వైఎస్సార్.. జనభేరి
ఎన్నికల ప్రచారానికి నేడు షర్మిల రాక
నేరేడుచర్ల వద్ద తొలి బహిరంగ సభ
హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో ప్రచారం
సాక్షిప్రతినిధి, నల్లగొండ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల జిల్లా పర్యటనకు వస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30గంటలకు హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని నేరేడుచర్లలో బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభతోనే జిల్లాలో ఆమె ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో షర్మిల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు ఎనిమిది అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానంలో పోటీలో ఉన్నారు. నల్లగొండ లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థి బరిలో ఉండడంతో ఆ లోక్‌సభ స్థానం పరిధిలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనే తొలివిడత ప్రచారంలో పాల్గొననున్నారు.
నేరేడుచర్ల, కోదాడ, సూర్యాపేట పట్టణాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయడంతో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు పార్టీ కార్యకర్తలను సమీకరించే పనిలో ఉన్నారు. గతంలో జిల్లాలో షర్మిల జరిపిన పాదయాత్రకు అనూహ్యమైన స్పందన రావడంతో ఆమెనే ‘స్టార్ క్యాంపెయినర్’గా పార్టీ నాయకత్వం ప్రచారానికి తీసుకువస్తున్నారు.
ఆరేళ్లపాటు వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంలో, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో షర్మిల సక్సెస్ ఆయ్యారు. ఆమె ప్రచారంతో ఓటర్లను ప్రభావితం అవుతారని, తమకు లాభిస్తుందన్న ఆశాభావాన్ని పార్టీ నాయకత్వం వ్యక్తం చేసింది. ఈ మూడు నియోజకవర్గాల్లో బలమైన కేడర్ ఉండడం, వైఎస్సార్ అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉన్నం దున షర్మిల ప్రచారం వారిని కదిలిస్తుందన్న కారణంతోనే కార్యక్రమాన్ని రూపొందించారు.
‘ మహానేత వైస్ రాజశేఖరరెడ్డి భిక్షతో పదవులు పొందిన వారు, ఆయనను విస్మరించినా, కిందిస్థాయి కార్యకర్తల్లో ఆయనపై అభిమానం వారి గుండెల్లో గూడు కట్టుకుని ఉంది. మహా నేత తనయగా, యువనేత సోదరిగా షర్మిలకు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.
విజయవంతం చేయండి
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో జరగనున్న మా పార్టీ నాయకురాలు షర్మిల ప్రచార పర్యటనను, బహిరంగ సభలను విజయవంతం చేయమని ప్రజలను కోరుతున్నాం. నేరేడుచర్ల, కోదాడ, సూర్యాపేటల్లో బహిరంగ సభలు జరుగుతాయి. పార్టీ కార్యకర్తలతో పాటు, మహానేత వైఎస్సార్ అభిమానులంతా ఈ సభలకు కదిలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
- గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు