
ఇంటి వేటలో బిజీ
ఒకవైపు ‘రేసు గుర్రం’, మరోవైపు హిందీ చిత్రం ‘వెల్‌కమ్ బ్యాక్’లో నటిస్తూ బిజీగా ఉన్నారు శ్రుతిహాసన్. గత కొన్ని రోజులుగా దుబాయ్‌లో ‘వెల్‌కమ్ బ్యాక్’ షూటింగ్‌లో పాల్గొన్న శ్రుతి ఓ రోజు క్రితమే ఇండియా చేరుకున్నారు. వచ్చీరావడంతోనే ఇంటి వేటలో పడ్డారామె. ఇటీవల ఓ వ్యక్తి శ్రుతి ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించడం, దాన్ని ఆమె అడ్డుకున్న విషయం తెలిసిందే. అప్పట్నుంచీ శ్రుతికి ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేదట. అందుకే కొత్త ఇంటికి మారాలనుకుంటున్నారామె. ముంబైలాంటి మహానగరంలో ఇల్లు వెతకడం అంటే అంత సులువు కాదు. పైగా, సెలబ్రిటీలంటే బోల్డన్ని సౌకర్యాలు ఉండాలి. అందుకే, ఇల్లు వెతికే పని తన ఒక్కదానివల్ల కాదని ఫిక్స్ అయిన శ్రుతి, ఆ పనిని ఏజెంట్లకు అప్పజెప్పారట. ఎంత అద్దె అయినా ఫర్వాలేదని, ప్రశాంతంగా ఉండటానికి వీలుగా ఉన్న ఇల్లు వెతికిపెట్టమని సదరు ఏజెంట్స్‌ని కోరారట శ్రుతిహాసన్. దీన్నిబట్టి ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో జరిగిన సంఘటన ఆమెను ఎంత బాధపెట్టిందో అర్థం చేసుకోవచ్చు.