, ముస్తఫా అహ్మద్, వడ్లోజు వెంకటేశం, షర్మిలా సంపత్, ఇరుగు సునీల్‌కుమార్, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, జిల్లా నేతలు ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి, మల్లురవీందర్రెడ్డి, పిట్ట రాంరెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి, అయిల వెంకన్నగౌడ్, పిచ్చిరెడ్డి, కోడి మల్లయ్య యాదవ్, మట్టారెడ్డి, ఆదెళ్ల శ్రీనివాసరెడ్డి, గోపిశెట్టి తిరుపతి వెంకయ్య, పి.సత్యనారాయణరెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పచ్చిపాల వేణుయాదవ్, ఖమ్మం జిల్లా మధిర ఎంపీపీ వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, యువజన నాయకుడు కె. నరేందర్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన మహిళా నాయకురాలు దామెర్ల రేవతి, వరంగల్ సేవాదళ్ అధ్యక్షుడు ఎం. కల్యాణ్, జిల్లా నేత మహిపాల్‌రెడ్డి, వనపర్తి నేత జశ్వంత్‌రెడ్డి, కొల్లాపూర్ నేత వరదారెడ్డి, దేవరకొండ నేత నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ కుటుంబంపై ఈ ప్రేమకు కృతజ్ఞతలు... వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... ఇన్నేళ్లైనా, ఎన్నాళ్లైనా.. వైఎస్ కుటుంబంపై ప్రేమ చూపిన హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అద్భుత సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. వైఎస్ కుటుంబంపై ప్రేమ చెరుపుకుంటే చెరిగేది కాదన్నారు. రాజన్న కలలుగన్న విధంగా అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలయ్యేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలని ఆయన కోరారు. -
వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి
హుజూర్నగర్ : తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చే సేందుకు ప్రతికార్యకర్త కృషిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్‌నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 8న హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో గల క్రిస్టల్ గార్డెన్స్‌లో ఉదయం 9 గంటలకు పార్టీ రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్న ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి వాటి పరిష్కారానికి రానున్న కాలంలో పార్టీ తరఫున ప్రజల పక్షాన పోరాటాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆశయసాధన కోసం స్థాపించిన వైఎస్సార్ సీపీ బడుగు, బలహీనవర్గాలకు అండగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారితో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులంతా ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పోతుల జ్ఞానయ్య,కోడి మల్లయ్య, నాయకులు గుర్రంవెంకటరెడ్డి, జడ రామకృ ష్ణ, పులిచింతల వెంకటరెడ్డి, కస్తాల ముత్తయ్య, మందా వెంకటేశ్వర్లు, పిల్లి మరియదాసు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ్‌కు హైకోర్టులో ఊరట
కారులో డబ్బు కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, నల్లగొండ జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి నల్లమాడ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సోదరుడు గౌతంకుమార్లకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు ఉత్తమ్‌కు చెందిన కారులో డబ్బులు తీసుకెళ్తున్నారంటూ ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు సూర్యాపేట పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులుగా ఉన్న హోం శాఖ ముఖ్య కార్యదర్శి, నల్లగొండ జిల్లా ఎస్పీ, ఎన్నికల అధికారి ఎన్.ప్రభాకర్, సూర్యాపేట ఇన్స్పెక్టర్లకు నోటీసులిచ్చారు. ఏప్రిల్ 30న సూర్యాపేట శివార్లలోని భవానీ దాబా దగ్గర ఓ ఇన్నోవా కారు బాయ్నెట్ నుంచి పొగలొస్తుండటాన్ని ఎన్నికల అధికారులు గమనించడం, దాన్ని తెరిచి చూడగా కొన్ని రూ.1,000, రూ.500 నోట్లు కాలిపోయిన స్థితిలో కనిపించడం తెలిసిందే. -
వైఎస్సార్.. జనభేరి
ఎన్నికల ప్రచారానికి నేడు షర్మిల రాక నేరేడుచర్ల వద్ద తొలి బహిరంగ సభ హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో ప్రచారం సాక్షిప్రతినిధి, నల్లగొండ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల జిల్లా పర్యటనకు వస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30గంటలకు హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలోని నేరేడుచర్లలో బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభతోనే జిల్లాలో ఆమె ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో షర్మిల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు ఎనిమిది అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానంలో పోటీలో ఉన్నారు. నల్లగొండ లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థి బరిలో ఉండడంతో ఆ లోక్‌సభ స్థానం పరిధిలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనే తొలివిడత ప్రచారంలో పాల్గొననున్నారు. నేరేడుచర్ల, కోదాడ, సూర్యాపేట పట్టణాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయడంతో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు పార్టీ కార్యకర్తలను సమీకరించే పనిలో ఉన్నారు. గతంలో జిల్లాలో షర్మిల జరిపిన పాదయాత్రకు అనూహ్యమైన స్పందన రావడంతో ఆమెనే ‘స్టార్ క్యాంపెయినర్’గా పార్టీ నాయకత్వం ప్రచారానికి తీసుకువస్తున్నారు. ఆరేళ్లపాటు వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంలో, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో షర్మిల సక్సెస్ ఆయ్యారు. ఆమె ప్రచారంతో ఓటర్లను ప్రభావితం అవుతారని, తమకు లాభిస్తుందన్న ఆశాభావాన్ని పార్టీ నాయకత్వం వ్యక్తం చేసింది. ఈ మూడు నియోజకవర్గాల్లో బలమైన కేడర్ ఉండడం, వైఎస్సార్ అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉన్నం దున షర్మిల ప్రచారం వారిని కదిలిస్తుందన్న కారణంతోనే కార్యక్రమాన్ని రూపొందించారు. ‘ మహానేత వైస్ రాజశేఖరరెడ్డి భిక్షతో పదవులు పొందిన వారు, ఆయనను విస్మరించినా, కిందిస్థాయి కార్యకర్తల్లో ఆయనపై అభిమానం వారి గుండెల్లో గూడు కట్టుకుని ఉంది. మహా నేత తనయగా, యువనేత సోదరిగా షర్మిలకు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. విజయవంతం చేయండి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో జరగనున్న మా పార్టీ నాయకురాలు షర్మిల ప్రచార పర్యటనను, బహిరంగ సభలను విజయవంతం చేయమని ప్రజలను కోరుతున్నాం. నేరేడుచర్ల, కోదాడ, సూర్యాపేటల్లో బహిరంగ సభలు జరుగుతాయి. పార్టీ కార్యకర్తలతో పాటు, మహానేత వైఎస్సార్ అభిమానులంతా ఈ సభలకు కదిలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. - గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు