పట్టిందల్లా బంగారమే! | Shruti Haasan to romance Mahesh? | Sakshi
Sakshi News home page

పట్టిందల్లా బంగారమే!

Published Tue, Apr 8 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM

పట్టిందల్లా బంగారమే!

పట్టిందల్లా బంగారమే!

మంచి రోజులు మొదలైతే... అవి కొన్నాళ్ల పాటు అలానే కొనసాగుతుంటాయి. ఆ సమయంలో పట్టిందల్లా బంగారమే. ప్రస్తుతం శ్రుతీహాసన్‌కి అదే జరుగుతోంది. రెండేళ్ల క్రితం ‘గబ్బర్‌సింగ్'తో మొదలైంది ఆమె హవా. గత ఏడాది ‘బలుపు', ‘డి-డే’,  ఈ ఏడాది ప్రారంభంలో ‘ఎవడు'... ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు శ్రుతీహాసన్. ప్రస్తుతం ఈ పాలబుగ్గల వయ్యారి చేతినిండా సినిమాలే. ఈ నెల 11న ‘రేసుగుర్రం'తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారామె.

సాధారణంగా హిందీ, తెలుగు, తమిళ చిత్ర సీమల్లో దేనినో ఒకదాన్ని నమ్ముకొని ముందుకెళ్తుంటారు హీరోయిన్లు. శ్రుతి మాత్రం అందుకు భిన్నం. సాధ్యమైనంతవరకూ అన్ని భాషల్నీ కవర్ చేస్తుంటారామె. బహుశా తండ్రి కమల్‌హాసన్ నుంచి అబ్బిన లక్షణం కావచ్చు. ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ‘వెల్‌కమ్ బ్యాక్’. జాన్ అబ్రహాం హీరో. ఇక రెండో సినిమా మన తెలుగు దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘గబ్బర్'.

మురుగదాస్ ‘రమణ' చిత్రం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ కథానాయకుడు. ఇందులో శ్రుతి పాత్ర పేరు ‘దేవిక'. నటనకి ఆస్కారమున్న పాత్ర చేస్తున్నారామె. తప్పకుండా బాలీవుడ్‌లో తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని నమ్మకంతో ఉన్నారామె. అలాగే తమిళంలో కూడా ఈ మధ్య ఓ సినిమాకు పచ్చ జెండా ఊపారు. అదే... విశాల్ ‘పూజై'.  యముడు, సింగం-2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన హరి ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో శ్రుతీది మాస్ అప్పీల్ ఉన్న పాత్ర అని సమాచారం.

ఇక ‘రేసుగుర్రం' తర్వాత శ్రుతీహాసన్ నటించే తెలుగు సినిమా ఏంటి? అనే విషయాన్ని ఆరాతీస్తే... ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. మహేశ్, ‘మిర్చి' కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే కదా. ఆ సినిమాలో కథానాయికగా శ్రుతీహాసన్ ఎంపికయ్యారనేది ఫిలిమ్‌నగర్ సమాచారం. అలాగే... మణిరత్నం తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో కూడా శ్రుతీహాసనే కథానాయికట. ఈ జాబితాను బట్టి ఆమె ఇప్పుడు పట్టిందల్లా బంగారమేనని అర్థం చేసుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement