జయం మనదే
‘నమస్తే అక్కా.. నమస్తే అన్నా.. నమస్తే తమ్ముడూ.. నమస్తే అవ్వా..తాతా రాష్ట్రాన్ని కమ్మేసిన చీకట్లు తొలగిపోయేందుకు ఎంతో సమయంలేదు. గత కాలపు వైభవం తిరిగి వచ్చేందుకు ఎన్నో రోజులు పట్టవు. నవ్య సీమాంధ్ర నిర్మాణం కోసం అడుగులు ముందుకేసేందుకు మరెన్నో గంటలు అవసరంలేదు.
రాష్ట్రాన్ని విభజించిన కర్కశులను శాశ్వతంగా ఇంటికి పరిమితం చేసేందుకు.. పేదలు.. దీనులతో ఆటలాడుకున్న దుర్మార్గులను తరిమికొట్టేందుకు.. ద్వంద్వ విధానాలను సమూలంగా పెకిలించేందుకు.. సుదీర్ఘ కాలంపాటు వేచి చూడాల్సిన అవసరం లేదు.. ఐదు సంతకాలు మీ జీవితాల్లో నూతన వెలుగులు ప్రసరింపజేస్తాయి ప్రతి ఇంటిలో ఆనందాలు వెల్లివిరుస్తాయి...’ అని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా ప్రజలకు ఆదివారం భరోసా ఇచ్చారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు, ‘మిట్ట మధ్యాహ్నం దాటింది. ఎండ మండిపోతున్నా ఖాతరు చేయడం లేదు. అనుకున్న దానికన్నా, దాదాపు మూడు నాలుగు గంటలు ఆలస్యంగా జరుగుతోంది. అయినా ఏ ఒక్కరి ముఖంలోను చికాకు కనిపించడం లేదు. ఆలస్యంగా ఈ కార్యక్రమం జరుగుతున్నా, ఎండ ఇంత తీక్షణంగా ఉన్నా, ఇంటికి పోవడానికి ఏ ఒక్కరూ కారణాలు వెతుక్కోలేదు. వస్తూనే చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతను కనబరుస్తున్నారు.
ఇంతటి ప్రేమానురాగాలను చూపిస్తున్నారు. మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితునికి మీ ఆప్యాయతలకు చేతులు జోడించి, పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కనిగిరివాసులనుద్దేశించి మాట్లాడారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుందని ప్రకటించగానే వేలాది మంది ఉదయం పది గంటలకే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 12 నుంచి 2 గంటల వరకు తీవ్రంగా ఎండకాసింది. అయినా జనం కాలు కదపకుండా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాక కోసం నిరీక్షించారు.
దాదాపు 2.30 గంటలకు కనిగిరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్బన్ కాలనీ ప్రాంతంలో జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయింది. అప్పటి వరకు దూరంగా ఉన్న అభిమానులు హెలికాప్టర్‌ను చుట్టుముట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, వారిని దూరంగా పంపించారు.
జగన్‌కు ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థి వైవీ.సుబ్బారెడ్డి, జిల్లా కన్వీనరు డాక్టర్ నూకసాని బాలాజీ, కనిగిరి అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, కన్వీనర్లు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మ, విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత రత్తయ్య, జిల్లా మైనారిటీ విభాగం నాయకుడు సయ్యద్ ఖాజా తదితరులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఓపెన్ టాప్ బస్సులో బయలుదేరిన జగన్ దారి పొడవునా నిల్చున్న వారిని పలకరిస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
బస్సుపై నుంచే ఆయన వేలాది మంది ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆల్‌ఫ్రీ హామీలపై విరుచుకుపడ్డారు. విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఓట్ల కోసం సీట్ల కోసం సోనియా గాంధీ, బీజేపీ నాయకులు, చంద్రబాబు నాయుడు కలసి బంగారం లాంటి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని దుయ్యబట్టారు. చివరగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తానని, అది పూర్తి చేసి, మళ్లీ మీ దగ్గరకు వస్తానని హామీఇచ్చారు.
అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞాపన:
‘నా పక్కన మదుసూదన్ యాదవ్ ఉన్నాడు. మంచివాడు.. యువకుడు.. ప్రజాసేవ చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు. మనస్ఫూర్తిగా దీవించండని సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నా కుడి పక్కన సుబ్బారెడ్డి ఉన్నారు.
వరుసకు నాకు చిన్నాన్న అవుతారు. మంచివారు మీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ చల్లటి ఆశీస్సులు ఇవ్వండి.. ఆదరించండి. ఆప్యాయతలు చూపించాల్సిందిగా పేరు పేరునా చేతులు జోడించి కోరుతున్నాను’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులకు ఓట్లను అభ్యర్థించారు. ఫ్యాను గుర్తుకు ఓటేసే వారు చేతులెత్తమని అడగడంతో, అక్కడున్న వారందరూ చేతులెత్తారు. తిరిగి అక్కడ నుంచి బస్సులోనే హెలిప్యాడ్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో బస్సుదిగి, కారులోకి మారి, హెలిప్యాడ్ చేరుకున్నారు. అక్కడ నుంచి కావలికి ఆయన బయలుదేరారు.
చీరాలలో సాయంత్రం జరిగిన బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. బాపట్ల ఎంపీ అభ్యర్థి వరికూటి అమృతపాణి, చీరాల అసెంబ్లీ అభ్యర్థి యడం బాలాజీలను గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడు రెహమాన్ ఖాన్‌తోపాటు జిల్లా సేవాదళ్ నాయకుడు ఆవుల చంద్రశేఖర్ రెడ్డి, చిన్న పరిశ్రమల విభాగం కన్వీనరు ఉడుముల లక్ష్మీ నారాయణరెడ్డి, ఎస్సీసెల్ నాయకుడు నల్లా సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.