‘హుజూర్‌నగర్‌’ తర్వాతే? | Khuntia Says No Change Of TPCC Chief | Sakshi
Sakshi News home page

‘హుజూర్‌నగర్‌’ తర్వాతే?

Published Tue, Jun 25 2019 1:49 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Khuntia Says No Change Of TPCC Chief - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీపీసీసీ అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో ఉండదా..? త్వరలోనే మున్సిపల్‌ ఎన్నికలు ఉంటాయనే ప్రభుత్వ సంకేతాలు... ఆరు నెలల్లో హుజూర్‌నగర్‌ అసెంబ్లీకి అనివార్యంగా జరగాల్సిన ఉప ఎన్నిక నేపథ్యంలో అవి పూర్తయిన తర్వాతే ఉత్తమ్‌ను మారుస్తారా..? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు. ఇప్పటికిప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సిన పనిలేదని, ఎన్నికలకు ముందు అధ్యక్షుడిని మారిస్తే పార్టీలో సమన్వయానికి కొంత ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తును అధిష్టానం ప్రస్తుతానికి నిలిపివేసినట్టు తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే సోమవారం విలేకరులతో మాట్లాడిన కుంతియా ఇప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండదని, రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉండాలా?.. వద్దా?.. అన్నది తేలిన తర్వాతే  మార్పులుంటాయని చెప్పడం గమనార్హం.  

ఎన్నికలకు ముందు ఎందుకు..? 
రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్‌ నుంచి జరుగుతున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపాలవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 స్థానాలు, లోక్‌సభ ఎన్నికల్లో 3 స్థానాలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికల్లో 20–25 శాతం స్థానాలు మాత్రమే గెలుచుకున్న ఆ పార్టీకి త్వరలోనే జరుగుతాయని భావిస్తున్న మున్సిపల్‌ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయంతో బీజేపీ దూకుడు మీద ఉండటం, 32 జిల్లా పరిషత్‌ల్లో ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్‌ గెలుచుకోకపోవడంతో మున్సిపల్‌ ఎన్నికల్లో కంటితుడుపు విజయమైనా ఆ పార్టీకి అనివార్యం కానుంది. కనీసం జిల్లాకు ఒకటో, రెండో మున్సిపాలిటీల్లోనైనా గెలవకపోతే పట్టణ ప్రాంతాల్లో ఘోరంగా దెబ్బతినే అవకాశముంది. దీంతో మున్సిపల్‌ ఎన్నికలపై కసరత్తును కాంగ్రెస్‌ అప్పుడే ప్రారంభించింది కూడా. ఇక, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌ అసెంబ్లీకి ఆరు నెలల్లో ఏ క్షణంలోనైనా ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ గెలుపోటములు కూడా కాంగ్రెస్‌ భవిష్యత్‌ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడి మార్పు ప్రక్రియ జరిగితే సమన్వయం దెబ్బతింటుందని, ఈ రెండు ఎన్నికల తర్వాతే అధ్యక్షుడిని మారిస్తే బాగుంటుందని చాలా మంది నేతలు సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా సోమవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పడం గమనార్హం.  

పెరుగుతున్న జాబితా.. 
ఇక టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆసక్తి కలిగిస్తోంది. రేవంత్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, విజయశాంతి, దామోదర రాజనర్సింహ, సంపత్‌ పేర్లు రేసులో వినిపిస్తుండగా ఇప్పుడు జగ్గారెడ్డి కూడా ఆ జాబితాలో చేరారు. నిన్నటివరకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి కావాలని అడిగిన జగ్గారెడ్డి ఆదివారం కుంతియాను కలసి తనకు కూడా టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. దీనికి తోడు అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని అధికారంలోకి తెచ్చే మెడిసిన్‌ తన వద్ద ఉందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటే జూలైలో ఉంటుందని, లేదంటే మరో ఏడాది కూడా ఉత్తమే అధ్యక్షుడిగా ఉంటారనే చర్చ పార్టీలో జరుగుతోంది.  

పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ కొసాగుతారు: కుంతియా 
పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనసాగుతారని ఏఐసీసీ ఇంచార్జీ కుంతియా స్పష్టం చేశారు. కొత్త అధ్యక్షుని నియామకంపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని ఆయన అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ‘రాజగోపాల్‌ రెడ్డికి పార్టీ చాలా గౌరవం ఇచ్చింది. కానీ ఆయన ఎందుకు అలా చేస్తున్నారో తెలియడం లేదు. అతని మీద క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది. ఎవరు క్రమశిక్షణ తప్పినా ఉపేక్షించేది లేదు’అని హెచ్చరించారు. రాహుల్‌గాంధీ ఏఐసీసీ అధ్యక్షునిగా కొనసాగాలని, ఆయన మంచి ఫైటర్‌ అన్న విషయం మొన్నటి ఎన్నికల్లో తేలిందన్నారు.  
 
29న సాగర్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం 
రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ నెల 29న నాగార్జునసాగర్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని కుంతియా తెలిపారు. ఈ ఎన్నికల వ్యూహరచన కోసం పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో కమిటీ వేసినట్లు వెల్లడించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ 34 శాతానికి పెంచాలని కుంతియా డిమాండ్‌ చేశారు. ఇకపై ప్రతి నెల 1, 2, 3 తేదీల్లో మండల, జిల్లా, బ్లాక్‌ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని, జూలై మొదటివారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో భేటీ ఉంటుందన్నారు. పార్టీ ఓటమిపై క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుని బలోపేతానికి కృషి చేస్తామని వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement