SRH: హైదరాబాదీలకు పండుగే.. సన్‌రైజర్స్‌ ప్రాక్టీస్‌ ఆరోజే మొదలు | IPL 2025: Uppal Stadium Renovation SRH To Start Training on this date | Sakshi
Sakshi News home page

IPL 2025: హైదరాబాదీలకు పండుగే.. సన్‌రైజర్స్‌ ప్రాక్టీస్‌ ఆరోజే మొదలు

Published Thu, Feb 27 2025 6:45 PM | Last Updated on Thu, Feb 27 2025 7:23 PM

IPL 2025: Uppal Stadium Renovation SRH To Start Training on this date

సన్‌రైజర్స్‌ జట్టు (PC: SRH X)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)-2025 నేపథ్యంలో ఉప్పల్‌ స్టేడియం కొత్త హంగులతో సిద్ధం కానుంది. రెండు వారాల్లోపు పునరుద్ధరణ పనులు పూర్తి కానున్నట్లు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(HCA) అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రావు తెలిపారు. అదే విధంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(Sunrisers Hyderabad) జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌ తేదీని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.

 విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా
కాగా గతేడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే. మూడేళ్లుగా ఎదురైన వైఫల్యాలను అధిగమించి.. వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. కమిన్స్‌ సారథ్యంలో.. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారి రికార్డులు కొల్లగొట్టింది. అయితే, ఆఖరి పోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో ఓటమిపాలైన రైజర్స్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

అయితే, టైటిల్‌ చేజారినా టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఆరెంజ్‌ ఆర్మీ మనసులు గెలుచుకుంది. ఇక ఈ ఏడాది సన్‌రైజర్స్‌ సరికొత్తగా అభిమానుల ముందుకు రానుంది. ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు ఐదుగురు ఆటగాళ్లను రీటైన్‌ చేసుకున్న రైజర్స్‌ యాజమాన్యం.. హెన్రిచ్‌ క్లాసెన్‌(దక్షిణాఫ్రికా) కోసం అత్యధికంగా    రూ. 23 కోట్లు ఖర్చు చేసింది.

కమిన్స్‌ సారథ్యంలోనే
అదే విధంగా ప్యాట్‌ కమిన్స్‌(ఆస్ట్రేలియా)ను రూ. 18 కోట్లు, అభిషేక్‌ శర్మ(భారత్‌)ను రూ. 14 కోట్లు, ట్రావిస్‌ హెడ్‌(ఆస్ట్రేలియా)ను    రూ. 14 కోట్లు, నితీశ్‌ రెడ్డి(భారత్‌)ని రూ. 6 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఇక వేలంపాటలో భాగంగా టీమిండియా స్టార్లు ఇషాన్‌ కిషన్‌, మహ్మద్‌ షమీలను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్‌ కమిన్స్‌ సారథ్యంలోనే తాము ఈసారీ బరిలోకి దిగుతామని ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. మార్చి 22 నుంచి ఐపీఎల్‌ పద్దెమినిదవ సీజన్‌ మొదలుకానుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ 2025 ఎడిషన్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో మార్చి 23న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ సొంత మైదానం ఉప్పల్‌లో రాజస్తాన్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది.

హైదరాబాదీలకు పండుగే.. సన్‌రైజర్స్‌ ప్రాక్టీస్‌ ఆరోజే మొదలు
ఈ నేపథ్యంలో రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పునరుద్ధరణ పనులు వేగవంతం చేశామని HCA అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రావు తాజాగా వెల్లడించారు. వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘ఈసారి హైదరాబాద్‌ ప్రజలకు పండుగే. మనకు ఇక్కడ తొమ్మిది మ్యాచ్‌లు జరుగబోతున్నాయి.

ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు రెనోవేషన్‌ చేస్తున్నాం. గతంలో అద్భుతమైన పిచ్‌లు రూపొందించినందుకు గానూ అవార్డు అందుకున్నాం. రానున్న పదిహేను రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తవుతాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు మైదానం సిద్ధమవుతుంది. మార్చి 2 నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఇక్కడ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు మొదలుపెడుతుంది’’అని జగన్‌ మోహన్‌ రావు తెలిపారు.

ఐపీఎల్‌-2025లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ షెడ్యూల్‌
👉మార్చి 23- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌‌ (హైదరాబాద్‌)
👉మార్చి 27 - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌ (హైదరాబాద్‌)
👉మార్చి 30- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ (వైజాగ్‌)
👉ఏప్రిల్‌ 3- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ కేకేఆర్‌ (కోల్‌కతా)
👉ఏప్రిల్‌ 6- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌ (హైదరాబాద్‌)
👉ఏప్రిల్‌ 12 - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స్‌ (హైదరాబాద్‌)
👉ఏప్రిల్‌ 17- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌ (ముంబై)
👉ఏప్రిల్‌ 23- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌ (హైదరాబాద్‌)
👉ఏప్రిల్‌ 25- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ సీఎస్‌కే (చెన్నై)
👉మే 2- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌ (అహ్మదాబాద్‌)
👉మే 5- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ (హైదరాబాద్‌)
👉మే 10- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ కేకేఆర్‌ (హైదరాబాద్‌)
👉మే 13- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ ఆర్సీబీ (బెంగళూరు)
👉మే 18- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ లక్నో (లక్నో)

ఐపీఎల్‌ 2025లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు
అథర్వ తైడే, అభినవ్‌ మనోహర్‌, అనికేత్‌ వర్మ, సచిన్‌ బేబి, ట్రవిస్‌ హెడ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అభిషేక్‌ శర్మ, కమిందు మెండిస్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, ఇషాన్‌ కిషన్‌, జీషన్‌ అన్సారీ, ప్యాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), మహ్మద్‌ షమీ, హర్షల్‌ పటేల్‌, రాహుల్‌ చాహర్‌, సిమ్రన్‌జీత్‌ సింగ్‌, ఎషాన్‌ మలింగ, ఆడమ్‌ జంపా, జయదేశ్‌ ఉనాద్కట్‌, బ్రైడన్‌ కార్సే.

చదవండి: ఆస్ట్రేలియానూ వదలకండి: అఫ్గనిస్తాన్‌ జట్టుపై పాక్‌ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement