ఐపీఎల్ ఫైనల్‌కు భారీ బందోబస్తు
ఉప్పల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈనెల 21న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. గురువారం ఉప్పల్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు భద్రతా అంశాల గురించి ఆయన చెప్పారు. ఈ సమావేశంలో హెచ్‌సీఏ కార్యదర్శి శేష్ నారాయణ్, జాయింట్ సీపీ తరుణ్ జోషి, మల్కాజ్‌గిరి డీసీపీ రమా ఉమామహేశ్వర్ వర్మ, ట్రాఫిక్ డీసీపీ రమేశ్ నాయుడు, అదనపు డీసీపీ దివ్యచరణ్ పాల్గొన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా 1800 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 250 మంది సెక్యూరిటీ వింగ్, 270 మంది ట్రాఫిక్ పోలీసులు, 870 లా అండ్ ఆర్డర్ పోలీసులు, 6 ప్లాటున్ల ఆర్మ్‌డ్ ఫోర్స్ బృందాలు, ఆక్టోపస్, స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్ స్టాఫ్‌తో పాటు 88 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
8 బాంబ్ డిస్పోజల్ బృందాలు మ్యాచ్ ముగిసేవరకు నిరంతరం పహారా కాస్తాయని పేర్కొన్నారు. సంఘవిద్రోహ శక్తులపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. గతంలో లాగానే షీ టీమ్స్‌ను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. బ్లాక్ టిక్కెట్ల విక్రయ సమాచారాన్ని అందించాలనుకునే వారు 100కు డయల్ చేయాలని లేదా 94906 17111 వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
వీఐపీల సెక్యూరిటీకి అనుమతి లేదు
వీఐపీల వెంట వచ్చే గన్‌మెన్‌లు, ఇతర సెక్యూరిటీ సిబ్బందిని లోపలికి అనుమతించబోమన్నారు. వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు
గత అనుభవాల దృష్ట్యా పార్కింగ్‌కు ఇబ్బందులు కలగకుండా అధికంగా పార్కింగ్ ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. 5150 ద్విచక్రవాహనాలకు, 4000 ఫోర్ వీలర్స్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పార్కింగ్‌లోకి వచ్చే ప్రతీ వాహనంలో టిక్కెట్ కలిగిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని, ఇతర వ్యక్తులకు ప్రవేశం లేదని స్పష్టం చేశారు.