నటుడు కమలహాసన్ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఏదో ఉంటుంది. ఆయన గురించి ఎంత చెప్పినా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే ఆయన్ని చిత్ర పరిశ్రమలో ఎన్‌సైక్లోపిడియా అంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కమలహాసన్ నిత్య విద్యార్థి కూడా. అలాంటి కమల్ వారసుల ప్రతిభ గురించి ఇంకా చెప్పాలా. ఆయన పెద్ద కూతురు శృతిహాసన్ ఇప్పుడు ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. సంగీత దర్శకురాలు, గాయనీ, గీత రచయిత అంటూ ఆమెలో అదనపు ప్రతిభ కూడా ఉంది. తన తల్లిదండ్రుల గురించి ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పే శృతిహాసన్‌కు తండ్రి కమలహాసన్ అన్నా, తల్లి సారిక అన్నా చాలా ప్రేమ, గౌరవం.
వాళ్లు విడిపోయినా, శృతిహాసన్ ఆ విషయాన్ని గౌరవిస్తారు. దీని గురించి ఇటీవల ఒక సమావేశంలో పేర్కొంటూ తన తల్లిదండ్రులు విడిపోవడం బాధాకరమేనన్నారు. అయితే విడిపోవడం వల్ల స్త్రీకి స్వేచ్ఛ వస్తుందని తనకు అప్పుడే తెలిసిందన్నారు. అదే విధంగా ఆర్థికపరమైన విషయాల గురించి తనకు అప్పుడే అవగతం అయ్యిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరో విషయం ఏమిటంటే తన తల్లికి దైవభక్తి ఎక్కువని, తన తండ్రి నాస్తికుడన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. దీంతో ఇంట్లో దేవుడి పేరు వినిపించేది కాదన్నారు. ఇక దేవాలయాలకు వెళ్లే అవకాశమెక్కడుంటుందని అన్నారు.
అలాంటిది కొంత కాలం తరువాత దేవుడిపై నమ్మకం ఏర్పడిందన్నారు. దీంతో తన తండ్రికి తెలియకుండా దేవాలయాలకు వెళ్లి వచ్చేదానినని చెప్పారు. ఆ అనుభవం చాలా ప్రత్యేకంగా ఉండేదన్నారు. ఇప్పటికీ ఆ అనుభవాన్ని కోరుకుంటున్నానని చెప్పారు. అయితే తాను దేవాలయానికి వెళ్లే విషయాన్ని తన తండ్రికి తెలియకుండా చాలా కాలం జాగ్రత్త పడ్డానని పేర్కొన్నారు. దైవభక్తితో తనలో శక్తి పెరిగిందని అన్నారు. దైవభక్తే తననీ స్థాయికి చేర్చిందనే అభిప్రాయాన్ని నటి శృతిహాసన్ వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈమె నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ముఖ్య భూమికను పోషిస్తున్నారు. తదుపరి నటుడు ధనుష్‌తో జత కట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment