ప్రజాదర్బార్‌లో తన సమస్య పరిష్కారమైనందుకు మహేశ్ భగవత్‌కు స్వీట్ బాక్స్ ఇస్తున్న ఓ మహిళ(ఫైల్)
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి హత్యాచారాలు వెలుగులోకి రావడంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ చేపట్టిన ప్రజాదర్బార్ పాత్ర కీలకం. శ్రావణి అదృశ్యంపై ఇచ్చిన ఫిర్యాదును బొమ్మల రామారం పోలీసులు తేలిగ్గా తీసుకోవడంతో మొదలైన హాజీపూ ర్ గ్రామస్తుల ఆందోళన ‘ప్రజాదర్బార్’కు ఫిర్యాదుగా చేరింది. దీంతో వెంటనే అక్కడి ఎస్సై వెంకటేశ్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. అదనపు బృందాలతో కేసు విచారణ జరిపి నిందితుడు శ్రీనివాసరెడ్డిని స్వల్ప వ్యవధిలోనే అరెస్టు చేశారు.
రిటైర్డ్ కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావుకు కుంట్లూరు గ్రామంలో ఉన్న భూమిని కొంతమంది కబ్జా చేయడంతో ప్రజా దర్బార్‌లో సీపీ మహేష్ భగవత్‌ను కలిసి వివరించారు. వెంటనే సీపీ మహేష్ భగవత్ సంబంధిత పోలీసు అధికారులను కేసు విచారణకు ఆదేశించారు. ఆ ప్లాట్ నాగేశ్వరరావు భార్య జ్యోతి పేరుపై ఉండటంతో ఆమె మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి ఎస్‌ఆర్‌వో కార్యాలయం నుంచి సేల్‌డీడ్ సర్టిఫైడ్ కాపీలు పొందారు. దీని ద్వారా ఆ ప్లాట్‌ను ఇతరులకు విక్రయించారని విచారణలో తేలడంతో నిందితులను అరెస్టు చేశారు.
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనర్ నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’బాధితులకు న్యాయం చేయడంతో పాటు సంచలన కేసుల పరిష్కారానికి వేదికగా మారింది. భూకబ్జాలు, హత్యలతో పాటు వివిధ కేసుల్లో ఠాణాలో న్యాయం జరగని పక్షంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ తలుపు తడితే విచారణలో వేగం పెరిగి బాధితులకు న్యాయం జరుగుతోంది. ఇలా రాచకొండ కమిషనరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ బాధితులకు ఆపన్నహస్తం అందిస్తోంది. సైబరాబాద్ విభజన అనంతరం ఏర్పాటైన ఈ కమిషనరేట్‌లో ఈ ప్రయోగం సత్ఫలితాలిస్తోంది. విభజన అనంతరం విస్తీర్ణపరంగా దేశంలోనే అతిపెద్ద కమిషనరేట్‌గా అవతరించిన నేపథ్యంలో కమిషనర్ మహేష్ భగవత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కమిషనరేట్‌లో 3జోన్‌ల ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వారంలో ఒకరోజు ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా డీసీపీ కార్యాలయాల్లోనే అందుబాటులో ఉంటూ ఫిర్యాదులను స్వీకరించారు. ఆ ఫిర్యాదులను చట్టపరంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయం కొన్ని నెలల క్రితం నేరేడ్‌మెట్‌కు మారినా సీపీ మహేష్ భగవత్ మాత్రం ప్రతి మంగళవారం ఎల్బీనగర్‌లో ప్రజాదర్బార్‌ను కొనసాగిస్తున్నారు.
మూడేళ్లలో ‘4సీ’కి వచ్చిన ఫిర్యాదులు 591
పోలీసు స్టేషన్‌లలో బాధితులకు న్యాయం జరగని పక్షంలో కమిషనర్‌ను కలిసేందుకు ఉమ్మడి సైబరాబాద్ కమిషనరేట్‌లో అప్పటి సీపీ సీవీ ఆనంద్ ‘4సీ’సెల్‌ను ఏర్పాటుచేశారు. అప్పట్లో కమిషనర్‌ను నేరుగా కలిసేందుకు అవకాశం ఉండేది కాదు. ఠాణాలో ఎస్‌హెచ్‌వో స్పందించుకుంటే ఆ తర్వాత ఏసీపీ, డీసీపీని కలవాల్సి వచ్చేది. అక్కడా చర్యలు లేకుంటేనే కమిషనరేట్‌లోని ‘4సీ’విభాగంలో ఫిర్యాదు స్వీకరించేవారు. అప్పుడే కమిషనర్‌ను కలిసి పరిస్థితి వివరించే అవకాశం ఉండేది. అయితే ఏసీపీ, డీసీపీలను కలవకున్నా నేరుగా ప్రజాదర్బార్‌లో పోలీసు కమిషనర్‌ను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో కమిషనరేట్‌లోని ‘4సీ’విభాగానికి కొంతమేర ఫిర్యాదులు తగ్గుతున్నాయి. మూడేళ్లలో ‘4సీ’కి 591 ఫిర్యాదులు వస్తే 415 పరిష్కారమయ్యాయి. మిగతావి వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి.
దర్యాప్తు వేగిరంగా.. నిష్పక్షపాతంగా
తన దృష్టికి వచ్చే ఫిర్యాదులపై కమిషనర్ తక్షణమే స్పందిస్తున్నారు. చట్టపరిధిలో అందుకు తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత ఠాణాల ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అనంతరం దర్యాప్తు పురోగతి క్రమాన్ని సంబంధిత పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు కమిషనర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఠాణాల్లో ఫిర్యాదు చేసినా స్పందన లేని కేసుల్లో తీవ్రతను బట్టి అవసరమైతే దర్యాప్తు బాధ్యతను ఆ ఠాణాకు సంబంధం లేని అధికారులకు అప్పగిస్తున్నారు. ఈ కేసుల్నీ కమిషనర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న దృష్ట్యా దర్యాప్తు వేగిరంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అస్కారం ఏర్పడుతోంది. ఈ విధంగా ప్రజాదర్బార్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా భూకబ్జా కేసులే ఎక్కువగా ఉండటంతో ఎస్‌వోపీ నిబంధనల ప్రకారం బాధితులకు న్యాయం చేసేందుకు కమిషనర్ చొరవ చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment