సభావేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో 43వేల పైచిలుకు భారీ మెజారిటీతో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి, నియోజకవర్గ కేంద్రంలో శనివారం ‘కృతజ్ఞత సభ’పేరిట బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17న పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాల్గొనాల్సిన బహిరంగ సభ వర్షం మూలంగా చివరి నిమిషంలో రద్దయింది. సుమారు పది రోజులక్రితం నిర్మించిన సభా వేదికను తొలగించక పోవడంతో శనివారం జరిగే బహిరంగ సభను అదే ప్రదేశంలో నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉప ఎన్నిక ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు శుక్రవారం బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు.
శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్‌కు చేరుకుని, సాయంత్రం ఐదు గంటలకు జరిగే ‘కృతజ్ఞత సభ’లో ప్రసంగిస్తారు. హుజూర్‌నగర్ విజయంపై ఎమ్మెల్యే సైదిరెడ్డి, పార్టీ ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఫోన్‌లో అభినందించిన కేసీఆర్, తనను కలిసేందుకు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేదని, శనివారం జరిగే సభకు సంబంధించిన ఏర్పాట్లను చూసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్ పర్యటనకు వస్తున్న కేసీఆర్‌కు భారీ స్వాగతం చెప్పేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.
సమన్వయ కమిటీలు..సామాజిక కోణాలు
హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి వరుసగా మూడు పర్యాయాలు టీఆర్‌ఎస్ పోటీ చేసినా.. పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ వ్యూహం రూపొందించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెప్టెంబర్ చివరివారంలో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కొందరు ఎంపిక చేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ప్రచార వ్యూహం అమలు, సమన్వయ బాధ్యతలను అప్పగిస్తూ సుమారు 70 మంది ఇన్‌చార్జీలకు ఉపఎన్నికల బాధ్యతలు అప్పగించారు.
నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీలతో పాటు కొన్ని ప్రధాన సామాజిక వర్గాల ఓట్లను రాబట్టేందుకు ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ స్థాయిలో తొమ్మిది మందితో కూడిన కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న వివిధ సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేందుకు కమిటీల ఏర్పాటు వ్యూహం టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చింది. పార్టీ వ్యూహం ఫలితాన్ని ఇవ్వడంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేసీఆర్ అభినందించగా, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదితరులను శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు.
మున్సిపోల్స్‌లోనూ ఇదే తరహా వ్యూహం
క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణుల సమన్వయం, ఇతర పార్టీల నుంచి చేరికలు తదితరాలతో భారీ మెజారిటీ సాధించిన టీఆర్‌ఎస్, త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. తమ నియోజకవర్గాల పరిధిలో మున్సిపాలిటీలు లేని ఎమ్మెల్యేలతో పాటు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ప్రచారం, సమన్వయం బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావిస్తోంది. మున్సిపాలిటీలు, వార్డుల వారీగా ఇతర పార్టీల్లో క్రియాశీలంగా ఉండే కార్యకర్తలు, నాయకులను గుర్తించి.. వారిని పార్టీ గూటికి చేర్చే బాధ్యతను కూడా ఇన్‌చార్జీలకు అప్పగిస్తారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై కేటీఆర్ పార్టీ మున్సిపల్ ఇన్‌చార్జీలతో త్వరలో సమావేశం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment