
సాక్షి, హైదరాబాద్: జరిమానాలకు జనం ఏమాత్రం జడవడం లేదు. ట్రాఫిక్ పోలీసులు కేవలం 11 నెలల్లో రూ.100 కోట్లకు పైగా చలానాలు విధించారంటే ఉల్లంఘనులు ఏస్థాయిలో చెలరేగుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న వాహనాలు, మితిమీరిన వేగం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ వరకు ఒక్క ఓవర్‌స్పీడ్‌లోనే అత్యధికంగా 29 లక్షల కేసుల్లో రూ.82 కోట్ల చలానాలు విధించడం వాహనదారుల మితిమీరిన వేగానికి నిదర్శనం. ప్రతిరోజూ 58 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా 16 మంది మరణిస్తున్నారు. 60 మంది క్షతగాత్రులవుతున్నారు. ప్రతి నిమిషానికీ 6 ఓవర్‌స్పీడ్ కేసులు నమోదవడం వాహనదారుల దూకుడును సూచిస్తోంది.
ప్రమాదాలకు కారణాలు...
వాస్తవానికి రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను పరిశీలిస్తే.. జాతీయ రహదారులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జరుగుతుండటం గమనార్హం. సైబరాబాద్ (570), రాచకొండ (503), సంగారెడ్డి (310), వరంగల్ (239), ఖమ్మం (204), సిద్దిపేట (185) నిజామాబాద్ (178)ల్లో రోడ్డు ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి. అధికలోడు, మితిమీరిన వేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, పెరుగుతున్న వాహనాల సంఖ్య కారణంగా రోడ్డు ప్రమాదాలు, చలానాలు అధికంగా నమోదయ్యేందుకు కారణమవుతున్నాయని రోడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment