Gabbar Singh
-
ఆ సినిమాతో రూ. 40 వేలు కాస్త రూ. 40 లక్షలు అయింది: అభిమన్యు
‘గబ్బర్‌సింగ్’ సినిమాలో సిద్దప్పనాయుడిగా అభిమన్యు సింగ్ భయపెట్టాడు. భయపెడుతూ భయపెడుతూనే... నవ్వకుండానే నవ్వించాడు. అలా ఆయనకు తెలుగులో భారీగా ఛాన్సులు దక్కించుకున్నాడు. రామ్‌గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’ సినిమాతో ఆయన టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. అందులో బుక్కారెడ్డిగా వణుకు పుట్టించాడు. ‘రక్తచరిత్రలో’ బుక్కారెడ్డి పాత్రను భయంకరంగా పండించి ‘ఉత్తమ విలన్’ అని అభిమన్యు నిరూపించకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.. తన రెమ్యునరేషన్‌తో పాటు పలు విషయాలను పంచుకున్నాడు.2001లోనే అభిమన్యు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, 2010లో ఆర్జీవీ తెరకెక్కించిన రక్తచరిత్ర సినిమాతోనే ఆయనకు గుర్తింపు వచ్చింది. రక్తచరిత్రలో ఆయన పాత్ర చాలా ఇంపాక్ట్ చూపుతుంది. సినిమా చూసే వారిలో భయాన్ని నెలకొలుపుతుంది. అలా తన నటనతో దుమ్మురేపాడు. ఆపై 2017లో అతను ఏకంగా శ్రీదేవితో కలిసి మామ్ చిత్రంలో నటించాడు. హిందీ చిత్రాలలో కనిపించడమే కాకుండా, ఆయన తమిళం, తెలుగు భాషా చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం పవన్ ఓజీలో చాలా కీలక పాత్రలో అభిమన్యు ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.మొదటి రెమ్యునరేషన్'నేను నటించిన మొదటి సినిమా (అక్స్) కోసం తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 12 వేలు మాత్రమే. చాలా ఏళ్ల పాటు ఒక సినిమాకు రూ. 20 వేల లోపే ఇచ్చేవారు. కానీ, రక్తచరిత్ర సినిమాకు రూ. 40 వేలు ఇచ్చారు. ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. ఈ మూవీలో నటించాను కాబట్టే పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్‌లో ఛాన్స్ వచ్చింది. నేను డబ్బును నమ్ముకోలేదు. అందువల్ల వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వచ్చాను. గబ్బర్ సింగ్ కోసం రూ. 40 లక్షలు ఇచ్చారు. దీంతో లైఫ్ మొత్తం మారిపోయింది. అలా 2010లో తొలిసారి ఎక్కిన కార్వాన్ 2025 వచ్చినా సరే నేను ఇంకా దిగలేదు. ఆ రెండు సినిమాలు నా జీవితంలో అంతలా ప్రభావం చూపాయి. ప్రస్తుతం ఓజీలో పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాను. ఇప్పుడు కూడా మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు.' అని తెలిపాడు.చీపురుతో ఫ్లోర్లు ఊడ్చేవాడుఅభిమన్యుసింగ్ స్వస్థలం బిహార్‌రాజధాని పట్నా. ‘బాలీవుడ్’ కలలతో ముంబైకి చేరుకున్నాడు. నిర్మాతల ఆఫీసుల చుట్టూ బొంగరంలా తిరిగాడు. కొంచెం కూడా ఫలితం కనిపించలేదు. ‘థియేటర్’ రూట్ నుంచి వెళితే...ప్రయాణం కాస్త సులువవుతుంది అనుకొని మకరంద్ దేశ్‌పాండే థియేటర్ గ్రూప్ ‘అంశ్’లో చేరాడు. ‘‘నటన అంటే ఇదీ’’ అని చెప్పలేదు మకరంద్. ‘‘చీపురు అంటే ఇదీ’’ అన్నట్లుగా మూలకు ఉన్న చీపురును అభిమన్యుకు చూపి...ఫ్లోర్ ఊడ్చమన్నాడు. ‘నేను వచ్చింది నటన నేర్చుకోవడం కోసం. ఊడ్చడం కోసం కాదు’ అభిమన్యులో కోపం కెరటమై లేచింది. అయితే నటన మీద ప్రేమ... ఆ కోపాగ్నిపై నీళ్లు చల్లింది. అలా....చీపురుతో ఫ్లోర్ ఊడ్చాడు అభిమన్యు. ‘ఇగో మెల్టింగ్’ పూర్తయ్యాక... అభిమన్యుకు నటనలో ఓనమాలు దిద్దించాడు మకరంద్. ‘అంశ్’ థియేటర్ గ్రూప్‌లో కె.కె. మీనన్, అనురాగ్ కశ్యప్‌లు అభిమన్యుకు సీనియర్లు. ‘బాగా నటిస్తున్నాడు’ అని పేరైతే వచ్చిందిగానీ... సినిమాల్లో అవకాశాలేవీ రావడం లేదు. తన రూమ్‌లో ఒంటరిగా ఏడ్చిన రోజులెన్నో ఉన్నాయి. పట్నాలో ఉన్నప్పుడు నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నుంచి ఒకరోజు ఫోన్ వచ్చింది. కట్ చేస్తే... రాకేష్ మెహ్ర ‘అక్స్’లో పోలీస్ పాత్ర పోషించే అవకాశం దక్కింది. అలా ‘రక్తచరిత్ర’తో దక్షిణాది సినిమాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. చెడు పాత్రలను ‘ఎంత మంచిగా చేశాడు’ అనిపించుకోవడం అంత తేలికేమీకాదు... అందుకే అభిమన్యు సింగ్ ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నాడు. -
మా జీవితాలను మార్చింది: హరీష్ శంకర్
‘‘సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ రోజుల్లో ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ అయి ఉంటే ఎంత బాగుండేదో అని నా మనసులో చిన్న వెలితి ఉండేది. ఆ వెలితి ఇప్పుడు తీరింది. అప్పుడు మిస్ అయిన డిజిటల్ హంగామాని మళ్లీ క్రియేట్ చేసి ఇస్తున్న మా అన్న గణేశ్‌కి, సత్యనారాయణకి థ్యాంక్స్. ‘గబ్బర్ సింగ్’ మా జీవితాలను మార్చేసిన సినిమా’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్, శ్రుతీహాసన్ జంటగా నటించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ చిత్రం 2012 మే 11న విడుదలైంది. ఈ నెల 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శనివారం ప్రెస్ మీట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ – ‘‘గబ్బర్ సింగ్’ డబ్బింగ్ సమయంలోనే ఈ మూవీ పక్కా బ్లాక్‌బస్టర్ అన్నారు పవన్ కల్యాణ్‌గారు. నా అభిమానులు కోరుకునేది ఇవ్వబోతున్నావ్’’ అన్నారు. ‘‘నన్ను నేను నమ్మలేని పరిస్థితిలో పవన్ కల్యాణ్‌గారు నమ్మి, నన్ను నిర్మాతగా నిలబెట్టారు. నేను, హరీష్, దేవిశ్రీ ప్రసాద్... అందరూ ప్రేమించి ఈ సినిమా చేశాం. ఏడేళ్లుగా నేను సినిమా తీయకపోవడం బాధగా ఉంది... మళ్లీ సినిమాలు తీస్తా’’ అన్నారు బండ్ల గణేశ్. డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, నటుడు రమేశ్‌రెడ్డి మాట్లాడారు. -
సొరంగంలో సంకల్ప స్ఫూర్తి.. ప్రధాని ప్రశంసలు.. ఎవరీ గబ్బర్ సింగ్ నేగి?
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగ ప్రమాదంలో చిక్కుకుని 17 రోజులు పర్వత గర్భంలో గడిపిన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. నవంబర్ 12న ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ ప్రయత్నాలు పూర్తయి బయటపడే వరకూ సొరంగం లోపల చిక్కుకున్న కార్మికుల్లో మానిసిక స్థైర్యం చాలా అవసరం. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు మానసికంగా చాలా ధైర్యం కావాలి. బతకాలన్న సంకల్పం ఉండాలి. బతుకుతామన్న ఆశ కోల్పోకూడదు. ఇది అందరికీ ఉండదు. కానీ ఉత్తరకాశీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మందిలో ఈ మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించాడు గబ్బర్ సింగ్ నేగి. ఆ స్థైర్యాన్ని మిగతా 40 మందికీ పంచాడు. సొరంగంలో ఉన్న 17 రోజులూ తోటి కార్మికులకు యోగా, ధ్యానం నేర్పించి చేయించాడు. వారు శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండేలా చూసుకున్నారు. అందరం తప్పకుండా బయటపడతామంటూ వారిలో ధైర్యం నూరిపోశాడు. చివరగా నేనే.. సొరంగంలో ఉండగా గబ్బర్ సింగ్ నేగి చెప్పిన మాటలను ఆయన అతని సోదరుడు జయమల్ సింగ్ నేగి తెలియజేశారు. రెస్క్యూ ప్రారంభమైనప్పుడు తొక్కిసలాట జరుగుతుందా అని అతన్ని అడిగినప్పుడు.. నేను సీనియర్ని..అందరూ బయటకు వచ్చిన తర్వాతే నేను చివరిగా వస్తాను అని గబ్బర్ సింగ్ నేగి చెప్పినట్లుగా జయల్ సింగ్ నేగి పేర్కొన్నారు. సొరంగం నుంచి సురక్షితంగా బయటపడిన కార్మికులందరూ తమ సహచరుడు గబ్బర్ సింగ్ నేగి కృషిని ప్రశంసించారు. తమను సురక్షితంగా మానసికంగ సంతోషంగా ఉంచడంలో నేగి పాత్రను వివరించారు. యోగా, ధ్యానంతోపాటు లూడో, చెస్ వంటి ఆటలు కూడా ఆడించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని సైట్‌లోని మానసిక వైద్యులలో ఒకరైన డాక్టర్ రోహిత్ గోండ్వాల్ కూడా తెలిపారు. ప్రధాని ప్రశంసలు గబ్బర్ సింగ్ నేగీ ధైర్యాన్ని, చొరవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారు. కార్మికులు సురక్షితంగా బయటపడిన తర్వాత మంగళవారం రాత్రి రాత్రి వారితో ఫోన్ ద్వారా మాట్లాడారు. గబ్బర్ సింగ్ నేగి గురించి తోటి కార్మికులు చెప్పడంతో ప్రధాని మోదీ ఆయన్ను అభినందించారు. -
ప్రతి రిలేషన్లో గొడవలు, మనస్పర్థలు కామన్: బండ్ల గణేశ్
Bandla Ganesh About Clash With Director: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌కు ఖరీదైన వాచ్ బాహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇది ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. కాగా గతంలో బండ్ల గణేశ్, హరీశ్ శంకర్ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్గా బండ్ల గణేశ్, హరీశ్ శంకర్‌ను కలవడం, బాహుమతులు ఇచ్చుకోవడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీంతో గతంలో బండ్ల చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చాయి. చదవండి: ఆస్తులన్ని పోయాయి, ఒక్క పూట భోజనమే చేసేదాన్ని: ‘షావుకారు’ జానకి హరీశ్ శంకర్‌తో గొడవపై ఓ ఇంటర్య్వూలో స్పందించిన బండ్ల గణేశ్ ఇలా వ్యాఖ్యానించాడు. ‘ప్రతి రిలేషన్లో గొడవలు, మనస్పర్థాలు సాధారణమే. ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. మళ్లీ సర్థుకుంటాయి. ఇలాంటి వాటి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దు’ అన్నాడు. అనంతరం ‘గబ్బర్ సింగ్ మూవీ నా జీవితాన్నే మార్చేసింది. ఈ మూవీతో నాకు అంత పెద్ద హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్‌కు నేను ఎప్పటికీ కృతజ్ఞతుడినే. నా జీవింతాంతం ఆయన నాకు మంచి స్నేహితుడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హరీశ్ శంకర్ కూడా మనసులో ఏం పెట్టుకోలేదని, ఆయన అంత వదిలేసి తనతో చాలా ఫ్రెండ్లిగా ఉంటున్నారని చెప్పాడు. అంతేగాక పవన్ కల్యాణ్ చాన్స్ ఇస్తే తనతో సినిమా చేసేందుకు ఆయన రెడీగా ఉన్నారని చెప్పాడు. చదవండి: ముచ్చటగా మూడోసారి.. అదే రిపీట్ అవుతుందా? కాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాకు బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్పట్లో బ్లాకబస్టర్గా నిలిచింది. దీంతో మే 12తో ఈ సినిమా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బండ్ల డైరెక్టర్ హరీశ్ శంకర్ కాస్ట్లీ వాచ్‌ను కానుకగా ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇదే మూవీ 8వ వార్షికోత్సవం సమయంలోనే హరీశ్ శంకర్, బండ్ల గణేశ్ మధ్య వాగ్వాదం నెలకొంది. 'గబ్బర్ సింగ్' 8వ వార్షికోత్సవం సందర్భంగా హరీశ్ శంకర్ అందరికీ థ్యాంక్స్ చెపుతూ ఒక లేఖను విడుదల చేశారు. అయితే, ఆ సినిమా నిర్మాత అయిన బండ్ల గణేశ్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో, రచ్చ మొదలైంది. హరీశ్ శంకర్ ఓ రీమేక్ డైరెక్టర్ అని, అతనితో మళ్లీ సినిమా చేసే ప్రసక్తే లేదంటూ బండ్ల అప్పట్లో ఫైర్ అయిన విషయం విధితమే. -
ధావన్: 'జట్టుకు దూరమయ్యావు! ఎంటర్టైన్మెంట్తో బతికేస్తున్నావా'
టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ ఫామ్‌ను కోల్పోయి జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుత పరిస్థితులు దృష్యా ధావన్ జట్టులోకి రావడం కష్టమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఇవేవి పట్టించుకోకుండా టీమిండియాలోకి రావాలని గబ్బర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగాడు. అయితే ఐదు మ్యాచ్‌లు కలిపి (12,8,14,12,0).. 56 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో ధావన్ రీఎంట్రీపై నీలీనీడలు కమ్ముకున్నాయి. చదవండి: 10 ఫోర్లు, 4సిక్స్‌లు.. సెంచరీతో చెలరేగిన శ్రీలంక బ్యాటర్! ఆటకు దూరంగా ఉన్నప్పటికి ధావన్ తన అభిమానులను అలరించాలనుకున్నాడు. అందుకు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫన్నీ వీడియోనూ షేర్ చేశాడు. బాలీవుడ్ బ్లాక్బాస్టర్ షోలే సినిమాలో విలన్ గబ్బర్‌సింగ్ పాపులర్ డైలాగ్ ''కిత్నే ఆద్మీ తే''ను తన స్టైల్లో అనుకరించాడు. ప్రస్తుతం ధావన్ చెప్పిన డైలాగ్ వైరల్‌గా మారింది. అయితే ధావన్ వీడియో చేయడంపై టీమిండియా ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.'' టీమిండియాకు ఎలాగో దూరమయ్యావు.. ఎంటర్టైన్మెంట్ మీద పడ్డావు. ఇలాంటివి మానేసి ఆటపై దృష్టి పెడితే బాగుంటుంది..'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక ధావన్ టీమిండియా తరపున టి20 ప్రపంచకప్‌కు ముందు శ్రీలంకతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లో ఆఖరిసారిగా పాల్గొన్నాడు. లంక పర్యటనకు వెళ్లిన రెండో టీమిండియా జట్టుకు ధావన్ కెప్టెన్సీ చేశాడు. టి20 సిరీస్‌ను లంక గెలుచుకోగా.. వన్డే సిరీస్‌ను మాత్రం టీమిండియా 2-1 తేడాతో దక్కించుకుంది. ఇక అప్పటినుంచి ధావన్ మళ్లీ టీమిండియాకు ఆడలేదు. చదవండి: IND Vs SA: అతడు ప్రపంచ స్ధాయి బౌలర్.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే! View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
టీమిండియా డాషింగ్ క్రికెటర్ నోట తెలుగు సినిమా డైలాగ్
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక తెలుగు సినిమా డైలాగ్‌ను చెప్పాడు. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పాపులర్ డైలాగ్‌ను తెలుగులో చెప్పి అందరీ దృష్టిని ఆకర్షించాడు. "నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది" అన్న పీకే డైలాగ్ సెహ్వాగ్ నోట వినిపించడం నెట్టింట వైరల్‌గా మారింది. మొబైల్లో పవన్ డైలాగ్ చెబుతున్న వీడియోను చూస్తూ.. పక్కన అమ్మాయి సాయం చేస్తుండగా సెహ్వాగ్ డైలాగ్‌ను పలికిన తీరు ఇరువురు సెలబ్రిటీల అభిమానులను ఫిదా చేస్తోంది. అయితే ఈ వీడియో ఎప్పడిదో అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. Sehwag Naidu mass 🔥🔥🔥 pic.twitter.com/y8fj0674sG — Chirag Arora (@Chiru2020_) September 6, 2021 చదవండి: మ్యాచ్ గెలిపించినా అక్షింతలు తప్పలేదు.. టీమిండియా కెప్టెన్‌పై బీసీసీఐ ఆగ్రహం -
పవన్ ఫ్యాన్స్‌కు బండ్ల గణేశ్ గుడ్ న్యూస్.. థియేటర్లలో మళ్లీ ‘గబ్బర్ సింగ్’
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2011 మే 11న విడుదలైన ఈ చిత్రం.. టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. దబాంగ్ సినిమాకు రిమేక్ అయినా.. కానీ పవన్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేశ్‌కు కూడా గుర్తింపు అందుకున్నాడు. (చదవండి: హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూతురు!) కాగా, ఇప్పుడు ఆ సినిమాను మళ్ళీ విడుదల చేయనున్నారట. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో వందకు పైగా థియేటర్లలో మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమా విడుదల చేయనున్నారట. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించిన బండ్ల గణేశ్.. ‘సెప్టెంబర్ 2న బాస్ బర్త్ డే స్పెషల్ గా గబ్బర్ సింగ్ సినిమా చూడండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 100 షోలు వేస్తున్నాను, మనం మన బాస్ పుట్టినరోజు థియేటర్లో జరుపుకుందాం, జై పవర్ స్టార్, జై దేవర ’అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. -
ఎట్టకేలకు మెత్తబడ్డ బండ్ల గణేష్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాకు అవకాశమిచ్చినా తనను గుర్తుకు పెట్టుకోలేదని కొద్ది రోజుల కిత్రం దర్శకుడు హరీష్ శంకర్‌పై విమర్శలకు దిగిన నిర్మాత బండ్ల గణేష్ ఎట్టకేలకు మెత్తబడ్డారు. ఈ చిన్న జీవితంలో పోట్లాటలు, శత్రుత్వాలు అవసరం లేదని ట్విటర్లో పేర్కొన్నారు. హరీష్ తనకు కాల్ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. తనకు కాల్ చేసి మట్లాడినందుకు ఆయనకు బండ్ల గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ ఇద్దరు దర్శకనిర్మాతల కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘గబ్బర్‌సింగ్’ విడుదలై 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ఆ సినిమాకు పని చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్తూ హరీష్ శంకర్ ట్విటర్లో ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: గణేష్-హరీష్‌ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు) అయితే, అందులో నిర్మాత బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు. నిజానికి ఆయన మరిచిపోయారో లేక కావాలనే చెప్పలేదో తెలియదు కాని ఈ విషయంపై బండ్ల గణేష్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ‘అది ఆయన సంస్కారం. అంతకన్నా ఏం చెప్పను. ఆయన రీమేక్‌లు మాత్రమే చేయగలరు. స్ట్రయిట్ సినిమా తీసి హిట్ చేసి చూపించమనండి. ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా. హరీష్ శంకర్ అనే వ్యక్తికి పవన్ కల్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించింది నేను. ఎన్టీఆర్ సినిమా ఇస్తానన్న ఓ నిర్మాత ఆ సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్ లో వుంటే పిలిచి అవకాశం వచ్చేలా చేసింది నేను. గబ్బర్ సింగ్ కూడా అంత పెద్ద హిట్ అయ్యిందంటే అందులో పవన్ సలహాలు చాలా ఉన్నాయి’అని బండ్ల గణేష్ గతంలో ఏకి పారేశాడు. (పొరపాటు జరిగింది.. క్షమించడంటూ బండ్ల ట్వీట్) @harish2you thank you so much brother for your concern. Felt really happy after your call , this is a small life no fights no enemies.🙏 — BANDLA GANESH. (@ganeshbandla) July 26, 2020 -
హరీష్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ దర్శకనిర్మాతుల హరీష్ శంకర్, బండ్ల గణేష్‌ల మధ్య వివాదం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇరువురు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటుండటంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఇద్దరు దర్శకనిర్మాతల కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘గబ్బర్‌సింగ్’ విడుదలై 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ హరీష్ శంకర్ ట్విటర్లో ఓ లేఖ విడుదల చేశారు. అయితే ఆ లెటర్లో నిర్మాత బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు. అయితే నిజానికి ఆయన మరిచిపోయారో లేక కావాలనే చెప్పలేదో తెలియదు కాని.. దీనిపై బండ్ల గణేష్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ‘అది ఆయన సంస్కారం. అంతకన్నా ఏం చెప్పను. ఆయన రీమేక్‌లు మాత్రమే చేయగలరు. స్ట్రయిట్ సినిమా తీసి హిట్ చేసి చూపించమనండి. ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా. హరీష్ శంకర్ అనే వ్యక్తికి పవన్ కల్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించింది నేను. ఎన్టీఆర్ సినిమా ఇస్తానన్న ఓ నిర్మాత ఆ సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్ లో వుంటే పిలిచి అవకాశం వచ్చేలా చేసాను నేను. గబ్బర్ సింగ్ కూడా అంత పెద్ద హిట్ అయ్యిందంటే అందులో పవన్ సలహాలు చాలా ఉన్నాయి. అంతాక్ష్యరి ఎపిసోడ్ పవన్ సలహానే. హీరోయిన్ శృతి హాసన్ ఎంపిక కూడా పవర్‌స్టార్‌దే. అనుకున్న బడ్జెట్లో సినిమా తీయడంలో డైరెక్టర్‌గా హరీష్ విజయం సాధించాడు’ అని ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక బండ్ల గణేష్ వ్యాఖ్యలపై హరీష్ శంకర్ ధీటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. ‘గబ్బర్ సింగ్’ విజయంలో ఎవరి పాత్ర ఏంటిదో అందరికీ తెలుసని తన సన్నిహితుల దగ్గర హరీష్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వివాదం ఎక్కడివరకు వెళుతుందో వేచిచూడాలి. Thanks again for the overwhelming appreciations and celebrations.... 🙏🙏🙏 thanks to all the fans who made this 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/ZVyHrdGASg — Harish Shankar .S (@harish2you) May 11, 2020 చదవండి: భార్యకు విడాకులు.. గాయనితో 9 ఏళ్లుగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కౌశల్ -
జగన్ సమక్షంలో గబ్బర్‌సింగ్ చేరిక
తూర్పుగోదావరి, కాట్రేనికోన (ముమ్మిడివరం): పల్లంకుర్రుకు చెందిన యువ పారిశ్రామికవేత్త, టీడీపీ నాయకుడు భూపతిరాజు శివకుమార్‌వర్మ (గబ్బర్‌సింగ్) హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రఘురామకృష్ణంరాజుతోపాటు గబ్బర్‌సింగ్ పార్టీలో చేరారు. ఆయన చేరికపై ముమ్మిడివరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, నాయకులు భూపతిరాజు సుబ్రమణ్యంరాజు (బుల్లిరాజు), నడింపల్లి సూరిబాబు, పెన్మెత్స రామకృష్ణంరాజు (గెడ్డం కృష్ణ), నేల కిషోర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
రోడ్డెక్కిన గబ్బర్ సింగ్, సాంబ
గురుగ్రాం : ‘అరెవో సాంబ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల లాభమా? నష్టమా?’అని గబ్బర్ ప్రశ్నించగా.. ‘ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేకపోవడం వలన తలకు తీవ్ర గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదం ఇంకా పెద్దదయినపుడు ఆ వ్యక్తి కోమాలోకి వెళ్లవచ్చు కొన్ని సార్లు ప్రాణాలూ విడవచ్చు. ఎలా చూసినా హెల్మెట్ లేకుండా వాహనం నడపడం ప్రయాణికుడికి తీవ్ర నష్టమే’అంటూ గబ్బర్ ప్రశ్నకు సాంబ సమాధానమిస్తాడు. ఏంటీ గబ్బర్, సాంబల పేర్లు చెప్పి షోలే సినిమా డైలాగులు కాకుండా వేరే డైలాగులు చెబుతున్నారనుకుంటున్నారా?. అయితే వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను వివరించడానికి హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం జిల్లా ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న వినూత్న ప్రయత్నం ఇది. ట్రాఫిక్ నియమాలు పాటించమని ఎన్ని సార్లు చెప్పినా, ప్రచారాలు చేసినా, భారీ జరిమానాలు విధించినా వాహనదారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో పోలీసులు విసుగెత్తిపోయారు. దీంతో ఏదైన వెరైటీగా చేసయినా సరే ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని ఆలోచన మెదలెట్టారు గురుగ్రాం ట్రాఫిక్ పోలీసులు. దీంతో స్థానిక విద్యార్థులతో కలిసి ప్రజలకు ట్రాఫిక్ పాఠాలు చెప్పాలని నిశ్చయించుకున్నారు. దీనిలో భాగంగా దీపక్, అరుణ్‌లు గబ్బర్ సింగ్, సాంబ వేషధారణలో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపేవారికి క్లాస్ తీసుకుంటున్నారు. షోలే సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్‌లను ట్రాఫిక్ భాషలో చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ట్రాఫిక్ పోలీసులు, విద్యార్ధులు ప్రయత్నానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
రోడ్డెక్కిన గబ్బర్ సింగ్, సాంబ
-
నాకో లెక్కుంది!
‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అని ‘గబ్బర్‌సింగ్’లో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్. కథానాయిక రాధికా ఆప్టే ఇలా అనడంలేదు కానీ, ఇటీవల ఆమె లెక్కల గురించి మాట్లాడారు. ‘‘నేను ఆర్టిస్ట్ కావాలనుకోవడానికి ఓ లెక్కుంది’’ అన్నారు. రాధిక లెక్కల వెనక పెద్ద కథే ఉంది. అదేంటో తెలుసుకుందాం. ► నాకు చిన్నప్పట్నుంచీ ఆర్టిస్ట్ కావాలన్నదే ఆశయం. అందుకని ఎప్పుడూ నన్ను నేను ఓ హీరోయిన్‌గానే ఊహించుకునేదాన్ని. నా గ్రాండ్ మదర్ లెక్కల టీచర్. ఆవిడ 32 ఏళ్ల పాటు లెక్కల టీచర్‌గా చేశారు. మా ఫ్యామిలీలో విదేశాలు వెళ్లి చదువుకున్న మొదటి మహిళ ఆవిడే. ఇంట్లో ఒక జీనియస్ ఉంటే... వాళ్లంటే ఇష్టం ఏర్పడుతుంది. నాకు ఆవిడ అంటే చాలా ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం నన్ను లెక్కలు ఇష్టపడేలా చేసింది. నేను కూడా లెక్కల్లో ఫస్ట్. పెద్దయ్యాక ఏమవ్వాలో చిన్నప్పుడే ఓ లెక్క వేసుకున్నా. ఆ లెక్క ప్రకారం హీరోయిన్ అయ్యాను. లేకపోతే లెక్కల టీచర్ని అయ్యుండేదాన్నేమో. ► నేను పెరిగింది పుణేలో. ఒకవైపు చదువుకోవడంతో పాటు మరోవైపు కథక్ క్లాసులకి వెళ్లేదాన్ని. ఎనిమిదేళ్ల పాటు ఆ డ్యాన్స్ నేర్చుకున్నా. ఆ తర్వాత లండన్‌లో ఓ ఏడాది పాటు పాటలు–డ్యాన్స్ నేర్చుకున్నాను. ► నాకు యాక్టింగ్ అంటే ఎంత ఇష్టం అంటే.. కాలేజీకి వెళ్లినా క్లాసులకు హాజరయ్యేదాన్ని కాదు. ఎప్పుడూ ఏదో ఒక నాటకం ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. రాత్రంతా నిద్రపోయేదాన్ని కాదు. మా లెక్కల టీచర్.. అదేనండి నా గ్రాండ్ మదర్ కూడా సరిగ్గా నిద్రపోయేవారు కాదు. రాత్రంతా నాకు లెక్కలు నేర్పించేవారు. క్లాసులో అందరి స్టూడెంట్స్కన్నా నేను లెక్కల్లో సూపర్. ఎందుకంటే, ఆవిడ సిలబస్‌లో లేనివి కూడా నేర్పించేవారు. దాంతో నాకు లెక్కల్లో అన్ని ఫార్ములాలు వచ్చేసేవి. ► లెక్కలు బాగా చేసేవాళ్లను మేధావులంటారు. నేను కూడా ఆ టైపేనండి. నా మైండ్ చాలా షార్ప్. ఏ విషయంలో అయినా దాదాపు నేను అనుకున్న లెక్క తప్పదు. అందుకు ఓ ఉదాహరణ.. ఆర్టిస్ట్ అవ్వాలని చిన్నప్పుడు లెక్కేసుకున్నా. పెద్దయ్యాక నెరవేర్చేసుకున్నా. ► నటిగా నేనేం లెక్కేసుకున్నానంటే... ‘ఎలాంటి పాత్ర అయినా చేయాలి. కథ బాగుంటే గ్లామర్ అయినా డీ–గ్లామర్ క్యారెక్టర్ అయినా చేయాలి’ అనుకున్నా. అందుకు తగ్గట్టుగానే పాత్రలను సెలక్ట్ చేసుకుంటున్నా. నా సినిమాలు చూసినవాళ్లకు ఆ విషయం అర్థమయ్యే ఉంటుంది. ► నా గ్లామర్ క్యారెక్టర్స్ చూసి ‘రాధికా చాలా హాట్’ అని కొంతమంది నాకు బిరుదు ఇచ్చారు. నో ప్రాబ్లమ్. మన దేశంలో ఏ కథానాయికను అయినా ఇలానే అంటారు. కొంచెం గ్లామరస్‌గా నటించినా చాలు ఈ బిరుదు ఇచ్చేస్తారు. ► జీవితంపట్ల నా లెక్క ఏంటంటే.. మనం ఏం అనుకున్నామో అది పూర్తిగా చేయాలి. ఒకవేళ నేను ఆర్టిస్ట్ కాకుండా మా అమ్మానాన్నలా డాక్టర్ అయ్యుంటే ఆ వృత్తికి కూడా న్యాయం చేసేదాన్ని. ఏ ప్రొఫెషన్లో ఉంటే దానికి ఫుల్ న్యాయం చేయాలనేది నా ఫిలాసఫీ. -
ఈ సిద్దప్పనాయుడికి...ప్రజాసేవ అంటే కసి...కసి!
అవును మరి. సిద్దప్పనాయుడు అంటే మాటలు కాదు. 35 బెల్ట్‌షాపులకు ఓనరు. ఎమ్మెల్యే కావాలని సిన్సియర్‌గా ఫిక్సై పోయాడు. ఎందుకంటే...ఆయనకు పెజాసేవ అంటే కసి..కసి! తన శత్రువును ఉద్దేశించి... ‘వాడ్ని చంపాక తల ఒక్కటి తీసుకురా ఆ హెడ్డుకి వెయిటు ఎక్కువ’ అని నిప్పులు కక్కగలడు. శత్రువు తమ్ముడిని దగ్గరకు తీసి... ‘తమ్ముడూ... నువ్వు ఉండాల్సింది కాళ్ల దగ్గర కాదు... కౌగిళ్లలో’ అంటూ చాప కింద నీరులా కుట్రకు రచన చేయగలడు. ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో సిద్దప్పనాయుడిగా అభిమన్యుసింగ్ భయపెట్టాడు. భయపెడుతూ భయపెడుతూనే... నవ్వకుండానే నవ్వించాడు. కొంచెం వెనక్కి వెళితే... రామ్‌గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’లో ఈ అభిమన్యుసింగ్ బుక్కారెడ్డిగా వణుకు తెప్పిస్తాడు. బుక్కారెడ్డి ఎవరు? వర్మ గొంతుతోనే స్వయంగా విందాం... ‘‘అతడు రాజకీయ నాయకుడు కాదు. రాక్షస నాయకుడు. అతని గురించి విన్నవాళ్లెవరైనా సరే... ‘అసలు భూమ్మీద ఇలాంటి మనిషి ఉంటాడా!’ అని స్టన్ అయిపోతారు’’ ‘రక్తచరిత్రలో’ బుక్కారెడ్డి పాత్రను భయంకరంగా పండించి ‘ఉత్తమ విలన్’ అని వర్మ చేత అనిపించుకున్నాడు అభిమన్యు. ‘బుక్కారెడ్డి పాత్రకు సోల్ ఇచ్చావు’ అని మెచ్చుకున్నాడు వర్మ. ఇప్పుడంటే అభిమన్యుసింగ్ వయిలెంట్ విలనిజం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాంగానీ... ఒకప్పుడు? అక్కడికే వెళదాం. అభిమన్యుసింగ్ స్వస్థలం బిహార్‌రాజధాని పట్నా. ‘బాలీవుడ్’ కలలతో ముంబైకి చేరుకున్నాడు. నిర్మాతల ఆఫీసుల చుట్టూ బొంగరంలా తిరిగాడు. కొంచెం కూడా ఫలితం కనిపించలేదు. ‘థియేటర్’ రూట్ నుంచి వెళితే...ప్రయాణం కాస్త సులువవుతుంది అనుకొని మకరంద్ దేశ్‌పాండే థియేటర్ గ్రూప్ ‘అంశ్’లో చేరాడు. మొదటి రోజు... ‘‘నటన అంటే ఇదీ’’ అని చెప్పలేదు మకరంద్. ‘‘చీపురు అంటే ఇదీ’’ అన్నట్లుగా మూలకు ఉన్న చీపురును అభిమన్యుకు చూపి...ఫ్లోర్ ఊడ్చమన్నాడు. ‘నేను వచ్చింది నటన నేర్చుకోవడం కోసం. ఊడ్చడం కోసం కాదు’ అభిమన్యులో కోపం కెరటమై లేచింది. అయితే నటన మీద ప్రేమ... ఆ కోపాగ్నిపై నీళ్లు చల్లింది. అలా....చీపురుతో ఫ్లోర్ ఊడ్చాడు అభిమన్యు. ‘ఇగో మెల్టింగ్’ పూర్తయ్యాక... అభిమన్యుకు నటనలో ఓనమాలు దిద్దించాడు మకరంద్. ‘అంశ్’ థియేటర్ గ్రూప్‌లో కె.కె. మీనన్, అనురాగ్ కశ్యప్‌లు అభిమన్యుకు సీనియర్లు. ‘బాగా నటిస్తున్నాడు’ అని పేరైతే వచ్చిందిగానీ... సినిమాల్లో అవకాశాలేవీ రావడం లేదు. తన రూమ్‌లో ఒంటరిగా ఏడ్చిన రోజులెన్నో ఉన్నాయి. పట్నాలో ఉన్నప్పుడు నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నుంచి ఒకరోజు ఫోన్ వచ్చింది. కట్ చేస్తే... రాకేష్ మెహ్ర ‘అక్స్’లో పోలీస్ పాత్ర పోషించే అవకాశం దక్కింది. అయితే... ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర నిరాశపరచడంతో... అభిమన్యు కెరీర్‌కు ఉపయోగపడలేదు. మళ్లీ స్ట్రగుల్....‘లక్ష్య్’ ‘డోల్’ ‘జన్నత్’ సినిమాల్లో నటించాడుగానీ... కెరీర్ స్పీడ్ అందుకోలేదు. అయితే... ‘గులాల్’ సినిమాతో కెరీర్ టర్నింగ్ తీసుకుంది. ప్రముఖుల దృష్టిలో పడే అవకాశం వచ్చింది. ‘రక్తచరిత్ర’తో దక్షిణాది సినిమాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. చెడు పాత్రలను ‘ఎంత మంచిగా చేశాడు’ అనిపించుకోవడం అంత తేలికేమీకాదు... అందుకే అభిమన్యు సింగ్ ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నాడు. -
'గబ్బర్ సింగ్ కావాలి.. బెగ్గర్ సింగ్ కాదు'
హైదరాబాద్ : సినిమాల కన్నా వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల పవన్ ఏపీకి 'ప్రత్యేక హోదా' విషయంలో పోరాటం చేయాలని సీమాంధ్ర ప్రజల తరఫున ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ ఎంపీలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. పవన్ విన్నపాన్ని ఎద్దేవా చేస్తూ రామ్ గోపాల్ వర్మ మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. 'విజ్ఞప్తి కాదు.. డిమాండ్ చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది. ఫ్లాపైనా మాకు గబ్బర్ సింగ్ కావాలిగానీ.. బెగ్గర్ సింగ్ కాదు. అసలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాదు.. రియల్ స్టార్ కేటీఆర్' అంటూ ఘాటైన కామెంట్లు చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్‌కు, రామూకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజా కామెంట్లతో రామూ మరోసారి పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టినట్లయ్యింది. -
నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది...
సినిమా వెనుక స్టోరీ - 35 ఆ రోజు పవన్‌కల్యాణ్ ‘తమ్ముడు’ సినిమా రిలీజ్. మొత్తం కుర్ర బ్యాచ్. కల్యాణ్ కటౌట్‌కి పాలాభిషేకం చేస్తున్నాడు ఓ కుర్రాడు. పేరు హరీశ్ శంకర్. పవన్‌కు అరివీర భయంకర ఫ్యాన్. ఎప్పటికైనా కల్యాణ్‌ని కలిసి ఓ ఫొటోగ్రాఫు, ఓ ఆటోగ్రాఫూ తీసుకోవా లనేది అతగాడి డ్రీమ్. నెరవేరుతుందా? ‘షాక్’తో షాక్ తిన్నాడు హరీశ్ శంకర్. రవితేజ లాంటి హీరోతో అలాంటి డిజాస్టర్ తీసినందుకు ఇంకొకడైతే హర్ట్ అయ్యి ఇండస్ట్రీ నుంచి తిరిగెళ్లిపోతాడు. కానీ హరీశ్ జగమొండి. పోయినచోటే వెతుక్కోవాలనే కసిలో ఉన్నాడు. ఎక్కడ పని దొరికితే అక్కడ వాలిపోయేవాడు. పూరి జగన్నాథ్, నల్లమలుపు బుజ్జి కాంపౌండ్‌లో స్టోరీ సిట్టింగ్స్‌లో కూర్చునే వాడు. రవితేజకు అతనంటే గురి. ఫ్లాపిచ్చిన ప్రతివాడూ పనికిరానివాడని కాదుగా! హరీశ్‌కు ఇంకో చాన్స్ ఇచ్చే ఉద్దేశం ఉంది రవితేజకు. హరీశ్ కూడా రవితేజకు కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ‘ఆంజనేయులు’ షూటింగ్ స్పాట్కెళ్తే నిర్మాత బండ్ల గణేశ్ కలిశాడు. సింగిల్ సిట్టింగ్‌లోనే క్లోజ్ అయిపోయారిద్దరూ. హరీశ్ బ్యాడ్‌లక్. రవితేజ రెండు ప్రాజెక్టులు ఒప్పేసుకున్నాడు... ‘శంభో శివ శంభో’, కృష్ణవంశీతో ‘కందిరీగ’. బండ్ల గణేశ్ నుంచి ఫోన్. ‘‘అర్జంట్‌గా ‘నందగిరి హిల్స్’కు రా.’’ నందగిరి హిల్స్ అంటే పవన్‌కల్యాణ్ ఇల్లు ఉన్న ఏరియా. ఆగమేఘాల మీద ఇంటి ముందు వాలిపోయాడు. గేట్లు తెరుచుకున్నాయి. లోపల నుంచి మూడు కార్లు దుమ్ము రేపుకుంటూ బయటికి వెళ్లిపోయాయి. హరీశ్ అయోమయంగా చూస్తున్నాడు. గణేశ్‌కి కాల్ చేస్తే ‘‘నేను కల్యాణ్‌తో ఫామ్‌హౌస్‌కి వెళ్తున్నా, నువ్వు నా కారులో అక్కడికొచ్చేయ్. అదిరిపోయే కథ చెప్పాలి’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. హరీశ్‌కి విపరీతమైన టెన్షన్. కల్యాణ్‌కి ఏ కథ చెప్పాలి? ఎలా చెప్పాలి? మంచి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ చెబుదామా? ఇవే ఆలోచనలు. మళ్లీ గణేశ్ ఫోన్. ‘‘మంచి లవ్‌స్టోరీ ఉంటే... అదే చెప్పు.’’ ఇప్పటికిప్పుడు లవ్‌స్టోరీ ఎలా? ఓ బడ్డీకొట్టు దగ్గర కారు ఆపించాడు. సిగరెట్ ముట్టించి, గట్టిగా దమ్ము పీల్చాడు. రవి తేజ కోసం చేస్తున్న లైన్ చెప్పేద్దామా? కల్యాణ్ బాబుకి బావుంటుంది. అప్పటి కప్పుడు టైటిల్ కూడా అనేసుకున్నాడు ‘రొమాంటిక్ రిషి’. ఫామ్ హౌస్. కల్యాణ్ వర్కర్స్‌తో ఏదో మాట్లాడుతున్నాడు. పక్కనే బండ్ల గణేశ్. హరీశ్ అక్కడికెళ్లాడు. ‘‘ఈ రోజు నాకు మూడ్ సరిగ్గా లేదు. ఇంకోరోజు కథ వింటా’’ చెప్పాడు కల్యాణ్. ‘‘బాబూ! ఈ రోజు ఏకాదశి. మంచి రోజు. అతనికి సెంటిమెంట్స్ ఎక్కువ. ఒక అయిదు నిమిషాలైనా కథ వింటే..?’’ అని గణేశ్ తటపటాయిస్తూ చెప్పాడు. ‘‘ఓకే... మీ సెంటిమెంట్స్‌ని నేనెందుకు కాదనాలి’’ అని అక్కడే చెట్టు దగ్గర కూర్చున్నాడు పవన్‌కల్యాణ్. హరీశ్ కథ చెబుతున్నాడు. గంటం పావు గడిచింది. అప్పటికి ఇంటర్వెల్ దాకా చెప్పడం పూర్తయింది. హరీశ్ కథ చెబుతున్నంతసేపూ పగలబడి నవ్వుతూనే ఉన్నాడు కల్యాణ్. ‘‘ఇక చాలు’’ అన్నాడు. హరీశ్ టెన్షన్‌గా చూస్తున్నాడు. ‘‘వియ్ డూ దిస్ ఫిల్మ్’’ అని హరీశ్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి లేచాడు కల్యాణ్. కాస్సేపటి తర్వాత గణేశ్ వచ్చి హరీశ్‌ను హగ్ చేసుకుని కంగాట్స్ చెప్పాడు. హరీశ్ స్క్రిప్టు వర్క్ మొదలెట్టాడు. కల్యాణ్‌కు ఇంకా సెకండాఫ్ చెప్పాలి. ఛేంజెస్ చెప్పాలి. బెటర్మెంట్స్ చెప్పాలి. కానీ అక్కడేమో కల్యాణ్ ఫుల్ బిజీ. అపాయింట్మెంట్ కూడా దొరకని స్థితి. ఆ టైమ్‌లో ఓ న్యూస్. హిందీ సినిమా ‘లవ్ ఆజ్ కల్’ బేస్‌తో కల్యాణ్ ఓ సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. బండ్ల గణేశ్ ప్రొడ్యూసర్. త్రివిక్రమ్ స్క్రిప్టు రాస్తున్నాడు. డెరైక్టర్ ఎవరో తెలియదు. హరీశ్‌నే చేయమంటారని టాక్. కానీ జయంత్. సి.పరాన్జీ డెరైక్షన్‌లో ‘తీన్మార్’ మొదలెట్టారు కల్యాణ్. హరీశ్ పరిస్థితేంటి? కల్యాణ్ ప్రాజెక్ట్ కన్ఫ్యూజన్లో ఉన్న టైమ్‌లో రవితేజ నుంచి పిలుపు. అక్కడ ‘కందిరీగ’ ప్రాజెక్ట్ క్యాన్సిల్. హరీశ్ రెడీ అంటే ఇక్కడ సినిమా స్టార్ట్. కల్యాణ్ కోసం తీర్చిదిద్దిన ‘రొమాంటిక్ రిషి’ రవి తేజకు షిఫ్ట్. ‘‘మరీ క్లాస్ టైటిల్లా ఉంది. ‘మిరపకాయ్’ అని పెడదాం’’ రవితేజ సలహా. ఓకే. 2011 సంక్రాంతికొచ్చిన ఈ సినిమా హరీశ్ లైఫ్‌లో కొత్త క్రాంతి తీసుకొచ్చింది. వ్వాట్ నెక్స్ట్ హరీశ్? ఫిబ్రవరి 21... తన ఫేవరెట్ డెరైక్టర్ ఈవీవీ చనిపోవడంతో హరీశ్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆయన డెడ్ బాడీని కొంత దూరం మోసి, విషాద హృదయంతో ఇలా ఇంటికొచ్చాడో లేదో... అలా ఫోన్ మోగింది. పవన్ కాలింగ్. స్నానం చేసి ఆదరాబాదరాగా కల్యాణ్ ఇంటికెళ్లేసరికి ఫొటో సెషన్ జరుగుతోంది. కల్యాణ్ పోలీసాఫీసర్ గెటప్‌లో ఉన్నాడు. హరీశ్కేం అర్థం కాలేదు. ‘దబంగ్’ను తెలుగులో చేస్తున్నాం, సినిమా పేరు ‘గబ్బర్‌సింగ్’, డెరైక్టర్‌వి నువ్వే’’ చెప్పాడు కల్యాణ్ తాపీగా. ‘‘ఎంత రెమ్యునరేషన్ కావాలి?’’ కల్యాణ్ డెరైక్ట్ క్వశ్చన్. ప్రొడ్యూసర్ కూడా ఆయనే మరి. హరీశ్ మాత్రం డబ్బుల గురించి మాట్లాడటం లేదు. పూనకం వచ్చినవాడిలా ఉన్నాడతను. ‘‘దబంగ్కి జిరాక్స్‌లా దీన్ని తీయకూడదు సార్. మీ ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్పులూ చేర్పులూ, డైలాగ్స్ రాసే అవకాశమివ్వండి చాలు. అదే నాకు పెద్ద రెమ్యునరేషన్’’ చెప్పాడు నిజాయతీగా. కల్యాణ్ నవ్వుతూ అడ్వాన్స్ కవర్ అతని చేతికిచ్చాడు. నెక్స్ట్ మినిట్‌లో మీడియాకు న్యూస్ వెళ్లిపోయింది. హరీశ్ ఓ ఉన్మాదంలో ఉన్నాడు. గబ్బర్‌సింగ్ అంటే రెట్టమతంగా ఉండే పోలీసాఫీసర్. అతనా పేరెందుకు పెట్టు కున్నాడు లాంటి లాజిక్స్ మిస్ కాకుండా, కల్యాణ్‌ని మాస్ ఎలా చూడాలనుకుంటు న్నారో అలా స్క్రిప్ట్‌ని డిజైన్ చేసుకున్నాడు. కోల్‌కతాలో ‘పంజా’షూటింగ్ జరుగు తుంటే స్క్రిప్టు వినిపించడానికెళ్లాడు. కల్యాణ్ వెంటనే కనెక్టయిపోయాడు. టక టకా తన సజెషన్స్ చెప్పేశాడు. ‘‘పోలీస్ స్టేషన్లో రౌడీలతో అంత్యాక్షరి సీన్ పెడదాం. బాగా కామెడీ క్రియేట్ చేయొచ్చు. ‘పాడమంటే పాడేది పాట కాదు’ లాంటి మంచి మంచి పాటలు పెడదాం’’ అని హింట్ ఇచ్చాడు. ఓకే సార్ అన్నాడు హరీశ్. ‘గబ్బర్‌సింగ్’ స్టార్ట్. ప్రొడ్యూసర్ పవన్ కల్యాణ్ కాదు... బండ్ల గణేశ్. హీరో యిన్‌గా శ్రుతీహాసన్‌ను తీసుకుంటే? ఐరన్ లెగ్ అన్నారు చాలామంది. కల్యాణ్ మాత్రం ఆమెకే ఓటు. ఇంకెవరూ మాటా ్లడ్డానికి లేదు. 2011 డిసెంబర్ 4... మిట్ట మధ్యాహ్నం 12 గంటల 20 నిముషాలకు ఫస్ట్ షాట్ తీశారు. అవతల ‘పంజా’ డిజాస్టర్. ఫ్యాన్స్ నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. ‘గబ్బర్ సింగ్’ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని రకరకాల డౌట్లు. ఫ్యాన్స్‌కు ఓ భరోసా ఇవ్వాలంటే టీజర్ రిలీజ్ చేయాలి. ఇంకా ఓ షెడ్యూలు కూడా ఫినిష్ కాకుండా టీజర్ చేయడమంటే కష్టమే. హరీశ్కో ఐడియా వచ్చింది. కల్యాణ్‌తో ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పించి, టీజర్ రిలీజ్ చేయిస్తే? ఐడియా బాగుంది. డైలాగ్ కూడా బాగా వచ్చింది. ‘‘నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది’’... ఇదీ డైలాగ్. ఇబ్బంది పడుతూనే కల్యాణ్ దగ్గరకు వెళ్లాడు. డైలాగ్ చెప్పగానే కల్యాణ్ సంబరపడిపోయి, క్లాప్స్ కొట్టేశాడు. టీజర్ రెడీ. ఆ ఒక్క టీజర్‌తో ‘గబ్బర్‌సింగ్’ ఎలా ఉండబోతోందో ఆడియన్స్ స్మెల్ చేసేశారు. ‘దబంగ్’లోని ‘మున్నీ బద్నామ్’ తరహాలో ఐటమ్ సాంగ్ కావాలి. మిగతా పాటలన్నీ చిటికెలో చేసిచ్చేసిన మ్యూజిక్ డెరైక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఈ సాంగ్‌కి రాత్రింబవళ్లూ తలకొట్టుకుంటున్నాడు. దేవి ఫాదర్, రైటర్ సత్యమూర్తి ఆ టైమ్‌కి అక్కడే ఉన్నారు. ‘‘ఎందుకురా టెన్షన్. ‘కెవ్వు కేక’ అని మొదలుపెట్టు’’ అన్నా రాయన. దేవి చెలరేగిపోయాడు. ‘అంత్యాక్షరి’ ఎపిసోడ్ గురించి చాలా కసరత్తులే చేశారు. డెరైక్షన్ డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేసి 300 పాటలు సెలక్ట్ చేశారు. వాటిల్లోంచి కొన్ని ఎంచుకున్నారు. పోలీస్ స్టేషన్ సెట్లో రౌడీ గ్యాంగ్‌తో రోజంతా తీయాలని ప్లాన్ చేశారు. కట్ చేస్తే - 4 గంటల్లోనే అయిపోయింది. సినిమా మొత్తం చాలా స్మూత్‌గా జరిగి పోయింది. డబ్బింగ్ సెషన్ కూడా హ్యాపీనే. అంతా కంప్లీట్ అయ్యాక డబ్బింగ్ ఫ్లోర్‌కి దణ్ణం పెట్టి, ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అవనుంది. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. టేక్ కేర్’’ అన్నాడు కల్యాణ్. 2012 మే 11. ఎండ దెబ్బకు రాళ్లు సైతం పగిలిపోతున్నాయి. ఇక్కడ ‘గబ్బర్‌సింగ్’ దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర పాత రికార్డులన్నీ బద్దలైపోతున్నాయి. ఆ థియేటర్ దగ్గర ఫుల్ ప్యాక్డ్గా జనం. పవన్ కల్యాణ్ కటౌట్‌కి క్షీరాభిషేకం చేస్తున్నారు. పక్కనే హరీశ్ శంకర్ కటౌట్. దానికీ క్షీరాభిషేకం. ఇదంతా చూసి హరీశ్ శంకర్ కళ్లు చెమర్చాయి. అతనికి తన ఫ్లాష్‌బ్యాక్ గుర్తొచ్చింది. హిట్ డైలాగ్స్ * ‘‘నేను ఆయుధాలతో చంపను. వాయిదాలతో చంపుతా’’ అనే బ్రహ్మానందం డైలాగ్ రాసింది ఈ సినిమా కో-డెరైక్టర్ శంకరమంచి రాజశేఖర్. అందుకే టైటిల్స్‌లో ఆయన పేరు వేశారు. * నేను ఆయుధాలతో చంపను... వాయిదాలతో చంపుతా * నేను ఆకాశం లాంటోణ్ణి. ఉరు మొచ్చినా మెరుపొచ్చినా ఇలానే ఉంటాను ఠి నేను ట్రెండ్ ఫాలో అవ్వను... ట్రెండ్ సెట్ చేస్తా * కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు - పులగం చిన్నారాయణ -
వరుసగా లైన్లో పెడుతున్నాడు
యంగ్ హీరో నాగచైతన్య ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇప్పటికే గౌతం మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో సినిమాను పూర్తి చేసిన చైతన్య, ఆ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే సోగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడు. ఇలా మూడు సినిమాలతో బిజీగా ఉన్న చైతూ, ఇప్పుడు నాలుగో సినిమాను కూడా లైన్లో పెట్టే ఆలోచనలో ఉన్నాడట. గబ్బర్‌సింగ్ సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన హరీష్ శంకర్, ఇటీవల సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో మరోసారి కమర్షియల్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో హరీష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి చైతు ప్లాన్ చేసుకుంటున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సుబ్రమణ్యం ఫర్ సేల్ తరువాత ఇంత వరకు సినిమా ఎనౌన్స్ చేయని హరీష్ శంకర్, నాగచైతన్య ఇమేజ్ తగ్గ కథ కోసం ట్రై చేస్తున్నాడు. కరెక్ట్ లైన్ దొరికితే త్వరలోనే ఈ సినిమా ప్రాజెక్ట్ కూడా ఫైనల్ చేసి లైన్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు చైతు. -
సుకుమార్ బాటలో హరీష్
దర్శకుడిగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న సుకుమార్, కుమారి 21 ఎఫ్ సినిమాతో నిర్మాతగా మారి సూపర్ హిట్ సాధించాడు. యూత్‌ను ఆకట్టుకునే సినిమాలను తెరకెక్కించటంతో స్పెషలిస్ట్‌గా పేరున్న సుక్కు నిర్మాతగా కూడా అదే తరహా సినిమాతో అలరించాడు. తన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్‌ను దర్శకుడి పరిచయం చేసి మరిన్ని మార్కులు సాధించాడు. భవిష్యత్తులో ఇదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ సినిమాలు నిర్మించాలని భావిస్తున్నాడు సుక్కు. ఇప్పుడు ఇదే బాటలో నడవడానికి మరో దర్శకుడు రెడీ అవుతున్నాడు. గబ్బర్‌సింగ్ లాంటి భారీ బ్లాక్‌బస్టర్‌తో ఆకట్టుకున్న హరీష్ శంకర్ తరువాత రామయ్య వస్తావయ్య సినిమాతో నిరాశపరిచాడు. ఈ ఫెయిల్యూర్‌తో లాంగ్ గ్యాప్ తీసుకున్న హరీష్ ఇటీవలే సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. అదే జోష్‌లో ఇప్పుడు నిర్మాణ రంగం మీద దృష్టి పెడుతున్నాడు. అంతేకాదు నిర్మాతగా తన తొలి సినిమాను తనే డైరెక్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట హరీష్. -
సంక్రాంతి బరిలో కూడా 'సర్ధార్' లేనట్టేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ లో భారీ మాస్ పాలోయింగ్ ఉన్న స్టార్ హీరో.. వరుస సూపర్ హిట్స్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ సెట్ చేసిన పవర్ స్టార్ చాలా రోజులుగా షూటింగ్ లకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అత్తారింటింకి దారేది లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత గోపాల గోపాల మూవీలో స్పెషల్ క్యారెక్టర్ చేసిన పవన్ ఆ తరువాత చాలా కాలం పాటు ముఖానికి రంగు వేసుకోలేదు. మధ్యలో పొలిటికల్ టర్న్ తీసుకున్న పవన్ చాలా రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. గబ్బర్ సింగ్ సక్సెస్ తరువాత ఆ సినిమాకు సీక్వల్ ఉంటుందని ఎనౌన్స్ చేసిన పవన్... సంపత్ నందితో కలిసి కథ కథనాలను కూడా రెడీ చేశాడు. అయితే మధ్యలో ఏ సమస్య వచ్చిందో ఏమోగాని సంపత్ ను సీన్ నుంచి తప్పించి పవర్ ఫేం బాబీతో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అంతా రెడీగా ఉన్న పవన్ మాత్రం ఈ సినిమాను ఎప్పటికి పూర్తి చేస్తాడో అర్థం కావటం లేదు. నటీనటుల ఎంపిక కోసం నెలల తరబడి వెయిట్ చేయించిన పవర్ స్టార్ ఇంకా చాలా మంది ఎంపిక విషయంలో ఆలోచనలోనే ఉన్నాడు. దీనికి తోడు రెండు షెడ్యూల్లు పూర్తయినట్టుగా చెపుతున్నా అందులో పవన్ నటించిన సీన్స్ మాత్రం ఒకటి రెండుకు మించి లేవన్న టాక్ వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలోకి సర్ధార్ ను తీసుకురావటం కష్టంగానే కనిపిస్తుంది. -
అసలు గబ్బర్ సింగ్ పాత్ర నేను చేస్తానని అడిగా
షోలే సినిమా స్క్రిప్టు వినగానే.. అందులోని గబ్బర్ సింగ్ పాత్రను తాను చేయాలని అనుకున్నానని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చెప్పారు. రచయితలైన సలీం -జావేద్‌లకు తాను అదే విషయం చెప్పానని, కానీ దర్శకుడు రమేష్ సిప్పీ మాత్రం అందుకు ఒప్పుకోలేదని.. తనను 'జై' పాత్రకే ఎంపిక చేశారని అమితాబ్ అన్నారు. వాస్తవానికి గబ్బర్ సింగ్ పాత్రకు తొలుత డానీ డెంజోంగ్పాను అనుకున్నారని, కానీ డేట్స్ కుదరకపోవడంతో అమ్జాద్ ఖాన్‌ను తీసుకున్నారని చెప్పారు. అమ్జాద్‌ను ఆ పాత్రకు సలీం-జావేద్ సూచించారు. అత్యంత భయంకరమైన దోపిడీ దొంగ పాత్ర పోషించిన అమ్జాద్ ఖాన్.. ఆ తర్వాతి కాలంలో టాప్ క్లాస్ విలన్లలో ఒకరిగా మారిపోయారు. అసలు నిజానికి ఆయన ఆ పాత్రను సమర్ధంగా పోషించగలరా.. లేదా అనే అనుమానాలు చాలామందికే వచ్చాయి. కానీ, గబ్బర్ సింగ్ పాత్రలో అమ్జాద్ ఖాన్ పూర్తిస్థాయిలో జీవించారని, ప్రేక్షకులు కూడా భయపడేలా చేశారని బిగ్ బీ చరెప్పారు. తనకు మాత్రం అమ్జాద్ ఖాన్ ఆ పాత్ర చేయడంపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. తనను అమ్జాద్ ఖాన్ సరదాగా 'పొట్టోడా' అని పిలిచేవారని, తాను ఆయనను 'బండోడా' అని పిలిచేవాడినని కూడా తెలిపారు. -
అప్పుడే 40 ఏళ్లా!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) అప్పటి వరకు చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర లాంటి పుస్తకాల్లోని జానపద కథలు మాత్రమే తెలుసు... భేతాళుడి కథల్లో విక్రమార్కుడు చివర్లో చిక్కుముడి ఎలా విప్పుతాడో అనే ఆసక్తి మాత్రమే అందమైన అనుభూతి. అప్పుడప్పుడు ఆ పుస్తకాల్లోని నీతి కథలు మాత్రమే పరిచయం... ఒకటి రెండు సినిమాలు చూసినా అంతగా ప్రభావితం చెయలేదు. తొమ్మిదేళ్ల వయసులో ఏం గుర్తుంటాయి.. సినిమాలు తెలియవు.. ఫైట్లు అంతకన్నా తెలియవు. పాటలు తెలియవు... పాడటం అసలు రాదు..అలాంటి రోజుల్లో ఒక రోజు స్కూల్లో పక్కబెంచి క్లాస్ మేట్ నోట '' అరె ఓ సాంబా''.. ఏంటది వింతగా ఉంది.. తిట్టా, పొగడ్తా, కొత్త పలకరింతా.. 40 ఏళ్ల క్రితం మొదటిసారి విన్న కొత్త పదం... నాలుగు దశాబ్దాలుగా టీవీలో ఎప్పుడు వినిపించినా, కనిపించినా అతుక్కుపోయేంత దగ్గరితనం. అప్పుడు, ఇప్పుడు కూడా సినిమాలంటే పెద్ద ఆసక్తి లేదు. మూడు గంటలు అలా కళ్లప్పగించి చీకటి గదిలో బందీ కావడం ఎందుకో నచ్చదు. కానీ సాంబాకు మాత్రం ఆ మినహాయింపు..ఎందుకు? ఇద్దరు హీరోలు, ఒక ఊరి పెద్ద, ఒక విలన్.. కొన్ని ఫైట్లు, కొంత మెలోడ్రామా... కొంత హాస్యం.. కొంత సరదా.. మంచి స్నేహం.. విషాదం.. ఆహ్లాదం.. మూడు గంటలపాటు 'రామ్ గఢ్' కొండల్లో క్షణక్షణానికి ఎగిసే జ్వాల (షోలే అర్థం అదే కదా!) సినిమాలు అంటే ఒక సాఫ్ట్ హీరో, కన్నీళ్లు పెట్టే హీరోయిన్, నాలుగు పాటలు.. చివరికి శుభం కార్డ్... ఈ మూస ధోరణి నుంచి భారతదేశ సినిమాను ఒక కొత్త ప్లాట్ ఫాం మీద నిలబెట్టింది షోలే. హీరోలంటే సాఫ్ట్ గానే ఉండాలనే మూస ధోరణికి గుడ్ బై చెప్పి కథా నాయకుడికి కొత్త గెటప్ ఇచ్చింది. స్కూల్లో ఏ ఫంక్షన్ జరిగినా గబ్బర్ సింగ్ ప్రత్యక్షమవ్వాల్సిందే.. 'అబ్ గోలీ ఖావో' డైలాగ్ వినపడాల్సిందే. స్నేహానికి నిర్వచనం ... ఇంటికి వెళుతూ దోస్త్ భూజాల మీద చేతులు వేసి ' ఏ దోస్తీ హమ్ నహీ ఛోడేంగే' అంటూ నడిచిన కిలోమీటర్లు ఎన్నో.. మొన్నీ మధ్య చిన్నప్పటి దోస్తు ల డిన్నర్ పార్టీలో మళ్లీ పాడుకున్నాం... అప్పుడే 40 సంవత్సాలు అయిందన్న విషయం తెలియకుండానే..! 'ఏ హాథ్ నహీ.. ఫాంసీ కా ఫందా' అని ఠాకూర్ సాబ్ గర్జించిన ఫేషియల్ ఎక్స్ ప్రెషన్ మొదటిసారి చూసినపుడు రోమాలు నిక్కపొడుచుకున్నాయి... ఇప్పటికీ అదే ఫీలింగ్.. క్లైమాక్స్ లో గబ్బర్ సింగ్ మొహంపై నాడాలు ఉన్న షూతో ఠాకూర్ సాబ్ తొక్కుతున్న సీన్ లో థియేటర్లో మోగిన చప్పట్లు వినపడుతూనే ఉన్నాయి. పట్టుదల, ప్రతీకారం నేర్పింది కూడా షోలేనేమో. గలగల పారే సెలయేరు ఒకటి మౌనముద్ర వహిస్తే 'ఛోటీ బహూ' మాటల కన్నా ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షల్ని ఎలా కట్టిపడే యొచ్చో కూడా మొదటిసారి తెలిసింది ఆ మూడు గంటల్లోనే.. ఎన్ని ఇబ్బందులున్నా జీవితాన్ని సరదాగా ఎలా లాగేయొచ్చో నవ్వులు పంచుతూ ఆవిష్కరించిన వీరూ.. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా అపుడపుడు సెటైర్లతో 'తుమ్ హారా నామ్ క్యాహై బసంతీ' అని అమాయకంగా ప్రశ్నించే జయ్... స్నేహితున్ని కాపాడేందుకు ' బొమ్మా, బొరుసా'లో బొమ్మ మాత్రమే చూపించి ప్రాణాలర్పించిన అదే జయ్... ' హమ్ గావ్ వాలే' అంటూ అమాయకత్వాన్ని ప్రదర్శించిన బసంతీ.. 'చల్ ధన్నూ' అంటూ టాంగాతో పాటు మనల్ని దోచుకున్న దృశ్యం ... 'మహబూబా' పాటతో ఐటమ్ సాంగ్ కి కొత్త నిర్వచనం ఇచ్చిన హెలన్ 'ఆప్ కా నమక్ ఖాయా సర్దార్' అంటూ అమాయకంగా 'గోలీ' తిన్న కాలియా.. హమ్ అంగ్రేజ్ కే జమానే కా జైలర్ హై అంటూ డాంబికాలు పోయే జైలర్.. ఎన్నెన్ని పాత్రలు..ఎన్ని రంగుల కలబోత, ఎన్ని భావాల అల్లిక... గబ్బర్ సింగ్.. విలనీని కొత్త పుంతలు తొక్కించిన ఆ కరకు బూట్ల చప్పుడు.. ఎంతో నిదానంగా పొగాకు అరచేతిలో నలిపి నోట్లో వేసుకుని, అంతే నిదానంగా తుపాకి గురిపెట్టి ప్రాణాల్ని నలిపేసిన కర్కశత్వం.. థియేటర్ గోడలు ప్రతిధ్వనించే నవ్వు.. ఇంటికి వెళ్లాక కూడా అలా వెంటాడి వేటాడే చూపు... దేశంలో ఏ జైలుకు కూడా తనని 20 సంవత్సరాలు బంధించే సత్తా లేదనే అతిశయం.... పగ, ప్రతీకారం... చట్టాన్ని కాపాడిన వ్యక్తి... అదే చట్టాన్ని కాదని వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని.. డాకూని దొంగలతోనే పట్టుకోవాలనే ప్రయత్నం.. నడకలో, ఎక్స్ ప్రెషన్స్ లో ఠీవీ.. ఠాకూర్ అంటే ఇలాగే ఉంటారేమో అన్నంత పరిచయం... సలీం జావెద్ లు చిన్నగా అల్లుకున్న కథ భారతదేశ చలనచిత్ర చరిత్రలో వట వృక్షం అంత ఎదిగింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు 'షోలే' ఛాయలు కనిపించని సినిమాలు చాలా అరుదు. ఎక్కడో ఒక చోట ఒక పోలిక..ఎక్కడో కాపీ కొట్టిన ఛాయలు.. ఇప్పటితరం ప్రేక్షకుల్ని కూడా కట్టి పడేయగలిగిన సమకాలీనత. నటీనటుల పేర్లు అప్రస్తుతం.. 1975 ఆగస్టు 15న విడుదలైన తర్వాత నటీనటులు వారి పేర్లు వారే మరచిపోయేంతటి ప్రభావం వేసిన దృశ్యకావ్యం.. బహుశా ఇలాంటి అభిప్రాయమే నా తరంలో మెజారిటీ ప్రేక్షకులకి కలిగి ఉంటుంది. ఈ తరం ప్రేక్షకులకి కూడా.. ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల మంది షోలేను చూసి ఉంటారని ఒక అంచనా. రైల్వే స్టేషన్ లో మొదలైన సినిమా అదే రైల్వేస్టేషన్ లో ముగుస్తుంది... ఈ మధ్యలో మరచిపోలేని అనుభూతుల్ని మిగిల్చి... భారతదేశ సినిమా షోలేకు ముందు.. షోలే తర్వాత... నాకుమాత్రం సినిమా అంటే షోలే మాత్రమే... -ఎస్. గోపినాథ్ రెడ్డి -
'గబ్బర్‌సింగ్' గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్
హైదరాబాద్: రెండున్నర దశాబ్ధాల కింద హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దోపిడీలు, హత్యలతో ప్రజలు, పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేసిన గబ్బర్‌సింగ్ గ్యాంగ్ సభ్యుడొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 65 ఏళ్ల వయస్సులోనూ ఆ గ్యాంగ్ సభ్యుడు కొమిరె అంజయ్య ఇళ్లలో చోరీలకు పాల్పడుతుండగా రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ క్రైం డీసీపీ నవీన్‌కుమార్ తెలిపారు. రాజేంద్రనగర్‌లో నివాసం ఉండే కొమిరె అంజయ్య అలియాస్ వడ్డె అంజయ్య(65) గబ్బర్‌సింగ్ గ్యాంగ్‌లో పనిచేసి వయోభారం కారణంగా కొంతకాలం దోపిడీలకు దూరంగా ఉన్నాడు. మళ్లీ రెండేళ్లుగా రాజేంద్రనగర్ ప్రాంతంలో 14 చోట్ల చోరీలకు పాల్పడ్డాడు. అతనిపై నిఘా పెట్టిన పోలీసులు బుధవారం రాజేంద్రనగర్ ఎన్జీఆర్ఐ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని 560 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని రిమాండ్‌కు తరలించారు. సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు సొత్తును దగ్గర ఉంచుకున్న బంధువులు, కుటుంబ సభ్యుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి సమయంలో చోరీలకు పాల్పడడం ఇతని నైజం. ఆ గ్యాంగ్‌లో మిగతావారు..? 1980 నుంచి 1990 వరకు ఎనిమిది మంది ముఠా సభ్యులు గల గబ్బర్‌సింగ్ గ్యాంగ్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో దోపిడీలు, హత్యలకు పాల్పడింది. ప్రజలకు, పోలీసులకు వారి ఆగడాలు నిద్ర లేకుండా చేశాయి. కొమిరె అంజయ్య ఆ గ్యాంగ్‌లో ఒకడు. ముఠాకే చెందిన అతని సోదరుడు కొమిరె యాదయ్య, నర్సింహులు, రాములు, వేముల కిష్టయ్య, చనిపోగా వరికుప్పల కృష్ణ జైలులో ఉన్నాడు. మిగతా వారు కొమిరె చంద్రయ్య, కొమిరె జంగయ్య వృద్ధాప్యంతో బయటకు రావడం లేదు. -
సప్త చిత్రాల శ్రుతి
ప్రస్తుతం హీరోయిన్గా టాప్ గేర్‌లో పరుగులు తీస్తున్న నటి ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం శ్రుతి హాసన్. నటిగా తన స్థాయిని పెంచుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తానని, శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని ప్రకటించిన ఈ బ్యూటీ తన వ్యాఖ్యల్ని నిజం చేసుకునే పనిలో పడ్డారు. టాలీవుడ్లో గబ్బర్‌సింగ్, రేసు గుర్రం, ఎవడు లాంటి చిత్రాలతో విజయ పథంలో కొనసాగుతున్న శ్రుతి హాసన్ పూజై చిత్రంతో తమిళంలోనూ గెలుపు ఖాతాను తెరిచారు. దీంతో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్గా తన హవా సాగుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఈ మూడు భాషల్లో ఏడు చిత్రాలను చేస్తూ సహ హీరోయిన్లను అధిగమించారు. తమిళంలో విజయ్ సరసన శింబు దేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న పులి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మరో హీరోయిన్గా హన్సిక, ముఖ్య పాత్రలో శ్రీదేవి నటించడం విశేషం. తెలుగులో మహేష్ బాబు సరసన ఇప్పటికే ఓ చిత్రం చేస్తున్నారు. తాజాగా, నాగార్జునతో జత కట్టేందుకు సిద్ధం అవుతున్నారు. బాలీవుడ్లో ఈ అమ్మడు చేతిలో ఏకంగా 4 చిత్రాలు ఉన్నాయి. ఈ ఏడాది ఏడు చిత్రాలు విడుదల అవుతాయని శ్రుతి హాసన్ సంతోషంగా చెబుతున్నారు. నాగార్జున సరసన నటించనున్న చిత్రంలో మరో హీరోగా కార్తీ నటించనున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకోనున్న మల్టీ స్టారర్ చిత్రంగా పేర్కొంటున్నారు. ఇందులో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని శ్రుతి పేర్కొంటున్నారు. -
గబ్బర్‌సింగ్ 2కు రంగం సిద్ధం
-
గబ్బర్‌సింగ్ 2 కథనే.. రవితేజ హీరోగా..!
-
పాతిక రూపాయలిచ్చినా నటిస్తాను!
సంభాషణం: కామెడీని పండించడంలో శ్రీనుకి ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. అదే ఆయనను ఈ రోజు బిజీ ఆర్టిస్టును చేసింది. విక్రమార్కుడు, మిస్టర్ ఫర్ఫెక్ట్, గబ్బర్‌సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర చిత్రాల్లో తన విభిన్నమైన యాసతో, వైవిధ్య భరితమైన హావభావాలతో కడుపుబ్బ నవ్వించిన శ్రీను చెప్పిన విశేషాలివి... నటుడు అవ్వాలని అయ్యారా? అనుకోకుండా అయ్యారా? అది చెప్పాలంటే పెద్ద ఫ్లాష్‌బ్యాక్ చెప్పాలి. నేను ‘తగరపు వలస’లో పుట్టాను. హైదరాబాద్‌లో పెరిగాను. చిన్నప్పట్నుంచీ చదువు కంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీదే ఆసక్తి. ఓసారి నేను ఇంట్లో డ్యాన్స్ చేస్తుంటే అమ్మ చూసింది. ‘డ్యాన్స్ అంటే ఏమిటో చూపిస్తాను చూడు’ అంటూ క్లాసికల్ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. సాధారణ గృహిణిలా ఉండే అమ్మలో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోయాను. చిన్నప్పుడు కొన్నాళ్లపాటు నేర్చుకునే స్థోమత లేక వదిలేసిందట. దాంతో నేనైనా మంచి డ్యాన్సర్‌ని అవ్వాలనుకున్నాను. పెళ్లిళ్లకీ, ఫంక్షన్లకీ ప్రోగ్రాములివ్వసాగాను. అది చూసి నాన్నగారు, తన స్నేహితుడు శరత్‌బాబు (నటుడు) దగ్గర నా గురించి ప్రస్తావించారు. చదవడం లేదు, ఎప్పుడూ డ్యాన్సులవీ అంటాడు అని చెబితే... ఆయన నన్ను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేర్చమని సలహా ఇచ్చారు. నాన్న అది ఫాలో అయిపోయారు. నాన్న చెప్పింది నేను ఫాలో అయిపోయాను. అంటే మీకు ఆసక్తి లేకుండానే చేరారా? దాదాపు అంతే. అయితే అక్కడ చేరాక బాగా ఆసక్తి పెరిగింది. తర్వాత సత్యానంద్‌గారి దగ్గర శిక్షణకు చేరాను. అక్కడే నాకు ప్రభాస్ పరిచయమయ్యాడు. ఇద్దరం స్నేహితులమయ్యాం. తను చెప్పాడు, ‘నాతో ఉండు, పరిచయాలు పెరుగుతాయి, మెల్లగా మంచి అవకాశాలు వస్తాయి’ అని. దాంతో పదేళ్లపాటు ప్రభాస్ వెంటే ఉన్నాను. సర్వం చూశాను. అందుకేనా మిమ్మల్ని ‘ప్రభాస్ శ్రీను’ అంటారు? అవును. శ్రీను అనేది మామూలు పేరు కదా. ప్రభాస్ శ్రీను అంటే వెరైటీగా ఉంటుందని అలా కంటిన్యూ అయిపోయాను. నా ఫ్రెండ్స్ అంటూంటారు... ‘ఆడపిల్లకి పెళ్లయ్యాక ఇంటిపేరు మారుతుంది. కానీ ఇంటిపేరు మారిన మొట్టమొదటి మగాడివి నువ్వే’ అని. అంటే పదేళ్లపాటు అవకాశాలే రాలేదా? చిన్న చిన్న అవకాశాలు వస్తే చేశాను. ‘విక్రమార్కుడు’తో బ్రేక్ వచ్చింది. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత బిజీ అయిపోయాను. ఇంతమంది కమెడియన్స్ మధ్య ఎలా నిలబడగలుగుతున్నారు? మీ పళ్లు మెరిసిపోతాయి అంటూ బోలెడు పేస్ట్ కంపెనీలు ప్రకటనలిస్తాయి. కానీ ‘కాల్గేట్’ వాడే వాడు దాన్నే వాడతాడు. అలాగే ఎందరు నటులున్నా ఏ పాత్రకు పనికొచ్చే నటుడిని ఆ పాత్రకు తప్పక తీసుకుంటారు దర్శకులు. కాబట్టి నాకు తగ్గవి నాకే వస్తాయి. అయినా ఎవరి టాలెంట్ వారిది. ఒకరిలా అవ్వాలనుకుంటే అవ్వలేం. బ్రహ్మానందం గారినే తీసుకోండి. ఆయనలాంటివాడు మరొకడు లేడు, రాడు. ఆయన సరస్వతీ పుత్రులు. ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. కానీ ఆయన స్థాయికి చేరడం మాత్రం ఏ ఒక్కరికీ సాధ్యం కాదు. డ్రీమ్‌రోల్ ఏదైనా ఉందా? ‘ఇలాంటిది చేయాలి’ అనుకోను కానీ, ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలనుకుంటాను. చిన్నదా పెద్దదా, రెమ్యునరేషన్ ఎక్కువా తక్కువా అని చూడను. పాతిక రూపాయలిచ్చినా నటిస్తాను. నాన్నగారిలా ఏ కలెక్టరో అయ్యుంటే బాగుండేదని అనిపించలేదా? లేదు. ఒకప్పుడు నన్ను ఎర్రయ్యగారి అబ్బాయనేవారు. ఇప్పుడు నాన్నను సిద్ధప్ప శ్రీను (గబ్బర్‌సింగ్‌లో పాత్ర) వాళ్ల నాన్నగారు అంటున్నారట. మేం కొన్నాళ్లు నరసన్నపేటలో ఉన్నాం. ఆ ఊరి వినాయకుడి వల్లే మేమంతా బాగున్నామని నమ్ముతాం. అందుకే ఇరవై మూడేళ్లుగా అక్కడ యేటా వినాయక చవితి ఘనంగా చేస్తున్నాం. నాన్న బిజీగా ఉండటం వల్ల ఈ యేడు పండుగ ఎలా చేయాలా అని టెన్షన్ పడ్డారు. దాంతో నేనే కొన్ని లక్షలు ఖర్చుపెట్టి మొత్తం చేయించేశాను. పండక్కి వచ్చిన నాన్న రైలు దిగుతూనే వచ్చి నన్ను వాటేసుకుని ఏడ్చేశారు. ‘ఇంకేం కావాల్రా నాన్నా నాకు’ అన్నారు. ఓ కొడుకుగా అంతకంటే గొప్ప ఆనందం ఏముంటుంది నాకు! భవిష్యత్ ప్రణాళికలేంటి? పెద్దగా ఏం లేవు. నేనెప్పుడూ నా కూతురు సాయివర్ణిక గురించే ఆలోచిస్తుంటాను. నటించినా, వ్యాపారం చేసినా, మరింకేదైనా చేసినా... నా కూతురికి ఓ గొప్ప జీవితాన్నివ్వడమే నా జీవిత లక్ష్యం. తననూ మీ దారిలో నడిపిస్తారా? లేదు. వెంకటేష్గారిలా ఒక్కసారి ఇంటికి చేరిన తర్వాత మళ్లీ సినిమా వాతావరణం కనిపించకూడదు అనుకుంటాను నేను. నా కూతుర్ని కూడా ఇండస్ట్రీకి దూరంగానే ఉంచుతాను. ఒకవేళ తను అవుతానంటే? ఐస్‌క్రీమ్ తింటే జలుబు చేస్తుందని చెబుతాం. అయినా మారాం చేస్తే ఏం చేస్తాం! తనను నాకు నచ్చినట్టుగా పెంచుతాను. తనకి నచ్చినవీ ఇస్తాను. ఏం చేసినా కానీ... నాకైనా, నా భార్య విజయకైనా పాప సంతోషమే ముఖ్యం. (నవ్వుతూ) అయినా తనకిప్పుడు మూడున్నరేళ్లే. ఇవన్నీ ఆలోచించడానికి చాలా టైముంది. చూద్దాం ఏం జరుగుతుందో! - సమీర నేలపూడి -
లేడీ గబ్బర్‌సింగ్
పవన్‌కల్యాణ్ పోషించిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘గబ్బర్‌సింగ్’ పాత్రను హీరోయిన్ ఓరియెంటెడ్‌గా మలిస్తే ఎలా ఉంటుంది? దర్శకుడు సురేష్ గోస్వామి అదే చేశారు. ‘బుల్లెట్ రాణి’ పేరుతో ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రంలో ప్రియాంక కొఠారి లేడీ గబ్బర్‌సింగ్‌గా కనిపించనున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఎమ్మెస్ యూసఫ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘యాక్షన్ నేపథ్యంలో ఉండే మాస్ మసాలా ఎంటర్టైనర్ ఇది. శృంగార తార ఇమేజ్ కలిగిన ప్రియాంక ఇందులో రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తారు. గ్లామర్, యాక్షన్ల కలగలుపుగా ఆమె పాత్ర ఉంటుంది’’ అని చెప్పారు. ఇప్పటికి 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని, చివరిషెడ్యూలు త్వరలోనే మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గుణవంత్, యాక్షన్: డ్రాగన్ ప్రకాశ్. -
బుల్లెట్ రాణిగా వస్తున్న లేడీ గబ్బర్ సింగ్!
పవన్ కల్యాణ్ గబ్బర్‌సింగ్ స్ఫూర్తితో తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి 'బుల్లెట్ రాణి' చిత్రం రాబోతోంది. ఇది గబ్బర్ సింగ్ సినిమాకు మక్కీకి మక్కీ కాపీ కాదని, అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ నిషా కొఠారీ పాత్రను మాత్రం గబ్బర్ సింగ్‌లో పవర్ఫుల్ పోలీసు అధికారి పాత్రలో పవన్ కల్యాణ్ నటించిన తీరు స్ఫూర్తితోనే రూపొందించినట్లు ఈ చిత్ర దర్శకుడు సురేష్ గోస్వామి తెలిపారు. ఇందులో నిషా కొఠారీ కూడా పవర్ఫుల్ పోలీసు అధికారిణి పాత్రంలో నటిస్తోంది. తన సినిమాను గబ్బర్ సింగ్ ఫిమేల్ వెర్షన్ అంటే ఏమీ బాధపడను గానీ, అది మాత్రం కాపీ కాదని ఆయన చెప్పారు. నిషా పాత్రను మాత్రం పవన్ స్ఫూర్తితోనే రూపొందించామన్నారు. మహిళను బలమైన పోలీసు అధికారిణిగా చూపించేందుకే ప్రయత్నించామని ఆయన చెప్పారు. నిషా కొఠారీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు ఈ సినిమాతో మంచి ఇమేజ్ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిషా చాలా ప్రతిభావంతురాలైన నటి అని, ఇప్పుడు బుల్లెట్ రాణి సినిమాలో ఆమె చాలా విభిన్నంగా కనిపిస్తుందన్న నమ్మకం తనకుందని సురేష్ గోస్వామి అన్నారు. -
ఠాగూర్ లాంటి సినిమా తీస్తా
చాగల్లు, న్యూస్‌లైన్ : కష్టించి పనిచేసే వారికి చిత్ర పరిశ్రమలో తప్పక గుర్తింపు ఉంటుందని గబ్బర్‌సింగ్ చిత్ర డెరైక్టర్ హరీష్‌శంకర్ అన్నారు. చాగల్లులో తెలగా సంఘం వినాయకుడి ఆలయం వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సినిమా ప్రారంభించే ముందు చాగల్లు వినాయకుడి ఆలయంలో పూజ చేయడం అలవాటుగా మారిందన్నారు. త్వరలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా సినిమా ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఇది తన ఐదో చిత్రమని అన్నారు. దర్శకుడు వీవీ వినాయక్ సోదరుడు లాంటి వారని, సినీ రంగంలో తననెంతగానో ప్రోత్సహించారని చెప్పారు. ఠాగూర్ లాంటి సందేశాత్మక చిత్రాలను తీయడమే తన లక్ష్యమన్నారు. యువతను ఆకట్టుకునేలా చిత్రాలు తీస్తానని చెప్పారు. హరీష్ శంకర్‌ను మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్ర కుమార్, ఏఎంసీ డెరైక్టర్ జుట్టా కొండలరావు, జూనియర్ ఆర్టిస్టులు దొమ్మేటి సత్యనారాయణమూర్తి, జి.సూరిబాబు, పంగిడి వెంకట్రావు, కె.పుట్టయ్య దుశ్శాలువాతో సత్కరించారు. -
శ్రుతిపై టాలీవుడ్ గుర్రు?
నటి శ్రుతిహాసన్‌పై టాలీవుడ్ గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సంచలన నటిగా పేరొందిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. గబ్బర్‌సింగ్, ఎవడు, రేసుగుర్రం వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న శ్రుతిహాసన్ హిందీ, తమిళ చిత్రాల్లోను నటిస్తూ యమ బిజీగా ఉన్నారు. అందాలారబోతలోనూ ముందున్న ఈ ముద్దుగుమ్మ ఈ తరహా ఫోటోలతో కలకలం పుట్టిస్తున్నారు. డిడే అనే హిందీ చిత్రంలో వేశ్య పాత్రలో ఒలకపోసిన శృంగారం విమర్శకుల చేతికి పెద్ద పనే చెప్పింది. ఆ తరువాత ఎవడు అనే తెలుగు చిత్రంలో దుస్తుల విషయంలో చాలా పొదుపు పాటించి సంచలనం రేపారు. అయితే ఆ చిత్రంలోని ఆమె శృంగారభరిత చిత్రాలు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. ఈ సంఘటన శృతిహాసన్‌కు కాస్త ఎక్కువ ఆగ్రహాన్నే కలిగించింది. తన అనుమతి లేకుండా ఈ ఫొటోలను నెట్లో పొందుపరచారంటూ ఆ చిత్ర నిర్మాతపై ఫైర్ అయ్యారు. ఆ నిర్మాత ఆ ఫొటోలతో తనకెలాంటి సంబందం లేదంటూ వివరణ ఇచ్చారు. అయి నా శ్రుతి కోపం చల్లారలేదు. తన ఇమేజ్ను డామేజ్ చేయడానికి ప్రయత్నించిన వారిని ఊరికే వదలి పెట్టకూడదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని టాలీవుడ్‌లోని పదిమంది ఫొటోగ్రాఫర్లను విచారిస్తున్నారు. శ్రుతిహాసన్ సెక్సీగా నటించడం కొత్తేమీ కాదు. ఆమె తొలి చిత్రం లక్ (హిందీ) లోనే ఈత దుస్తులు ధరించి అందాలారబోతకు శ్రీకారం చుట్టారు. అలాంటిది పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? అంటూ టాలీవుడ్లో ఆమెపై వ్యతిరేకత వ్యక్తం అవుతోందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంలో కొందరు తెలుగు నిర్మాత మండలి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. -
పట్టిందల్లా బంగారమే!
మంచి రోజులు మొదలైతే... అవి కొన్నాళ్ల పాటు అలానే కొనసాగుతుంటాయి. ఆ సమయంలో పట్టిందల్లా బంగారమే. ప్రస్తుతం శ్రుతీహాసన్‌కి అదే జరుగుతోంది. రెండేళ్ల క్రితం ‘గబ్బర్‌సింగ్'తో మొదలైంది ఆమె హవా. గత ఏడాది ‘బలుపు', ‘డి-డే’, ఈ ఏడాది ప్రారంభంలో ‘ఎవడు'... ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు శ్రుతీహాసన్. ప్రస్తుతం ఈ పాలబుగ్గల వయ్యారి చేతినిండా సినిమాలే. ఈ నెల 11న ‘రేసుగుర్రం'తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారామె. సాధారణంగా హిందీ, తెలుగు, తమిళ చిత్ర సీమల్లో దేనినో ఒకదాన్ని నమ్ముకొని ముందుకెళ్తుంటారు హీరోయిన్లు. శ్రుతి మాత్రం అందుకు భిన్నం. సాధ్యమైనంతవరకూ అన్ని భాషల్నీ కవర్ చేస్తుంటారామె. బహుశా తండ్రి కమల్‌హాసన్ నుంచి అబ్బిన లక్షణం కావచ్చు. ప్రస్తుతం బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ‘వెల్కమ్ బ్యాక్’. జాన్ అబ్రహాం హీరో. ఇక రెండో సినిమా మన తెలుగు దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘గబ్బర్'. మురుగదాస్ ‘రమణ' చిత్రం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ కథానాయకుడు. ఇందులో శ్రుతి పాత్ర పేరు ‘దేవిక'. నటనకి ఆస్కారమున్న పాత్ర చేస్తున్నారామె. తప్పకుండా బాలీవుడ్లో తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని నమ్మకంతో ఉన్నారామె. అలాగే తమిళంలో కూడా ఈ మధ్య ఓ సినిమాకు పచ్చ జెండా ఊపారు. అదే... విశాల్ ‘పూజై'. యముడు, సింగం-2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన హరి ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో శ్రుతీది మాస్ అప్పీల్ ఉన్న పాత్ర అని సమాచారం. ఇక ‘రేసుగుర్రం' తర్వాత శ్రుతీహాసన్ నటించే తెలుగు సినిమా ఏంటి? అనే విషయాన్ని ఆరాతీస్తే... ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. మహేశ్, ‘మిర్చి' కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే కదా. ఆ సినిమాలో కథానాయికగా శ్రుతీహాసన్ ఎంపికయ్యారనేది ఫిలిమ్‌నగర్ సమాచారం. అలాగే... మణిరత్నం తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో కూడా శ్రుతీహాసనే కథానాయికట. ఈ జాబితాను బట్టి ఆమె ఇప్పుడు పట్టిందల్లా బంగారమేనని అర్థం చేసుకోవచ్చు. -
శృతిహాసన్‌కు ఝలక్ ఇచ్చిన బండ్ల గణేష్..?
-
శ్రుతిహాసన్ లక్కీ లేడీ!
శ్రుతిహాసన్ ఐరన్ లెగ్ అనేది ఒకప్పటి మాట. ‘గబ్బర్‌సింగ్’తో శ్రుతి ఫేట్ మొత్తం మారిపోయింది. టైమ్ కలిసొస్తే అన్నీ కుదురుతాయేమో. వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో పాటు శ్రుతిహాసన్ భారీ అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వేరే కథానాయికలకు వెళ్లాల్సిన అవకాశాలు శ్రుతి ఖాతాలో చేరడం విశేషం. ఉదాహరణకు హిందీ చిత్రాలు ‘వెల్కమ్ బ్యాక్’, ‘గబ్బర్’. జాన్ అబ్రహాం హీరోగా అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వెల్కమ్ బ్యాక్’. ఈ చిత్రంలో సోనాక్షీ సిన్హాని నాయికగా అనుకున్నారు కుదర్లేదు. ఆ తర్వాత అసిన్‌ని అనుకున్నారు. సెట్ కాలేదు. శ్రద్ధాకపూర్‌ని ఎంపిక చేయాలనుకుంటే, తను కూడా సెట్‌కాలేదు. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి శ్రుతిహాసన్‌కి ఈ అవకాశం వచ్చింది. ‘వెలకమ్’లాంటి విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక, మరో చిత్రం ‘గబ్బర్’ విషయానికొస్తే... క్రిష్ దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న చిత్రం ఇది. సూపర్ హిట్ మూవీ ‘రమణ’కి రీమేక్ ఇది. ఇదే చిత్రం తెలుగులో ‘ఠాగూర్’గా రీమేక్ అయ్యింది. హిందీలో అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. ముందుగా శ్రద్ధాకపూర్‌ని నాయికగా అనుకుంటే, కుదర్లేదట. దాంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం శ్రుతికి వచ్చింది. దాంతో ఈ ముద్దుగుమ్మను ‘లక్కీ లేడీ’ అంటున్నారు. -
మెగా కాంపౌండ్‌లో హరీష్ శంకర్
-
‘గబ్బర్‌సింగ్ 2’లో అసిన్?
మలయాళ సుందరి అసిన్ తెలుగు చిత్రాల్లో నటించడం మానేసి దాదాపు ఏడేళ్లయ్యింది. హిందీ ‘గజిని’ రీమేక్‌లో నటించడానికి అంగీకరించిన తర్వాత మెల్లిగా తమిళ సినిమాలకు కూడా దూరమయ్యారామె. అయితే, హిందీలో ఒకటీ రెండు సినిమాలు మినహా చేయడంలేదు కాబట్టి, ఇకనుంచి దక్షిణాది చిత్రాల్లో కూడా నటించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి ‘గబ్బర్‌సింగ్ 2’లో నటించే అవకాశం ఆమెను వరించింది. ఈ విషయాన్ని అసిన్ తన ట్విట్టర్లో స్వయంగా పేర్కొన్నారు. ఓ రెండు రోజుల క్రితమే ‘గబ్బర్‌సింగ్ 2’ యూనిట్ ఆమెను ఈ విషయమై సంప్రదించారట. అయితే, ఈ చిత్రానికి అసిన్ పచ్చజెండా ఊపిందీ లేనిదీ మాత్రం పేర్కొనలేదు. ప్రస్తుతం ఆమె హిందీలో ‘మేరీ అప్నే’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది మినహా అసిన్ చేతిలో వేరే సినిమాలు లేవు. పైగా పవన్‌కళ్యాణ్ సరసన సినిమా అంటే అది జాక్పాట్లాంటిదే. కాబట్టి, ఈ అవకాశాన్ని అసిన్ వదులుకోరనే భావించవచ్చు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం త్వరలోనే మొదలు కానుంది. గతంలో ఆమె పవన్‌కళ్యాణ్ సరసన ‘అన్నవరం’లో నటించిన విషయం తెలిసిందే. -
రాజీపడి బతకడం నా డిక్షనరీలోనే లేదు!
సంప్రదాయ కుటుంబం. పుటి ్టందీ, పెరిగిందీ... కల్చరల్ హబ్‌లో. వేదం చదివాడు. సంధ్యా వందనం ఆచరిస్తాడు. గాయత్రీ మంత్రం పఠిస్తాడు. ఇంట్లో... శ్రీశ్రీ, తిలక్, శ్రీపాద. బయట... నాటక పరిషత్తు. శుభ్రమైన వాక్కు, విద్వత్తు. మరేంటి?!! ఈ డాన్స్లేంటి? పంచ్ డైలాగులేంటి? బిల్డప్ షాట్లేంటి? అసలు హరీష్‌శంకర్ ... ఈ ఫీల్డులోకి రావడం ఏంటి? ఏం లేదు! హరీష్‌కు ఇండస్ట్రీ అంటే ప్రాణం. షాక్, మిరపకాయ్, గబ్బర్సింగ్రామయ్యా వస్తావయ్యా... అన్నీ ప్రాణం పెట్టి తీసినవే. అందుకే అవి హిట్టయినా, కాకున్నా... ప్రాణం మాత్రం మినిమం గ్యారెంటీ! నిన్నగాక మొన్న వచ్చి... పరిశ్రమను ఓ కుదుపు కుదిపాడు హరీష్. పరిశ్రమ కూడా అతడినేం తక్కువ కుదపలేదు! ఏమిటా కుదుపులు? చదవండి ఈ ‘తారాంతరంగం’. ఏంటి సార్... మీ కొత్త సినిమాల కబుర్లు? హరీష్‌శంకర్: మూడు కథలు రెడీగా ఉన్నాయి. అందులో రెండు మాస్ ఎంటర్టైనర్స్.. అవి ప్రేక్షకుల కోసం. మూడోది నా కోసం. ప్రయోగాత్మకం అన్నమాట. తెలిసో... తెలీకో మా దర్శకులందరం ఒకే తరహా సినిమాలు చేస్తున్నాం. అవే హీరో ఇంట్రడక్షన్సూ, అవే పంచ్ డైలాగులు, అవే డాన్సులు, ఆవే బిల్డప్ షాట్స్... హీరోలు మారుతున్నారంతే! ఈ ట్రెండ్‌ని బ్రేక్ చేయాలని ఉంది. బాలీవుడ్లో గొప్ప సినిమాలొస్తున్నాయి. రాజ్‌కుమార్ ఇరానీ ‘త్రీ ఇడియట్స్’ తీశారంటే.. ఆయన మేథాశక్తి అంత గొప్పది. ఆ స్థాయిలో ఆలోచించే శక్తిని ఆ దేవుడు నాకూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. త్వరలో నా నుంచి అంత గొప్ప సినిమా కాకపోయినా.. ఓ మంచి సినిమా మాత్రం వస్తుంది. అది కూడా లో బడ్జెట్లోనే. ‘రామయ్యా వస్తావయ్యా’తో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టుంది? హరీష్‌శంకర్: అది గొప్ప సినిమా అని నేను అనను. కచ్చితంగా ఫ్లాపే. అయితే.. ఆ సినిమాకు రావాల్సిన దానికంటే ఎక్కువగా బ్యాడ్ వచ్చింది. దానికీ నేను బాధపడటంలేదు. ఎందుకంటే.. ‘గబ్బర్‌సింగ్’కి నాకు రావాల్సిన దానికంటే.. ఎక్కువ పేరొచ్చింది. అంతటి సక్సెస్‌ని ఎంజాయ్ చేశాను కాబట్టి... ఈ ఫ్లాప్ బాధ్యతని కూడా తీసుకోవడానికి నేను బాధపడటంలేదు. ‘రామయ్యా...’ ముందు మీ చేతిలో మూడు సినిమాలున్నాయి. ‘రామయ్యా...’ ఫ్లాప్ తర్వాత ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కు తీసుకున్నారని టాక్. నిజమేనా? హరీష్‌శంకర్: ‘నా సినిమా సరిగ్గా ఆడలేదు కాబట్టి అడ్వాన్సు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని’ నేనే అన్నాను. ఓ నిర్మాత ‘ఇచ్చేయ్ బాబూ’ అన్నాడు... ఇచ్చేశాను. అది తప్పేం కాదే..! ‘గబ్బర్‌సింగ్’ హిట్ చూసి అడ్వాన్సులిచ్చారు. ‘రామయ్యా..’ ఫ్లాప్ అయ్యింది. నా ఫెయిల్యూర్ని గుర్తించి అడ్వాన్స్ వెనక్కు తీసుకున్నారు. ‘రామయ్యా వస్తావయ్యా’కు ఫస్ట్ అనుకున్న కథ ఇది కాదని, దిల్‌రాజు కథను మార్చారని టాక్? హరీష్‌శంకర్: అవి ఉట్టి మాటలండీ. నా సక్సెస్‌లో నేను ఎవరికైనా భాగం ఇస్తా. ఫెయిల్యూర్లో మాత్రం పూర్తి బాధ్యత నాదే. ఎవరికీ భాగం ఇవ్వను. తొలి చిత్రం ఫ్లాపవ్వడం వల్ల వచ్చిన పరిపక్వతా ఇది? హరీష్‌శంకర్: అయ్యుండొచ్చు. ‘షాక్’ టైమ్‌లో నేను టూ యంగ్. 26 ఏళ్ల కుర్రాణ్ణి. అందుకే తేలిగ్గా తేరుకోగలిగా. అయితే.. దర్శకునిగా నాకు ఆ సినిమా చెడ్డ పేరు మాత్రం తేలేదు. ‘వీడితో సినిమా చేయొచ్చు..’ అని నిర్మాతలకు ఓ నమ్మకం కుదిరేట్లు చేసిందా సినిమా. కానీ కమర్షియల్ సక్సెస్ కాలేదు కాబట్టి.. ఎంత బాగా తీసినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే, పరిశ్రమ సక్సెస్ వెనకే ఉంటుంది. ఏది ఏమైనా.. ‘షాక్’ ఫ్లాప్‌కి పూర్తి బాధ్యుణ్ణి నేనే. వర్మ కథకు నేను సరైన న్యాయం చేయలేకపోయాననే చెబుతా. ఆ సినిమా తర్వాత మరో సినిమా చేయడానికి నాకు నాలుగేళ్లు పట్టింది. ఈ నాలుగేళ్లలో మిమ్మల్ని ఎవరూ పిలవలేదా? హరీష్‌శంకర్: మధ్యలో ఓ పెద్దాయన నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఎవరో కాదు... ఫ్లాప్ డెరైక్టర్లకు పిలిచి మరీ అవకాశం ఇచ్చే పేషన్ ఉన్న నిర్మాత ఎమ్మెస్ రాజు. ఆయనకు ఓ కథ చెప్పాను. దానికి టైటిల్ ‘ఆట’ అని ఆయనే పెట్టారు. అయితే.. ఆ కథకు సంబంధించిన డిస్కషన్స్‌లో మా ఇద్దరికీ సెట్ అవ్వలేదు. తొలి సినిమాకు నేను కథకుణ్ణి ఎలాగూ కాదు. తర్వాత చేసే సినిమా అయినా.. సొంత కథతో అనుకున్నది అనుకున్నట్లు తీయాలని మనసులో గట్టిగా అనుకున్నాను. అందుకే అభిప్రాయాలు కలవక రాజుగారి సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత వేరే కథకు అదే టైటిల్‌ని పెట్టి వీఎన్ ఆదిత్యతో రాజుగారు సినిమా తీశారు. ఎమ్మెస్ రాజుగారితో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని తెలీగానే... నాకు వెంటనే వచ్చిన మరో పిలుపు పూరిజగన్నాథ్ నుంచి. ‘చిరంజీవిగారబ్బాయి చరణ్‌ని లాంచ్ చేస్తున్నాం. డిస్కషన్స్‌కి నువ్వూ ఉంటే బావుంటుంది’ అంటే.. వెళ్లి రైటర్‌గా జాయినయ్యా. ఒక సినిమాను డెరైక్ట్ చేసిన తర్వాత, మళ్లీ ఇంకో డెరైక్టర్ దగ్గర రైటర్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది నిజంగా నవ్వాలో ఏడ్వాలో తెలీని పరిస్థితి. ప్రారంభంలో నాకు ఇలాంటి ఫీలింగ్ కలిగినా.. సినిమా వర్క్ స్టార్ట్ అయ్యాక.. నాకు ఆ ఫీలింగే కలక్కుండా చూసుకున్నారు పూరి. షూటింగ్ జరుగుతున్నంతసేపూ నన్నూ ఒక దర్శకునిగానే ట్రీట్ చేశారు. పూరితో అసోసియేషన్ నచ్చి ‘బుజ్జిగాడు’ సినిమాక్కూడా కంటిన్యూ అయిపోయాను. ఆ టైమ్‌లో పూరి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. బేసిగ్గా పూరి మంచి రైటర్ కాబట్టి... మా లాంటివాళ్లకు ఆయన దగ్గర పెద్ద పని ఉండేది కాదు. పెయిడ్ హాలిడేలా ఉండేది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సజావుగా వెళ్లిపోతుండేది. ఓసారి ఉన్నట్టుండి ఎందుకో అనిపించింది.. ‘వచ్చిన పనిని మరిచిపోయి తిరుగుతున్నానా!’ అని. మళ్లీ సీరియస్‌గా ప్రయత్నాలు ప్రారంభించాను. ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్.. ఇలా తిరగని హీరో లేడు, కలవని నిర్మాత లేడు..! కానీ ఎక్కడా వర్కవుట్ అవ్వలేదు. మరి ‘మిరపకాయ్’ ఎలా సెట్ అయ్యింది? హరీష్‌శంకర్: ఆ విషయం చెప్పేముందు రవితేజ గురించి చెప్పాలి. ఒక ఫ్లాప్ దర్శకుని ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా ఇండస్ట్రీలో చాలామంది ఇష్టపడరు. కానీ రవితేజ.. ‘షాక్’ సినిమా ఫ్లాప్ అని తెలిసిన తొలిరోజే నన్ను పిలిచి.. ‘ఒక మంచి కథ చేసుకో.. ఇద్దరం కలిసి మళ్లీ చేద్దాం. ‘షాక్’ గురించి ఆలోచించొద్దు’ అని ధైర్యం చెప్పారు. ఆ క్షణాన నిజంగా ఉద్వేగానికి లోనయ్యాను. ఆయనైతే మంచితనంతో అంతటి ఫ్లాప్ తర్వాత కూడా ఆఫర్ ఇచ్చారు కానీ.. నాకైతే ఆయన్ను మళ్లీ కలవడానికి మొహం చెల్లలేదు. నాలుగేళ్లపాటు బయట హీరోలనే ట్రై చేశాను. కానీ ఆయన నన్ను వదల్లేదు. పిలిపించి మరీ ‘మిరపకాయ్’ అవకాశం ఇచ్చారు. రవితేజకి నేను తీర్చలేనంత రుణపడిపోయానండీ.. నాకు డెరైక్టర్‌గా జన్మనిచ్చింది రవితేజ, పునర్జన్మనిచ్చింది రవితేజ. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం రవితేజ. ఆయన లేకపోతే డెరైక్టర్‌గా నేను లేను. వ్యక్తిగతానికొద్దాం. మీకు పొగరు అంటారు నిజమా? హరీష్‌శంకర్: ఏదీ మనసులో దాచుకోలేను. మొహం మీదే అనేస్తుంటా. దానికి ‘పొగరు’ అని పేరు పెట్టారు. ‘షాక్’ టైమ్‌లోనే నాకీ బిరుదు వచ్చేసింది. అప్పట్లో మేం రిలీజ్ చేయకుండానే ‘షాక్’ స్టిల్స్ ఓ వెబ్సైట్లోకొచ్చేశాయి. మేం రిలీజ్ చేయకుండా మా స్టిల్స్‌ని బయటకు తేవడం ఏంటని వాళ్లమీద కేకలేసేశాను. సైట్లో ఉన్న మా స్టిల్స్‌ని డిలీట్ చేయించాను. మనం అంత చేస్తే.. వాళ్లెందుకు ఊరుకుంటారు! సినిమా ఎప్పుడు రిలీజవుతుందా.. అని కాచుక్కూర్చున్నారు. రిలీజైంది. సినిమా కు నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక రివ్యూ రూపంలో రెచ్చిపోయారు. ‘టీవీలో వచ్చే ‘నేరాలూ-ఘోరాలు’ కార్యక్రమాన్ని టికెట్ కొని చూడాలంటే ‘షాక్’ చూడండి’ అంటూ ఇష్టం వచ్చినట్లు రాసేశారు. చాలా బాధ పడ్డాను. ఆ రివ్యూని కట్ చేసుకొని దాచుకున్నాను కూడా. ఎప్పటికైనా సక్సెస్ కొట్టాలనే కసిని ఆ రివ్యూ నాలో పెంచింది. అలాంటి అనుభవం ఎదురైన తర్వాత కూడా.. మీడియాపై సెటైర్లు వేస్తారెందుకు? హరీష్‌శంకర్: నా తరఫున మీ ద్వారా... క్లారిటీగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. బ్యాడ్ ప్రొఫెషన్ ఏదీ ఉండదండీ.. బ్యాడ్ పీపుల్ అన్ని ప్రొఫెషన్సులోనూ ఉంటారు. ఓ ఆటోడ్రైవర్ ప్యాసింజర్‌ను మోసం చేస్తే, ఆటోడ్రైవర్లందరూ మోసగాళ్లు కాదు. ఓ చెడ్డవాడు ఆటోడ్రైవర్ అయ్యాడన్నమాట. ఓ బస్ కండెక్టర్ లేడీస్ విషయంలో తప్పుగా బిహేవ్ చేస్తే... ఆ వృత్తిని మనం నిందించకూడదు. చెడ్డవాడు కండక్టర్ అయ్యాడన్న విషయం గుర్తుంచుకోవాలి. నేను మీడియాను ఎప్పుడూ తప్పుపట్టను. నా దృష్టిలో అది గౌరవనీయమైన, బాధ్యతాయుతమైన వృత్తి. ఐ రెస్పెక్ట్ మీడియా ఎలాట్. కేవలం కొన్ని కొన్ని వెబ్సైట్ల గురించి నేను మాట్లాడి న దాన్ని అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు. కానీ మీరన్న మాట మీడియా మొత్తానికీ వర్తిస్తుందని కొందరి అభిప్రాయం... హరీష్‌శంకర్: యద్భావం తద్భవతి... మనం ఎదుటివారిని ఏ దృష్టితో చూస్తే... వాళ్లు మనకు అదే దృష్టిలో కనిపిస్తారు. మనం కావాలి అనుకున్నవారు, మనపై మంచి అభిప్రాయం ఉన్నవారు, మనలో ఎన్ని లోపాలున్నా పట్టించుకోరు. మనల్ని ఏకేయాలనుకున్నప్పుడు మన మంచిని కూడా తప్పుగానే చూపిస్తారు. హరీష్ అనేవాడు మీడియాపై విరుచుకుపడుతున్నాడు అనే దృష్టితో సైట్ ఓపెన్ చేస్తే.. కచ్చితంగా నేను వాళ్లకు తప్పుగానే కనిపిస్తా. మనుషుల జీవితాలు ఎఫెక్ట్ అయ్యే స్థాయిలో గాసిప్పులు రాయకూడదు. అవి చదివి ఇంట్లో వాళ్లు ఆందోళనకు గురైతే? ‘గబ్బర్‌సింగ్’లో ఓ డైలాగ్ ఉంది. ‘మనకున్న తిక్క అవ్వచ్చూ... కోపం అవ్వచ్చూ... మూర్ఖత్యం అవ్వచ్చూ... తెగింపు అవ్వచ్చు... ఏదైనా అది మనల్ని ముందుకు తీసుకెళుతుందా, లేక వెనక్కి లాగుతుందా అని ఆలోచించాలి’ అని. నాకున్న ఎగ్రెసివ్‌నెస్ వల్ల నాకు జరిగిన నష్టం ఏమీ లేదు. ఇన్‌ఫ్యాక్ట్ నేను చాలా త్వరగా డెరైక్టర్ అయ్యాను. నేను చాలా స్పీడ్‌గా సినిమాలు తీస్తాను. నా క్వాలిటీ నాకు మైనస్ అవుతుందంటే... డెఫినెట్‌గా మార్చుకుంటా. ట్విట్టర్లో కూడా మీకు వ్యతిరేకంగా ఎవరైనా ట్వీట్ చేస్తే... మీరు స్పందించే తీరు చాలా ఘాటుగా ఉంటుంది. ఒక స్టార్ డెరైక్టర్‌గా అలా స్పందించడం కరక్టే అంటారా? హరీష్‌శంకర్: నా ట్వీట్స్ చూడండి. సాధ్యమైనంతవరకూ ఆనెస్ట్గానే ఉంటాయి. ఒక డెరైక్టర్‌గా నా సినిమాకు సంబంధించిన కరెక్ట్ ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవాలనే నేను ట్విట్టర్‌ని ఫాలో అవుతాను. కానీ కొంతమంది ట్వీట్స్ మన సహనాన్ని పరీక్షిస్తుంటాయి. విమర్శకు ఓ పద్ధతి ఉందండీ.. నా వర్క్‌ని ఎంత విమర్శించినా నేను బాధ పడను. కానీ వ్యక్తిగత విమర్శలకు దిగితే మాత్రం క్షమించను. ‘నీకంత లేదురా...’ అని ట్వీట్ చేయడాలు, వల్గర్ కామెంట్స్ పోస్ట్ చేయడాలు కరెక్ట్ కాదు. అలాంటివి చేస్తే.. అంతే తీవ్రంగా స్పందిస్తున్నాను. ఇకముందు కూడా అలాగే స్పందిస్తాను. ఈ మధ్య మీపై కొన్ని రూమర్లు కూడా వచ్చాయి కదా... హరీష్‌శంకర్: ముసుగులో గుద్దులాట అనవసరం. చార్మి గురించేగా మీరు మాట్లాడుతోంది. ఆ రూమర్ ఎలా పుట్టిందో నాకిప్పటికీ అర్థం కాని విషయం. దీని గురించి అడుగుదామని చార్మీకి ఫోన్ చేశాను. ఆ అమ్మాయి లోకల్లో లేకపోవటంతో ఫోన్ కలవలేదు. తర్వాత తానే.. అందులో నిజం లేదని ట్వీట్ చేసింది. నిజానికి తాను ట్వీట్ చేసేంత వరకూ ఈ విషయంపై చాలా బాధపడ్డాను. ఓ వారం రోజుల పాటు తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాను. తర్వాత మేమిద్దరం కలుసుకొని మాట్లాడుకున్నాం కూడా. ఏదో పార్టీలో ఈ సంఘటన జరిగిందని వార్తలొచ్చాయి. అసలేం జరిగింది? హరీష్‌శంకర్: ఓ పార్టీకి అందరం వెళ్లాం. దాన్ని బేస్ చేసుకొని ఓ వెబ్సైట్లో కథ అల్లేశారు. ఈ గాసిప్... హల్చల్ చేస్తున్న టైమ్‌లోనే ఓ ఇంగ్లిష్ పత్రికావిలేఖరి ఫోన్‌చేసి వివరణ అడిగాడు. ‘ఇది ఎలా పుట్టిందో నాకూ అర్థం కావడం లేదండీ... నేను మిమ్మల్ని కలిసి పూర్తి వివరణ ఇస్తాను’ అని చెప్పాను. కానీ అతను ‘నిప్పు లేకుండా పొగ రాదు కదా’ అన్నాడు. నాకు మామూలుగానే టెంపర్ ఎక్కువ. ‘అది నిప్పు విషయంలోనే కానీ, మనిషి విషయంలో కాదు. అసలు నీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు’ అని ఘాటుగా చెప్పా. పొద్దున్నే పేపర్ చూస్తే.. దీని గురించి ఇంతపెద్ద ఆర్టికల్ ఉంది. నేను షాక్. ప్రెస్‌మీట్ పెడదామనుకున్నా. ‘అది ఇంగ్లిష్ పేపర్. ఎంతమంది చదువుతారు? ప్రెస్‌మీట్ పెట్టి ప్రపంచం మొత్తం తెలియజేయడం దేనికి?’ అని ఓ పాత్రికేయ మిత్రుడు అనడంతో.. ఆ ఆలోచనను విరమించా. ఇన్ని చూశారు కదా.. ఇకనైనా లౌక్యంగా ఉండొచ్చుగా? హరీష్‌శంకర్: ‘ఆకలిరాజ్యం’లో కమల్‌హాసన్ అంటారు. ‘ఎలాగోలా బతకాలనుకుంటే ఎలాగైనా బతకొచ్చు. ఇలాగే బతకాలి అనుకున్నాను కాబట్టే ఇన్ని కష్టాలు’ అని. నా పద్ధతీ అంతే. ఎవరికోసమో నేను మారను. ‘షాక్’ తర్వాత గ్యాప్ రావడంతో స్టోరీ సిట్టింగ్స్‌కి వెళ్లేవాణ్ణి. ఓ సినిమా స్టోరీ సిట్టింగ్ గోవాలో పెట్టారు. నాకు ఫ్లైట్ టికెట్ తీశారు. నాతో పాటు సిట్టింగ్‌లో కూర్చునే ఇంకో రైటర్‌కి బస్ టికెట్ తీశారు. మేమిద్దరం కథ గురించి డిస్కస్ చేసుకుంటూ గోవా వెళదాం అనుకున్నాం. కానీ ఇద్దరిదీ తలోదారి అయ్యింది. దాంతో నిర్మాతతో గొడవ పెట్టుకున్నా. ‘నేను డెరైక్టర్‌గా వెళుతున్నప్పుడు నువ్వు నాకు ఫ్లైట్ టికెట్ తీయ్ కాదనను. కానీ ఇప్పుడు నేను ఓ రైటర్‌గా వెళుతున్నాను. తను, నేను ఇద్దరం ఈ సినిమాకు రైటర్లమే. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనుకుంటే ఇద్దరికీ బస్ టికెట్టే తీయండి. అంతేకానీ.. నాకు ఫ్లైట్... ఆయనకు బస్ టికెట్ తీస్తే.. ఈ అసమానతల కారణంగా కలిసి ప్రశాంతంగా ఎలా పని చేయగలం’అని నిర్మొహమాటంగా చెప్పా. ఆ ప్రొడ్యూసర్ కూడా నా బాధ అర్థం చేసుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చాకే కాదు. చిన్నప్పట్నుంచీ నేనింతే. రాజీ పడి బతక్కపోతే ఇండస్ట్రీలో ఎదగలేం అంటారు. మీరేమో అందుకు భిన్నంగా ఉన్నారు? హరీష్‌శంకర్: చూడండీ... సినిమా ఇండస్ట్రీకి రావాలని చాలామందికి ఉంటుంది. కానీ లైఫ్‌తో రాజీపడిపోయి ఆ కోరికను చంపుకుంటారు. రకరకాల బరువుబాధ్యతలు వాళ్లను ధైర్యంగా ముందుకు వెళ్లనీయవు. అద్భుతమైన టాలెంట్ ఉండి కూడా తెరవెనుకే మిగిలిపోతారు. కానీ నేను అలాకాదు. లైఫ్‌తో కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం లేక... ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్లీ రాజీపడమంటే ఎలా చెప్పండి. దానికి నేను అస్సలు ఒప్పుకోను. చిన్నప్పట్నుంచీ మీరింతేనా? హరీష్‌శంకర్: ఇంతే... ఈ రాముడు మంచి బాలుడూ కాదు. అలాగని చెడ్డబాలుడూ కాదు. మీ కుటుంబ నేపథ్యం తెలుసుకోవాలనుంది..? హరీష్‌శంకర్: నేను పుట్టిందీ పెరిగిందీ అంతా హైదరాబాద్ బీహెచ్ఈఎల్లోనే. 10వ తరగతి మాత్రం జగిత్యాలలో చదివాను. మా నాన్నగారు తెలుగు మాస్టర్. అష్టావధాని కూడా. అమ్మ హౌస్‌వైఫ్. నేను ఇంటికి పెద్దకొడుకుని. తమ్ముడు ప్రస్తుతం జాబ్‌లో ఉన్నాడు. చెల్లికి పెళ్లయ్యింది. బావకు యూఎస్‌లో జాబ్. మా నాన్న నాకిచ్చిన ఆస్తి ఒక్కటే.. తెలుగుభాష. అందరూ నన్ను ఇంగ్లిష్ మీడియంలో జాయిన్ చేయమని చెబుతున్నా.. నాన్నమాత్రం తెలుగు మీడియంలోనే చేర్చారు. నేను అదృష్టవంతుణ్ణి అయ్యింది అక్కడే. నాన్నగారు నా అంత స్పీడ్కాదు. చాలా నెమ్మదస్థుడు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది కదా... ఓ స్థలం కొనేద్దాం అనే తెలివితేటలు కూడా ఆయనకు ఉండేవి కావు. అప్పుడప్పుడు నేను తెలీనితనంతో అంటుండేవాణ్ణి.. ‘ఏమిచ్చారు మీరు మాకు’ అని. ఇప్పుడు నేను డెరైక్టర్ అయ్యాక తెలిసింది ఆయన నాకు ఏమిచ్చారో. మీ నాన్న నుంచి మీరేం నేర్చుకున్నారు? హరీష్‌శంకర్: నాకు ఆయన తండ్రి మాత్రమే కాదు. గురువు కూడా. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయనే. స్కూల్లో నేను మంచి స్టూడెంట్‌ని. టెన్త్ వరకూ క్లాస్ ఫస్ట్ వచ్చేవాణ్ణి. ఇంటర్‌కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్నయ్యాను. నా చదువుపై మా నాన్నకు పూర్తి నమ్మకం. మా నాన్న తెలుగు టీచర్ అవడంతో... స్కూల్ అయ్యాక ఆయనకు పెద్ద పనుండేది కాదు. మ్యాథ్య్, సైన్స్ చెప్పే టీచర్లు మాత్రం సాయంత్రం పూట ట్యూషన్లు చెప్పుకుంటూ చేతినిండా సంపాదించేవారు. అందుకే మా నాన్నకు పెద్ద కోరిక ఉండేది. ఎలాగైనా నా కొడుకుని మ్యాథ్స్ టీచర్నో లేక సైన్స్ టీచర్నో చేయాలి అని. కాలేజ్ అయ్యాక అప్పుడు మేం కూడా ఇంట్లో ట్యూషన్లు చెప్పుకోవచ్చు అనేది ఆయన ఆశ. మేం ఆర్థిక బాధలు పడకూడదని, మాకు ఏ లోటు కలగకూడదని ఓ వైపు టీచర్‌గా చేస్తూ, మరోవైపు నాన్న పౌరోహిత్యం కూడా చేసేవారు. నాకు బాధ అనిపించేది. ‘దేనికి బాధ.. పౌరోహిత్యం అంటే పదిమంది హితం కోరడం’ అని నాన్న నాకు సర్ది చెప్పేవారు. నాకు గాయత్రీ మంత్రోపదేశం చేశారు కాబట్టి సంధ్యావందనం వచ్చు. ఇదిగాక వేదపఠనం నేర్పారు. మీరు సాహిత్యాభిలాషి, రచయిత అని విన్నాం. సాహిత్యాభిమానం ఎలా మొదలైంది మీకు? హరీష్‌శంకర్: నాకు సమ్మర్ ఎలర్జీ ఉండేది. ఎండలు ఎక్కువగా ఉంటే ముక్కులోంచి బ్లీడింగ్ అవుతుండేది. దాంతో సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంట్లో అందరికీ టెన్షన్. పైగా నేను చిన్నప్పట్నుంచీ బాగా హైపర్. ఒకచోట ఉండేవాణ్ణికాదు. దాంతో నాన్న నన్ను బయటకు వెళ్లనీయకుండా... చిన్నప్పట్నుంచీ మధుబాబు డిటెక్టివ్ నవలలు తీసుకొచ్చి చదవమనేవారు. వాటిల్లో పడైనా బయటకు వెళ్లకుండా ఉంటాడని నాన్న ఆలోచన. అలా పుస్తకాలు చదవడం అలవాటైంది. నైన్త్క్లాస్కి వచ్చేసరికే యండమూరి, మల్లాది నవలలు ఆల్మోస్ట్ నమిలేశా. తర్వాత చలం, తిలక్, శ్రీశ్రీ, శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి, అడవిబాపిరాజు... ఇలా మహామహుల రచనలన్నింటినీ చదివేశా. ఓ విధంగా చెప్పాలంటే మా ఇల్లే ఓ లైబ్రరీ. ఈ రోజున నేను రాయగలిగున్నానంటే... కారణం ఆ పుస్తకాలే. సరే... డెరైక్టర్ అవాలనే ఆలోచన ఎలా మొదలైంది? హరీష్‌శంకర్: బీహెచ్ఈఎల్ అంటే... అదొక కల్చరల్ హబ్. పరిషత్తు నాటకాలకు పెట్టింది పేరు. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే పరిషత్ నాటకాల్లోకి ఎంటరయ్యా. నాయుడు గోపి, మిశ్రో మాకు హీరోలు. వారి నాటకం అంటే.. స్టేజ్ డెకరేషన్ నుంచి ‘పరబ్రహ్మ...’ పాడేంత వరకూ వారితోనే ఉండేవాణ్ణి. చాలా నాటకాల్లో బాలనటుడిగా నటించాను. తర్వాత మా గురువు మోహన్రావుగారు నాటకాన్ని డెరైక్ట్ చేస్తుంటే... ఆయనకు సహాయకునిగా ఉండేవాణ్ణి. అలా నాటకరంగంలో అసిస్టెంట్‌గా నా దర్శక ప్రస్థానం మొదలైంది. అయిదొందలు ఇస్తామంటే... వారం రోజులు కష్టపడి రిహార్సల్స్ చేసి దూరదర్శన్‌లో డ్రామాలు వేసేవాళ్లం. ఆ అనుభవమే నన్ను సినిమాలవైపు నడిపించింది. ఫస్ట్ ఎవర్ని కలిశారు? హరీష్‌శంకర్: ఈవీవీ గారిని. ఆయన రైటర్లను బాగా ఎంకరేజ్ చేస్తారు. ‘రచనా సహకారం’ అని ఓ పదిమంది రైటర్ల పేరు టైటిల్స్‌లో వేస్తారు. అందులో ఒకడిగా జాయిన్ అయితే చాలని తిరిగాను. అవకాశం రాలేదు. తొలిసారి ఎవరిదగ్గర పనిచేశారు? హరీష్‌శంకర్: పర్టిక్యులర్‌గా ఒకరి దగ్గర అని లేదు. చాలామంది దగ్గర ఘోస్ట్‌గా చేశా. అయితే.. కెరీర్ ప్రారంభంలో నన్ను ఎంకరైజ్ చేసిన వ్యక్తుల్లో ఇద్దరి పేర్లు మాత్రం కచ్చితంగా చెప్పాలి. వారే దుర్గా ఆర్ట్స్ ఎస్.గోపాల్‌రెడ్డి, కె.ఎల్.నారాయణ. వారి తర్వాత రవిరాజా పినిశెట్టి. ఆయన ‘వీడే’ సినిమాకు పనిచేశా. అప్పుడే ‘నేనూ ఓ సినిమాకు డెరైక్ట్ చేయొచ్చు’ అనే నమ్మకం ఏర్పడింది. మరి రామ్‌గోపాల్‌వర్మతో పరిచయం ఎలా? హరీష్‌శంకర్: దానికి కారణం రవితేజగారు. ‘నా ఆటోగ్రాఫ్’ టైమ్‌లో ఆయనకు ఓ కథ చెప్పాను. అది ఆయనకు నచ్చేసి డవలప్ చేయమన్నారు. ఈ లోపు వర్మగారు హిందీ, తెలుగు భాషల్లో ‘షాక్’ ప్రాజెక్ట్‌ని లైన్లో పెట్టారు. ‘ఢర్నా మనాహై’ఫేం ప్రవాల్రామన్ డెరైక్టర్. తెలుగు వెర్షన్‌కి తెలుగు తెలిసిన కో-డెరైక్టర్ కావాలి అనుకున్నప్పుడు రవితేజ నా పేరు సజెస్ట్ చేశారు. ‘షాక్’ సినిమా కో-డెరైక్టర్‌గా, కోన వెంకట్‌తో కలిసి ముంబయ్‌లో అడుగుపెట్టా. వర్మ మా ఇద్దరికీ ‘షాక్’ కథ చెప్పారు. ఒక మారియో ప్యూజో నవల చదువుతున్నట్లు కళ్ల ముందు సినిమా కనిపించింది. ఇలాక్కూడా కథ చెప్పొచ్చా అనిపించింది. ఎలా ఉంది అన్నారు. మనకు నోటి దూల ఎక్కువ కదా. ‘కథ అద్భుతంగా ఉందిసార్. అయితే... రవితేజ మీద వర్కవుట్ అవ్వదు’ అని టక్కున అనేశాను. కోన పక్కనుండి గిల్లుతున్నా పట్టించుకోలా. వర్మ నా వంక కోరగా చూశారు. ‘హైదరాబాద్ నుంచి వచ్చి నా కథ వర్కవుట్ అవ్వదంటావా... నీ డెసిషన్ తీసుకొని సినిమా తీయడం మానేస్తాననుకున్నావా?’ అన్నారు సూటిగా. ‘మీరేం మానొద్దండీ.. ఇది రవికి బాగోదు అన్నాను అంతే’ అన్నాను రెట్టిస్తూ.. ‘సరే ఏం చేస్తే బావుంటుందో చేయ్. ఈ సినిమాకు నువ్వే డెరైక్టర్‌వి’ అని సీరియస్‌గా నన్ను డెరైక్టర్ని చేసేసి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అందరూ షాక్. అప్పటికే రవితేజకు కథ చెప్పి ఉండటంతో ఆలోచనలో పడ్డాను. ‘వర్మతో పాటు నీ పేరు స్క్రీన్‌మీద వస్తుంది. ఇది మామూలు అవకాశం కాదు. డెరైక్ట్‌గా ప్లేట్ నీ ముందుకొస్తే తిననంటావేంటి?’ అని నచ్చజెప్పారు కోన. వర్మగారి లైన్ అలాగే ఉంచి, స్క్రీన్‌ప్లేలో కొన్ని మార్పులు చేశా. ఒకవేళ సినిమా అందుకే పోయిందేమో. ఆయన చెప్పినట్టు తీస్తే ఫలితం ఎలా ఉండేదో. వర్మ వద్ద పనిచేయకపోయినా... ఆయన లక్షణాలు మీలో కొన్ని కనిపిస్తుంటాయి? హరీష్‌శంకర్: ఒకళ్లను చూసి ఎడాప్ట్ అవ్వలేమండీ.. గాంధీమహాత్ముణ్ణి చూసి ప్రపంచం అంతా అడాప్ట్ అయిపోవచ్చుగా.. మనం అవ్వలేం. మనలో ఏది ఉంటుందో.. అదే మనకు నచ్చుతుంది. అది ఎదుటివారిలో కనిపిస్తే ఆటోమేటిగ్గా వాళ్లను మనం ఇష్టపడతాం. బహుశా.. నాలో నాకు నచ్చే అంశాలు ఆయనలో నాకు కనిపించి ఉండొచ్చు. చూడండీ.. మన సెల్లో సిమ్‌కార్డ్ ఉంటేనే సిగ్నల్స్ వస్తాయి. ఆ విషయాన్ని పక్కనపెడదాం... మీది ప్రేమ వివాహమట కదా. కాస్త మీ ప్రేమకథ చెబుతారా? హరీష్‌శంకర్: పెద్ద లవ్‌స్టోరీ ఏం లేదండీ... తను ఎన్ఆర్ఐ. కెనడాలో ఉండేది. పేరు స్నిగ్ద. క్లినికల్ సైకాలజిస్ట్. ఆటిజంతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు కౌన్సెలింగ్ చేస్తుంది. స్నేహితుని బర్త్‌డే పార్టీలో తొలిసారి తనను చూశాను. అప్పుడే ఆమెతో పరిచయం అయ్యింది. తర్వాత తను కెనడా వెళ్లిపోయింది. అనుకోకుండా ఇంటర్నెట్లో కలిసింది. మా ఇద్దరి అభిప్రాయాలూ కలిశాయి. కానీ మా కులాలు వేరవడంతో మా ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. ఎలాగోలా ఒప్పించి చెల్లి పెళ్లి అయ్యాక... పెళ్లి చేసుకున్నా. సినిమాలపై తనకు లీస్ట్ నాలెడ్జ్. ఒక దర్శకునిగా కాక, వ్యక్తిగా నన్ను ఇష్టపడటం నాకు నచ్చింది. అందుకే పెళ్లి చేసుకున్నాను. పిల్లల సంగతేంటి? హరీష్‌శంకర్: పిల్లలపై ఇంట్రస్ట్ లేదండీ. నా మార్కుల గురించి, నా లైఫ్ గురించి టెన్షన్ పడుతున్న ఈ దశలో... పిల్లల మార్కుల గురించి, పిల్లల లైఫ్‌ల గురించి ఆలోచించలేను. - బుర్రా నరసింహ ‘గబ్బర్‌సింగ్’ విషయంలో పవన్‌కల్యాణ్ కంట్రిబ్యూషన్ ఎంత? హరీష్‌శంకర్: ఆ సినిమా విషయంలో కల్యాణ్‌గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ‘గబ్బర్‌సింగ్’ టైటిల్ పెట్టింది ఆయనే. క్యారెక్టరైజేషన్ విషయంలో కూడా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాలో ఓ మంచి మద్దెల ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుందని ఆయన చెబితే.. ‘అంత్యాక్షరి ఎపిసోడ్’ని డిజైన్ చేసి దాన్ని పర్పస్‌ఫుల్‌గా వాడాను. సినిమా మొత్తానికి ఎంత కష్టపడ్డానో.. ఆ ఒక్క ఎపిసోడ్ విషయంలో అంత కష్టపడ్డాను. దాదాపు మూడొందల పాటల్ని విని, అందులోంచి కొన్ని పాటల్ని వడపోత కట్టి, ఆ ఎపిసోడ్ చేశాం. తర్వాత చాలా సినిమాల్లో దాన్ని ప్రేరణగా తీసుకొని సన్నివేశాలొచ్చాయి. ఆ సినిమా మాతృక ‘దబాంగ్’ను నేనెంత ఛేంజ్ చేయకపోతే.. ‘మాటలు, మార్పులు’ అనే టైటిల్ కార్డ్ వేసుకుంటానో అర్థంచేసుకోండి. కల్యాణ్‌గారి ‘తొలిప్రేమ’ షూటింగ్ బీహెచ్ఈఎల్లో జరిగినప్పట్నుంచీ, ‘గబ్బర్‌సింగ్’ తొలిషాట్ తీసేంతవరకూ.. ఈ మధ్యలో వచ్చిన వపన్ సినిమాలు, పవన్ డైలాగులు, పవన్ స్టైల్స్‌తో కలిసి నేను చేసిన ప్రయాణ ఫలితమే ‘గబ్బర్‌సింగ్’ సినిమా. పవన్‌పై నాకున్న ఇష్టానికి ప్రతీక ‘గబ్బర్‌సింగ్’. లైఫ్‌లో గుర్తుండిపోయిన సంఘటనలు? హరీష్‌శంకర్: మనసుకు బాధ పెట్టిన సంఘటనలే నన్ను ఎక్కువ హంట్ చేస్తుంటాయి. ఉదాహరణకు వడ్డే నవీన్‌గారి సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా నేను ఓకే అయ్యాను. అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్. ముహూర్తం అయిపోగానే... సదరు దర్శకుడు పక్కకు పిలిచి... ‘నేను ఫస్ట్ టైమ్ డెరైక్ట్ చేస్తున్నాను. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టాఫ్‌ని పెట్టుకోలేం’ అన్నారు. బాధతో బయటకెళ్లిపోయాను. తర్వాత అదే డెరైక్టర్ ఇంకో సినిమాకు నన్ను తీసుకొని రెండ్రోజుల తర్వాత పంపించేశారు. ఆ క్షణంలో ఎంత బాధ అనిపిస్తుందో అర్థం చేసుకోండి. అంలాంటి బాధల్ని ఎన్నోసార్లు ఫేస్ చేశా. బంజారాహిల్స్ నుంచి అమీర్‌పేట వరకు కన్నీటితో నడుచుకుంటూ వెళ్లిపోయిన సందర్భాలున్నాయి. ఓ ప్రైవేటు ఆల్బమ్ షూటింగ్ చేస్తున్నాం. ప్రముఖ కెమెరామేన్ ఆ ఆల్బమ్‌కి పనిచేస్తున్నారు. ఏదో పనిచేస్తూ... తెలీక కెమెరాకు అడ్డుగా నిలబడ్డాను. అప్పటికే ఆ కెమెరామేన్ చాలా ఇరిటేషన్లో ఉన్నట్టున్నారు. నేను లొకేషన్లో ఉండేసరికి... ఆయనకు కోపం ఆగలేదు. నా చొక్కా కాలర్ పట్టుకొని బయటకు లాక్కెళ్లారు. కచ్చితంగా అక్కడ తప్పు నాదే అయినా.. ఆ క్షణాన చాలా బాధ పడ్డాను. ఆ సంఘటన నాకు అలాగే ఎందుకు గుర్తుండిపోయిందంటే... ఆ రోజు నా పుట్టిన రోజు . అయితే.. నేను డెరైక్టర్ని అయ్యాక ఆయనతోనే కలిసి పనిచేశా. నేను ఎంత ఎగ్రెసివ్‌గా ఉంటానో, అంత సున్నితంగా ఉంటా. పిలిస్తే కన్నీళ్లు వస్తాయి నాకు. ఉదాహరణకు ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఇన్సిడెంట్ జరిగాక, వారం రోజులు మనిషిని కాలేకపోయాను. -
గబ్బర్ సింగ్ మళ్లీ గుర్రం ఎక్కేస్తున్నాడు
గత ఏడాది బాక్సాఫీస్ వద్ద ‘గబ్బర్‌సింగ్’ చేసిన హడావిడి అంతా ఇంతాకాదు. పాత రికార్డులన్నింటినీ సాధ్యమైనంతవరకూ ఆ సినిమాతో తుడిచిపెట్టేశారు పవర్‌స్టార్. ప్రస్తుతం ‘అత్తారింటికి దారేది’తో మరోసారి పెను సంచలనానికి తెరలేపారాయన. టాలీవుడ్లో వంద కోట్ల క్లబ్లో చేరబోయే తొలి సినిమాగా ‘అత్తారింటికి దారేది’ని చెప్పుకుంటున్నారంటే... ఈ సినిమా సాధించిన విజయం స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రాండ్ సక్సెస్‌ని ఓ పక్క ఎంజాయ్ చేస్తూనే... మరోపక్క తన తర్వాతి చిత్రాన్ని సెట్స్‌కి పైకి తీసుకెళడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు పవర్‌స్టార్. సంపత్‌నంది దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ దసరాకే సెట్స్‌కి వెళ్లాల్సింది. కొన్ని కారణాల రీత్యా ఈ నెలాఖరు నుంచి చిత్రీకరణ మొదలు పెట్టాలనుకుంటున్నారు. ‘గబ్బర్‌సింగ్’కు ధీటైన కథను ఈ సినిమా కోసం సంపత్‌నంది సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనికి ‘గబ్బర్‌సింగ్-2’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో పవర్‌స్టార్‌తో జతకట్టే నాయిక విషయంలో పలువురి పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ప్రముఖంగా ప్రణీత పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే... ఇవన్నీ కరెక్ట్ కాదని విశ్వసనీయ సమాచారం. ఓ బాలీవుడ్ కథానాయిక పవన్‌కి జతకట్టనుందని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న విషయం తెలి సిందే. -
నేడు పవర్ స్టార్ జన్మదినం
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా కోసం ప్రస్తుతం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాగే... మరోమారు ‘గబ్బర్‌సింగ్’లా పవన్ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం దర్శకుడు సంపత్‌నంది అద్భుతమైన కథ తయారు చేశారని సమాచారం. ఈ రెండు సినిమాలతో అభిమానులను ఓ రేంజ్లో ‘ఖుషీ’ చేయనున్నారు పవర్‌స్టార్. నేడు ఆయన పుట్టిన రోజు. నేడంతా ఫ్యాన్స్‌కి పండగే పండగ. -
పవన్ మానియా మొదలైంది అప్పట్నుంచే
స్టార్ అయిన ప్రతి ఒక్కరూ ఎదుటివారిని ప్రభావితం చేయలేరు. అది అతి కొద్దిమందికే సాధ్యం. ఆ కొద్దిమందిలో కచ్చితంగా పవన్‌కల్యాణ్ ఒకరు. ప్రస్తుత యువతరానికి పవనిజాన్ని అనుసరించడం పరిపాటైపోయింది. దశాబ్దంన్నర క్రితం విడుదలైన ‘తొలిప్రేమ’ నుంచే యువతలో ఈ పవన్ మానియా మొదలైంది. పవన్ క్రేజ్ జయాపజయాలకు అతీతం. తన అన్న చిరంజీవి వదిలి వెళ్లిన అగ్ర స్థానానికి అతి చేరువలో ఉన్న కథానాయకుడాయన. అందుకు ఆయన సినిమాల ఓపెనింగ్సే నిదర్శనం. అంతేకాదు.. మెగా హీరోలకు సంబంధించిన ఏ వేడుక జరిగినా... ఆ వేడుకలో పవన్ ఉన్నా, లేకున్నా.. అభిమానుల నుంచి ముక్తకంఠంతో వినిపించే పదం ఒక్కటే ‘పవర్‌స్టార్’. కుర్రకారుని ఆ స్థాయిలో మెస్మరైజ్ చేశారాయన. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా కోసం ప్రస్తుతం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాగే... మరోమారు ‘గబ్బర్‌సింగ్’లా పవన్ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం దర్శకుడు సంపత్‌నంది అద్భుతమైన కథ తయారు చేశారని సమాచారం. ఈ రెండు సినిమాలతో అభిమానులను ఓ రేంజ్లో ‘ఖుషీ’ చేయనున్నారు పవర్‌స్టార్. నేడు ఆయన పుట్టిన రోజు. నేడంతా ఫ్యాన్స్‌కి పండగే పండగ.