మహేశ్ భగవత్
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలోని వంగపల్లి వద్ద మంగళవారం పోలీసులు జాప్యం కారణంగా బాలుడు మృతి చెందాడన్న విషయాన్ని రాచకొండ పోలీసులు ఖండించారు. పెండింగ్‌లో ఉన్న ఈ–చలాన్ల కోసం కారు ఆపిన కారణంగా మూడు నెలల బాలుడు చనిపోయాడన్నది వాస్తవం కాదని అంతర్గత విచారణలో అధికారులు తేల్చారు.
బాలుడి మృతిపై మీడియాలో వస్తున్న కథనాలపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ గురువారం వివరణ ఇచ్చారు. జనగామ మండలం వెంకిర్యాలకు చెందిన సరస్వతి మేనరిక వివాహం చేసుకున్న కారణంగా పిల్లలు జన్యుపరమైన వ్యాధులతో పుడుతున్నారని, గతంలోనూ ఓ పాప దీనివల్లే మరణించినట్లు ఆయన తెలిపారు. మూడు నెలల క్రితం జన్మించిన రేవంత్ జ్వరంతో బాధపడుతుండటంతో సోమవారం జనగామలోని ఓ చిల్ట్రన్స్ ఆస్పత్రిలో చేర్చారు.
చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన వైద్యులు ప్రసూతి శిశు సంరక్షణ కేంద్రానికి లేదా వరంగల్ ఎంజీఎంకు తరలించమని సూచించారు. మంగళవారం సరస్వతి తదితరులు చిన్నారిని తీసుకుని కారులో నిలోఫర్ ఆస్పత్రికి బయల్దేరారు. ఈ కారు డ్రైవర్ సీటు బెల్టు లేకుండా నడుపుతుండటంతో వంగపల్లి ఎక్స్‌రోడ్స్ వద్ద ట్రాఫిక్ నియంత్రణలో ఉన్న ఎస్సై రాజు ఆపి రూ.100 జరిమానా విధించారు. పెండింగ్ చలాన్లు తనిఖీ చేయగా రూ.1,000 జరిమానా ఉన్నట్లు తేలింది.
దీంతో సదరు డ్రైవర్ ఫోన్ ద్వారా యజమానితో మాట్లాడించగా ట్రాఫిక్ పోలీసులు విడిచి పెట్టారు. ఇది మొత్తం కనిష్టంగా ఏడు నుంచి పది నిమిషాలలోపులోనే పూర్తయిందని వివరించారు. ఆ సమయంలోనూ కారులో ఉన్న వాళ్లు బాలుడి పరిస్థితిని పోలీసులకు చెప్పలేదని ఆయన వెల్లడించారు. బాలుడి మరణం బాధాకరమని పోలీసు శాఖ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment