Welcome Back
-
ఎంపీ వైవీకి ఘనస్వాగతం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో అలుపెరగని పోరాటం సాగించి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడంలో ప్రథమ భూమికను పోషించడమే కాకుండా పార్లమెంట్ సభ్యత్వాన్ని త్రుణప్రాయంగా భావించి ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగిన ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాజీనామా అనంతరం మొదటిసారి గురువారం జిల్లాకు వచ్చిన సందర్భంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి. వందలాది వాహనాలలో వేలాది మంది నేతలు, కార్యకర్తలు, అభిమానులు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి ఎంపీకి ఘనంగా స్వాగతం పలికారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని శింగరకొండ ప్రసన్న ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి ఒంగోలు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా పార్టీకి చెందిన స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎంపీ వైవీకి ఘనస్వాగతం పలికారు. శాలువాలు కప్పి సన్మానించారు. మహిళలు హారతులు పట్టారు. హోదా కోసం ఎంపీ పోరా టాన్ని కీర్తించారు. దారి పొడవునా వైఎస్ఆర్ విగ్రహాలతో పాటు అంబేడ్కర్ విగ్రహాలకు ఎంపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో శింగరకొండకు చేరుకున్నారు. అక్కడ పార్టీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గరటయ్యతో పాటు వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, జంకె వెంకటరెడ్డి, సమన్వయకర్తలు బుర్రా మధుసూదన్‌యాదవ్, రావి రామనాథంబాబు, ఐ.వి.రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, అట్లా చినవెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, కృష్ణచైతన్యలతో పాటు ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎంపీకి ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత స్థానిక ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఎంపీ పూజలు నిర్వహించారు. టీడీపీ, బీజేపీలు ప్రజలను మోసం చేశాయి... ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో విలేకర్లతో ఎంపీ మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. చంద్రబాబు తొలుత ప్యాకేజీకి ఒప్పుకుని బీజేపీతో కలిసి రాష్ట్ర ప్రజలను వంచించాడని విమర్శించారు. ఈ సందర్భంగా అద్దంకి పట్టణానికి చెందిన చైతన్య బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపీని కలిశారు. అనంతరం గరటయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఎంపీకి మద్దతుగా అద్దంకి పట్టణం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భవానీ సెంటర్ సమీపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బి.వి.కృష్ణారెడ్డికి చెందిన బాలాజీ ట్రేడర్స్‌కు వెళ్లి కొద్దిసేపు పార్టీ శ్రేణులతో ఎంపీ మాట్లాడారు. అద్దంకిని రెవెన్యూ డివిజన్ చేయాలంటూ అద్దంకి పట్టణాభివృద్ధి కమిటీ, ప్రజాసంఘాలు 20 రోజులుగా బంగ్లా రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో చేపట్టిన రిలే దీక్షలకు ఎంపీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎంపీ వైవీకి వినతిపత్రం సమర్పించారు. డివిజన్ కోసం తాను కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరి మేదరమెట్ల వచ్చారు. ఆయనకు మేదరమెట్లలో అపూర్వ స్వాగతం లభించింది. ఆ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత మేదరమెట్లలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఎంపీ వైవీ.. అక్కడ వైఎస్ఆర్ విగ్రహంతో పాటు తన తండ్రి యర్రం చినపోలిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో వైఎస్ విజయమ్మ 63వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అక్కడి నుంచి గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌కు ర్యాలీ చేరుకుంది. అక్కడ పార్టీ నేతలు లింగా రామకృష్ణారెడ్డి, సీవై రెడ్డి శాండిల్యతో పాటు ఎంపీకి పలువురు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీని స్థానిక ఎంపీటీసీ శాలువా కప్పి సన్మానించారు. అక్కడ పార్టీ శ్రేణులనుద్దేశించి ఎంపీ ప్రసంగించారు. హోదా ఆవశ్యకతను పార్లమెంట్లో వినిపించామన్నారు. అక్కడి నుంచి ర్యాలీ కొనసాగింది. గుండ్లాపల్లి ఫ్లైఓవర్, ఆర్సీ రోడ్డు వద్ద ఎంపీ సమీప బంధువులు ఆయనకు హారతితో స్వాగతం పలికారు. అక్కడ కొద్దిసేపు ఆగిన ఎంపీ.. అందరితో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి మద్దిపాడుకు ర్యాలీ చేరుకుంది. ఎంపీపీ నారా విజయమ్మ, బీసీ నాయకుడు లక్ష్మీనారాయణ, చుండూరి రవి తదితరులు ఎంపీకి స్వాగతం పలికారు. అక్కడ వైఎస్ఆర్, అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ ఒంగోలు నగర శివారులోని త్రోవగుంటకు చేరుకుంది. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి ఎంపీ పూలమాలలు వేశారు. ఆ తర్వాత 6 గంటల ప్రాంతంలో ఒంగోలు నగరంలోని మంగమ్మ కాలేజీ వద్దకు ర్యాలీ చేరుకుంది. అక్కడ వేలాది మంది కార్యకర్తలు వైవీ సుబ్బారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి కర్నూలురోడ్డు, బైపాస్ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్, మస్తాన్‌దర్గా మీదుగా చర్చి సెంటర్ వరకు ర్యాలీ సాగింది. అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైవీ.. విలేకర్లతో మాట్లాడారు. ఎంపీ వెంట వైఎస్సార్ సీపీ నాయకులు కుప్పం ప్రసాద్, వేమూరి సూర్యనారాయణ, పటాపంజుల శ్రీనివాస్, కొఠారి రామచంద్రరావు, మారెడ్డి రామకృష్ణారెడ్డి, గోలి తిరుపతిరావు, ఎస్.రవణమ్మ, కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, చుండూరి రవిబాబు, నాగిరెడ్డి, కేవీ ప్రసాద్, దేవరపల్లి అంజిరెడ్డి, పులుగు అక్కిరెడ్డి, గొర్రెపాటి శ్రీనివాసరావు, లంకపోతు అంజిరెడ్డి, దాచూరి గోపాల్‌రెడ్డి, వీఆర్సీ రెడ్డి, ఆళ్ల రవీంద్రారెడ్డి, పటాపంజుల అశోక్, దుంపా చెంచిరెడ్డి, కొమ్ము సామేలు, భక్తవత్సలరెడ్డి, షేక్ నాగూర్, పి.రామసుబ్బారెడ్డి, పల్లెర్ల పుల్లారెడ్డి, ఆర్లారెడ్డి, వర్దుశేషయ్య, కండే రమణయ్య యాదవ్, వెంకాయమ్మ, ఈశ్వరమ్మ, గోపిరెడ్డి గోపాల్‌రెడ్డి, తోటపల్లి సోమశేఖర్, నాగూర్, ఇనగంటి పిచ్చిరెడ్డి, వాకా రమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వేణు, జెడ్పీటీసీ సభ్యుడు మారం వెంకారెడ్డి, పెద్దిరెడ్డి భాస్కరరెడ్డి, జేమ్స్ తదితరులు ఉన్నారు. -
ఆయన కాంగ్రెస్‌లోకి వస్తే స్వాగతిస్తా..
మహబూబ్ నగర్ జిల్లా : బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే స్వాగతిస్తానని మాజీ మంత్రి, వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ..నాగం జనార్దన్ రెడ్డి లాంటి బలమైన నాయకుల అవసరం కాంగ్రెస్‌కు ఎంతైనా ఉందన్నారు. నాగం జనార్దన్ రెడ్డి, జైపాల్ రెడ్డిలపై ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లోని వచ్చినా తాను ఆహ్వానిస్తానని తెలిపారు. రావుల తనకంటే బలమైన అభ్యర్థి అని భావిస్తే తన సీటును కూడా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. రావుల కాంగ్రెస్‌లోకి వస్తే దేవరకద్రలో అవకాశం ఉంటుందని, పవన్‌కుమార్ రెడ్డి కంటే రావుల బలమైన అభ్యర్థి అవుతాడని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇతర పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్‌లోకి వస్తామంటే స్వాగతిస్తామన్నారు. నాగం చేరికను కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన నేతలెవరూ వ్యతిరేకించడం లేదన్నారు. కేవలం ఇతర పార్టీలు మారి కాంగ్రెస్‌లో చేరినవారే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. -
ఎంత పని చేస్తే... అంత ఉత్సాహం
‘‘అలుపా.. అలాంటిది నా నిఘంటువులోనే లేదు. నెలల తరబడి బిజీగా షూటింగ్స్ చేస్తున్నాం కాబట్టి, ఓ వారం రోజులు విశ్రాంతి తీసుకోరాదూ అని ఎవరైనా సలహా ఇస్తే, నవ్వేసి ఊరుకుంటా. ఎందుకంటే నూతనోత్సాహం కోసం నాకు సెలవులు అవసరంలేదు. పని చేసుకుంటూ పోతే ఉత్సాహం ఉరకలేస్తుంది’’ అని శ్రుతీహాసన్ చెప్పారు. ఆమె అలా అనడానికి కారణం కూడా ఉంది. ‘పూజ’ చిత్రంలో ఓ పాట షూటింగ్ కోసం ఇటీవల ఆమె స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కి వెళ్లారు. ఆ పాట చిత్రీకరణ పూర్తి కాగానే, వేరే చిత్రం షూటింగ్ కోసం వెంటనే దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. హడావిడిగా సూట్‌కేస్ సర్దుకుని ఫ్లయిట్ ఎక్కేశారు. అలా వెంట వెంటనే ప్రయాణాలు చేయడం కొంచెం ఒత్తిడి అనిపించినప్పటికీ, ఖాతరు చేయలేదని శ్రుతీ తెలిపారు. చేతినిండా పని ఉన్నప్పుడు చేయకపోతే భవిష్యత్తులో చింతించాల్సి వస్తుందని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రుతీ నటిస్తున్న చిత్రాల్లో హిందీ చిత్రం ‘వెల్కమ్ బ్యాక్’ ఒకటి. ఇందులో సీనియర్ నటుడు నానా పటేకర్, అనిల్కపూర్లకు రాఖీ సిస్టర్‌గా నటిస్తున్నారు శ్రుతి. ఇంకా ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, డింపుల్ కపాడియా వంటి ప్రముఖులు కూడా నటిస్తున్నారు. అందుకని ‘వెల్కమ్ బ్యాక్’లోశ్రుతి నటించడం ఆమె తండ్రి కమల్‌హాసన్‌కు ఆనందాన్నిచ్చిందట. ఈ సీనియర్లతో నటించడం గురించి శ్రుతి చెబుతూ.. ఆ నలుగురూ సింప్లీ సూపర్బ్, చాలా డౌన్ టు ఎర్త్ అన్నారు. -
పట్టిందల్లా బంగారమే!
మంచి రోజులు మొదలైతే... అవి కొన్నాళ్ల పాటు అలానే కొనసాగుతుంటాయి. ఆ సమయంలో పట్టిందల్లా బంగారమే. ప్రస్తుతం శ్రుతీహాసన్‌కి అదే జరుగుతోంది. రెండేళ్ల క్రితం ‘గబ్బర్‌సింగ్'తో మొదలైంది ఆమె హవా. గత ఏడాది ‘బలుపు', ‘డి-డే’, ఈ ఏడాది ప్రారంభంలో ‘ఎవడు'... ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు శ్రుతీహాసన్. ప్రస్తుతం ఈ పాలబుగ్గల వయ్యారి చేతినిండా సినిమాలే. ఈ నెల 11న ‘రేసుగుర్రం'తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారామె. సాధారణంగా హిందీ, తెలుగు, తమిళ చిత్ర సీమల్లో దేనినో ఒకదాన్ని నమ్ముకొని ముందుకెళ్తుంటారు హీరోయిన్లు. శ్రుతి మాత్రం అందుకు భిన్నం. సాధ్యమైనంతవరకూ అన్ని భాషల్నీ కవర్ చేస్తుంటారామె. బహుశా తండ్రి కమల్‌హాసన్ నుంచి అబ్బిన లక్షణం కావచ్చు. ప్రస్తుతం బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ‘వెల్కమ్ బ్యాక్’. జాన్ అబ్రహాం హీరో. ఇక రెండో సినిమా మన తెలుగు దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘గబ్బర్'. మురుగదాస్ ‘రమణ' చిత్రం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ కథానాయకుడు. ఇందులో శ్రుతి పాత్ర పేరు ‘దేవిక'. నటనకి ఆస్కారమున్న పాత్ర చేస్తున్నారామె. తప్పకుండా బాలీవుడ్లో తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని నమ్మకంతో ఉన్నారామె. అలాగే తమిళంలో కూడా ఈ మధ్య ఓ సినిమాకు పచ్చ జెండా ఊపారు. అదే... విశాల్ ‘పూజై'. యముడు, సింగం-2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన హరి ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో శ్రుతీది మాస్ అప్పీల్ ఉన్న పాత్ర అని సమాచారం. ఇక ‘రేసుగుర్రం' తర్వాత శ్రుతీహాసన్ నటించే తెలుగు సినిమా ఏంటి? అనే విషయాన్ని ఆరాతీస్తే... ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. మహేశ్, ‘మిర్చి' కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే కదా. ఆ సినిమాలో కథానాయికగా శ్రుతీహాసన్ ఎంపికయ్యారనేది ఫిలిమ్‌నగర్ సమాచారం. అలాగే... మణిరత్నం తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో కూడా శ్రుతీహాసనే కథానాయికట. ఈ జాబితాను బట్టి ఆమె ఇప్పుడు పట్టిందల్లా బంగారమేనని అర్థం చేసుకోవచ్చు. -
శృతీహాసన్ చుట్టూ తిరుగుతోన్న బాలీవుడ్ డైరెక్టర్స్
-
శ్రుతిహాసన్ లక్కీ లేడీ!
శ్రుతిహాసన్ ఐరన్ లెగ్ అనేది ఒకప్పటి మాట. ‘గబ్బర్‌సింగ్’తో శ్రుతి ఫేట్ మొత్తం మారిపోయింది. టైమ్ కలిసొస్తే అన్నీ కుదురుతాయేమో. వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో పాటు శ్రుతిహాసన్ భారీ అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వేరే కథానాయికలకు వెళ్లాల్సిన అవకాశాలు శ్రుతి ఖాతాలో చేరడం విశేషం. ఉదాహరణకు హిందీ చిత్రాలు ‘వెల్కమ్ బ్యాక్’, ‘గబ్బర్’. జాన్ అబ్రహాం హీరోగా అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వెల్కమ్ బ్యాక్’. ఈ చిత్రంలో సోనాక్షీ సిన్హాని నాయికగా అనుకున్నారు కుదర్లేదు. ఆ తర్వాత అసిన్‌ని అనుకున్నారు. సెట్ కాలేదు. శ్రద్ధాకపూర్‌ని ఎంపిక చేయాలనుకుంటే, తను కూడా సెట్‌కాలేదు. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి శ్రుతిహాసన్‌కి ఈ అవకాశం వచ్చింది. ‘వెలకమ్’లాంటి విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక, మరో చిత్రం ‘గబ్బర్’ విషయానికొస్తే... క్రిష్ దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న చిత్రం ఇది. సూపర్ హిట్ మూవీ ‘రమణ’కి రీమేక్ ఇది. ఇదే చిత్రం తెలుగులో ‘ఠాగూర్’గా రీమేక్ అయ్యింది. హిందీలో అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. ముందుగా శ్రద్ధాకపూర్‌ని నాయికగా అనుకుంటే, కుదర్లేదట. దాంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం శ్రుతికి వచ్చింది. దాంతో ఈ ముద్దుగుమ్మను ‘లక్కీ లేడీ’ అంటున్నారు. -
ఇంటి వేటలో బిజీ
ఒకవైపు ‘రేసు గుర్రం’, మరోవైపు హిందీ చిత్రం ‘వెల్కమ్ బ్యాక్’లో నటిస్తూ బిజీగా ఉన్నారు శ్రుతిహాసన్. గత కొన్ని రోజులుగా దుబాయ్‌లో ‘వెల్కమ్ బ్యాక్’ షూటింగ్లో పాల్గొన్న శ్రుతి ఓ రోజు క్రితమే ఇండియా చేరుకున్నారు. వచ్చీరావడంతోనే ఇంటి వేటలో పడ్డారామె. ఇటీవల ఓ వ్యక్తి శ్రుతి ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించడం, దాన్ని ఆమె అడ్డుకున్న విషయం తెలిసిందే. అప్పట్నుంచీ శ్రుతికి ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేదట. అందుకే కొత్త ఇంటికి మారాలనుకుంటున్నారామె. ముంబైలాంటి మహానగరంలో ఇల్లు వెతకడం అంటే అంత సులువు కాదు. పైగా, సెలబ్రిటీలంటే బోల్డన్ని సౌకర్యాలు ఉండాలి. అందుకే, ఇల్లు వెతికే పని తన ఒక్కదానివల్ల కాదని ఫిక్స్ అయిన శ్రుతి, ఆ పనిని ఏజెంట్లకు అప్పజెప్పారట. ఎంత అద్దె అయినా ఫర్వాలేదని, ప్రశాంతంగా ఉండటానికి వీలుగా ఉన్న ఇల్లు వెతికిపెట్టమని సదరు ఏజెంట్స్‌ని కోరారట శ్రుతిహాసన్. దీన్నిబట్టి ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో జరిగిన సంఘటన ఆమెను ఎంత బాధపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. -
అమితాబ్, రేఖ వెల్కమ్ బ్యాక్!
కొన్ని జంటల మధ్య కెమిస్ట్రీ భలే వర్కవుట్ అవుతుంది. వాళ్లని తెరమీద ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడబుద్ధేస్తుంది. అలాంటి జంటే అమితాబ్ బచ్చన్-రేఖ. ముప్ఫయేళ్ల క్రితం బాలీవుడ్‌ని ఏలిన చూడముచ్చటైన జంటల్లో వీరిది మొదటి స్థానం అనే చెప్పాలి. ఈ ఇద్దరూ కలిసి దాదాపు 18 సినిమాల్లో నటించారు. ఈ జంట నటించిన చివరి చిత్రం ‘సిల్సిలా’. ఆ తర్వాత అమితాబ్, రేఖ జతకట్టలేదు. వెండితెరపై ఎన్నో చిత్రాల్లో ప్రేమికులుగా నటించిన ఈ ఇద్దరూ తెరవెనుక కూడా లవర్సే అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రేఖ మెడలో అమితాబ్ మూడు ముళ్లు వేస్తారని కూడా చాలామంది ఊహించారు. కానీ అమితాబ్ జీవితంలోకి జయబాధురి రావడంతో, రేఖతో అనుబంధానికి తెరపడింది. ఆ విధంగా ఈ ఇద్దరి కాంబినేషన్ తెరపై కూడా కనుమరుగైంది. 30 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ ఓ చిత్రంలో నటించబోతున్నారన్నది బాలీవుడ్ టాక్. ‘వెల్కమ్’కి సీక్వెల్‌గా అనీస్ బజ్మీ దర్శకత్వంలో ఫిరోజ్ నడియాడ్వాలా నిర్మించనున్న ‘వెల్కమ్ బ్యాక్’లోనే అమితాబ్, రేఖ కాంబినేషన్ కనిపించనుందని వినికిడి. ఇందులో అమితాబ్ డాన్‌గా నటించబోతున్నారట. ధనవంతురాలి పాత్రకు రేఖను అడిగారట. అటు అమితాబ్, ఇటు రేఖ ఈ చిత్రంలో నటించడానికి సుముఖంగానే ఉన్నారని సమాచారం. ఈ ఇద్దరూ జంటగా నటించకపోయినా వీరి కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు ఉంటాయని యూనిట్ సభ్యులు అంటున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. ఇంకా అమితాబ్, రేఖ అధికారికంగా సైన్ చేయలేదట. ఒకవేళ ఈ ఇద్దరూ అంగీకరిస్తే.. చాలా విరామం తర్వాత కలిసి నటించబోతున్నారు కాబట్టి కచ్చితంగా ‘వెల్కమ్ బాక్’కి అదనపు ఆకర్షణ అవుతారని చెప్పొచ్చు.