Rachakonda Police Commissioner
-
రాచకొండ సీపీగా తరుణ్ జోషి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఎఫెక్ట్‌తో రాచకొండ పోలీసు కమిషనర్‌గా పని చేస్తున్న జి.సుధీర్‌బాబు బదిలీ అయ్యారు. ఈయన్ను మల్టీ జోన్–2 ఐజీగా బదిలీ చేసిన ప్రభుత్వం అక్కడ పని చేస్తున్న తరుణ్ జోషిని రాచకొండ కొత్త సీపీగా నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడు కమిషనరేట్ల నుంచి బదిలీ అయిన అధికారుల్లో ఎన్నికల కోడ్ ప్రభావం పడిన వారే అధికంగా ఉన్నారు. కీలక స్థానాల్లో పని చేస్తున్న ఉన్నతాధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గత నెలలో మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం ఈ ఏడాది జూన్ 30ని గడువుగా తీసుకుని..ఆ తేదీ నుంచి వెనక్కు నాలుగేళ్ల కాలంలో వరుసగా మూడేళ్లు ఓ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తే బదిలీ తప్పనిసరి. సుదీర్‌బాబు 2018 ఏప్రిల్ నుంచి 2023 జనవరి వరకు రాచకొండ కమిషనరేట్‌లో సంయుక్త, అదనపు సీపీగా విధులు నిర్వర్తించారు. డీఐజీ హోదాలో సంయుక్త సీపీగా అక్కడ రిపోర్ట్ చేసిన ఆయన ఐజీగా పదోన్నది పొందిన తర్వాత కూడా కొనసాగుతూ అదనపు సీపీగా పని చేశారు. ఆపై హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా బదిలీపై వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత గతేడాది డిసెంబర్ 13న రాచకొండ పోలీసు కమిషనర్‌గా వెళ్లారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం 2020 జూలై 1 నుంచి ఒకే కమిషనరేట్‌లో మూడేళ్లు పనిచేసిన జాబితాలో సుధీర్ బాబు ఉన్నారు. దీంతో ఆయన్ను బదిలీ చేసిన ప్రభుత్వం తరుణ్ జోషిని కొత్త సీపీగా నియమించింది. గతంలో రాచకొండ సంయుక్త సీపీగా పని చేసిన అనుభవం ఈయనకు ఉంది. హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో కీలక పోస్టింగ్‌లతో పాటు వరంగల్ సీపీగానూ పని చేశారు. కోడ్ ఎఫెక్ట్‌తోనే ఈస్ట్‌జోన్ డీసీపీ బి.సాయి శ్రీ సైతం బదిలీ కాగా..ఆ స్థానంలో మల్కాజ్గిరి ఎస్ఓటీ డీసీపీగా పని చేస్తున్న ఆర్.గిరిధర్ నియమితులయ్యారు. గద్వాల డీఐజీగా ఉన్న డి.జోయల్ డెవిస్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సీపీగా నియమించింది. ఈయన ఇటీవల జరిగిన బదిలీల వరకు వెస్ట్ జోన్ డీసీపీగా, ఆపై సిటీ స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా పని చేశారు. ట్రాన్స్‌కోలో పని చేస్తున్న డి.ఉదయ్‌కుమార్ రెడ్డిని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా, ఎస్.రష్మీ పెరుమాళ్‌ను హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ డీసీపీగా ప్రభుత్వం నియమించింది. డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ యూఎల్‌సీలో పనిచేస్తున్న కె.వెంకట ఉపేందర్‌రెడ్డి రాజేంద్రనగర్ ఆర్డీవోగా బదిలీ అయ్యారు. కీసర ఆర్డీవోగా రమాదేవి, శేరిలింగంపల్లి తహసీల్దార్‌గా వెంకట్‌రెడ్డిలకు పోస్టింగ్ లభించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. -
వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లిదాకా వెళ్ళింది కానీ..
-
ఆదిభట్ల కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
-
మన్నెగూడ కేసు: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ యువతిని సినీ ఫక్కీలో వంద మంది కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును ఆరు గంటల్లోనే ఛేదించారు పోలీసులు. శుక్రవారం రాత్రి యువతిని రక్షించారు. అయితే.. ఆమెను రహస్య ప్రదేశంలో ఉంచినట్లు సమాచారం. తండ్రికి వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా కేసును ఛేదించారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా యువతి నల్లగొండలో ఉన్నట్లు గుర్తించి రెస్క్యూ చేశారు. వైశాలిని రహస్య ప్రదేశంలో ఉంచిన పోలీసులు.. ఆమె తండ్రిని మాత్రమే చూడడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆమెకు ఓ పరీక్ష ఉండడం, ఆ పరీక్షకు తండ్రే దగ్గరుండి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 28 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు చెప్పారు. మిగిలిన వారు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవడంతో కనిపెడ్డడానికి ఇబ్బందులు ఎదురైనట్లు వెల్లడించారు. ‘ఇది పక్కాగా ప్లాన్ చేసిన కిడ్నాప్. అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత భయపెట్టారు. వైశాలి షాక్‌లో ఉంది. నవీన్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదు. అతని కోసం టీమ్స్ వెతుకుతున్నాయి. దొరికిన నిందితులను ఇన్వెస్టిగేట్ చేసి మిగతా వాళ్లను పట్టుకుంటాం.’ అని రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇదీ చదవండి: కిడ్నాప్ కేసులో ట్విస్ట్: డాడీ నేను క్షేమంగానే ఉన్నాను.. కానీ, తీవ్ర గాయాలతో.. -
రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఫోటోతో ఫేక్ వాట్సాప్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు అదపు లేకుండ పోతుంది. మరోసారి కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఫోటోతో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేశారు. కమిషనర్ ఫోటోతో ఫేక్ నంబర్ నుంచి ప్రజలకు మెసేజ్‌లు చేస్తూ, మోసం చేసేందుకు యత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పందించారు. 87647 47849 నంబర్‌తో ఫేక్ వాట్సాప్ డీపీని సైబర్ దొంగలు సృష్టించారని, ఈ వాట్సాప్ నంబర్ నుంచి వస్తున్న మెస్సేజ్‌లను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. నిందితుడిని పట్టుకునే పనిలో సైబర్ టీం పనిచేస్తోందని తెలిపారు. -
జాప్యంతో కాదు..జన్యులోపంతోనే బాలుడి మృతి
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలోని వంగపల్లి వద్ద మంగళవారం పోలీసులు జాప్యం కారణంగా బాలుడు మృతి చెందాడన్న విషయాన్ని రాచకొండ పోలీసులు ఖండించారు. పెండింగ్‌లో ఉన్న ఈ–చలాన్ల కోసం కారు ఆపిన కారణంగా మూడు నెలల బాలుడు చనిపోయాడన్నది వాస్తవం కాదని అంతర్గత విచారణలో అధికారులు తేల్చారు. బాలుడి మృతిపై మీడియాలో వస్తున్న కథనాలపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ గురువారం వివరణ ఇచ్చారు. జనగామ మండలం వెంకిర్యాలకు చెందిన సరస్వతి మేనరిక వివాహం చేసుకున్న కారణంగా పిల్లలు జన్యుపరమైన వ్యాధులతో పుడుతున్నారని, గతంలోనూ ఓ పాప దీనివల్లే మరణించినట్లు ఆయన తెలిపారు. మూడు నెలల క్రితం జన్మించిన రేవంత్ జ్వరంతో బాధపడుతుండటంతో సోమవారం జనగామలోని ఓ చిల్ట్రన్స్ ఆస్పత్రిలో చేర్చారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన వైద్యులు ప్రసూతి శిశు సంరక్షణ కేంద్రానికి లేదా వరంగల్ ఎంజీఎంకు తరలించమని సూచించారు. మంగళవారం సరస్వతి తదితరులు చిన్నారిని తీసుకుని కారులో నిలోఫర్ ఆస్పత్రికి బయల్దేరారు. ఈ కారు డ్రైవర్ సీటు బెల్టు లేకుండా నడుపుతుండటంతో వంగపల్లి ఎక్స్‌రోడ్స్ వద్ద ట్రాఫిక్ నియంత్రణలో ఉన్న ఎస్సై రాజు ఆపి రూ.100 జరిమానా విధించారు. పెండింగ్ చలాన్లు తనిఖీ చేయగా రూ.1,000 జరిమానా ఉన్నట్లు తేలింది. దీంతో సదరు డ్రైవర్ ఫోన్ ద్వారా యజమానితో మాట్లాడించగా ట్రాఫిక్ పోలీసులు విడిచి పెట్టారు. ఇది మొత్తం కనిష్టంగా ఏడు నుంచి పది నిమిషాలలోపులోనే పూర్తయిందని వివరించారు. ఆ సమయంలోనూ కారులో ఉన్న వాళ్లు బాలుడి పరిస్థితిని పోలీసులకు చెప్పలేదని ఆయన వెల్లడించారు. బాలుడి మరణం బాధాకరమని పోలీసు శాఖ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు. -
ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. మట్టారెడ్డి సహా ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు ఆయుధాలు, 20 రౌండ్ల బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. మట్టారెడ్డిని కీలక సూత్రధారిగా పోలీసులు తేల్చారు. లేక్‌విల్లా భూ వివాదమే హత్యకు కారణంగా పోలీసులు నిర్థారించారు. చదవండి: టార్గెట్ శ్రీనివాస్‌రెడ్డా..?లేక రాఘవేందర్‌రెడ్డా..? ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు. 48 గంటల పాటు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామని తెలిపారు. మట్టారెడ్డికి గతంలో నేర చరిత్ర ఉందని తెలిపారు. మట్టారెడ్డి గెస్ట్ హౌస్ వద్ద సీపీ ఫుటేజీ లభించడంతో కీలక ఆధారం లభించిందని సీపీ తెలిపారు. -
గ్రేటర్ పోరు: భారీ బందోబస్తు..
-
గ్రేటర్ పోరు: భారీ బందోబస్తు..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాచకొండ పరిధిలో 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌లోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయని వెల్లడించారు. 1072 సాధారణ, 512 సమస్యత్మక, 53 అతి సమస్యత్మక పోలింగ్ ప్రాంతాలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. (చదవండి: ఆ వదంతులు నమ్మకండి) 29 చెక్‌పోస్ట్‌లు, 90 పికెట్స్, 104 వాహనాలు ఏర్పాటు చేసి నిఘా పట్టిష్టం చేశామని పేర్కొన్నారు. ఆరు ఫ్లెయింగ్ స్క్వాడ్, ఏసీపీ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 533 నామినేషన్లు దాఖలయ్యాయని వెల్లడించారు. సోషల్ మీడియాలో దూషణలు, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు. 353 మంది ఆయుధాలు డిపాజిట్ చేశారని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 10 మోంటెడ్ కెమెరా వాహనాలతో నిఘా పటిష్టం చేశామని పేర్కొన్నారు. 89 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశామని, 140 నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశామని కమిషనర్ పేర్కొన్నారు. (చదవండి: గ్రేటర్ ఎన్నికలు: ఎస్ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు..) -
రూ.40 కోట్లు కుచ్చు టోపీ, బురిడీ బాబా అరెస్ట్
-
పెళ్లికి రూ.3 కోట్లు ఖర్చు, బురిడీ బాబా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ఆధ్యాత్మికవేత్తగా ప్రజలను మోసం చేస్తున్న కుమార్ గిరిష్ సింగ్ అనే బురిడి బాబాను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డీమ్ బ్రిడ్జ్ మనీ సర్క్యూలేషన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న గిరీష్ సింగ్‌తోపాటు అతని సోదరుడు దిలిప్ సింగ్‌ను ఎస్ఆర్ నగర్లో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు కార్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన గిరీష్ సింగ్ ఆధ్యాత్మిక వేత్తగా ప్రజలను మోసం చేస్తూ దాదాపు రూ.40 కోట్లు కాజేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నెల్లూరుకు చెందిన గిరీష్ సింగ్ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడంతో ఆధ్యాత్మికతను బోధించడం ప్రారంభించాడు. అనంతరం సోదరుడు దిలీప్ సింగ్‌తోపాటు ‘అద్వైత ఆధ్యాత్మిక రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ (ASRCE) ను ప్రారంభించాడు. ఇంటర్ ఫెయిల్ అయిన గిరీష్ కుమార్ హిమాలయాన్ యూనివర్సిటీ నుంచి నకిలీ డిగ్రీ పట్టా పొందాడు. అయితే తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల మీద మంచి పట్టు ఉండటంతో బురిడీ బాబా బుట్టలో ఈజీగా పడిపోయేవాళ్లు. గత ఏడాది గిరీష్ సింగ్ తన అనుచరురాలైన దివ్యను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి డబ్బుపై ఆశ పెంచుకున్న గిరీష్...యువతులను టార్గెట్ చేసుకొని నేరుగా వెళ్లి కలిసి వాళ్లకి ఆధ్యాత్మిక బోధనలు ఇచ్చేవాడు. పలు టీవీ ఛానల్లో సైతం ఆధ్యాత్మిక బోధనలు ఇస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలో గిరీష్ సింగ్ అనేక మంది నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి, చివరికి వారికి కుచ్చు టోపీ పెట్టడంతో బాధితులు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గిరీష్ సింగ్, అతని సోదరుడు దిలీప్‌ను పలు కేసుల కింద అరెస్టు చేశారు. జనాల నుంచి వసూలు చేసిన డబ్బుతో అతగాడు దాదాపు ఇరవై దేశాలు చుట్టేసి... అక్కడ జల్సాలు చేశావాడు. అతగాడు ఏర్పాటు చేసిన గొలుసుకట్టు వ్యాపారంలో లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి చివరికి మోసపోయామని గ్రహించి పోలీసుల్ని ఆశ్రయించారు. గత ఏడాదే గిరీష్ కుమార్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా అతగాడిలో ఏ మార్పు రాలేదు. ఆధ్యాత్మికం ముసుగులో మళ్లీ దందా షురూ చేశాడు. రాచకొండ ఉమ్మడి కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీలో గిరీష్, దివ్యల వివాహం కోసం ప్రజల నుంచి రూ.3 కోట్ల సేకరించి ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అలాగే అతని తరగతులకు హాజరయ్యే వారి నుంచి రూ.10,000 నుంచి రూ .2 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇతనిపై 4 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయని, గిరీష్, అతని సోదరుడి పేరుతో భారీగా ఆస్తులు కూడబెట్టారని పేర్కొన్నారు. అలాగే ప్రజల నుంచి డిబెంచర్లు, డ్రీం బ్రిడ్జ్‌ల రూపంలో రూ.40 కోట్లు కాజేశారని తెలిపారు. -
నారాయణపురం ఠాణా.. ది బెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు పోలీసుస్టేషన్లకు అరుదైన గుర్తింపు లభించింది. 2018కి సంబంధించి పనితీరు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న వాటిలో 86 ఠాణాలను బెస్ట్ అంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) గుర్తించింది. వీటిలో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం 14వ స్థానంలో, నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీసుస్టేషన్ 24వ స్థానంలో నిలిచాయి. 2015లో ఎంహెచ్ఏ ఆధ్వర్యంలో జరిగిన వార్షిక డీజీపీల సదస్సులో చేసిన అనేక తీర్మానాల్లో ‘ఉత్తమ పోలీసుస్టేషన్ల’గుర్తింపు ఒకటి. మౌలిక వసతులు, పనితీరు, ప్రజల మన్నన తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని దేశంలోని ఉత్తమ ఠాణాలకు అవార్డులు ఇవ్వాలని ఆ సదస్సులో నిర్ణయించారు. దీంతో 2017 నుంచి బెస్ట్ ఠాణాల ఎంపిక మొదలైంది. ఆ ఏడాది హైదరాబాద్ కమిషనరేట్‌లో ఉన్న పంజగుట్ట రెండోస్థానంలో నిలిచింది. సమగ్ర అధ్యయనం తర్వాత ఎంపిక... దేశ వ్యాప్తంగా ఉత్తమ పోలీసుస్టేషన్లను ఎంపిక చేయాల్సిన బాధ్యతల్ని ఎంహెచ్ఏ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాకు అప్పగిస్తుంది. కేంద్రం అధీనంలోని ఈ విభాగం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తుంది. 750 కంటే ఎక్కువ ఠాణాలు కలిగిన రాష్ట్రాల నుంచి మూడు, మిగిలిన రాష్ట్రాల నుంచి రెండు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఒకటి చొప్పున ఎంట్రీలను స్వీకరిస్తుంది. తెలంగాణ నుంచి వెళ్లిన ఎంట్రీల్లో నారాయణపురం, చింతపల్లి పోలీసుస్టేషన్లు ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్‌కు చెందిన ఓ ప్రత్యేక బృందం ఈ ప్రాంతాలకు చేరుకుని దాదాపు 2 నెలల పాటు రహస్యంగా వాటి పనితీరు, మౌలిక సదుపాయాలు, నేరాల నిరోధం, కేసుల్ని కొలిక్కి తీసుకురావడం తదితర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఒక్కో పోలీసుస్టేషన్ పరిధి నుంచి 100 మందిని ఎంపిక చేసుకుని వారి అభిప్రాయాలు తీసుకుంది. వీరిలో ఠాణాకు వచ్చిన బాధితులు, దాని చుట్టుపక్కల నివసించే వారు, పోలీసుస్టేషన్ పరిధిలోని విద్య, వ్యాపార సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థల నుంచి వివరాలు సేకరించింది. అత్యంత క్లిష్టమైన ఎంపిక విధానం... క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఎంపిక విధానం అత్యంత క్లిష్టంగా ఉంటుంది. తొలుత అభిప్రాయాలు సేకరించినప్పుడు కనీసం 80 శాతం మంది పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయాలి. కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, నేరగాళ్లకు శిక్షలు పడుతున్న శాతం, రికవరీలతో పాటు ఠాణా పరిశుభ్రత, పచ్చదనం, అక్కడి పోలీసుల ప్రవర్తన, విధి నిర్వహణ తీరును పరిగణలోకి తీసుకుంటారు. ఈ బృందం పరిశీలించే అంశాల్లో టాయిలెట్స్‌లోని ఫ్లష్‌లు సరిగ్గా పని చేస్తున్నాయా? వంటి చిన్న చిన్నవీ ఉంటాయి. ఇలా చేపట్టిన సమగ్ర అధ్యయనం తర్వాత దేశంలో ఉత్తమంగా నిలిచిన పోలీసుస్టేషన్ల జాబితాను ఎంహెచ్ఏకు అందిస్తుంది. డ్యూటీ మీట్లో అందించే అవకాశం... ఈ పోలీసుస్టేషన్ల జాబితాను వివిధ కోణాల్లో పరిశీలించే ఎంహెచ్ఏ అధికారులు వాటినీ మదిస్తారు. ఈ జాబితాను ఓ నిపుణుల కమిటీకి అందిస్తారు. వీరు చేసే మదింపు తర్వాత తుది ఉత్తమ పోలీసుస్టేషన్ల జాబితా విడుదల అవుతుంది. ఈసారి మొత్తం 86 ఠాణాలు బెస్ట్‌గా గుర్తించగా, వీటిలో రెండు తెలంగాణకు చెందినవి ఉన్నాయి. ఈ మేరకు ఎంహెచ్ఏ నుంచి రాష్ట్ర పోలీసు విభాగానికి వర్తమానం అందింది. ఈ ఠాణాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రోల్‌మోడల్‌గా ప్రకటిస్తారు. 2017కు సంబంధించి పంజగుట్ట పోలీసుస్టేషన్ రెండో స్థానం సంపాదించింది. గత ఏడాది గ్వాలియర్‌లో జరిగిన వార్షిక డీజీపీల సదస్సులో అవార్డును అందించారు. ఈసారి అదే సంప్రదాయం కొనసాగుతుందా లేక జాతీయ స్థాయిలో జరిగే ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్లో ఈ అవార్డుల్ని అందిస్తారా అనేది స్పష్టం కావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. ఇదో అరుదైన గుర్తింపు... రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని సం స్థాన్ నారాయణపురం ఠాణా జాతీయ స్థాయిలో ఉత్తమ ఠాణాగా ఎంపిక కావడం అరుదైన గుర్తింపు గా భావిస్తున్నాం. కమిషనరేట్‌కే తలమానికమైన రాచకొండ గ్రామం ఇదే పోలీసుస్టేషన్ పరిధిలో ఉండటం గమనార్హం. ఈ గ్రామాభివృద్ధికి పోలీసు విభాగం అనేక రకాలైన సహాయసహకారాలు అందించింది. ఈ పోలీసుస్టేషన్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు సీసీటీఎన్ఎస్ వ్యవస్థ అమలు కూడా పక్కాగా సాగుతోం ది. ఈ గుర్తింపు సాధించడంలో సహకరించిన డీజీపీ మహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు. ఈ ఠాణా ఇన్స్పెక్టర్తో పాటు ఏసీపీ, డీసీపీని అభినందిస్తున్నా. – మహేష్ మురళీధర్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్ -
సమస్యల పరిష్కారంలో సూపర్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి హత్యాచారాలు వెలుగులోకి రావడంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ చేపట్టిన ప్రజాదర్బార్ పాత్ర కీలకం. శ్రావణి అదృశ్యంపై ఇచ్చిన ఫిర్యాదును బొమ్మల రామారం పోలీసులు తేలిగ్గా తీసుకోవడంతో మొదలైన హాజీపూ ర్ గ్రామస్తుల ఆందోళన ‘ప్రజాదర్బార్’కు ఫిర్యాదుగా చేరింది. దీంతో వెంటనే అక్కడి ఎస్సై వెంకటేశ్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. అదనపు బృందాలతో కేసు విచారణ జరిపి నిందితుడు శ్రీనివాసరెడ్డిని స్వల్ప వ్యవధిలోనే అరెస్టు చేశారు. రిటైర్డ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావుకు కుంట్లూరు గ్రామంలో ఉన్న భూమిని కొంతమంది కబ్జా చేయడంతో ప్రజా దర్బార్‌లో సీపీ మహేష్ భగవత్‌ను కలిసి వివరించారు. వెంటనే సీపీ మహేష్ భగవత్ సంబంధిత పోలీసు అధికారులను కేసు విచారణకు ఆదేశించారు. ఆ ప్లాట్ నాగేశ్వరరావు భార్య జ్యోతి పేరుపై ఉండటంతో ఆమె మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి ఎస్ఆర్వో కార్యాలయం నుంచి సేల్‌డీడ్ సర్టిఫైడ్ కాపీలు పొందారు. దీని ద్వారా ఆ ప్లాట్‌ను ఇతరులకు విక్రయించారని విచారణలో తేలడంతో నిందితులను అరెస్టు చేశారు. సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనర్ నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’బాధితులకు న్యాయం చేయడంతో పాటు సంచలన కేసుల పరిష్కారానికి వేదికగా మారింది. భూకబ్జాలు, హత్యలతో పాటు వివిధ కేసుల్లో ఠాణాలో న్యాయం జరగని పక్షంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ తలుపు తడితే విచారణలో వేగం పెరిగి బాధితులకు న్యాయం జరుగుతోంది. ఇలా రాచకొండ కమిషనరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ బాధితులకు ఆపన్నహస్తం అందిస్తోంది. సైబరాబాద్ విభజన అనంతరం ఏర్పాటైన ఈ కమిషనరేట్‌లో ఈ ప్రయోగం సత్ఫలితాలిస్తోంది. విభజన అనంతరం విస్తీర్ణపరంగా దేశంలోనే అతిపెద్ద కమిషనరేట్‌గా అవతరించిన నేపథ్యంలో కమిషనర్ మహేష్ భగవత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కమిషనరేట్‌లో 3జోన్ల ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వారంలో ఒకరోజు ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా డీసీపీ కార్యాలయాల్లోనే అందుబాటులో ఉంటూ ఫిర్యాదులను స్వీకరించారు. ఆ ఫిర్యాదులను చట్టపరంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయం కొన్ని నెలల క్రితం నేరేడ్మెట్కు మారినా సీపీ మహేష్ భగవత్ మాత్రం ప్రతి మంగళవారం ఎల్బీనగర్లో ప్రజాదర్బార్‌ను కొనసాగిస్తున్నారు. మూడేళ్లలో ‘4సీ’కి వచ్చిన ఫిర్యాదులు 591 పోలీసు స్టేషన్లలో బాధితులకు న్యాయం జరగని పక్షంలో కమిషనర్‌ను కలిసేందుకు ఉమ్మడి సైబరాబాద్ కమిషనరేట్‌లో అప్పటి సీపీ సీవీ ఆనంద్ ‘4సీ’సెల్‌ను ఏర్పాటుచేశారు. అప్పట్లో కమిషనర్‌ను నేరుగా కలిసేందుకు అవకాశం ఉండేది కాదు. ఠాణాలో ఎస్‌హెచ్‌వో స్పందించుకుంటే ఆ తర్వాత ఏసీపీ, డీసీపీని కలవాల్సి వచ్చేది. అక్కడా చర్యలు లేకుంటేనే కమిషనరేట్‌లోని ‘4సీ’విభాగంలో ఫిర్యాదు స్వీకరించేవారు. అప్పుడే కమిషనర్‌ను కలిసి పరిస్థితి వివరించే అవకాశం ఉండేది. అయితే ఏసీపీ, డీసీపీలను కలవకున్నా నేరుగా ప్రజాదర్బార్‌లో పోలీసు కమిషనర్‌ను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో కమిషనరేట్‌లోని ‘4సీ’విభాగానికి కొంతమేర ఫిర్యాదులు తగ్గుతున్నాయి. మూడేళ్లలో ‘4సీ’కి 591 ఫిర్యాదులు వస్తే 415 పరిష్కారమయ్యాయి. మిగతావి వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. దర్యాప్తు వేగిరంగా.. నిష్పక్షపాతంగా తన దృష్టికి వచ్చే ఫిర్యాదులపై కమిషనర్ తక్షణమే స్పందిస్తున్నారు. చట్టపరిధిలో అందుకు తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత ఠాణాల ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అనంతరం దర్యాప్తు పురోగతి క్రమాన్ని సంబంధిత పోలీసు ఇన్స్పెక్టర్కు కమిషనర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఠాణాల్లో ఫిర్యాదు చేసినా స్పందన లేని కేసుల్లో తీవ్రతను బట్టి అవసరమైతే దర్యాప్తు బాధ్యతను ఆ ఠాణాకు సంబంధం లేని అధికారులకు అప్పగిస్తున్నారు. ఈ కేసుల్నీ కమిషనర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న దృష్ట్యా దర్యాప్తు వేగిరంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అస్కారం ఏర్పడుతోంది. ఈ విధంగా ప్రజాదర్బార్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా భూకబ్జా కేసులే ఎక్కువగా ఉండటంతో ఎస్వోపీ నిబంధనల ప్రకారం బాధితులకు న్యాయం చేసేందుకు కమిషనర్ చొరవ చూపుతున్నారు. -
రెండో టెస్టుకు 1500 మందితో భారీ భద్రత
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఈనెల 12న భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరగబోయే రెండో టెస్టుకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. విలేకరులతో మహేశ్ భగవత్ మాట్లాడుతూ..ఈ 1500 మంది పోలీసులతో పాటుగా స్టేడియం మేన్‌జ్‌మెంట్ కూడా ప్రత్యేకంగా ప్రైవేటు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. 100 సీసీ టీవీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశామని తెలిపారు. రెండో టెస్టుకు హాజరయ్యే ప్రేక్షకులు భద్రత అధికారుల సూచనలు పాటిస్తూ సెల్‌ఫోన్ తీసుకెళ్లవచ్చునని తెలిపారు. లాప్‌టాప్‌లు, కెమెరాలు, పవర్‌బ్యాంక్‌లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, కాయిన్స్, లైటర్స్, హెల్మెట్స్, ఫెర్ప్యూమ్స్, బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, బయటి తినుబండారాలకు అనుమతి లేదని వివరించారు. ఫోర్ వీలర్ వాహనాలకు 16 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామని, 4900 వరకు బైక్‌లను పార్కింగ్ చేసుకునేందుకు సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు. -
ఐపీఎల్ ఫైనల్‌కు భారీ బందోబస్తు
ఉప్పల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈనెల 21న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. గురువారం ఉప్పల్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు భద్రతా అంశాల గురించి ఆయన చెప్పారు. ఈ సమావేశంలో హెచ్‌సీఏ కార్యదర్శి శేష్ నారాయణ్, జాయింట్ సీపీ తరుణ్ జోషి, మల్కాజ్గిరి డీసీపీ రమా ఉమామహేశ్వర్ వర్మ, ట్రాఫిక్ డీసీపీ రమేశ్ నాయుడు, అదనపు డీసీపీ దివ్యచరణ్ పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 1800 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 250 మంది సెక్యూరిటీ వింగ్, 270 మంది ట్రాఫిక్ పోలీసులు, 870 లా అండ్ ఆర్డర్ పోలీసులు, 6 ప్లాటున్ల ఆర్మ్డ్ ఫోర్స్ బృందాలు, ఆక్టోపస్, స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్ స్టాఫ్‌తో పాటు 88 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 8 బాంబ్ డిస్పోజల్ బృందాలు మ్యాచ్ ముగిసేవరకు నిరంతరం పహారా కాస్తాయని పేర్కొన్నారు. సంఘవిద్రోహ శక్తులపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. గతంలో లాగానే షీ టీమ్స్‌ను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. బ్లాక్ టిక్కెట్ల విక్రయ సమాచారాన్ని అందించాలనుకునే వారు 100కు డయల్ చేయాలని లేదా 94906 17111 వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. వీఐపీల సెక్యూరిటీకి అనుమతి లేదు వీఐపీల వెంట వచ్చే గన్మెన్లు, ఇతర సెక్యూరిటీ సిబ్బందిని లోపలికి అనుమతించబోమన్నారు. వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు గత అనుభవాల దృష్ట్యా పార్కింగ్‌కు ఇబ్బందులు కలగకుండా అధికంగా పార్కింగ్ ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. 5150 ద్విచక్రవాహనాలకు, 4000 ఫోర్ వీలర్స్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పార్కింగ్‌లోకి వచ్చే ప్రతీ వాహనంలో టిక్కెట్ కలిగిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని, ఇతర వ్యక్తులకు ప్రవేశం లేదని స్పష్టం చేశారు.