బూడిదంపాడులో మహిళలతో కరచాలనం
రాజన్న బిడ్డను అక్కున చేర్చుకున్న గిరిజన తండాలు
రెండో రోజు జనభేరి విజయవంతం
ఐదు నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్ల పర్యటన
ఉదయం నుంచి రాత్రి వరకు అలుపెరగని ప్రచారయాత్ర
పాల్వంచలో పోటెత్తిన జనం
వనమాకు మద్దతుగా భారీ మోటార్ సైకిల్ ర్యాలీ
సాక్షి, ఖమ్మం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలను చూసేందుకు, ఆమె ప్రసంగాన్ని వినేందుకు పట్టణాలకు దీటుగా పల్లెలు.. గిరిజన తండాలు కదిలాయి. దారిపొడవునా మహిళలు, కూలీలు ఎదురేగి పూలవర్షం కురిపిస్తూ ఆప్యాయంగా రాజన్నబిడ్డకు స్వాగతం పలికారు. షర్మిల యాత్రకు వస్తున్న జనాభిమానాన్ని చూస్తూ నూతనోత్సాహంతో వైఎస్‌ఆర్ సీపీ, సీపీఎం శ్రేణులు కదం తొక్కాయి.. జిల్లాలో సోమవారం షర్మిల ఎన్నికల ప్రచారం జనభేరి సాగిన తీరిది. రెండోరోజు ఎన్నికల ప్రచారయాత్ర ఖమ్మం, వైరా, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో సాగింది.
ఉదయం 9.49 గంటలకు షర్మిల ప్రచార యాత్ర ఖమ్మంలోని ఎస్‌ఆర్ గార్డెన్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ఆమె పార్టీ జిల్లాకార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ అంబే ద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్, వైఎస్‌ఆర్ కు నివాళులర్పించారు. అక్కడి నుంచి రోటరీనగర్, ఇల్లెందు క్రాస్‌రోడ్, మంచుకొండ మీదుగా బూడిదంపాడుకు ప్రచారయాత్ర చేరుకుంది. బూడిదంపాడులో గిరిజన మహిళలు షర్మిలతో చేయి కలిపేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ప్రచార రథానికి అడ్డుగా వచ్చి..
రహదారిపై నీళ్లు చల్లి.. పూలబాట వేసి సాదరంగా ఆహ్వానించి వారి ఆప్యాయతను చాటుకున్నారు. అనంతరం కామేపల్లి మండలంలోకి యాత్ర ప్రవేశించగా... గోవింద్రాల, పొన్నెకల్లు గ్రామాల్లో గిరిజనులు బారులు తీరి షర్మిలకు స్వాగతం పలికారు, మధ్యాహ్నం 12 గంటలకు ప్రచార యాత్ర గార్లకు చేరుకుంది. వైఎస్‌ఆర్ సీపీ, సీపీఎం శ్రేణులు కలిసికట్టుగా షర్మిలకు స్వాగతం పలికి ఆమెతోపాటు ప్రచారంలో పాల్గొన్నారు.
కారేపల్లిలో కూడా షర్మిల ప్రచారయాత్రకు విశేష స్పందన లభించింది. డప్పు వాయిద్యాలతో పార్టీ కార్యకర్తలు ఆమెను ఆహ్వానించారు. ఇక్కడి సభకు వైరా నియోజకవర్గంలోని పలు మండలాల కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 4.30 గంటలకు షర్మిల ప్రచారయాత్ర ఇల్లెందు చేరుకుంది. అక్కడ భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం షర్మిల టేకులపల్లి మీదుగా పాల్వంచ చేరుకున్నారు.
పాల్వంచలో జనజాతర...
పాల్వంచలో జనభేరికి జనాభిమానం పోటెత్తింది. ఎటుచూసినా వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులతో జనజాతర గా కనిపించింది. కొత్తగూడెం అసెంబ్లీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు మద్దతుగా ఇల్లెందు క్రాస్‌రోడ్ నుంచి పాల్వంచ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మోటార్ సైకిళ్లతో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించడంతో పార్టీలో నూతనోత్తేజం కనిపించింది.
దమ్మపేట సెంటర్ జన జాతరగా మారింది. షర్మిలను చూసేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. ఆ తర్వాత దమ్మపేట సెంటర్‌లో భారీగా హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తుండగా జై జగన్ నినాదాలు మిన్నంటాయి.
ఫ్యాను గుర్తుకే ఓటేయాలని ఆమె పదేపదే చెబుతుండటంతో అదే రీతిలో ప్రజలు కూడా స్పందించారు. పాల్వంచ మండల శివారు వరకు ఇదే రీతిలో జనప్రవాహం కొనసాగింది. అనంతరం ప్రచారయాత్ర రాత్రి 8.30 గంటలకు మోరంపల్లి బంజర మీదుగా మణుగూరు చేరుకుంది. ఇక్కడ కూడా గిరిజనులు షర్మిలపై ఆప్యాయత చూపించారు. అభిమానులు భారీగా తరలిరావడంతో మణుగూరు జనప్రవాహాన్ని తలపించింది.
ఓటేసే ముందు మదినిండా వైఎస్‌ను తలుచుకోండి...
‘గిరిజనులంటే వైఎస్ రాజశేఖరరెడ్డికి అమిత ప్రేమ...దేశ చరిత్రలోనే రాష్ట్రంలో గిరిజనులకు 13 లక్షల ఎకరాల పోడు భూములపై హక్కు కల్పించిన ఘనత ఆయనదే’ అని షర్మిల అన్నారు. మణుగూరులో సోమవారం రాత్రి ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగిస్తూ... ఓటేసే సమయంలో ఒక్కసారి వైఎస్‌ను గుండెలనిండా గుర్తు తెచ్చుకుని ఆయన పాలన తిరిగి తెచ్చేందుకు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ తెల్లం వెంకటరావు, ఖమ్మం, వైరా, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు కూరాకుల నాగభూషణం, బాణోతు మదన్‌లాల్, డాక్టర్ రవిబాబునాయక్, వనమా వెంకటేశ్వరరావు, పాయం వెంకటేశ్వర్లు, పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర నాయకులు ఎన్‌వీ రెడ్డి.
వైఎస్‌ఆర్ సీపీ యువజన విభాగం మూడు జిల్లాల కోఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎండీ ముస్తఫా, సీపీఎం నాయకులు కాసాని ఐలయ్య, బొంతు రాంబాబు, దేవులపల్లి యాకయ్య, అన్నవరపు కనకయ్య, వైఎస్‌ఆర్ సీపీ కొత్తగూడెం నియోజకవర్గ పరిశీలకులు ఆకుల మూర్తి, నాయకులు వనమా రాఘవ, భీమా శ్రీదర్, పాయం ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
పరుగు పరుగున మిర్చి కూలీలు...
షర్మిల జనభేరి మంచుకొండ. పొన్నెకల్, భీక్లీ తండా గ్రామశివారుకు చేరుకోగానే... గ్రామ సమీపంలో మిర్చి తోటల్లో మిరపకాయలు కోస్తున్న కూలీలు రహదారిపైకి వచ్చేందుకు పరుగులు తీశారు. ఇది గమనించిన షర్మిల కాన్వాయ్‌ని వారు వచ్చేదాక ఆపారు.
‘ఏంటమ్మా.. బాగున్నారా.. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి’ అని వారిని పలకరించిన తర్వాత ప్రచార రథం ముందుకు కదిలింది. భీక్లీతండాలో బాణోతు రాజేష్ అనే బాలుడు మిర్చి కోత పనుల నుంచి షర్మిల వద్దకు వచ్చాడు. ఏం నాన్నా.. పనికి వెళుతున్నావా.. బాగా చదువుకోవాలి.. జగనన్న అధికారంలోకి రాగానే మీ జీవితాలు బాగుపడుతాయి.. నువ్వు మంచిగా చదువుకోవాలంటూ ధైర్యం చెప్పారు.
షర్మిల నేటి పర్యటన షెడ్యూల్
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాజన్న బిడ్డ, జగనన్న సోదరి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకురాలు వైఎస్ షర్మిల మూడోరోజు మంగళవారం నాటి పర్యటన షెడ్యూల్‌ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు.
ఉదయం 10 గంటలకు అశ్వాపురం, 11 గంటలకు సారపాక, 12 గంటలకు భద్రాచలం, 4 గంటలకు మోరంపల్లిబంజర, 5 గంటలకు ములకలపల్లి, రాత్రి 7 గంటలకు దమ్మపేట రోడ్‌షోల్లో పాల్గొంటారని వివరించారు.
ఈ పర్యటనలో షర్మిలతో పాటు ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావ్‌తో పాటు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ, సీపీఎం అభ్యర్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. పర్యటనను విజయవంతం చేయాల్సిందిగా కోరారు.