నేడు జననేత జగన్ జనభేరి
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం (నేడు) జిల్లాకు రానున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సభ ముగించుకుని మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్‌లో ఆయన మడకశిర చేరుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 2.30 గంటలకు హిందూపురం చేరుకుని అంబేద్కర్ సర్కిల్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు తాడిపత్రి బహిరంగ సభలో పాల్గొంటారని ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు.
ఉరకలేస్తున్న ఉత్సాహం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు రానుండడంతో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటికే వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, షర్మిల నిర్వహించిన ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది. పైగా ప్రచార పర్వంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు దూసుకెళ్తుండడంతో టీడీపీ అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు ప్రచారాలకు వెళ్తే కనీసం ఇళ్లలో ఉన్న వారు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో వారు ప్రలోభాలకే పరిమితమైపోయారు.
గత నెల 30న అనంతపురంలో జరిగిన బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చినా జనం మాత్రం కరువయ్యారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందు వైఎస్ జగన్ జిల్లాకు వస్తుండడంతో టీడీపీ అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కాగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ పిలుపునిచ్చారు. వైఎస్ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు.