మీకెంతో రుణపడి ఉన్నాం
మీ రుణం తీర్చుకునే అవకాశం జగనన్నకు ఇవ్వండి
విశాఖ వైఎస్సార్ జనభేరి సభల్లో షర్మిల
వైఎస్ మరణం తర్వాత మాకు అండగా నిలిచారు
రాజన్న రాజ్యం కోసం ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి
చంద్రబాబు ఓ సైకో! బాలకృష్ణ చచ్చిన పాము!
ఈ రోజుతో పవన్‌కల్యాణ్ చాప్టర్ క్లోజ్
మనం ఈ పరీక్షలోడిస్టింక్షన్లో పాసవ్వాలి!
భారీ మెజారిటీతో గెలిపించాలని వినతి
విజయమ్మతో కలసి షర్మిల ప్రచారం
సాక్షి, విశాఖపట్నం: ‘‘మా కుటుంబం మీ అందరికీ రుణపడి ఉంది. మనసున్న మారాజు రాజశేఖరరెడ్డి చనిపోతే ఆ బాధ తట్టుకోలేక గుండె పగిలి రాష్ట్రంలో కొన్ని వందలమంది ప్రాణాలు వదిలేశారు. వైఎస్ చనిపోయి అయిదేళ్లవుతున్నా మీ అందరి గుండెల్లో ఆయన బతికే ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత మా ప్రతి కష్టంలోనూ మీరంతా మమ్మల్ని అక్కున చేర్చుకున్నారు. మా ప్రతి పోరాటంలోనూ అండగా నిలిచారు. జగనన్నపై కక్షగట్టిన సోనియాగాంధీ టీడీపీ నేతలతో కుట్రపన్ని జైలు పాలుచేస్తే తెలుగు ప్రజలు జగన్ కోసం పరితపించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు ఎదురైనా మీ అండతో ధైర్యంగా ముందడుగు వేయగలిగాం. అందుకు వైఎస్ కుటుంబం మీ అందరికీ రుణపడి ఉంది. ఆ రుణం తీర్చుకోవడానికి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి. జగనన్న ముఖ్యమంత్రి అయితే వైఎస్ సంక్షేమ పథకాలన్నింటినీ సమర్థంగా అమలుచేస్తారు’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జనభేరి చివరి రోజైన సోమవారం షర్మిల, పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ ఎంపీ అభ్యర్థి విజయమ్మతో కలసి విశాఖలో ప్రచారం నిర్వహించారు. ‘‘మీరంతా జగనన్న వదిలిన బాణాలు. మనం పరీక్ష రాసే సమయం వచ్చింది. 75 శాతం ఓటింగ్ వైఎస్సార్‌సీపీకి పడేలా ఉండాలి. డిస్టింక్షన్లో పాసవ్వాలి. విజయం సాధించి వైఎస్సార్‌కి కానుకగా ఇవ్వాలి’’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘లెక్కలేనంత తిక్క ఉందని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పుకున్నాడు. అలాంటి మనిషి గురించి ప్రత్యేకంగా నేనేం మాట్లాడతాను. అయిపోయింది.. ఈ రోజుతో పవన్ కల్యాణ్ చాప్టర్ క్లోజ్. బాలకృష్ణా.. ఆయనొక చచ్చిన పాము. వదిలేద్దాంలే.. పాపం పోనీ..!’’అంటూ చురకలు వేశారు. షర్మిల ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..
చంద్రబాబు సైకో!
చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నారు. తన గత పాలనను తిరిగి తెస్తాననే ధైర్యం ఆయనకు ఉందా? రాజశేఖరరెడ్డి ఏ పథకాలు అమలు చేశారో వాటినే తానుకూడా అమలు చేస్తానని బాబు చెబుతున్నారు. వైఎస్ రుణమాఫీ చేస్తే తాను కూడా రుణమాఫీ చేస్తానంటున్నారు. కానీ తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు రుణమాఫీ చేయాలని ఎందుకు గుర్తుకు రాలేదు? పోనీ రుణాలపై వడ్డీ మాఫీ చేశారా? నిజానికి బాబు దృష్టిలో రైతులు పురుగులకన్నా హీనం. సీఎంగా కూర్చుని వ్యవసాయం దండగ అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. తిన్నదరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నాయుడు తెలివి సామాన్యమైనది కాదు. సొంతమామను వెన్నుపోటు పొడిచాడు. ఆయన పార్టీని, అధికారాన్నీ లాక్కుని, ఆయన్నే పార్టీ నుంచి వెలేశాడు. ఆయన బతికున్నపుడు చెప్పులు వేయించిన చంద్రబాబు ఇపుడు ఓట్లు కోసం ఆయన ఫొటోకు దండలు వేస్తున్నారు.
బాబు సీఎంగా ఉన్న రోజుల్లో విద్యార్థులు స్కాలర్ షిప్‌లు కావాలని అడిగితే.. మెస్ చార్జీలు కూడా ఇవ్వలేదు. అంగన్‌వాడీలు జీతాలు పెంచాలని అడిగితే.. మహిళలని చూడకుండా గుర్రాలతో తొక్కించారు. ఆయన సైకో కాక మరేంటి?
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం పొందేది పేదలే. అలాంటివారికి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో ఉచిత వైద్యం అందించకపోగా.. వారి నుంచే యూజర్ చార్జీలు వసూలు చేయాలని ఆలోచించారు. ఓ మహిళ తన భర్త చనిపోయాడు.. పెన్షన్ ఇప్పించండి బాబూ అని అడిగితే.. మీ ఊళ్లో ఎవరైనా చనిపోతే ఇస్తానన్నారు. ఒకరికి పెన్షన్ రావాలంటే మరొకరు చనిపోవాలని కోరుకునేవాడు సైకో కాక మరేంటి?
వ్యవసాయం, వ్యవసాయానికి సబ్సిడీ దండగన్న చంద్రబాబు.. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాడంటే నమ్మగలమా? తన పాలనలో ఎనిమిదిసార్లు కరెంట్ చార్జీలు పెంచిన చంద్రబాబు ఇపుడు ఉచిత విద్యుత్ ఇవ్వగలడా? లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల్ని పప్పుబెల్లాల్లా తన బినామీలకు అప్పగించిన ఈయన కొత్తగా పరిశ్రమలు తెస్తాడా? ప్రభుత్వోద్యోగులకు జీతాలివ్వడం, డీఏ, పీఆర్‌సీ పెంపు దండగన్నవాడు ఇపుడు ప్రభుత్వ ఉద్యోగాలిస్తాడా?
తన సొంత నియోజకవర్గం కుప్పంను మున్సిపాలిటీగా చేసుకోలేని చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్, మలేసియా, జపాన్ చేసేస్తాడంటే నమ్మగలమా? ఈయన చెప్పే సొల్లు వినడానికి మనమేమైనా చెవుల్లో పువ్వులు పెట్టుకున్నామా?
రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం
రాజశేఖరరెడ్డి పాలనలో మన రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రైతులకు నీళ్లిచ్చారు. 7 గంటలు కరెంటు ఇచ్చారు. మద్దతు ధర, ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారు. ఇంకా రైతులకు రుణమాఫీ చేశారు. చంద్రబాబు రైతులకు, మహిళలకు రూపాయి వడ్డీకి రుణాలిస్తే వైఎస్ పావలా వడ్డీకే రుణాలిచ్చారు. మహిళలు వైఎస్ పుణ్యాన ఆర్థికంగా స్థిరపడగలిగారు.
చంద్రబాబు తన పాలనలో 16 లక్షల పింఛన్లు ఇస్తే వైఎస్ 71 లక్షల పింఛన్లు ఇచ్చారు. అయిదేళ్లలో కేంద్రప్రభుత్వం దేశం మొత్తంమీద పేదలకోసం 47 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తే వైఎస్ మన రాష్ట్రంలో 48 లక్షల పక్కా ఇళ్లు కట్టి చూపించారు.
చంద్రబాబు కిలో బియ్యాన్ని రూ.5.25 చేస్తే... వైఎస్ మార్కెట్లో రూ.25 పలికే కేజీ బియ్యాన్ని పేదలకు రూ.2కే అందించారు. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పేదలకు ఖరీదైన వైద్యం చేయించారు. ఫోన్ చేసిన 20 నిమిషాలకు 108 వచ్చేది.
వైఎస్ తన ఐదేళ్ల పాలనలో ఒక్క పన్ను, ఒక్క చార్జీ పెంచలేదు. విత్తనాలు, ఆర్టీసీ చార్జీలు, ధరలు పెంచలేదు. గ్యాస్ ధర వైఎస్ సీఎం కాకముందు ఎంత ఉందో ఆయన చనిపోయేవరకు అదే ధర ఉంది. చంద్రబాబు ఎనిమిదేళ్లలో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచారు.
వైఎస్ మరణించాక సీల్డ్ కవర్‌లో ఊడిపడ్డ కిరణ్‌కుమార్‌రెడ్డి వైఎస్ ప్రతి పథకానికి తూట్లు పొడిచారు. అయిదుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు. రూ.32 వేల కోట్లు విద్యుత్ చార్జీలు, సర్‌చార్జీలు అంటూ పెంచేశారు.
ఇన్ని అరాచకాలు జరిగితే అయిదేళ్లలో చంద్రబాబు ఏ ఒక్కసారైనా ప్రధాన ప్రతిపక్షం హోదాలో నిలదీశారా? తన అవినీతి ఆరోపణల నుంచి బయటపడ్డం కోసం ప్రతిపక్షం పాలకపక్షంతో కుమ్మక్కైంది. ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని దించాలని ప్రయత్నిస్తే బాబు కాంగ్రెస్‌కు రక్షణ కవచంగా నిలిచారు. సోనియా తన కొడుకును ప్రధాని చేయాలన్న ఆశతో రాష్ట్రాన్ని విభజిస్తే దానికి సహకరించింది చంద్రబాబే.
ఈ ఐదేళ్లలో రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల కోసం ఎవరైనా పోరాటం చేశారంటే అది జగనన్న మాత్రమే. వారంపాటు మెతుకు ముట్టకుండా రైతులు, చేనేతల కోసం, పెం చిన చార్జీలు తగ్గించడం కోసం నిరాహార దీక్షలు చేసింది జగనన్న ఒక్కరే. మన రాష్ట్రాన్ని ముక్కలు చే యవద్దని నిరాహార దీక్షలు చేసింది జగనన్న మాత్రమే. ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీని గెలిపించండి. జగనన్న మీ సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తాడు.
వైఎస్సార్ బతికున్నంత వరకు రాజకీయాల్లో కనీస జోక్యంలేని విజయమ్మ, తమ కుటుంబాన్ని నమ్ముకుని వెంట నిలిచిన వారి విజయం కోసమే తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి, విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి విజయమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. కడప ఉప ఎన్నికలో పార్టీ అధ్యక్షుడు జగనన్నకు వచ్చిన 5.40 లక్షల ఓట్ల మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో పట్టంకట్టాలి.