సస్యశ్యామలం చేస్తా | development with ysrcp | Sakshi
Sakshi News home page

సస్యశ్యామలం చేస్తా

Published Mon, May 5 2014 2:25 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

సస్యశ్యామలం చేస్తా - Sakshi

సస్యశ్యామలం చేస్తా

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు పరోక్ష రాజకీయాల్లో పని చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి చిన్నాన్న వై.వి. సుబ్బారెడ్డి,  ఆ పార్టీ తరఫున ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో స్థానిక ఎంపీలు లేకపోవడంతో,  జిల్లా అభివృద్ధి జరగలేదని అంటున్నారు.
 
స్థానికుడిగా ఒంగోలు పరిస్థితి తనకు తెలుసని, ఆ దిశగా నగరాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.  రైతులు పడుతున్న ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇస్తున్నారు.  ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధిపై తన విజన్‌ను ‘సాక్షి ప్రతినిధి’తో పంచుకున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, ఒంగోలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై తన విజన్‌ను ‘సాక్షి ప్రతినిధి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి ఒంగోలు నియోజకవర్గాన్ని గత 15-20 సంవత్సరాలుగా ఇక్కడి పార్లమెంటు సభ్యులు పట్టించుకోలేదు. గత 15 రోజులుగా జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నా.

పశ్చిమ ప్రాంతాల్లోని ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. వేరే జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి పోటీ చేసిన వారు గెలిచి తమ వ్యాపారాలు చూసుకోవడానికి సరిపోతోంది. మా ప్రభుత్వం వచ్చాక జిల్లాలో ముందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి. అంతేకాక ఫ్లోరైడ్ సమస్యతో అనారోగ్యానికి గురవుతున్నారు. కనీసం ఆసుపత్రి సౌకర్యం కూడా లేదు. వీటిపై ప్రధానంగా ఫోకస్ చేస్తాను.
 
 వెలిగొండ పూర్తి చేస్తాం..
 జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత జిల్లాను సస్యశ్యామలం చేయడానికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తారు.  వైఎస్ కన్న కలలు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తి చేస్తారు. వైఎస్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును జగన్ ప్రారంభిస్తారు.
 
ఒంగోలుకు కోస్టల్ కారిడార్
రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు అడ్డగోలుగా విభజించారు. సీమాంధ్ర అభివృద్ధి జరగాలంటే, కేంద్రం, రాష్ట్రంలోను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన భూమిక పోషించాల్సి ఉంది. సీమాంద్ర అభివృద్ధికి కోస్టల్ కారిడార్ ఉన్న ప్రకాశం జిల్లా అత్యంత ప్రధానం కానుంది. ప్రకాశం జిల్లా ఇటు రాయలసీమ, అటు కోస్తా జిల్లాలకు మధ్యలో ఉంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి, రాజధానిని ప్రకాశం జిల్లాకు తెచ్చుకోవడానికి కృషి చేద్దాం. రాజధాని ఎక్కడైనా ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేద్దాం. పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య తీర్చుకుందాం. పశ్చిమ ప్రాంతంలో వ్యవసాయేతర పరిశ్రమలు స్థాపిద్దాం. అలాగే టమాటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం.
 
 రైల్వేస్టేషన్ అభివృద్ధికి కృషి
 ఒంగోలులో రెల్వే స్టేషన్‌తో పాటు, రైల్వే లైన్లను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా నడికుడి-కాళహస్తి రైలు మార్గం చాలా అవసరం. అప్పట్లో రాజశేఖరరెడ్డి కేంద్రంతో కొట్లాడి నిధులు కేటాయించారు. అయితే ఆ ప్రాజెక్టు ముందుకు పోవడానికి మన నాయకులు పట్టించుకోలేదు. ముఖ్యంగా మన ఎంపీగా గెలిచిన వాళ్లు పట్టించుకోలేదు. సీమాంధ్ర అభివృద్ధికి నడికుడి రైల్వే లైన్ దోహద పడుతుంది.
 
ఒంగోలు రైల్వేస్టేషన్ అభివృద్ధి జరగలేదు. ఇంకా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగడం లేదు. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వెళ్లాలంటే విజయవాడ, నెల్లూరు వెళ్లి ఎక్కాల్సి వస్తోందని కొంత మంది ఆర్యవైశ్యులు నా దృష్టికి తెచ్చారు. నేను వారికి వాగ్దానం చేశాను. రైల్వే స్టేషన్ అభివృద్ధే కాకుండా, ప్రధాన రైళ్లు ఆగేవిధ ంగా చర్యలు తీసుకుంటానని చెప్పాను.
 
 పోర్టును తెస్తాం
 రామాయపట్నం పోర్టును నెల్లూరు జిల్లా తీసుకు వెళ్లాడు అక్కడి ఎంపీ చింతా మోహన్, ఇక్కడి ఎంపీ కూడా నెల్లూరు వాస్తవ్యుడు కావడంతో, ఆయన దానిని వదిలేశారు. దానిని కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగ సమస్య తీరి పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, తిరిగి రామాయపట్నానికే పోర్టు తెచ్చుకు నేలా కృషి చేస్తాను.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement