
మలయాళ సుందరి అసిన్
మలయాళ సుందరి అసిన్ తెలుగు చిత్రాల్లో నటించడం మానేసి దాదాపు ఏడేళ్లయ్యింది. హిందీ ‘గజిని’ రీమేక్‌లో నటించడానికి అంగీకరించిన తర్వాత మెల్లిగా తమిళ సినిమాలకు కూడా దూరమయ్యారామె. అయితే, హిందీలో ఒకటీ రెండు సినిమాలు మినహా చేయడంలేదు కాబట్టి, ఇకనుంచి దక్షిణాది చిత్రాల్లో కూడా నటించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి ‘గబ్బర్‌సింగ్ 2’లో నటించే అవకాశం ఆమెను వరించింది. ఈ విషయాన్ని అసిన్ తన ట్విట్టర్‌లో స్వయంగా పేర్కొన్నారు. ఓ రెండు రోజుల క్రితమే ‘గబ్బర్‌సింగ్ 2’ యూనిట్ ఆమెను ఈ విషయమై సంప్రదించారట. అయితే, ఈ చిత్రానికి అసిన్ పచ్చజెండా ఊపిందీ లేనిదీ మాత్రం పేర్కొనలేదు.
ప్రస్తుతం ఆమె హిందీలో ‘మేరీ అప్నే’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది మినహా అసిన్ చేతిలో వేరే సినిమాలు లేవు. పైగా పవన్‌కళ్యాణ్ సరసన సినిమా అంటే అది జాక్‌పాట్‌లాంటిదే. కాబట్టి, ఈ అవకాశాన్ని అసిన్ వదులుకోరనే భావించవచ్చు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం త్వరలోనే మొదలు కానుంది. గతంలో ఆమె పవన్‌కళ్యాణ్ సరసన ‘అన్నవరం’లో నటించిన విషయం తెలిసిందే.