గొల్లెన శివరాం, బక్కతట్ల ఉమామహేశ్, గాయపడిన సిద్ధూ
సాక్షి, గోదావరిఖని(రామగుండం): ‘ఇప్పుడే వస్తానమ్మా.. అంటూ బండి తీసుకుని బైటికిపోయినవ్. చూసిచూసి అర్ధరాత్రి ఐతంది బిడ్డా.. ఎక్కడికి పోయినవ్ రా.. అని ఫోన్ చేసిన. అన్నం తినకుండా పోయినవ్.. బుక్కెడంత తిందువురారా అని బ్రతిమిలాడిన. దగ్గరనే ఉన్నా అంటివి. గంటలో ఇంటికాడుంటా అంటివి. వచ్చి పడుకున్నావనుకున్నా కొడుకా.. ఇట్లా.. నీ బతుకు తెల్లారుతదనుకోలేదు బిడ్డా.. అంటూ ఆ కన్నతల్లి కడుపు వేదన కన్నీరు పెట్టించింది. బైక్ ప్రమాదంలో చనిపోయిన బక్కతట్ల ఉమామహేశ్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు కాగా.. కొడుకు చదువుకుంటున్నాడని కూరగాయలు అమ్మిన పైసలతో బైక్ కొనిస్తే.. అదే అతడి ప్రాణాలు తీసిందని కన్నీరు మున్నీరయ్యారు.
ప్రాణంతీసిన అతివేగం..
అర్ధరాత్రి.. అతివేగం.. ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. మరొకరు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్పోర్ట్స్ బైక్‌పై ముగ్గురు యువకులు మితిమీరిన వేగంతో ఓ షాపు గోడను బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గోదావరిఖనిలోని రాంనగర్‌కు చెందిన గొల్లెన శివరాం(19), మల్లికార్జునగర్‌కు చెందిన బక్కతట్ల ఉమామహేశ్(21), కొత్తకూరగాయల మార్కెట్‌కు చెందిన బీమ్ల సిద్దూ(17) స్నేహితులు.ముగ్గురు కలిసి సోమవారం రాత్రి తొమ్మిదిగంటలకు మహేశ్ బైక్‌పై బయటకు వెళ్లారు. పదకొండు గంటల సమయంలో ఉమామహేశ్‌కు తల్లిఫోన్‌చేసి త్వరగా ఇంటికి రమ్మని సూచించగా.. గంటలో వస్తానని వెళ్లలేదు.
చదవండి: మైనేమ్ ఈజ్ సుజి, ఐ యామ్ సింగిల్.. అంటూ అందంగా మాట్లాడుతారు
మంగళవారం వేకువజామున ముగ్గురూ కలిసి బైక్‌పై స్టేడియం వైపు నుంచి రమేశ్‌నగర్‌వైపు అతివేగంగా వెళ్తుండగా చౌరస్తా వద్ద అదుపు తప్పి వెంకటేశ్వర్ సైకిల్‌షాప్ గోడకు ఢీకొంది. బైక్ నడుపుతున్న శివరాం గోడకు అతుక్కుని అక్కడికక్కడే దుర్మణం పాలయ్యాడు. వెనకాల కూర్చున్న ఉమామహేశ్ తలకు బలమైన గాయాలు కాగా కరీంనగర్ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. బీమ్ల సిద్దూతలకు బలమైన గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఉమామహేశ్ తండ్రి పోచయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్‌టౌన్‌సీఐ రాజ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శివరాం, సిద్దూ పై గతంలో కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: అంబులెన్స్ లేదు.. పీహెచ్‌సీకి తాళం.. ఆటోలోనే ప్రసవించిన మహిళ
రెండు కుటుంబాల్లో తీరని విషాదం
ఉమామహేశ్ తండ్రి స్థానిక మల్లికార్జున్‌నగర్‌లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ఉమామహేశ్ వరంగల్‌లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. శివరాం తండ్రి సమ్మయ్య మున్సిపల్ కార్యాలయంలో స్వీపర్. ప్రమాదంలో ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడం ఆ కుటుంబంలోనూ అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిద్దూ కుటుంబం కూరగాయల మార్కెట్ సమీపంలో నివాసముంటున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో చికిత్సకు డబ్బులు లేకపోడంతో ఆర్థికసాయం కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రాణాలు తీస్తున్న నైట్‌రైడ్లు
స్పోర్ట్స్‌బైక్‌లపై నైట్‌రైడ్లు యువకుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల కాలంలో యువతకు బైక్‌రైడింగ్ ఫ్యాషన్‌గా మారింది. కొత్త బైక్‌లకు తోడు తమకున్న అలవాట్లు ప్రాణాలు తీస్తున్నాయి. మూడేళ్ల కిందట ఇలాగే రామమందిర్ ఏరియా సమీపంలోని సబ్‌స్టేషన్ వద్ద అర్ధరాత్రి రోడ్డుపై ఉన్న పోల్‌ను ఢీకొని ఇద్దరు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment