అభిమాన గోదారి | ys vijayamma general elections campaign at rajahmundry | Sakshi
Sakshi News home page

అభిమాన గోదారి

Published Wed, Apr 23 2014 11:59 PM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

వెఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. - Sakshi

వెఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ.

ఎండ మండిపడే వేళ.. ఎవరైనా చల్లనిమాను నీడన చేరతారే తప్ప- ‘మబ్బు నీడ ఎక్కడా?’ అని ఓరకంట కూడా వెతుక్కోరు. దాహార్తులు చలివేంద్రాన్ని ఆశ్రయిస్తారే తప్ప-ఎండమావి దిక్కుకు అడుగు వేయరు. మనసావాచా   కర్మణా తమ క్షేమాన్ని కాంక్షించే వారెవరో, తమ కలలను సాకారం చేయగలవారెవరో ప్రజలకు తెలుసు.
 
  విశ్వసనీయత ఏదో, విశ్వాసఘాతుకత్వం ఏదో..     పసిగట్టగల దిట్టలు వారు. అందుకే జిల్లాలో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటన దిగ్విజయమైంది. ఆమెపై జనాభిమానం గోదావరి వరదనే చిన్నబుచ్చింది. జననేతపై గురి జేజేలుగా మార్మోగింది.

 
 సాక్షి, రాజమండ్రి : పుష్కరాలకు రాజమండ్రి నగరం ఇసుక వేస్తే రాలనంతగా జనంతో కిటకిటలాడిపోతుంది. అలాంటి రాజమండ్రి సహా జిల్లాలో పలు పట్టణాలు, గ్రామాలు.. ‘వచ్చే ఏడాది జరగనున్న పుష్కరాలు అప్పుడే వచ్చేశాయేమో!’ అనిపించేంతగా జనసంద్రాలయ్యాయి.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, జననేత జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తి, వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ.. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడురోజులు జరిపిన పర్యటనవిజయవంతమైంది.

 
 ఆమె అడుగిడిన ప్రతి చోటా మహిళలు అడుగడుగునా పూలజల్లులు, హారతులతో ఆత్మీయ స్వాగతం పలికారు. సోమవారం తునిలో విజయమ్మ  ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బుధవారం రాజమండ్రి సిటీ నియోజకవర్గంతో పర్యటన ముగించారు.

బుధవారం ఉదయం మండపేట నుంచి బయలుదేరిన విజయమ్మ 10.20 గంట లకు అనపర్తి నియోజకవర్గంలోని పెడపర్తికి చేరుకున్నారు. అక్కడ అశేషంగా హాజరైన  ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. ఫ్యాను గుర్తు కు ఓటేసి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలి పించాల్సిందిగా కోరారు.
 
 అనంతరం 12.00 గంటలకు అనపర్తి చేరుకుని దేవీచౌక్‌లో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. రాజన్న సువర్ణయుగం జగన్‌బాబుతోనే సాధ్యమని నొక్కిచెప్పారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరి, అనపర్తి అసెంబ్లీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణరెడ్డిలను గెలిపించాల్సిందిగా కోరారు.

12.30 గంటలకు బయలుదేరి జేగురుపాడు వద్ద ఆడదానిరేవు సమీపంలోని రామదాసు పేపర్‌మిల్స్ వద్ద భోజనానికి ఆగారు. అంతకుముందు విజయమ్మ పర్యటన పెరపర్తి, కుతుకులూరు, రామవరం, పొలమూరు గ్రామాల గుండా సాగింది.
 
 రూరల్‌లో ప్రభంజనం..

 భోజన విరామానంతరం విజయమ్మ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం మండల గ్రామాల్లో పర్యటించారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్, అసెంబ్లీ  అభ్యర్థి ఆకుల  వీర్రాజు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

4.10 గంటలకు ప్రారంభమైన పర్యటన జేగురుపాడు, మాధవరాయుడుపాలెం సెంటర్, కడియపు సావరం మీదుగా 5.10 గంటలకు కడియం బొబ్బిలిబ్రిడ్జిపైకి చేరుకుంది. ‘మీ కష్టాలు తీరాలంటే జగన్‌ను అధికారంలోకి తీసుకురావా’లని ఓటర్లను అభ్యర్థించారు.
 
 
  చంద్రబాబు అధికారంలో ఉన్నంతసేపూ రాష్ట్రానికి రూ.వంద కోట్లు విలువచేసే ప్రాజెక్టు కూడా తేలేక పోయారని ధ్వజమెత్తారు. కేంద్రంలో చక్రం తిప్పానన్న ఆయన తొమ్మిదేళ్ల పరిపాలనలో  రాష్ట్ర ప్రజలకు ఏం చేశారంటూ ప్రశ్నించారు. అక్కడినుంచి ప్రారంభమైన యాత్ర 5.55 గంటలకు ధవళేశ్వరం చేరుకుంది.
 
 ప్రాణమున్నంత వరకూ పదిలం మీ అభిమానం
 ధవళేశ్వరం బస్టాండు సెంటర్‌లో జరిగిన సభలో కిక్కిరిసిన జనం మధ్య విజయమ్మ ప్రసంగిస్తూ ‘నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకూ మీ అభిమానాన్ని మర్చిపోలే’నంటూ ఉద్వేగానికి గురయ్యారు.
 
  ప్రజల అభిమానాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటా నన్నారు. మహానేత రాజశేఖరరెడ్డిలో ఉన్న రాజసం, తెగువ, ధైర్యం జగన్ బాబులో ఉన్నాయని, అక్కున చేర్చుకోవాలంటూ ప్రజల్ని కోరారు.

 అక్కడినుంచి 6.20 గంటలకు బయలుదేరిన పర్యటన స్వరాజ్‌నగర్, రాజమండ్రి రైల్వేస్టేషన్, కోటిపల్లి బస్టాండు, మెయిన్‌రోడ్, కందకంరోడ్డు, లక్ష్మివారపుపేట, దేవీచౌక్, తుమ్మలావ, ఆర్యాపురం, లింగంపేట, ఆదెమ్మదిబ్బ, కంబాలచెరువు సెంటర్‌ల మీదుగా ఆజాద్‌చౌక్‌కు చేరుకుంది.  
 
 అయిదు చేవ్రాళ్లు.. అయిదు వరాలు

 అంతకు ముందు ఆమెకు కోటిపల్లి బస్టాండు వద్ద పార్టీ కోఆర్డినేటర్, సిటీ నియోజకవర్గ అభ్యర్థి బొమ్మన రాజ్‌కుమార్, ఎంపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.
 
  అడుగడుగునా తన కోసం వేచి ఉన్న వేలాది మంది ప్రజల అభిమానంతో విజయమ్మ ఉద్విగ్నతకు లోనయ్యారు. ఆజాద్ చౌక్‌లో సభాస్థలానికి చేరుకున్న వెంటనే మైనార్టీలు, ఇతర వర్గాల ప్రజలు వేలాదిగా ఎదురొచ్చి స్వాగతం పలకడం చూసి విచలితులయ్యారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘రాజశేఖరరెడ్డి లేని లోటు నాకు ఈ జన్మలో తీరేది కాదు. కానీ ప్రజలకు రాజన్నలేని లోటును జగన్‌బాబు తీరుస్తాడు’ అని భరోసా ఇచ్చారు.
 
 
జగన్‌బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవితాలను మార్చే పథకాలపై ఐదు సంతకాలు చేస్తారని, ఆ రోజునుంచే అవి అమల్లోకి వస్తాయని జగన్ తరపున విజయమ్మ హామీ ఇచ్చారు. పర్యటించిన ప్రతి చోటా ఈ మాట చెపుతున్నప్పుడు సభాప్రాంగణాలు కరతాళ ధ్వనులతో మారుమోగాయి.
 
 పార్టీ శ్రేణుల్లో
 పరవళ్లు తొక్కిన సమరోత్సాహం

 మూడు రోజులు సాగిన విజయమ్మ పర్యటనతో పార్టీ శ్రేణుల సమరోత్సాహం పదిరెట్లయింది. ఆమె కొన్ని నియోజకవర్గాల్లోనే పర్యటించినా.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచీ నేతలు, కార్యకర్తలు జనభేరి సభలకు పోటెత్తారు. ఆమెకు అడుగడుగునా లభించిన జనాదరణతో అభ్యర్థుల్లో విజయం పట్ల విశ్వాసం ద్విగుణీకృతమైంది. ప్రత్యర్థుల గుండెలలో రైళ్లు పరిగెత్తాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement