ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు
సాక్షి,బెంగళూరు/పూతలపట్టు(యాదమరి)/వెల్దుర్తి: ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఏపీకి వస్తున్న కర్ణాటక పోలీసులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో కారు డ్రైవర్ కూడా మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి.కొత్తకోట రైల్వే బ్రిడ్జి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పూతలపట్టు ఎస్‌ఐ మనోహర్ కథనం ప్రకారం.. గంజాయి కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటకలోని శివాజీనగర్ పోలీసులు శనివారం రాత్రి ఇన్నోవా, ఫార్చ్యునర్ కార్లలో విజయనగరానికి బయల్దేరారు.
ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో యాదమరి మండలం వద్దకు వచ్చేసరికి తమకు అందిన ఆదేశాల మేరకు ఫార్చ్యునర్ కారులో కొందరు పోలీసులు తిరిగి కర్ణాటకకు వెళ్లిపోగా.. మిగిలిన వారు ఇన్నోవా కారులో విజయనగరానికి బయల్దేరారు. తెల్లవారుజామున 4.30 గంటలకు పూతలపట్టు మండలం పి.కొత్తకోట వద్దకు రాగానే.. ఇన్నోవా కారు డ్రైవర్ జోసఫ్(28) నియంత్రణ కోల్పోయి రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టాడు. దీంతో డ్రైవర్ జోసఫ్ సహా అందులో ప్రయాణిస్తున్న ఎస్‌ఐ అవినాష్(29), కానిస్టేబుల్ అనిల్(26) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎస్‌ఐ దీక్షిత్, కానిస్టేబుల్ శరవణబసవకు తీవ్రగాయాలయ్యాయి.
వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి.. అనంతరం వేలూరు సీఎంసీకి తరలించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, వెస్ట్ సీఐ శ్రీనివాసులు, కర్ణాటకలోని పులకేశీనగర ఏసీపీ అబ్దుల్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.
కారును ఢీకొట్టిన లారీ : ఐదుగురి దుర్మరణం
కర్ణాటకలోని కొప్పళ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. చిన్నాళ గ్రామానికి చెందిన దేవప్పకొప్పద(62), గిరిజమ్మ(45), శాంతమ్మ(32), పార్వతమ్మ(32), కస్తూరమ్మ(22) శనివారం రాత్రి కుకనూరు తాలూకా బిన్నాళ గ్రామంలో జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తిరుగు ప్రయాణమవ్వగా.. రాత్రి 10.30 సమయంలో భానాపుర వద్ద వీరి కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దేవప్ప, గిరిజమ్మ, శాంతమ్మ, పార్వతమ్మ, కస్తూరమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఆటో కారు ఢీ.. ముగ్గురి మృతి
ఆటోను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. ఆదివారం సాయంత్రం డోన్ వైపు నుంచి వస్తున్న ఆటో వెల్దుర్తి గ్రామంలోకి మలుపు తిరుగుతుండగా.. కర్నూలు నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఆటో బోల్తా పడగా.. కారు డివైడర్ పైకెక్కి ఆగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బేతంచెర్ల మండలం మర్రికుంటకు చెందిన తిమ్మమ్మ(60) అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి, హైవే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
తీవ్రగాయాలైన ఆటో డ్రైవర్ కల్లూరుకు చెందిన అయ్యస్వామి (46)ని, మరో గుర్తుతెలియని వ్యక్తి(50)ని, తిమ్మమ్మ కోడలు వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి మేనల్లుడు చిన్నారి గౌతమ్‌ను 108 అంబులెన్సులో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలోనే డ్రైవర్ అయ్యస్వామి మృతి చెందగా, గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. కారులోని ఎయిర్‌బెలూన్లు తెరుచుకోవడంతో అందులో ఉన్న దంపతులు, వారి కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment