రుణమాఫీ ఘనత వైఎస్ఆర్దే
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏనాడూ ధరల పెరుగుదల లేదని, అంతేకాక.. కేంద్రంతో మాట్లాడి మరీ రైతులకు రుణమాఫీ చేయించిన ఘనత కూడా ఆయనదేనని వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆమె 'వైఎస్ జనభేరి'లో మాట్లాడారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా జలయజ్ఞాన్ని వైఎస్సే ప్రారంభించారని, ఏం చేసినా ప్రజల మనసులోనుంచి వైఎస్‌ఆర్‌ను ఎవరూ తొలగించలేరని ఆమె స్పష్టం చేశారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కలిపించిన ఘనత వైఎస్‌దని, రాష్ట్రగతిని మార్చిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని విజయమ్మ అన్నారు.
చంద్రబాబు హయాంలో పశువులకు నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని, హైటెక్ సిటీని చూపించి బాబు 55 వేల కోట్ల అప్పులు మోపారని, రైతుల రుణమాఫీ చేస్తానని బాబు మళ్లీ మోసంగించే ప్రయత్నం చేస్తున్నారని విజయమ్మ మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల వ్యవస్థ ఏర్పాటుచేసిందే చంద్రబాబని, అలాంటిది ఇప్పుడు ఇంటింటికీ ఉద్యోగం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జీతాలు పెంచాలని అడిగితే గుర్రాలతో తొక్కించిన ఘనత బాబుదని మండిపడ్డారు. ప్రధానమంత్రిని సైతం తానే చేశానంటున్న చంద్రబాబు వందకోట్ల విలువైన ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారా అని విజయమ్మ ప్రశ్నించారు.