జనహోరు.. | ys jagan,jana bheri at guntur | Sakshi
Sakshi News home page

జనహోరు..

Published Fri, Apr 25 2014 1:34 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

జనహోరు.. - Sakshi

జనహోరు..

 
- జననేతకు నీరాజనం పలికిన జిల్లా ప్రజలు
- మండుటెండలోనూ తరగని అభిమానం
- వైఎస్ జగన్ మూడురోజుల పర్యటన విజయవంతం
- పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత పర్యటన
- ఫ్యాన్ ప్రభంజనాన్ని చాటిన జనభేరి ప్రచారం
 
 
 నిరంతరం తమ సంక్షేమం కోసం పరితపించే నాయకుడెవరో.. తమ కలలు సాకారం చేయగల సమర్థుడెవరో ప్రజలకు బాగా తెలుసు.. అందుకే జననేతపై అభిమానం చాటుకున్నారు. భానుడు నిప్పులు చెరుగుతున్నా వెరవలేదు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ఎర్రటి ఎండలోనూ గంటలకొద్దీ నిరీక్షించారు. ఆత్మీయానురాగాలు పంచారు.

 వారందరిలో ఒకటే ఆశ.. రాజన్న బిడ్డను చూడాలని, ఆ అభిమాన నేత పలుకులు వినాలని. జనభేరి రథంపై చిరునవ్వులు చిందిస్తూ తమ ముందుకు వచ్చిన జగనన్నను చూడగానే వారి ముఖాల్లో వెలిగిపోయాయి. వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం విజయవంతమైంది. ఆయన పర్యటన ఫ్యాన్ ప్రభంజనానికి అద్దం పట్టింది. జగన్ ఉద్వేగపూరిత ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహాన్ని నింపాయి.
 
 సాక్షిప్రతినిధి, గుంటూరు,  వైఎస్సార్ జనభేరికి జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు వచ్చిన జననేతకు ప్రతి పల్లెలోనూ అఖండ స్వాగతం లభించింది. ఈ నెల 21వ తేదీ సోమవారం రాత్రి తెనాలి నియోజకవర్గం కొల్లిపర చేరుకొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు గుదిబండి చినవెంకటరెడ్డి నివాసంలో బస చేశారు. మంగళవారం ఉదయం 10.45 నిమిషాలకు మాతృ వియోగంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు.

డెల్టాలో అపూర్వ స్వాగతం..  జిల్లాలో ఎన్నికల పర్యటనకు వచ్చిన జగన్‌కు డెల్టా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం 11.05 నిముషాలకు కొల్లిపర నుంచి జగన్‌రోడ్‌షో ప్రారంభించారు. రోడ్ల వెంట బారులు తీరిన అశేష జనవాహిని, ప్రజలు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు అభిమానం కురిపించారు. కొల్లిపర నుంచి బయలుదేరిన ఆయనకు తూములూరు వద్ద ఇటుకబట్టీ కార్మికులు, మహిళలు, మొక్కజొన్న రైతులు స్వాగతం పలికి వారి సమస్యలను వివరించారు.

త్వరలోనే మీ కష్టాలన్నీ తీరుస్తానంటూ వారికి జగన్ భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి శిరిపురం అడ్డరోడ్డుకు చేరగానే ప్రజలు జగన్‌పై పూలవాన కురిపించారు. అనంతరం అత్తోట చేరుకున్న జగన్‌కు రైతులు, రైతుకూలీలు వారి సమస్యలను వివరించారు. మీరు ముఖ్యమంత్రి అయితేనే తమ సమస్యలు తీరుతాయంటూ తెలిపారు. నంబూరు, కాజా గ్రామాల మీదుగా మంగళగిరిలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.

ఆయన చెప్పే ప్రతి మాటకు హర్షధ్వానాలు చేశారు. మంగళగిరి నుంచి దుగ్గిరాల మీదుగా తెనాలి చేరుకున్న జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అప్పటికే ప్రచార సమయం ముగియడంతో ఆయన ప్రసంగించకుండానే వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వేలసంఖ్యలో ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఆయనను అనుసరించారు.

 అక్కడి నుంచి ఆయన రాత్రి వినుకొండలోని బాలాజీ ఎస్టేట్స్‌కు చేరుకొని బస చేశారు.విను‘కొండంత’ అభిమానం... బాలాజీ ఎస్టేట్స్ నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు ప్రచారానికి బయలుదేరిన జగన్‌కు వేలసంఖ్యలో ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలతో కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు.

నారపురెడ్డి పల్లె వద్ద బీఈడీ కళాశాల విద్యార్థులను, మార్గంమధ్యలో రైతులు, మహిళలను పలకరిస్తూ జగన్ ముందుకు సాగారు. వినుకొండ పట్టణానికి చేరుకొనే సరికి సమయం సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలైంది. సుమారు గంటసేపు మండుటెండలో ఆయన ప్రసంగించారు. అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా బహిరంగసభ నుంచి వెళ్లలేదు.

 అనంతరం వినుకొండ నుంచి ప్రకాశం జిల్లా సంతమాగులూరులో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన ఆయన నరసరావుపేట మండలం లక్ష్మీపురం, పిట్లూరివారిపాలెం మీదగా చిలకలూరిపేట బహిరంగసభకు హాజరయ్యారు. అన్నిగ్రామాల్లోనూ ప్రజల ఎదురేగి ఘనస్వాగతం పలికారు.

చిలకలూరిపేటలో బహిరంగసభ అనంతరం పొన్నూరుకు చేరుకొని రాత్రి బసచేశారు. గురువారం ఉదయం పొన్నూరులో రోడ్‌షో అనంతరం అక్కడ జరిగిన బహిరంగసభలో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

 శోభమ్మ అక్కలాంటింది..:జగన్
 పొన్నూరు బహిరంగ సభలో జగన్  మాట్లాడుతూ ‘మీ అందరికో విజ్ఞప్తి ... ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం నాకు తెలిసింది. శోభమ్మ కారు ప్రమాదంలో గాయపడటం నా మనసును తీవ్రంగా కలచివేసింది. శోభమ్మ నాకు అక్కలాంటిది. నా కోసం ఆమె ఎంతో చేశారు.

 నా ప్రతి అడుగులోనూ అడుగై నడిచారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆమెను పరామర్శించేందుకు వెళ్తున్నా.. మండుటెండలో మేమంతా వేచి ఉంటే జగన్ మాట్లాడకుండా వెళుతున్నారని ఏమీ అనుకోవద్దు.. జగన్ మీ మనిషి... మీరు కాకుంటే ఇంకెవరు అర్థం చేసుకుంటారు..ఒక్క విషయం చెప్పదలచుకున్నా పొన్నూరు నియోజకవర్గ పార్టీ అభ్యర్తి రమణను, గుంటూరు ఎంపీ అభ్యర్థి బాలశౌరిలను గెలిపించండి’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. జగన్ పర్యటనతో జిల్లా పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది.
 

పార్టీలో చేరిన ప్రముఖులు..
 జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ సమక్షంలో పలువురు రాజకీయ ప్రముఖులు పార్టీలో చేరారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే చల్లా నారపరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షేక్ సుభాని, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్, మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దాసరి కిరణ్‌కుమార్, టీడీపీ నేత ఉగ్గిరాల సీతారామయ్య తదితరులు చేరినవారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement