auto and car accident
-
రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టిన కారు
సాక్షి,బెంగళూరు/పూతలపట్టు(యాదమరి)/వెల్దుర్తి: ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఏపీకి వస్తున్న కర్ణాటక పోలీసులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో కారు డ్రైవర్ కూడా మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి.కొత్తకోట రైల్వే బ్రిడ్జి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పూతలపట్టు ఎస్ఐ మనోహర్ కథనం ప్రకారం.. గంజాయి కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటకలోని శివాజీనగర్ పోలీసులు శనివారం రాత్రి ఇన్నోవా, ఫార్చ్యునర్ కార్లలో విజయనగరానికి బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో యాదమరి మండలం వద్దకు వచ్చేసరికి తమకు అందిన ఆదేశాల మేరకు ఫార్చ్యునర్ కారులో కొందరు పోలీసులు తిరిగి కర్ణాటకకు వెళ్లిపోగా.. మిగిలిన వారు ఇన్నోవా కారులో విజయనగరానికి బయల్దేరారు. తెల్లవారుజామున 4.30 గంటలకు పూతలపట్టు మండలం పి.కొత్తకోట వద్దకు రాగానే.. ఇన్నోవా కారు డ్రైవర్ జోసఫ్(28) నియంత్రణ కోల్పోయి రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టాడు. దీంతో డ్రైవర్ జోసఫ్ సహా అందులో ప్రయాణిస్తున్న ఎస్ఐ అవినాష్(29), కానిస్టేబుల్ అనిల్(26) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎస్ఐ దీక్షిత్, కానిస్టేబుల్ శరవణబసవకు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి.. అనంతరం వేలూరు సీఎంసీకి తరలించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, వెస్ట్ సీఐ శ్రీనివాసులు, కర్ణాటకలోని పులకేశీనగర ఏసీపీ అబ్దుల్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. కారును ఢీకొట్టిన లారీ : ఐదుగురి దుర్మరణం కర్ణాటకలోని కొప్పళ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. చిన్నాళ గ్రామానికి చెందిన దేవప్పకొప్పద(62), గిరిజమ్మ(45), శాంతమ్మ(32), పార్వతమ్మ(32), కస్తూరమ్మ(22) శనివారం రాత్రి కుకనూరు తాలూకా బిన్నాళ గ్రామంలో జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తిరుగు ప్రయాణమవ్వగా.. రాత్రి 10.30 సమయంలో భానాపుర వద్ద వీరి కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దేవప్ప, గిరిజమ్మ, శాంతమ్మ, పార్వతమ్మ, కస్తూరమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆటో కారు ఢీ.. ముగ్గురి మృతి ఆటోను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. ఆదివారం సాయంత్రం డోన్ వైపు నుంచి వస్తున్న ఆటో వెల్దుర్తి గ్రామంలోకి మలుపు తిరుగుతుండగా.. కర్నూలు నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఆటో బోల్తా పడగా.. కారు డివైడర్ పైకెక్కి ఆగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బేతంచెర్ల మండలం మర్రికుంటకు చెందిన తిమ్మమ్మ(60) అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డి, హైవే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రగాయాలైన ఆటో డ్రైవర్ కల్లూరుకు చెందిన అయ్యస్వామి (46)ని, మరో గుర్తుతెలియని వ్యక్తి(50)ని, తిమ్మమ్మ కోడలు వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి మేనల్లుడు చిన్నారి గౌతమ్‌ను 108 అంబులెన్సులో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలోనే డ్రైవర్ అయ్యస్వామి మృతి చెందగా, గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. కారులోని ఎయిర్బెలూన్లు తెరుచుకోవడంతో అందులో ఉన్న దంపతులు, వారి కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఐదుగుర్ని బలిగొన్న అతివేగం
గుమ్మఘట్ట: అతి వేగంతో ప్రయాణిస్తున్న ఆటో, కారు ఢీకొన్న ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం గోనబావి సమీపాన సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోయ రాజశేఖర్ (27), అతని కుమార్తె రష్మిత (5), గొల్ల నాగమ్మ (64), ఆమె కుమార్తె గొల్ల లక్ష్మీదేవి (64), నాగమ్మ మనవడు మహేంద్ర (9) మృత్యువాత పడగా.. బోయ రూప, ఆమె కుమారుడు రాము తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం వెస్ట్ కోడిపల్లికి చెందిన బోయ రాజశేఖర్, రూప దంపతులు కుమార్తె రష్మిత, కుమారుడు రాముతో కలిసి శనివారం సొంత ఆటోలో పైదొడ్డి గ్రామానికి వెళ్లారు. ఆటోను అక్కడే బంధువుల ఇంటివద్ద నిలిపి.. మరో 15 మంది బంధువులతో కలసి క్రూయిజర్ వాహనంలో కర్ణాటక రాష్ట్రంలోని హులిగెమ్మ క్షేత్రానికి వెళ్లారు. అక్కడ తమ కుమారుడైన రాముకు కేశఖండనం చేయించి ఆదివారం రాత్రి పైదొడ్డి గ్రామానికి తిరిగొచ్చి రాత్రి అక్కడే బస చేశారు. సోమవారం ఉదయం రాజశేఖర్ దంపతులు పిల్లలతో తమ ఆటోలో సొంతూరికి పయనమయ్యారు. వారి వెంటే బయలుదేరిన రాజశేఖర్ పినతల్లి ఈశ్వరమ్మ మార్గంమధ్యలో కలుగోడు క్రాస్ వద్ద దిగిపోయింది. బతిమాలి ఆటో ఎక్కి.. ఆటో మరో 15 కిలోమీటర్లు వెళ్లి ఉంటే అందరూ సురక్షితంగా ఇంటికి చేరేవారు. కానీ.. పూలకుంట వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న ముప్పలకుంటకు చెందిన గొల్ల నాగమ్మ, ఆమె కుమార్తె లక్ష్మీదేవి, మనవడు గొల్ల మహేంద్ర (9) ఆ ఆటోలో ఎక్కేందుకు ప్రయత్నించారు. వద్దని ఎంత చెబుతున్నా వినకుండా బతిమాలి అదే ఆటోలో ఎక్కారు. కిలోమీటర్ దూరం కూడా వెళ్లకముందే గోనబావి సమీపాన ఆటో, మహీంద్ర కారు అతివేగంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటో నుజ్జునుజ్జు కాగా.. అందులో ఉన్న బోయ రాజశేఖర్, కుమార్తె రష్మిత, గొల్ల నాగమ్మ, ఆమె మనవడు మహేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. బోయ రూప, కుమారుడు రాము, గొల్ల లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గొల్ల లక్ష్మీదేవి చనిపోయింది. మెరుగైన వైద్యం కోసం రూపను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి, రామును కర్నూలుకు తరలించారు. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారు డ్రైవర్, వైఎస్సార్సీపీ నాయకుడు ప్రతాప్‌రెడ్డి స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ సంతాపం తెలిపారు. -
కారు బోల్తా : ముగ్గురికి గాయాలు
భీమారం(చెన్నూర్) : పెద్దపల్లి జిల్లా సు ల్తానాబాద్ నుంచి మంచిర్యాల జిల్లా చె న్నూరు మండలం కత్తెరశాల మల్లన్న జాతరకు కారులో వెళ్తుండగా భీమారం జోడువాగుల వద్ద జాతీయ రహదారిపై బోల్తా పడింది. ముందు వెళ్తున్న ట్రాలీఆటోను ఓవర్ టేక్ చేసే క్రమంలో అదు పు తప్పి రెండు పల్టీలు కొట్టడంతో ము గ్గురు గాయపడ్డారు. మహాశివరాత్రి సం దర్భంగా కత్తెరశాల మల్లికార్జున స్వామి ఆలయంలో జరిగే జాతరలో బోనాలు పోసుకొనేందుకు సుల్తానాబాద్‌కు చెంది న బాకం సంపత్ తన కుటుంబసభ్యులతో కలిసి కారులో వెళ్తున్నారు. భీమారం వద్ద పండ్ల లోడుతో ముందు వెళ్తున్న ఆటోను తప్పించి ముందుకు వెళ్లే క్రమంలో కారు అదుపు కాకపోవడంతో ఆటో ను ఆటోను ఢీ కొట్టింది. ఇందులో కారు నడుపుతున్న యజమాని సంపత్, తల్లి మల్లమ్మ, సమ్మక్కకు తలతోపాటు కాళ్ల కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108లో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఆటోను ఢీకొన్న కారు
పెద్దవడుగూరు (తాడిపత్రి) : పెద్దవడుగూరు మండలం కాశేపల్లి సమీపంలోని టోల్ గేటు వద్ద నిల్చున్న ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ రమణారెడ్డి కథనం ప్రకారం... జక్కలచెరువుకు చెందిన దçస్తగిరి పామిడిలో నివాసముంటూ పామిడి-గుత్తి మధ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం 11:50 ప్రాంతంలో గుత్తి నుంచి ఆటో పామిడికి బయలుదేరింది. మార్గమధ్యంలోని టోల్ గేటు వద్దకు రాగానే అక్కడ డాబా నిర్వహించే వ్యక్తి ఆటో దిగి డబ్బులు ఇస్తుండగా, అదే సమయంలో గుత్తి వైపు నుంచి అనంతపురం వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చంద్రశేఖర్, రేణుక సహా గుత్తి ఆర్ఎస్కు చెందిన రామచంద్ర, పామిడి మహమ్మద్ అలీ, కృష్ణవేణి, వెంకటరమణమ్మ, ప్రసాద్ ఆటో డ్రైవర్ దస్తగిరి తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108లో గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకకోసం అనంతపురం తరలించారు. గాయపడిన వారిలో ఇంకా కొందరి వివరాలు తెలియరాలేదు.