గురుగ్రాం : ‘అరెవో సాంబ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల లాభమా? నష్టమా?’అని గబ్బర్ ప్రశ్నించగా.. ‘ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేకపోవడం వలన తలకు తీవ్ర గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదం ఇంకా పెద్దదయినపుడు ఆ వ్యక్తి కోమాలోకి వెళ్లవచ్చు కొన్ని సార్లు ప్రాణాలూ విడవచ్చు. ఎలా చూసినా హెల్మెట్ లేకుండా వాహనం నడపడం ప్రయాణికుడికి తీవ్ర నష్టమే’అంటూ గబ్బర్ ప్రశ్నకు సాంబ సమాధానమిస్తాడు. ఏంటీ గబ్బర్, సాంబల పేర్లు చెప్పి షోలే సినిమా డైలాగులు కాకుండా వేరే డైలాగులు చెబుతున్నారనుకుంటున్నారా?. అయితే వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను వివరించడానికి హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం జిల్లా ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న వినూత్న ప్రయత్నం ఇది.
ట్రాఫిక్ నియమాలు పాటించమని ఎన్ని సార్లు చెప్పినా, ప్రచారాలు చేసినా, భారీ జరిమానాలు విధించినా వాహనదారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో పోలీసులు విసుగెత్తిపోయారు. దీంతో ఏదైన వెరైటీగా చేసయినా సరే ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని ఆలోచన మెదలెట్టారు గురుగ్రాం ట్రాఫిక్ పోలీసులు. దీంతో స్థానిక విద్యార్థులతో కలిసి ప్రజలకు ట్రాఫిక్ పాఠాలు చెప్పాలని నిశ్చయించుకున్నారు. దీనిలో భాగంగా దీపక్, అరుణ్‌లు గబ్బర్ సింగ్, సాంబ వేషధారణలో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపేవారికి క్లాస్ తీసుకుంటున్నారు. షోలే సినిమాలోని పవర్‌ఫుల్ డైలాగ్‌లను ట్రాఫిక్ భాషలో చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ట్రాఫిక్ పోలీసులు, విద్యార్ధులు ప్రయత్నానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment