అభిమానానికి జీ హుజూర్ | YS Sharmila's Paramarsa Yatra in Huzurnagar Constituency | Sakshi
Sakshi News home page

అభిమానానికి జీ హుజూర్

Published Sun, Jan 25 2015 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

అభిమానానికి జీ హుజూర్

అభిమానానికి జీ హుజూర్

 దిర్శించర్ల.. బ్రహ్మరథం పట్టగా..  కాల్వపల్లి.. ఎదురేగి స్వాగతం పలకగా..సుందర్‌నగర్.. స్వాగత సుమాంజలులు తెలపగా.. హరిజన కాలనీ.. అక్కున చేర్చుకుంది..కందిబండ.. అండగా నిలిచింది.. వైఎస్ తనయ షర్మిలకు జీ‘హుజూర్’ అంటూ అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. పరామర్శయాత్రలో భాగంగా షర్మిల శనివారం హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని ఐదు కుటుంబాలను ఓదార్చారు..వారి  బాధలను పంచుకున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ :  జననీరాజనం... ఆత్మీయ స్వాగతం.. మేళతాళాలు, మంగళహారతులు... నుదుట తిలకాలు, కరచాలనానికి పోటాపోటీలు... ఏ గ్రామానికి వెళ్లినా జనమే జనం... జై జగన్, వైఎస్సార్ అమర్హ్రే నినాదాలు... నాట్లు వేసే కూలీలు, ఇటుక బట్టీల్లో పనిచేసే మహిళలు పరుగున వచ్చి వైఎస్సార్ తనయకు బ్రహ్మరథం.. స్థూలంగా ఇదీ షర్మిల హుజూర్‌నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన పరామర్శయాత్ర. పరామర్శ యాత్రలో భాగంగా శనివారం నాలుగోరోజు షర్మిల హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని దిర్శించర్ల, కాల్వపల్లి, హుజూర్‌నగర్, మేళ్లచెరువు, కందిబండ గ్రామాలకు వెళ్లి తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు.
 
 ఆయా కుటుంబాలకు చెందిన వారితో ఆత్మీయంగా మాట్లాడిన షర్మిల వారిని పేరుపేరునా పలకరించారు. తన తండ్రి కోసం చనిపోయిన వారి కుటుంబాలకు తన కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, తమ కుటుంబ పెద్దను కోల్పోయి ఐదేళ్లు దాటిన తర్వాత కూడా తమపై అభిమానంతో తమను చూసేందుకు షర్మిల రావడం పట్ల వృుతుల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇచ్చిన మాట మీద నిలబడే కుటుంబంగా వైఎస్ కుటుంబం తన పేరు నిలబెట్టుకుందని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్ల తర్వాత కూడా తమ వద్దకు వచ్చి తమ స్థితిగతులను విచారించిన షర్మిలకు, ఆమె సోదరుడు జగన్‌మోహన్‌రెడ్డి, తల్లి విజయమ్మలకు కృృతజ్ఞతలు తెలిపారు. శనివారం పర్యటనలో భాగంగా షర్మిల గరిడేపల్లి కీతవారిగూడెంలో ఏర్పాటుచేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.  
 
 నాలుగోరోజు పర్యటన సాగిందిలా...
 పరామర్శ యాత్రలో భాగంగా శనివారం ఉదయం నేరేడుచర్ల సమీపంలోని సిటీసెంట్రల్ స్కూల్ నుంచి షర్మిల బయలుదేరారు. అక్కడే ఉన్న స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులతో ఆమె కొంతసేపు ముచ్చటించారు. విద్యార్థులతో కరచాలనం చేసి వారిని ‘హాయ్’ అంటూ పలకరించారు. అనంతరం విద్యార్థులే ప్రపంచానికి వెలుగుదివ్వెలని, చిమ్మచీకట్లు ఉన్నా చిన్న వెలుగు ఎంత కాంతినిస్తుందో అంతటి శక్తిమంతులని చెప్పారు. అక్కడి నుంచి విద్యార్థుల వీడ్కోలు తీసుకుని నేరుగా మండలంలోని దిర్శించర్ల గ్రామానికి వెళ్లారు. అక్కడ తురక లింగయ్య కుటుంబాన్ని సందర్శించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. లింగయ్య భార్య వెంకటమ్మ షర్మిలకు తన కష్టసుఖాలను చెప్పుకున్నారు.
 
 ఆ కుటుంబానికి భరోసానిచ్చిన షర్మిల అక్కడి నుంచి గరిడేపల్లి మండలం కాల్వపల్లికి బయల్దేరారు. మధ్యలో నేరేడుచర్లలో  ప్రజలనుద్దేశిం చి ప్రసంగించారు. అక్కడి నుంచి మార్గమధ్యంలో గ్రామగ్రామాన ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. జననీరాజనం మధ్య షర్మిల కీతవారిగూడెంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేశారు. అక్కడ గ్రామస్తులతో మాట్లాడి కాల్వపల్లికి వెళ్లారు. అక్కడ వెంకటగిరి జయమ్మ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. జయమ్మ భర్త సత్యనారాయణ, కూతుళ్లతో మాట్లాడి ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పారు. అక్కడి నుంచి హుజూర్‌నగర్ బయల్దేరిన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.  షర్మిల హుజూర్‌నగర్‌కు చేరుకునే సరికి ఆమెకు పెద్ద ఎత్తున స్వాగతం లభించింది. స్థానిక ఇందిరాసెంటర్‌లో తన కోసం వేచి ఉన్న ప్రజలకు అభివాదం ప్రసంగించిన తర్వాత అక్కడే ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 
 అక్కడి నుంచి స్థానిక సుందరయ్య నగర్‌లో లింగంపాండు కుటుంబాన్ని పరామర్శించారు. పాండు భార్య నాగమ్మను అడిగి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న షర్మిల  ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత హుజూర్‌నగర్ గ్రామశివారులో సాయంత్రం 4:45 గంటల సమయంలో ఆమె భోజనం చేశారు. అక్కడినుంచి బయలుదేరి మేళ్లచెరువులో చల్లాపూర్ణయ్య కుటుంబం వద్దకు వెళ్లారు. అక్కడ పూర్ణయ్య భార్య అరుణ షర్మిలకు తన కుటుంబ పరిస్థితులను వివరించారు. అనంతరం షర్మిల అక్కడి నుంచి కందిబండకు వెళ్లి పేరుపంగు లింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. లింగయ్య భార్య శంభమ్మ షర్మిలతో మాట్లాడి తన కుటుంబ స్థితిగతులను చెప్పారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పిన షర్మిల అక్కడి నుంచి కోదాడ నియోజకవర్గంలోనికి వెళ్లిపోయారు.
 
 జన‘జాతర’..
 ఒక్కమాటలో చెప్పాలంటే షర్మిల పర్యటన సందర్భంగా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో జనజాతర నెలకొంది. ఉదయం పర్యటన ప్రారంభమైనప్పటి నుంచి రాత్రి ముగిసేంతవరకు ఆమె వెంట జనమే జనం. వైఎస్ అభిమానులు, జగన్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తోడు గ్రామగ్రామాన స్థానికులు ఆమెకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. నేరేడుచర్ల మండలంలోని చింతకుంట్ల సమీపం నుంచి బయలుదేరిన షర్మిలకు రాంనగర్, నేరేడుచర్ల, నర్సయ్యగూడెం, దిర్శించర్లలలో ఘనస్వాగతం లభించింది. దిర్శించర్లలో తురక లింగయ్య కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఊరుఊరంతా ఆ ఇంటి ముందే ఉంది.
 
 నేరేడుచర్ల మీదుగా గరిడేపల్లి మండలం కాల్వపల్లికి వస్తున్న సందర్భంగా ఎల్‌బీనగర్, అప్పన్నపేట, గరిడేపల్లి, కీతవారిగూడెం, రాయినిగూడెం, కాల్వపల్లి, గోపాలపురంలలో జనం ప్రభంజనమై కదిలారు. ఇక, హుజూర్‌నగర్ ఇందిరాసెంటర్ అయితే జనసంద్రాన్ని తలపించింది. అక్కడి నుంచి భోజనం ముగించుకుని వెళుతున్న షర్మిలకు వేపలసింగారం, మిట్టగూడెంలలో ప్రజలు ఆత్మీయంగా సాదర స్వాగతం పలికారు. వేపలసింగారంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత మేళ్లచెరువు వెళ్లిన షర్మిలకు జనహారతులు పట్టారు. మేళ్లచెరువు సెంటర్ జనంతో నిండిపోయింది. అక్కడినుంచి కందిబండకు వెళ్లిన షర్మిలకు అక్కడ కూడా ఘన స్వాగతం లభించింది. మొత్తంమీద నాలుగోరోజు పరామర్శయాత్ర హుజూర్‌నగర్ నియోజకవర్గంలో జననీరాజనం నడుమ ప్రభంజనంలా సాగింది.
 
 మేళ్లచెరువు కాదు... జన చెరువు
 నాలుగోరోజు యాత్రలో మేళ్లచెరువులో జరిగిన బహిరంగ సభ హైలెట్‌గా నిలిచింది. షర్మిలకు హుజూర్‌నగర్ నుంచే ఘనస్వాగతం పలికిన మండల ప్రజలు మేళ్లచెరువులో వైఎస్ కుటుంబంపై తమకున్న అభిమానాన్ని చాటిచెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే మేళ్లచెరువు ఊరంతా రోడ్డెక్కింది. పెట్రోల్‌బంకు నుంచి మేళ్లచెరువు మెయిన్‌సెంటర్ జనసంద్రమైంది. షర్మిలను చూసేందుకు, ఆమె మాటలు వినేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చారు. పిల్లాపాపలను ఎత్తుకున్న తల్లుల నుంచి పండు ముదుసలి వరకు, యువకుల నుంచి వృద్ధుల వరకు, విద్యార్థులు షర్మిలను చూసేందుకు ఎగబడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుమార్తెతో కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు.
 
 ఈ సందర్భంగా మేళ్లచెరువులో షర్మిల చేసిన ప్రసంగానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది.  పరామర్శయాత్రలో షర్మిల వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్.గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశరావు, గున్నం నాగిరెడ్డి, భీష్వ రవీందర్, పి.సిద్దార్థరెడ్డి, ఆకుల మూర్తి, మెండెం జయరాజ్, ముస్తఫా అహ్మద్, వడ్లోజు వెంకటేశం, షర్మిలా సంపత్, ఇరుగు సునీల్‌కుమార్, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, జిల్లా నేతలు ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి, మల్లురవీందర్‌రెడ్డి, పిట్ట రాంరెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి, అయిల వెంకన్నగౌడ్, పిచ్చిరెడ్డి, కోడి మల్లయ్య యాదవ్, మట్టారెడ్డి, ఆదెళ్ల శ్రీనివాసరెడ్డి, గోపిశెట్టి తిరుపతి వెంకయ్య, పి.సత్యనారాయణరెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పచ్చిపాల వేణుయాదవ్,  ఖమ్మం జిల్లా మధిర ఎంపీపీ వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, యువజన నాయకుడు కె. నరేందర్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన మహిళా నాయకురాలు దామెర్ల రేవతి, వరంగల్ సేవాదళ్ అధ్యక్షుడు ఎం. కల్యాణ్, జిల్లా నేత  మహిపాల్‌రెడ్డి, వనపర్తి నేత జశ్వంత్‌రెడ్డి, కొల్లాపూర్ నేత వరదారెడ్డి, దేవరకొండ నేత నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 
 వైఎస్ కుటుంబంపై ఈ ప్రేమకు కృతజ్ఞతలు...
 వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... ఇన్నేళ్లైనా, ఎన్నాళ్లైనా.. వైఎస్ కుటుంబంపై ప్రేమ చూపిన హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అద్భుత సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. వైఎస్ కుటుంబంపై ప్రేమ చెరుపుకుంటే చెరిగేది కాదన్నారు. రాజన్న కలలుగన్న విధంగా అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలయ్యేలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలని ఆయన కోరారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement