నారాయణపురం పోలీస్ స్టేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు పోలీసుస్టేషన్లకు అరుదైన గుర్తింపు లభించింది. 2018కి సంబంధించి పనితీరు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న వాటిలో 86 ఠాణాలను బెస్ట్ అంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) గుర్తించింది. వీటిలో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం 14వ స్థానంలో, నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీసుస్టేషన్ 24వ స్థానంలో నిలిచాయి. 2015లో ఎంహెచ్‌ఏ ఆధ్వర్యంలో జరిగిన వార్షిక డీజీపీల సదస్సులో చేసిన అనేక తీర్మానాల్లో ‘ఉత్తమ పోలీసుస్టేషన్ల’గుర్తింపు ఒకటి. మౌలిక వసతులు, పనితీరు, ప్రజల మన్నన తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని దేశంలోని ఉత్తమ ఠాణాలకు అవార్డులు ఇవ్వాలని ఆ సదస్సులో నిర్ణయించారు. దీంతో 2017 నుంచి బెస్ట్ ఠాణాల ఎంపిక మొదలైంది. ఆ ఏడాది హైదరాబాద్ కమిషనరేట్‌లో ఉన్న పంజగుట్ట రెండోస్థానంలో నిలిచింది.
సమగ్ర అధ్యయనం తర్వాత ఎంపిక...
దేశ వ్యాప్తంగా ఉత్తమ పోలీసుస్టేషన్లను ఎంపిక చేయాల్సిన బాధ్యతల్ని ఎంహెచ్‌ఏ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాకు అప్పగిస్తుంది. కేంద్రం అధీనంలోని ఈ విభాగం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తుంది. 750 కంటే ఎక్కువ ఠాణాలు కలిగిన రాష్ట్రాల నుంచి మూడు, మిగిలిన రాష్ట్రాల నుంచి రెండు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఒకటి చొప్పున ఎంట్రీలను స్వీకరిస్తుంది. తెలంగాణ నుంచి వెళ్లిన ఎంట్రీల్లో నారాయణపురం, చింతపల్లి పోలీసుస్టేషన్లు ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్‌కు చెందిన ఓ ప్రత్యేక బృందం ఈ ప్రాంతాలకు చేరుకుని దాదాపు 2 నెలల పాటు రహస్యంగా వాటి పనితీరు, మౌలిక సదుపాయాలు, నేరాల నిరోధం, కేసుల్ని కొలిక్కి తీసుకురావడం తదితర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఒక్కో పోలీసుస్టేషన్ పరిధి నుంచి 100 మందిని ఎంపిక చేసుకుని వారి అభిప్రాయాలు తీసుకుంది. వీరిలో ఠాణాకు వచ్చిన బాధితులు, దాని చుట్టుపక్కల నివసించే వారు, పోలీసుస్టేషన్ పరిధిలోని విద్య, వ్యాపార సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థల నుంచి వివరాలు సేకరించింది.
అత్యంత క్లిష్టమైన ఎంపిక విధానం...
క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఎంపిక విధానం అత్యంత క్లిష్టంగా ఉంటుంది. తొలుత అభిప్రాయాలు సేకరించినప్పుడు కనీసం 80 శాతం మంది పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయాలి. కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, నేరగాళ్లకు శిక్షలు పడుతున్న శాతం, రికవరీలతో పాటు ఠాణా పరిశుభ్రత, పచ్చదనం, అక్కడి పోలీసుల ప్రవర్తన, విధి నిర్వహణ తీరును పరిగణలోకి తీసుకుంటారు. ఈ బృందం పరిశీలించే అంశాల్లో టాయిలెట్స్‌లోని ఫ్లష్‌లు సరిగ్గా పని చేస్తున్నాయా? వంటి చిన్న చిన్నవీ ఉంటాయి. ఇలా చేపట్టిన సమగ్ర అధ్యయనం తర్వాత దేశంలో ఉత్తమంగా నిలిచిన పోలీసుస్టేషన్ల జాబితాను ఎంహెచ్‌ఏకు అందిస్తుంది.
డ్యూటీ మీట్‌లో అందించే అవకాశం...
ఈ పోలీసుస్టేషన్ల జాబితాను వివిధ కోణాల్లో పరిశీలించే ఎంహెచ్‌ఏ అధికారులు వాటినీ మదిస్తారు. ఈ జాబితాను ఓ నిపుణుల కమిటీకి అందిస్తారు. వీరు చేసే మదింపు తర్వాత తుది ఉత్తమ పోలీసుస్టేషన్ల జాబితా విడుదల అవుతుంది. ఈసారి మొత్తం 86 ఠాణాలు బెస్ట్‌గా గుర్తించగా, వీటిలో రెండు తెలంగాణకు చెందినవి ఉన్నాయి. ఈ మేరకు ఎంహెచ్‌ఏ నుంచి రాష్ట్ర పోలీసు విభాగానికి వర్తమానం అందింది. ఈ ఠాణాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రోల్‌మోడల్‌గా ప్రకటిస్తారు. 2017కు సంబంధించి పంజగుట్ట పోలీసుస్టేషన్ రెండో స్థానం సంపాదించింది. గత ఏడాది గ్వాలియర్‌లో జరిగిన వార్షిక డీజీపీల సదస్సులో అవార్డును అందించారు. ఈసారి అదే సంప్రదాయం కొనసాగుతుందా లేక జాతీయ స్థాయిలో జరిగే ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్‌లో ఈ అవార్డుల్ని అందిస్తారా అనేది స్పష్టం కావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు.
ఇదో అరుదైన గుర్తింపు...
రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని సం స్థాన్ నారాయణపురం ఠాణా జాతీయ స్థాయిలో ఉత్తమ ఠాణాగా ఎంపిక కావడం అరుదైన గుర్తింపు గా భావిస్తున్నాం. కమిషనరేట్‌కే తలమానికమైన రాచకొండ గ్రామం ఇదే పోలీసుస్టేషన్ పరిధిలో ఉండటం గమనార్హం. ఈ గ్రామాభివృద్ధికి పోలీసు విభాగం అనేక రకాలైన సహాయసహకారాలు అందించింది. ఈ పోలీసుస్టేషన్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు సీసీటీఎన్‌ఎస్ వ్యవస్థ అమలు కూడా పక్కాగా సాగుతోం ది. ఈ గుర్తింపు సాధించడంలో సహకరించిన డీజీపీ మహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు. ఈ ఠాణా ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఏసీపీ, డీసీపీని అభినందిస్తున్నా.
– మహేష్ మురళీధర్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment