పేదవాడి కష్టాల చూసి మ్యానిఫెస్టో రాశా:జగన్
ప్రకాశం: తాను రాసిన మ్యానిఫెస్టో ఏసీ రూముల్లో కూర్చొని రాసింది కాదని.. పేదవాడి కష్టాల చూసి రాసిందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ దివంగత మహానేత వైఎస్సార్ వెళుతూ వెళుతూ తనకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారన్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకునే ఓదార్పు యాత్ర కార్యక్రమం చేపట్టానన్నారు. ఈ రోజు జిల్లాలోని చీరాలలో జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశిస్తూ జగన్ ప్రసంగించారు. ప్రజలకు అవసరాలను తీర్చే మ్యానిఫెస్టోను తాను ఏసీ గదుల్లో కూర్చుని రాసింది కాదన్నారు. ఆ పేదవాడి కష్టాలను చూసి మాత్రమే తాను మ్యానిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. అక్కచెల్లెమ్మల కోసం అమ్మ ఒడి పథకంపై మొదటి సంతకం చేస్తానన్నారు. అంతే కాకుండా ప్రతీ స్కూలును ఇంగ్లీష్ మీడియం స్కూళ్లగా మార్చుతానన్నారు.
వృద్ధులకు ప్రస్తుతం ఇచ్చే రెండొందల రూపాయల పెన్షన్ ను ఏడొందలు చేస్తూ రెండో సంతకం చేస్తానని జగన్ తెలిపారు. చేనేతలకు చెందిన అవ్వాతాతలకు వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్ అందజేస్తానని హామీ ఇచ్చారు. మూడు వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తూ రైతన్నల కోసం మూడో సంతకం చేస్తానన్నారు. అక్కచెల్లెమ్మల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ నాల్గో సంతకం చేస్తానని, అడిగిన వారికి 24 గంటల్లో ఏ కార్డైనా ఇచ్చేలా ప్రతి గ్రామంలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఐదో సంతకం చేస్తానని జగన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించుకుని తలరాతను మార్చుకుందామన్నారు.
వైఎస్ జగన్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రత్యర్థులు కుట్రలకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఆదివారం రాత్రి జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జగన్ ప్రసంగిస్తుండగా ప్రత్యర్థులు పవర్ కట్ చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో వైఎస్ జగన్ సంయమనంతో ఉండాలంటూ కార్యకర్తలను కోరారు. ఓటుతో బుద్ది చెప్పాలంటూ పిలుపునిచ్చారు.