ఏ క్షణమైనా డ్రంకన్‌ డ్రైవ్‌ | Traffic Police Checkups Drunk And Drive In ORR | Sakshi
Sakshi News home page

ఏ క్షణమైనా డ్రంకన్‌ డ్రైవ్‌

Mar 12 2018 7:58 AM | Updated on May 25 2018 2:06 PM

Traffic Police Checkups Drunk And Drive In ORR - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:  ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)లో వాహన చోదకుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఏ సమయంలో ఎప్పుడైనా ఓఆర్‌ఆర్‌లో డ్రంకన్‌ డ్రైవ్‌  తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే  సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌లో గురువారం రాత్రి 8.30 గంటల నుంచి మూడు గంటల పాటు డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించి మద్యం తాగి వాహనం నడుపుతున్న 137 మంది వాహన చోదకులపై కేసులు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఇదే విధానాన్ని ఓఆర్‌ఆర్‌లో నెలకు ఐదు నుంచి పదిసార్లు సమయంతో నిమిత్తం లేకుండా డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించి ప్రమాదరహిత రహదారిగా మార్చాలని ఇరు కమిషనరేట్ల అధికారులు నిర్ణయించారు. మద్యం తాగి ఓఆర్‌ఆర్‌పై వాహనంతో నడిపితే తప్పనిసరిగా దొరికిపోయేలా చతుర్ముఖ వ్యూహన్ని అమలుచేయనున్నారు. ప్రస్తుతం రెండు కమిషనరేట్ల పరిధిలో నేరాలను నియంత్రించడంలో భాగంగా అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ  నేర నియంత్రణ చేస్తున్న పోలీసులు అదే వ్యూహంతో ఓఆర్‌ఆర్‌పై డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలతో రోడ్డు ప్రమాదాలకు చెక్‌ పెట్టాలని యోచిస్తున్నారు. రెండు కమిషనరేట్ల పరిధిలోని 156.9 కిలోమీటర్ల పరధిలో గతేడాది జరిగిన 45 రోడ్డు ప్రమాదాల్లో 39 మంది దుర్మరణం చెందారు. 66 మంది గాయపడ్డారు. 

వేగం తగ్గించినా మారని తీరు...
గంటకు 120 కిలోమీటర్ల వేగపరిమితి ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్‌ఆర్‌లో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన పోలీసులు ఆ వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ తొమ్మిది నెలల క్రితం నోటిఫికేషన్‌ జారీచేశారు. అయినా వాహనదారుల్లో ఏమాత్రం స్పీడ్‌ జోష్‌ తగ్గలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన సెంట్రల్‌ రోడ్డు రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనంలో తేలినా వాహనదారులు గమ్యానికి చేరుకునే క్రమంలో తమ ప్రాణాల కంటే వేగానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఓఆర్‌ఆర్‌ నిర్వహణను చూస్తున్న హెచ్‌ఎండీఏ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా వాహనదారులు అక్కడికక్కడే దుర్మరణం చెందడానికి కారణమవుతోంది. అతివేగం వల్ల జరుగుతున్న ఈ రోడ్డు ప్రమాదాల్లో మృతుల శరీరభాగాల చెల్లాచెదరుగా పడి ఉండటంతో గుర్తు పట్టడం కూడా ఒకానొక సమయంలో పోలీసులకు కష్టమవుతోంది. ఈ అతివేగానికి చెక్‌ పెట్టడానికి స్లో స్పీడ్‌ లేజర్‌ గన్‌ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చి వాహనదారులు మాత్రం చలాన్లు కడుతున్నారు గానీ వేగాన్ని మాత్రం తగ్గించుకోవడం లేదు. స్లో స్పీడ్‌ లేజర్‌ గన్‌ కెమెరాలు, ఇటు డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలతో ఓఆర్‌ఆర్‌ను రోడ్డు ప్రమాద రహితంగా మార్చాలనుకుంటున్నామని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement