అమ్మకు జేజేలు | ys vijayamma election campaign in Srikakulam | Sakshi
Sakshi News home page

అమ్మకు జేజేలు

Published Tue, Apr 29 2014 2:09 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

అమ్మకు జేజేలు - Sakshi

అమ్మకు జేజేలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: విజయమ్మకు చిక్కోలు ఆత్మీయ హారతిపట్టింది. తమ కోసం తరలివచ్చిన ఆత్మ బంధువును ఆత్మీయంగా అక్కున చేర్చుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల సంగ్రామంలో వైఎస్‌ఆర్ జనభేరి మోగించిన విజయమ్మకు జిల్లా జేజేలు పలికింది. జనభేరి ప్రచార సభల్లో భాగంగా విజయమ్మ సోమవారం ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. కవిటి, పూండి, పాతపట్నం, ఆమదాలవలసలలో ఆమె పాల్గొన్న ప్రచార సభలకు ప్రజలు పోటెత్తారు. రాబోయే ఎన్నికల్లో  వైఎస్సార్‌కాంగ్రెస్ ఘన విజయానికి ప్రతీకగా విజయమ్మ ప్రచార సభలను విజయవంతం చేశారు.
 
 ఆత్మీయ హారతి
  మిట్టమధ్యాహ్నం... రాత్రి అనే తేడా లేకుండా ఆమె రాకకోసం ప్రజలు భారీ సంఖ్యలోవేచి చూడటం అబ్బురపరిచింది. కవిటి నుంచి ఆమదాలవలస వరకు ఆమె పాల్గొన్న నాలుగు ప్రచార సభలకు ప్రజలు భారీసంఖ్యలో పోటెత్తారు. నిర్ణీత సమయం కంటే చాలా ఆలస్యంగా ఆ సభలకు జరిగినప్పటికీ ప్రజలు ఏమాత్రం నిరాశపడకుండా పెద్ద సంఖ్యలో హాజరుకావడం గమనార్హం. ఉదయం 9.30 గంటలకు జరగాల్సిన కవిటి సభ మధ్యాహ్నం 12గంటలకు నిర్వహించారు. అంతటి ఉడుకెత్తే ఎండలో కూడా ఉద్దానం విజయమ్మ కోసం ఉప్పొంగింది. మిట్ట మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కూడా పూండీలో విజయమ్మ కోసం ప్రజలు భారీ సంఖ్యలో వేచి ఉండటం విశేషం.
 
 ఇక సాయంత్రం 6.30 గంటలకు పాతపట్నం చేరుకునేసరికి జనసంద్రం ఎదురు నిలిచింది. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లకు ఇరువైపులా నిలబడి జేజేలు పలికారు. ఇసుకేస్తే రాలనంత  భారీ సంఖ్యలో జనంతో పాతపట్నం రోడ్లు కిక్కిరిసిపోయాయి. రాత్రి 7.30 గంటలకు ఆమదాలవలసలో నిర్వహించిన సభ జిల్లా చరిత్రలోనే నూతనాధ్యాయంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఆమదాలవలస రైల్వే స్టేషన్ రోడ్డు మొత్తం ప్రజలతో కిక్కిరిసిపోయి విజయమ్మకు స్వాగతసుమాంజలి పలికింది. అసలు ఆ జనసందోహం మధ్య నుంచి ఆమె వాహనం కదలడమే గగనమైపోయిందంటే ఎంతగా జనం పోటెత్తారో తెలుస్తోంది. రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహించిన సభ ఆద్యంతం జనం ఉర్రూతలూగిపోయారు.
 
 ఆత్మీయ తరంగం
 జనభేరి ప్రచారసభల్లో విజయమ్మ జిల్లావాసులపై ఆత్మీయత కూడిన భరోసా కల్పించారు. నాలుగున్నరేళ్లలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు తమ కుటుంబం అండగా ఉం టుందన్న విశ్వాసం కలిగించారు. ఓ తల్లిగా ఆమె మనసుపొరల్లోని మాటలు ఆత్మీయతరంగాల్లో ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి.‘దివంగత  వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారిలో దీక్ష జగన్‌బాబులో ఉన్నాయి...రాజశేఖరరెడ్డిగారిలో ఉన్న పట్టుదల జగన్‌బాబులో ఉంది.. రాజశేఖరరెడ్డిగారిలో ఉన్న వాత్సల్యం జగన్‌బాబులో ఉంది...రాజశేఖరరెడ్డిగారిలాగానే  ప్రజలకు మేలుచేయాలన్న తపన జగన్‌బాబులోఉంది. ప్రజల కోసం ఎంతైనా పోరాడగల పటిమ జగన్‌బాబులో ఉంది. ’అని విజయమ్మ ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజల కోసం జగన్ చేసిన దీక్షలను ఈ సందర్భంగా విజయమ్మ గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం వారం రోజులు ఒక్క మెతుకుకూడా ముట్టకుండా జగన్ చేసిన దీక్షను ఆమె ప్రస్తావించినప్పుడు ప్రచారసభల్లో ఒక్కసారిగా గంభీర వాతావరణం ఆవహించింది. ‘అంతలా ఏమీ తినకుండా దీక్ష చేస్తే ఎలా నాయానా అని నేను ప్రశ్నిస్తే... పిల్లలకు మేలు జరగుతుందంటే అంతకంటే కావల్సిందేముందమ్మా అని జగన్ అన్నారు’అని విజయమ్మ చెబుతున్నప్పుడు ఆమెతోపాటు అందరి కళ్లు చెమర్చాయి.   నాలుగున్నరేళ్లుగా పోరాటంలోనే ప్రస్థానం కొనసాగిస్తోందని విజయమ్మ గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లుగా పడుతున్న బాధలకు ముగింపు పలికేలా మే 7న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్‌ను ఆశీర్వదించాల్సిందిగా కోరారు.
 
 అమ్మగా నేనుంటా
 రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను విజయమ్మ ప్రజలకు గుర్తు చేశారు. జగన్ సీఎం అయితే వాటిని అంతకంటే మెరుగ్గా అమలు చేస్తారని భరో సా ఇచ్చారు. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ఐదు సంతకాతో రాష్ట్రం దశా, దిశా మారుస్తామని భరోసా ఇచ్చారు. ‘నేను విశాఖపట్నం ఎంపీగా ఇక్కడే మీకు అందుబాటులో ఉంటాను.జగన్‌బాబు మిమ్మల్ని చూస్తాడు. అమ్మగా నేను మీతో ఉంటాను’ అని భరోసా కల్పించారు.
 
 చంద్రబాబుపై చండ్రనిప్పులు
 టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్లపాలనపై విజయమ్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ఏమీ చేయలేదనే విషయాన్ని ప్రజలతోనే ఆమె చెప్పించారు. ‘చంద్రబాబు ఉచిత విద్యుత్తు ఇచ్చాడా?.. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చాడా?.. ఇళ్లు కట్టించాడా?.. పింఛన్లు సరిగా ఇచ్చాడా?’అని విజయమ్మ ప్రశ్నించగా ప్రజలు లేదు లేదు అని బిగ్గరగా బదులిచ్చారు.  ఎన్టీఆర్ ఇచ్చిన రూ.2 కిలో బియ్యం పథకాన్ని చంద్రబాబు కొనసాగించాడా?, రూ.50కు హార్స్‌పవర్ విద్యుత్తు ఇచ్చాడా?,మద్యం నిషేధం కొనసాగించడా?’అని విజయమ్మ ప్రశ్నించగా ప్రజలు లేదు... లేదు అని  బిగ్గరగా బదులిచ్చారు. ‘2009 ఎన్నికల్లో నగదు బదలీ పథకం, ఉచిత కలర్ టీవీలు అని వచ్చాడు, 2014 వచ్చేసరికి ఆ రెండు వదిలేశాడు.  
 
 రుణ మాఫీ...ఇంటికో ఉద్యోగం అంటూ కొత్త పాట అందుకున్నాడు’అని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలతో కలసి రాష్ట్ర విభజనకు సహకరించారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. చంద్రబాబుపై విజయమ్మ విమర్శలకు ప్రజల నుంచి మంచిస్పందన లభించింది. విజయమ్మ జనభేరి ప్రచార సభల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ నేతలు తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, కలమట వెంకటరమణ,  కలమట మోహనరావు, జుత్తు జగన్నాయకులు, పాలవలస రాజశేఖరం, నర్తు రామారావు, పిరియా సాయిరాజ్, వజ్జ బాబూరావు, కొయ్య ప్రసాదరెడ్డి, పేడాడ తిలక్,  హనుమంతు కిరణ్, కిల్లి సత్యనారాయణ, కిల్లి లక్ష్మణరావు,దువ్వాడ శ్రీకాంత్, చింతాడ గణపతి తదితరులతోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.  
 
 జిల్లాపై హామీల వర్షం
 వైఎస్సార్‌కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలతోపాటు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో చేయబోయే అభివృద్ధి పథకాలను విజయమ్మ వివరించారు.
   వంశధార, తోటపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లా రైతులకు మూడు పంటలకు సాగునీరు అందిస్తాం.
  వంశధార, నాగావళి కరకట్టల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం.
  ఉత్తరాంధ్ర సుజలస్రవంతి, పోలవరం ప్రాజెక్టులను కూడా పూర్తిచేసి శ్రీకాకుళం జిల్లా వరకు సాగునీరు అందిస్తాం.
  ఆమదాలవలసలో చంద్రబాబు ప్రభుత్వంలో మూసివేసిన సహకార చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభిస్తాం.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement