ఎంపీ వైవీకి ఘనస్వాగతం | Grand Welcome To YSRCP MP YV Subba Reddy | Sakshi
Sakshi News home page

ఎంపీ వైవీకి ఘనస్వాగతం

Published Fri, Apr 20 2018 11:47 AM | Last Updated on Thu, Aug 9 2018 4:30 PM

Grand Welcome To YSRCP MP YV Subba Reddy - Sakshi

ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని గజమాలతో సన్మానిస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, అభిమానులు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో అలుపెరగని పోరాటం సాగించి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడంలో ప్రథమ భూమికను పోషించడమే కాకుండా పార్లమెంట్‌ సభ్యత్వాన్ని త్రుణప్రాయంగా భావించి ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగిన ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాజీనామా అనంతరం మొదటిసారి గురువారం జిల్లాకు వచ్చిన సందర్భంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి. వందలాది వాహనాలలో వేలాది మంది నేతలు, కార్యకర్తలు, అభిమానులు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి ఎంపీకి ఘనంగా స్వాగతం పలికారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని శింగరకొండ ప్రసన్న ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి ఒంగోలు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

అడుగడుగునా పార్టీకి చెందిన స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎంపీ వైవీకి ఘనస్వాగతం పలికారు. శాలువాలు కప్పి సన్మానించారు. మహిళలు హారతులు పట్టారు. హోదా కోసం ఎంపీ పోరా టాన్ని కీర్తించారు. దారి పొడవునా వైఎస్‌ఆర్‌ విగ్రహాలతో పాటు అంబేడ్కర్‌ విగ్రహాలకు ఎంపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో శింగరకొండకు చేరుకున్నారు. అక్కడ పార్టీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గరటయ్యతో పాటు వైఎస్సార్‌ సీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, జంకె వెంకటరెడ్డి, సమన్వయకర్తలు బుర్రా మధుసూదన్‌యాదవ్, రావి రామనాథంబాబు, ఐ.వి.రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, అట్లా చినవెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, కృష్ణచైతన్యలతో పాటు ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎంపీకి ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత స్థానిక ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఎంపీ పూజలు నిర్వహించారు. 
 

టీడీపీ, బీజేపీలు  ప్రజలను మోసం చేశాయి...
ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో విలేకర్లతో ఎంపీ మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. చంద్రబాబు తొలుత ప్యాకేజీకి ఒప్పుకుని బీజేపీతో కలిసి రాష్ట్ర ప్రజలను వంచించాడని విమర్శించారు. ఈ సందర్భంగా అద్దంకి పట్టణానికి చెందిన చైతన్య బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపీని కలిశారు. అనంతరం గరటయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఎంపీకి మద్దతుగా అద్దంకి పట్టణం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భవానీ సెంటర్‌ సమీపంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు బి.వి.కృష్ణారెడ్డికి చెందిన బాలాజీ ట్రేడర్స్‌కు వెళ్లి కొద్దిసేపు పార్టీ శ్రేణులతో ఎంపీ మాట్లాడారు. అద్దంకిని రెవెన్యూ డివిజన్‌ చేయాలంటూ అద్దంకి పట్టణాభివృద్ధి కమిటీ, ప్రజాసంఘాలు 20 రోజులుగా బంగ్లా రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలో చేపట్టిన రిలే దీక్షలకు ఎంపీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎంపీ వైవీకి వినతిపత్రం సమర్పించారు. డివిజన్‌ కోసం తాను కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరి మేదరమెట్ల వచ్చారు. ఆయనకు మేదరమెట్లలో అపూర్వ స్వాగతం లభించింది. ఆ సెంటర్‌లోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత మేదరమెట్లలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఎంపీ వైవీ.. అక్కడ వైఎస్‌ఆర్‌ విగ్రహంతో పాటు తన తండ్రి యర్రం చినపోలిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో వైఎస్‌ విజయమ్మ 63వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. అక్కడి నుంచి గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌కు ర్యాలీ చేరుకుంది. అక్కడ పార్టీ నేతలు లింగా రామకృష్ణారెడ్డి, సీవై రెడ్డి శాండిల్యతో పాటు ఎంపీకి పలువురు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీని స్థానిక ఎంపీటీసీ శాలువా కప్పి సన్మానించారు. అక్కడ పార్టీ శ్రేణులనుద్దేశించి ఎంపీ ప్రసంగించారు. హోదా ఆవశ్యకతను పార్లమెంట్‌లో వినిపించామన్నారు. అక్కడి నుంచి ర్యాలీ కొనసాగింది.

గుండ్లాపల్లి ఫ్లైఓవర్, ఆర్‌సీ రోడ్డు వద్ద ఎంపీ సమీప బంధువులు ఆయనకు హారతితో స్వాగతం పలికారు. అక్కడ కొద్దిసేపు ఆగిన ఎంపీ.. అందరితో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి మద్దిపాడుకు ర్యాలీ చేరుకుంది. ఎంపీపీ నారా విజయమ్మ, బీసీ నాయకుడు లక్ష్మీనారాయణ, చుండూరి రవి తదితరులు ఎంపీకి స్వాగతం పలికారు. అక్కడ వైఎస్‌ఆర్, అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ ఒంగోలు నగర శివారులోని త్రోవగుంటకు చేరుకుంది. అక్కడ అంబేడ్కర్‌ విగ్రహానికి ఎంపీ పూలమాలలు వేశారు. ఆ తర్వాత 6 గంటల ప్రాంతంలో ఒంగోలు నగరంలోని మంగమ్మ కాలేజీ వద్దకు ర్యాలీ చేరుకుంది. అక్కడ వేలాది మంది కార్యకర్తలు వైవీ సుబ్బారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి కర్నూలురోడ్డు, బైపాస్‌ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్, మస్తాన్‌దర్గా మీదుగా చర్చి సెంటర్‌ వరకు ర్యాలీ సాగింది. అక్కడ వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైవీ.. విలేకర్లతో మాట్లాడారు.

ఎంపీ వెంట వైఎస్సార్‌ సీపీ నాయకులు కుప్పం ప్రసాద్, వేమూరి సూర్యనారాయణ, పటాపంజుల శ్రీనివాస్, కొఠారి రామచంద్రరావు, మారెడ్డి రామకృష్ణారెడ్డి, గోలి తిరుపతిరావు, ఎస్‌.రవణమ్మ, కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, చుండూరి రవిబాబు, నాగిరెడ్డి, కేవీ ప్రసాద్, దేవరపల్లి అంజిరెడ్డి, పులుగు అక్కిరెడ్డి, గొర్రెపాటి శ్రీనివాసరావు, లంకపోతు అంజిరెడ్డి, దాచూరి గోపాల్‌రెడ్డి, వీఆర్‌సీ రెడ్డి, ఆళ్ల రవీంద్రారెడ్డి, పటాపంజుల అశోక్, దుంపా చెంచిరెడ్డి, కొమ్ము సామేలు, భక్తవత్సలరెడ్డి, షేక్‌ నాగూర్, పి.రామసుబ్బారెడ్డి, పల్లెర్ల పుల్లారెడ్డి, ఆర్లారెడ్డి, వర్దుశేషయ్య, కండే రమణయ్య యాదవ్, వెంకాయమ్మ, ఈశ్వరమ్మ, గోపిరెడ్డి గోపాల్‌రెడ్డి, తోటపల్లి సోమశేఖర్, నాగూర్, ఇనగంటి పిచ్చిరెడ్డి, వాకా రమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వేణు, జెడ్పీటీసీ సభ్యుడు మారం వెంకారెడ్డి, పెద్దిరెడ్డి భాస్కరరెడ్డి, జేమ్స్‌ తదితరులు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement