'తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ పదిలం'
వైఎస్ఆర్ ఆశయాలను స్పూర్తిగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేసే సత్తా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల స్సష్టం చేశారు. శనివారం వరంగల్ జిల్లా మరిపెడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో షర్మిల ప్రసంగించారు. వైఎస్ఆర్ పాలన సువర్ణయుగమన్ని తెలిపారు. మహానేత పరిపాలనలో ప్రవేశ పెట్టిన ఏ పథకాన్నైనా అద్భుతంగా అమలు పరిచారన్నారు. ఆయన హయాంలో ఆర్టీసీ, కరెంట్... ఇలా ఏ ఒక్క ఛార్జీ పెరగలేదని గుర్తు చేశారు.
వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన అన్ని సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పోడిచిందని ఆరోపించారు. వైఎస్ఆర్ హయాంలో మంజూరైన ఇళ్లకు కనీసం బిల్లులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేదని... అలాగే కరెంట్ ఛార్జీలు పెంచి రూ. 32 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుందని అన్నారు. వైఎస్ఆర్ ఆకస్మిక మరణంతో ఆయన అభిమానులు ఎక్కువ మంది తెలంగాణలోనే చనిపోయారన్నారు. తెలంగాణలో 60 శాతం మంది ప్రజలు ఇంకా వైఎస్ఆర్ను గుండెల్లోనే పెట్టుకున్నారని తెలిపారు. ఏ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టిన లోను కాకుండా... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వెయ్యాలని తెలంగాణ ప్రజలకు సూచించారు.