Traffic polices
-
పగలూ రాత్రీ బాదేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: పోలీసు పనితీరుకు ప్రామాణికమంటూ డీజీపీ కార్యాలయం అమలులోకి తీసుకువచ్చిన వర్టికల్స్ విధానం అటు పోలీసులు, ఇటు నగర వాసులకు నరకం చూపిస్తోంది. ఇందులో నిర్దేశించిన మేరకు డ్రంకెన్ డ్రైవ్ కేసుల కోసం ట్రాఫిక్ విభాగం అధికారులు పగలూ రాత్రీ అనే తేడా లేకుండా రోడ్డున పడుతున్నారు. అదేమంటే రోడ్డు ప్రమాదాల నిరోధం కోసమే ఇవన్నీ చేస్తున్నామని చెబుతున్నారు. సీన్ కట్ చేస్తే. డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కావడం తప్ప ఆశించిన స్థాయిలో రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గట్లేదు. పనితీరు మదింపు... శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్ వింగ్ సహా ప్రత్యేక విభాగాలను పని తీరును మథించడానికి డీజీపీ కార్యాలయం వర్టికల్స్ విధానాన్ని రూపొందించింది. బీటు కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల వరకు ఎవరెవరు, ఏ రకమైన విధులు నిర్వర్తించాలనేది నిర్దేశించింది. వీటిని వీళ్లు ఎంత సమర్థంగా వ్యవహరిస్తున్నారన్నది గుర్తించడానికంటూ వర్టికల్స్ విధానం అమలులోకి తీసుకువచ్చారు. ప్రతి నెలా ఆయా అధికారులు తమ పని తీరును ఈ వర్టికల్స్‌లో నిర్దేశించిన విధంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే డీజీపీ కార్యాలయం ర్యాంకింగ్స్ ఇస్తూ ఉత్తమ అధికారులను గుర్తిస్తోంది. డీడీ తనిఖీలను చేర్చి.. సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ వంటి ప్రత్యేక విభాగాలకు సైతం కొన్ని అంశాలను నిర్దేశించారు. ట్రాఫిక్ పోలీసుల విషయానికి వచ్చేసరికే అసలు సమస్య వచ్చిపడుతోంది. వీళ్లు నిర్వర్తించే ప్రతి పనీ నేరుగా నగర వాసులు ఇంకా పక్కాగా చెప్పాలంటే వాహన చోదకులతో ముడిపడి ఉంటుంది. ట్రాఫిక్ పోలీసుల పనితీరును గుర్తించే వర్టికల్స్‌లో పెండింగ్ ఈ–చలాన్ల వసూలుతో పాటు డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలను డీజీపీ కార్యాలయం చేర్చింది. ఒక్కో పోలీసుస్టేషన్ ఒక నెలలో ఏ తరహావి, ఎన్ని కేసులు నమోదు చేస్తోందనేది గణిస్తోంది. ఆ ప్రాంతాలు, సమయాల్లో చేస్తే ఒకే... నగర ట్రాఫిక్ విభాగం అధికారులు గడిచిన కొన్నాళ్లుగా ప్రతి రోడ్డు ప్రమాదాన్నీ అధ్యయనం చేస్తున్నారు. ఏఏ ప్రాంతాల్లో, ఏయే సమయాల్లో, ఏ కారణం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే అంశంపై నివేదికలు రూపొందించారు. వీటి ఆధారంగా డ్రంకెన్ డ్రైవ్ కారణంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో, ఆ సమయాల్లో ఈ తనిఖీలు నిర్వహించేలా చేస్తే సరిపోతుంది. అలా కాకుండా అనునిత్యం రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వీటిని నిర్వహిస్తుండటంతో అటు పోలీసులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టి పరిస్థితులను మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైకి.. ట్రాఫిక్ విభాగం అధికారులు వర్టికల్స్‌ను అందుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పగలు–రాత్రి తేడా లేకుండా రోడ్లపై డ్రంక్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలన్నీ ప్రధాన రహదారులపై జరుగుతుండటంతో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. మరోపక్క అసలే అరకొర సిబ్బందితో ఉన్న ట్రాఫిక్ ఠాణాలకు ఈ తనిఖీలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. రాత్రి వేళల్లో డ్రంక్ డ్రైవింగ్ చేసిన వాళ్లూ ఉదయం డ్యూటీకి రావాల్సి రావడం.. ఒక్కోసారి మళ్లీ పగటిపూట కూడా ఈ తనిఖీలు చేయాల్సి వస్తుండటంతో గగ్గోలు పెడుతున్నారు. పని భారం తప్పించాలంటూ ఉన్నతాధికారులను వేడుకొంటున్నారు. (చదవండి: వాహనదారులకు అలర్ట్ ఈ రూట్స్‌లో వెళ్లకండి.. ట్రాఫిక్ మళ్లింపులు కలవు) -
జాప్యంతో కాదు..జన్యులోపంతోనే బాలుడి మృతి
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలోని వంగపల్లి వద్ద మంగళవారం పోలీసులు జాప్యం కారణంగా బాలుడు మృతి చెందాడన్న విషయాన్ని రాచకొండ పోలీసులు ఖండించారు. పెండింగ్‌లో ఉన్న ఈ–చలాన్ల కోసం కారు ఆపిన కారణంగా మూడు నెలల బాలుడు చనిపోయాడన్నది వాస్తవం కాదని అంతర్గత విచారణలో అధికారులు తేల్చారు. బాలుడి మృతిపై మీడియాలో వస్తున్న కథనాలపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ గురువారం వివరణ ఇచ్చారు. జనగామ మండలం వెంకిర్యాలకు చెందిన సరస్వతి మేనరిక వివాహం చేసుకున్న కారణంగా పిల్లలు జన్యుపరమైన వ్యాధులతో పుడుతున్నారని, గతంలోనూ ఓ పాప దీనివల్లే మరణించినట్లు ఆయన తెలిపారు. మూడు నెలల క్రితం జన్మించిన రేవంత్ జ్వరంతో బాధపడుతుండటంతో సోమవారం జనగామలోని ఓ చిల్ట్రన్స్ ఆస్పత్రిలో చేర్చారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన వైద్యులు ప్రసూతి శిశు సంరక్షణ కేంద్రానికి లేదా వరంగల్ ఎంజీఎంకు తరలించమని సూచించారు. మంగళవారం సరస్వతి తదితరులు చిన్నారిని తీసుకుని కారులో నిలోఫర్ ఆస్పత్రికి బయల్దేరారు. ఈ కారు డ్రైవర్ సీటు బెల్టు లేకుండా నడుపుతుండటంతో వంగపల్లి ఎక్స్‌రోడ్స్ వద్ద ట్రాఫిక్ నియంత్రణలో ఉన్న ఎస్సై రాజు ఆపి రూ.100 జరిమానా విధించారు. పెండింగ్ చలాన్లు తనిఖీ చేయగా రూ.1,000 జరిమానా ఉన్నట్లు తేలింది. దీంతో సదరు డ్రైవర్ ఫోన్ ద్వారా యజమానితో మాట్లాడించగా ట్రాఫిక్ పోలీసులు విడిచి పెట్టారు. ఇది మొత్తం కనిష్టంగా ఏడు నుంచి పది నిమిషాలలోపులోనే పూర్తయిందని వివరించారు. ఆ సమయంలోనూ కారులో ఉన్న వాళ్లు బాలుడి పరిస్థితిని పోలీసులకు చెప్పలేదని ఆయన వెల్లడించారు. బాలుడి మరణం బాధాకరమని పోలీసు శాఖ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు. -
రాంగ్ రూట్.. ఇకపై ఫుల్ టైట్
నేరేడ్మెట్(హైదరాబాద్): పక్కనే రాంగ్ రూట్.. కాస్త దూరం వెళ్తే యూటర్న్.. కానీ కొంత మంది రాంగ్రూట్నే ఎంచుకుంటున్నారు. ఓవైపు వేగంగా వచ్చే వాహనాలు.. మరోవైపు రాంగ్రూట్లో వెళ్లే వాహనాలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా కొందరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇప్పటికే రాంగ్రూట్లో వెళ్లే వారికి అనేక చలాన్లు సైతం వేశారు. ట్రాఫిక్ పోలీసులు లేని సమయంలో రయ్యిమంటూ వాహనాలకు ఎదురెళ్తున్నారు. అటునుంచి వేగంగా వచ్చే వాహనాలకు అడ్డుగా వెళ్లడంతో ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడక్కడా ఉండే సీసీ కెమెరాల్లో కనిపించకుండా నంబర్ప్లేట్లను చెరిపేస్తున్నారు. కొంతమంది ఆకతాయిలు నంబర్ ప్లేట్లకు మాస్కులు కట్టి నంబర్ కనిపించకుండా తప్పించుకుంటున్నారు. అలాంటి వారికిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మొదటిసారి అవగాహన కల్పిస్తూ.. రెండోసారి వాహనదారులు చిక్కితే చలాన్లు విధిస్తున్నారు. హెల్మెట్ లేకుండా.. నంబర్ ప్లేట్ కనిపించకుండా ఉన్న వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ► మల్కాజిగిరి ట్రాఫిక్ ఠాణా పరిధిలోని నేరేడ్మెట్లో రాంగ్ రూట్ డ్రైవింగ్‌లు అధికంగా ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ► ఇందులో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులే షార్ట్‌కట్‌లో గమ్యస్థానాలకు వెళ్లడానికి రాంగ్రూట్లో ప్రయాణిస్తున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. ► నేరేడ్మెట్–ఈసీఐఎల్ ప్రధాన మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ► ఈ మార్గంలో నేరేడ్మెట్ క్రాస్ రోడ్డు, జేజేనగర్ చౌరస్తా, సైనిక్‌పురి చౌరస్తాల్లోనే యుటర్న్‌లు ఉన్నాయి. ► డిఫెన్స్ కాలనీ, వాయుపురి, సైనిక్పురితోపాటు పలు కాలనీలు ఉన్నాయి. ► ఆయా కాలనీల అంతర్గత రోడ్ల నుంచి ప్రధాన రోడ్ల మీదికి వచ్చే వాహనదారులు రాంగ్రూట్లో ప్రయాణిస్తున్నారు. ► దాంతో ఎదురుగా వస్తున్న పాదచారులు, ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ► గడిచిన నెలలో 10 వరకు రాంగ్‌రూట్ ప్రయాణం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు. ► ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు రాంగ్‌రూట్ డ్రైవింగ్ నియంత్రణకు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చదవండి: బైక్‌పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా.. -
11 నెలలు.. రూ. 100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: జరిమానాలకు జనం ఏమాత్రం జడవడం లేదు. ట్రాఫిక్ పోలీసులు కేవలం 11 నెలల్లో రూ.100 కోట్లకు పైగా చలానాలు విధించారంటే ఉల్లంఘనులు ఏస్థాయిలో చెలరేగుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న వాహనాలు, మితిమీరిన వేగం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ వరకు ఒక్క ఓవర్స్పీడ్లోనే అత్యధికంగా 29 లక్షల కేసుల్లో రూ.82 కోట్ల చలానాలు విధించడం వాహనదారుల మితిమీరిన వేగానికి నిదర్శనం. ప్రతిరోజూ 58 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా 16 మంది మరణిస్తున్నారు. 60 మంది క్షతగాత్రులవుతున్నారు. ప్రతి నిమిషానికీ 6 ఓవర్‌స్పీడ్ కేసులు నమోదవడం వాహనదారుల దూకుడును సూచిస్తోంది. ప్రమాదాలకు కారణాలు... వాస్తవానికి రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను పరిశీలిస్తే.. జాతీయ రహదారులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జరుగుతుండటం గమనార్హం. సైబరాబాద్ (570), రాచకొండ (503), సంగారెడ్డి (310), వరంగల్ (239), ఖమ్మం (204), సిద్దిపేట (185) నిజామాబాద్ (178)ల్లో రోడ్డు ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి. అధికలోడు, మితిమీరిన వేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, పెరుగుతున్న వాహనాల సంఖ్య కారణంగా రోడ్డు ప్రమాదాలు, చలానాలు అధికంగా నమోదయ్యేందుకు కారణమవుతున్నాయని రోడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. -
నంబర్ ప్లేట్లు ఒకేలా ఉండాలి
సాక్షి, సిటీబ్యూరో: వాహనాలకు అమర్చే రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లపై ఇష్టారీతిన ఫ్యాన్సీ లెటర్లు, ఇతర గుర్తులు వాడరాదని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్‌కుమార్ నంబర్ ప్లేట్ల తయారీదారులను హెచ్చరించారు. సెంట్రల్ మోటారు వెహికల్ నిబంధనలు–1989 ప్రకారం నంబర్ ప్లేట్లు రూపొందించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నాంపల్లిలోని ట్రాఫిక్ కాంప్లెక్స్‌లో వాహనాలకు రిజిస్ట్రేషన్ నం బర్ ప్లేట్లు తయారీదారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంబర్ ప్లేట్ తయారీదారులు తమ వద్దకు వచ్చే కస్టమర్ ఒరిజినల్ ఆర్సీ, యజ మాన్య వివరాలు తీసుకోవడంతో పాటు సెంట్రల్ మోటారు వెహికల్ నిబంధనలు–1989పై అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు ఒక సర్క్యు లర్ జారీ చేశారు. సరైన నంబర్ ప్లేట్ లేని వాహనాలు వాడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ– 1 ఎల్ఎస్ చౌహాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన గబ్బర్ సింగ్, సాంబ
గురుగ్రాం : ‘అరెవో సాంబ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల లాభమా? నష్టమా?’అని గబ్బర్ ప్రశ్నించగా.. ‘ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేకపోవడం వలన తలకు తీవ్ర గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదం ఇంకా పెద్దదయినపుడు ఆ వ్యక్తి కోమాలోకి వెళ్లవచ్చు కొన్ని సార్లు ప్రాణాలూ విడవచ్చు. ఎలా చూసినా హెల్మెట్ లేకుండా వాహనం నడపడం ప్రయాణికుడికి తీవ్ర నష్టమే’అంటూ గబ్బర్ ప్రశ్నకు సాంబ సమాధానమిస్తాడు. ఏంటీ గబ్బర్, సాంబల పేర్లు చెప్పి షోలే సినిమా డైలాగులు కాకుండా వేరే డైలాగులు చెబుతున్నారనుకుంటున్నారా?. అయితే వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను వివరించడానికి హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం జిల్లా ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న వినూత్న ప్రయత్నం ఇది. ట్రాఫిక్ నియమాలు పాటించమని ఎన్ని సార్లు చెప్పినా, ప్రచారాలు చేసినా, భారీ జరిమానాలు విధించినా వాహనదారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో పోలీసులు విసుగెత్తిపోయారు. దీంతో ఏదైన వెరైటీగా చేసయినా సరే ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని ఆలోచన మెదలెట్టారు గురుగ్రాం ట్రాఫిక్ పోలీసులు. దీంతో స్థానిక విద్యార్థులతో కలిసి ప్రజలకు ట్రాఫిక్ పాఠాలు చెప్పాలని నిశ్చయించుకున్నారు. దీనిలో భాగంగా దీపక్, అరుణ్‌లు గబ్బర్ సింగ్, సాంబ వేషధారణలో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపేవారికి క్లాస్ తీసుకుంటున్నారు. షోలే సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్‌లను ట్రాఫిక్ భాషలో చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ట్రాఫిక్ పోలీసులు, విద్యార్ధులు ప్రయత్నానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
రోడ్డెక్కిన గబ్బర్ సింగ్, సాంబ
-
ఆ లెక్కే వేరబ్బా..!
‘‘తిరుపతి రవాణా శాఖ కార్యాలయంలో పనిచేసే ఓ హోంగార్డుపై అవినీతి ఆరోపణలు రావడంతో అతన్ని మాతృశాఖకు పంపుతూ ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) నెల రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. కానీ నెలగా ఆయన రవాణా శాఖ చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల వేతనాలు చెల్లించే బిల్లులో హోంగార్డు చిత్తూరులో పనిచేస్తుండడాన్ని గుర్తించిన కమిషనర్ షాక్‌కు గురయ్యారు.’’ ‘‘నిత్యం ఖద్దరు దుస్తుల్లో కనిపించే గంగాధరనెల్లూరుకు చెందిన ఓ టీడీపీ నేత ఇటీవల ఎంపికైన ఓ హోంగార్డుకు చిత్తూరు రవాణా శాఖ కార్యాలయంలో పోస్టింగ్ వేయిం చాడు. వాహన తనిఖీ అధికారి(ఎంవీఐ)తో పాటు ఉండే ఆ హోంగార్డు అధికారులు లేని సమయంలో ఎంవీఐ వాహనం తీసుకెళ్లి జాతీయ రహదారుల్లో వాహనాలు ఆపుతూ దోపిడీకి పాల్పడుతున్నాడు. టీడీపీ నేత రెకమెండేషన్ కావడంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి’’ చిత్తూరు అర్బన్: రోడ్లపై నిలబడి ట్రాఫిక్ చూడడం, అధికారులకు టీ కాఫీలు తెచ్చివ్వడం, రాత్రి గస్తీలకు వెళ్లడం ఇష్టపడని కొందరు హోంగార్డులు వారి పలుకుబడి ఉపయోగించి జిల్లా రవాణా శాఖలోనే పనిచేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సామ, భేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నారు. అవసరమైన చోట డబ్బు ఇవ్వడం.. డబ్బులు పనిచేయని చోట అధికార పార్టీ నేతల ద్వారా పోస్టింగులు వేయించుకోవడం చేస్తున్నారు. ఇంతగా రవాణా శాఖలో పోస్టింగులు వేయించుకోవడానికి కారణాలు ఏమిటి..? అసలు రవాణా శాఖే కావాలని ఎందుకు పట్టుపడుతున్నారు..? ఇక్కడ హోంగార్డులు చేసే పనులేమిటి..? ఏంచేస్తున్నారో.. మీరే చదవండి. ఇవీ విధులు.. పోలీసు శాఖలాగే హోంగార్డులకు సైతం పనిగంటల్లో పరిమితి ఉండదు. అయితే శాంతి భద్రతలు, ట్రాఫిక్, ఇతర విభాగాల్లో పనిచేసే హోంగార్డులకు షిప్టు పద్ధతిలో అధికారులు విధులు కేటాయిస్తుం టారు. పోలీసు శాఖలోని హోంగార్డులకు రవాణా శాఖలో విధులు కేటాయించే బాధ్యత చిత్తూరు, తిరుపతిలోని హోంగార్డు విభాగ అధికారులు చూస్తుంటారు. రవాణా శాఖకు అటాచ్మెంట్ చేసిన హోంగార్డులు డీటీసీ, ఆర్టీఓ, ఎంవీఐ, ఏఎంవీఐ అధికారుల వద్ద పనిచేయాలి. అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు రాత్రయినా సరే వెళ్లాల్సిందే. నెలమొత్తం పనిచేసిన హోంగార్డు ఎవరి వద్ద పనిచేశారో తెలిపే డ్యూటీ సర్టిఫికెట్‌ను చిత్తూరులోని డీటీసీ కార్యాలయంలో అందజేయాలి. చేస్తున్న పనులు ఇలా.. జిల్లాలో చిత్తూరు, తిరుపతి రవాణా శాఖ కార్యాలయంతో పాటు ఐదు చోట్ల యూనిట్, ఎంవీఐ కార్యాలయాలు, మూడు చెక్‌పోస్టులున్నాయి. ఇద్దరు ఆర్టీఓలతో పాటు 32 మంది ఎంవీఐల వద్ద 32 మంది హోంగార్డులుగా పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా డ్యూటీ సర్టిఫికెట్ చూసి ఒక్కొక్కరికి నెలకు రూ.18 వేల జీతాన్ని రవాణా శాఖ చెల్లిస్తోంది. రవాణా శాఖలో పనిచేయడానికి చాలామంది హోంగార్డులు డబ్బులిచ్చి పోస్టింగులు వేయించుకుంటున్నారనే విమర్శలున్నాయి. కొందరు ఎంవీఐలు తనిఖీల సమయంలో అవినీతి కార్యకలాపాలకు పాల్పడడాన్ని హోంగార్డులు ప్రత్యక్షంగా చూస్తూ అక్రమ మార్గాల్లో సంపాదనపై దృష్టి పెడుతున్నారు. చిత్తూరులోని ఓ ఎంవీఐ వద్ద పనిచేసే హోంగార్డు ఎంవీఐ వాహనం తీసుకెళ్లి గ్రానైట్ రాళ్లు తీసుకెళ్లే లారీల వద్ద డబ్బు వసూలు చేస్తూ దొరికిపోయినా దీన్ని బయటకు పొక్కనీయకుండా అధికారులు మందలించి సర్దుబాటు చేసేశారు. ఇక కూడళ్లు ఉన్న రోడ్లు, జాతీయ రహదారులు, చెక్‌పోస్టుల్లో ఓవైపు ఎంవీఐలు దందాలు చేస్తుంటే, పక్కనే మరోవైపు హోంగార్డులు మామూళ్లు వసూలు చేస్తుంటారు. ఎన్ఆర్ పేట, పలమనేరు, రేణిగుంట చెక్‌పోస్టుల్లో ఈ చిత్రాలు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. కొందరు హోంగార్డుల్లో రోజుకు రూ.10 వేలు సంపాదించే వాళ్లు కూడా ఉన్నారని బహిరంగ ఆరోపణలున్నాయి. ఇంత ఆదాయం వస్తున్న రవాణా శాఖలో పోస్టింగ్ కోసం తొలుత రూ.30 వేల నుంచి రూ.50 వేలను ఇవ్వడానికి ఏమాత్రమూ వెనుకాడడం లేదు. హోంగార్డు విభాగంలో పనిచేసే ఒకరిద్దరు అధికారుల నుంచి పర్యవేక్షణ చూసే సిబ్బంది వరకు మామూళ్లు ఇస్తూ ఏళ్ల తరబడిగా రవాణా శాఖలో పాతుకుపోయారు. కొందరు ఎంవీఐలు హోంగార్డులను సొంత పనులకు ఉపయోగించుకుంటుండటంతో అధికా రుల బలహీనతను హోంగార్డులు పసిగట్టేసి సొంతంగా తనిఖీలకు సైతం వెళ్లే స్థాయికి చేరుకున్నారనే ఆరోపణలున్నాయి. మార్చమని చెబుతున్నాం.. తిరుపతిలో ఓ హోంగార్డును వద్దని ఆపేస్తే అతను మా చెక్‌పోస్టులోనే పనిచేస్తున్నట్లు గుర్తించాం. జీతం ఆపేసి, అతన్ని వెనక్కు పంపాం. ఆర్నెల్లపాటు హోంగార్డు మా వద్ద పనిచేస్తే బ్యాచ్‌ల వారీగా రొటేట్ చేయమని పోలీసులకు రాస్తున్నాం. మా ఎంవీఐలు ఎక్కడైనా హోంగార్డులను మిస్యూస్ చేస్తుంటే ఫిర్యాదు చేయండి. యాక్షన్ తీసుకుంటాం. – సీహెచ్.ప్రతాప్, ఉప రవాణా కమిషనర్ -
కూల్.. కూల్ ట్రాఫిక్ సిబ్బంది
ఒంగోలు క్రైం: వేసవిలో కూల్..కూల్‌గా ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తించేందుకు ఎస్పీ బి.సత్య ఏసుబాబు ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. అందుకోసం ఒంగోలు నగరంలో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవిని తట్టుకొని విసుగులేకుండా విధులు నిర్వర్తించేందుకు కొన్ని వసతులు కల్పించారు. ఈ సందర్భంగా తలపై వేసవిని కూడా తట్టుకునే టోపీ, కళ్లకు కూలింగ్ అద్దాలు, మంచినీరు చల్లగా ఉండేవిధంగా చేసే అధునాతన వాటర్ బాటిళ్లు అందించారు. ఈ సందర్భంగా ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆదివారం ట్రాఫిక్ సిబ్బందికి అందించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిబ్బందికి అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు సిబ్బందికి చేసిన ఏర్పాట్ల గురించి ట్రాఫిక్ సిఐ కెవి.రాఘవేంద్ర వివరించారు. కార్యక్రమంలో ఎస్సై డి.రంగనా«థ్, కె.హనుమంతరావులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
ఏ క్షణమైనా డ్రంకన్ డ్రైవ్
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో వాహన చోదకుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఏ సమయంలో ఎప్పుడైనా ఓఆర్ఆర్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓఆర్ఆర్లో గురువారం రాత్రి 8.30 గంటల నుంచి మూడు గంటల పాటు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి మద్యం తాగి వాహనం నడుపుతున్న 137 మంది వాహన చోదకులపై కేసులు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఇదే విధానాన్ని ఓఆర్ఆర్లో నెలకు ఐదు నుంచి పదిసార్లు సమయంతో నిమిత్తం లేకుండా డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి ప్రమాదరహిత రహదారిగా మార్చాలని ఇరు కమిషనరేట్ల అధికారులు నిర్ణయించారు. మద్యం తాగి ఓఆర్ఆర్పై వాహనంతో నడిపితే తప్పనిసరిగా దొరికిపోయేలా చతుర్ముఖ వ్యూహన్ని అమలుచేయనున్నారు. ప్రస్తుతం రెండు కమిషనరేట్ల పరిధిలో నేరాలను నియంత్రించడంలో భాగంగా అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ నేర నియంత్రణ చేస్తున్న పోలీసులు అదే వ్యూహంతో ఓఆర్ఆర్పై డ్రంకన్ డ్రైవ్ తనిఖీలతో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టాలని యోచిస్తున్నారు. రెండు కమిషనరేట్ల పరిధిలోని 156.9 కిలోమీటర్ల పరధిలో గతేడాది జరిగిన 45 రోడ్డు ప్రమాదాల్లో 39 మంది దుర్మరణం చెందారు. 66 మంది గాయపడ్డారు. వేగం తగ్గించినా మారని తీరు... గంటకు 120 కిలోమీటర్ల వేగపరిమితి ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్ఆర్లో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన పోలీసులు ఆ వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ తొమ్మిది నెలల క్రితం నోటిఫికేషన్ జారీచేశారు. అయినా వాహనదారుల్లో ఏమాత్రం స్పీడ్ జోష్ తగ్గలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలినా వాహనదారులు గమ్యానికి చేరుకునే క్రమంలో తమ ప్రాణాల కంటే వేగానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఓఆర్ఆర్ నిర్వహణను చూస్తున్న హెచ్ఎండీఏ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా వాహనదారులు అక్కడికక్కడే దుర్మరణం చెందడానికి కారణమవుతోంది. అతివేగం వల్ల జరుగుతున్న ఈ రోడ్డు ప్రమాదాల్లో మృతుల శరీరభాగాల చెల్లాచెదరుగా పడి ఉండటంతో గుర్తు పట్టడం కూడా ఒకానొక సమయంలో పోలీసులకు కష్టమవుతోంది. ఈ అతివేగానికి చెక్ పెట్టడానికి స్లో స్పీడ్ లేజర్ గన్ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చి వాహనదారులు మాత్రం చలాన్లు కడుతున్నారు గానీ వేగాన్ని మాత్రం తగ్గించుకోవడం లేదు. స్లో స్పీడ్ లేజర్ గన్ కెమెరాలు, ఇటు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలతో ఓఆర్ఆర్ను రోడ్డు ప్రమాద రహితంగా మార్చాలనుకుంటున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. -
అవిశ్రాంతంగా పనిచేస్తున్న పోలీసులు
హైదరాబాద్: వాన కష్టాల ‘కడలి’లో ఉన్న సిటీని గట్టెక్కించడానికి పోలీసులు నిర్విరామంగా పని చేస్తున్నారు. సమయంతో పని లేకుండా విధుల్లో నిమగ్నమవుతున్న అధికారులు, సిబ్బంది వరద సహాయకచర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులు సైతం ‘రోడ్డెక్కి’ వాహనాలను నియంత్రిస్తున్నారు. రహదారులపై పడిన చెట్లను తొలగించడంలో జీహెచ్ఎంసీకి, పునరావాలస కేంద్రాల ఏర్పాటులో రెవెన్యూ యంత్రాంగానికి, నాలాల పర్యవేక్షణలో ఆ విభాగం అధికారులకు, కూలిన గోడల శిథిలాల తొలగింపులో అగ్నిమాపక శాఖకు, రోడ్ల మరమ్మతులో ఆర్ అండ్ డీ అధికారులకు పోటీగా పోలీసులు పని చేస్తున్నారు. ఇప్పటి వరకు అక్రమ పార్కింగ్‌లో ఉన్న వాహనాలను తొలగించడానికి (టోవింగ్ చేయడానికి) వినియోగించిన ట్రాఫిక్ క్రేన్లను ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం కాంక్రీట్, ఇసుక, కంకరు రవాణాకు వాడుతున్నారు. వీటిని వినియోగించి రోడ్లపై ఉన్న అనేక గుంతల్ని పూడుస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా నిర్విరామంగా విధుల్లో ఉంటూ, వానకి తడుస్తున్న తమ సిబ్బంది ఆరోగ్యంపై పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరు అనారోగ్యానికి గురికాకుండా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో రెండు మూడురోజుల పాటు నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందనే సమాచారం నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోపక్క రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ శుక్రవారం అల్వాల్‌లో పర్యటించారు. శ్రీనివాసనగర్‌కాలనీ, రెడ్డి కాలనీల్లోని నీట మునిగిన ప్రాంతాలకు వెళ్ళిన ఆయన అక్కడి పరిస్థితుల్ని సమీక్షించారు. మోకాలు లోతు నీళ్ళల్లోనూ స్థానిక అధికారులతో కలిసి నడిచిన వెళ్ళిన భగవత్ స్థానికులతో మాట్లాడుతూ వారి ఇబ్బందులు, సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వరదల నేపథ్యంలో ఎలాంటి సహాయసహకారాలు అవసరమైనా పోలీసుల్నీ సంప్రదించవచ్చని ఆయన స్థానికులకు హామీ ఇచ్చారు. -
బేగంపేటలో ఏసీబీ సీటీరేంజ్ అధికారుల రైడ్
హైదరాబాద్: నగరంలోని బేగంపేటలో ఆదివారం ఏసీబీ సీటీరేంజ్ అధికారులు రైడ్ జరిపారు. చలానా లేకుండా వాహనాదారులనుంచి ట్రాఫిక్ పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో 16వేల రూపాయాలకు పైగా సొమ్మును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, బేగంపేట సీఐ సహా 15మందిపై ఏసీబీ కేసు నమోదు చేసినట్టు సమాచారం.