ప్రతీకాత్మక చిత్రం
గుమ్మఘట్ట: అతి వేగంతో ప్రయాణిస్తున్న ఆటో, కారు ఢీకొన్న ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం గోనబావి సమీపాన సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోయ రాజశేఖర్ (27), అతని కుమార్తె రష్మిత (5), గొల్ల నాగమ్మ (64), ఆమె కుమార్తె గొల్ల లక్ష్మీదేవి (64), నాగమ్మ మనవడు మహేంద్ర (9) మృత్యువాత పడగా.. బోయ రూప, ఆమె కుమారుడు రాము తీవ్రంగా గాయపడ్డారు.
వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం వెస్ట్ కోడిపల్లికి చెందిన బోయ రాజశేఖర్, రూప దంపతులు కుమార్తె రష్మిత, కుమారుడు రాముతో కలిసి శనివారం సొంత ఆటోలో పైదొడ్డి గ్రామానికి వెళ్లారు. ఆటోను అక్కడే బంధువుల ఇంటివద్ద నిలిపి.. మరో 15 మంది బంధువులతో కలసి క్రూయిజర్ వాహనంలో కర్ణాటక రాష్ట్రంలోని హులిగెమ్మ క్షేత్రానికి వెళ్లారు. అక్కడ తమ కుమారుడైన రాముకు కేశఖండనం చేయించి ఆదివారం రాత్రి పైదొడ్డి గ్రామానికి తిరిగొచ్చి రాత్రి అక్కడే బస చేశారు. సోమవారం ఉదయం రాజశేఖర్ దంపతులు పిల్లలతో తమ ఆటోలో సొంతూరికి పయనమయ్యారు. వారి వెంటే బయలుదేరిన రాజశేఖర్ పినతల్లి ఈశ్వరమ్మ మార్గంమధ్యలో కలుగోడు క్రాస్ వద్ద దిగిపోయింది.
బతిమాలి ఆటో ఎక్కి..
ఆటో మరో 15 కిలోమీటర్లు వెళ్లి ఉంటే అందరూ సురక్షితంగా ఇంటికి చేరేవారు. కానీ.. పూలకుంట వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న ముప్పలకుంటకు చెందిన గొల్ల నాగమ్మ, ఆమె కుమార్తె లక్ష్మీదేవి, మనవడు గొల్ల మహేంద్ర (9) ఆ ఆటోలో ఎక్కేందుకు ప్రయత్నించారు. వద్దని ఎంత చెబుతున్నా వినకుండా బతిమాలి అదే ఆటోలో ఎక్కారు. కిలోమీటర్ దూరం కూడా వెళ్లకముందే గోనబావి సమీపాన ఆటో, మహీంద్ర కారు అతివేగంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటో నుజ్జునుజ్జు కాగా.. అందులో ఉన్న బోయ రాజశేఖర్, కుమార్తె రష్మిత, గొల్ల నాగమ్మ, ఆమె మనవడు మహేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు.
బోయ రూప, కుమారుడు రాము, గొల్ల లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గొల్ల లక్ష్మీదేవి చనిపోయింది. మెరుగైన వైద్యం కోసం రూపను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి, రామును కర్నూలుకు తరలించారు. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారు డ్రైవర్, వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రతాప్‌రెడ్డి స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment