నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది... | This story about gabbar singh Movie | Sakshi
Sakshi News home page

నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది...

Published Sat, Feb 20 2016 10:50 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది... - Sakshi

నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది...

సినిమా వెనుక స్టోరీ - 35
ఆ రోజు పవన్‌కల్యాణ్ ‘తమ్ముడు’ సినిమా రిలీజ్. మొత్తం కుర్ర బ్యాచ్. కల్యాణ్ కటౌట్‌కి పాలాభిషేకం చేస్తున్నాడు ఓ కుర్రాడు. పేరు హరీశ్ శంకర్. పవన్‌కు అరివీర భయంకర ఫ్యాన్. ఎప్పటికైనా కల్యాణ్‌ని కలిసి ఓ ఫొటోగ్రాఫు, ఓ ఆటోగ్రాఫూ తీసుకోవా లనేది అతగాడి డ్రీమ్. నెరవేరుతుందా?
   
‘షాక్’తో షాక్ తిన్నాడు హరీశ్ శంకర్. రవితేజ లాంటి హీరోతో అలాంటి డిజాస్టర్ తీసినందుకు ఇంకొకడైతే హర్ట్ అయ్యి ఇండస్ట్రీ నుంచి తిరిగెళ్లిపోతాడు. కానీ హరీశ్ జగమొండి. పోయినచోటే వెతుక్కోవాలనే కసిలో ఉన్నాడు. ఎక్కడ పని దొరికితే అక్కడ వాలిపోయేవాడు. పూరి జగన్నాథ్, నల్లమలుపు బుజ్జి కాంపౌండ్‌లో స్టోరీ సిట్టింగ్స్‌లో కూర్చునే వాడు.
 
రవితేజకు అతనంటే గురి. ఫ్లాపిచ్చిన ప్రతివాడూ పనికిరానివాడని కాదుగా! హరీశ్‌కు ఇంకో చాన్స్ ఇచ్చే ఉద్దేశం ఉంది రవితేజకు. హరీశ్ కూడా రవితేజకు కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ‘ఆంజనేయులు’ షూటింగ్ స్పాట్‌కెళ్తే నిర్మాత బండ్ల గణేశ్ కలిశాడు. సింగిల్ సిట్టింగ్‌లోనే క్లోజ్ అయిపోయారిద్దరూ. హరీశ్ బ్యాడ్‌లక్. రవితేజ రెండు ప్రాజెక్టులు ఒప్పేసుకున్నాడు... ‘శంభో శివ శంభో’, కృష్ణవంశీతో ‘కందిరీగ’.
   
బండ్ల గణేశ్ నుంచి ఫోన్. ‘‘అర్జంట్‌గా ‘నందగిరి హిల్స్’కు రా.’’ నందగిరి హిల్స్ అంటే పవన్‌కల్యాణ్ ఇల్లు ఉన్న ఏరియా. ఆగమేఘాల మీద ఇంటి ముందు వాలిపోయాడు. గేట్లు తెరుచుకున్నాయి. లోపల నుంచి మూడు కార్లు దుమ్ము రేపుకుంటూ బయటికి వెళ్లిపోయాయి.
 
హరీశ్ అయోమయంగా చూస్తున్నాడు. గణేశ్‌కి కాల్ చేస్తే ‘‘నేను కల్యాణ్‌తో ఫామ్‌హౌస్‌కి వెళ్తున్నా, నువ్వు నా కారులో అక్కడికొచ్చేయ్. అదిరిపోయే కథ చెప్పాలి’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. హరీశ్‌కి విపరీతమైన టెన్షన్. కల్యాణ్‌కి ఏ కథ చెప్పాలి? ఎలా చెప్పాలి? మంచి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ చెబుదామా? ఇవే ఆలోచనలు. మళ్లీ గణేశ్ ఫోన్. ‘‘మంచి లవ్‌స్టోరీ ఉంటే... అదే చెప్పు.’’
 
ఇప్పటికిప్పుడు లవ్‌స్టోరీ ఎలా? ఓ బడ్డీకొట్టు దగ్గర కారు ఆపించాడు. సిగరెట్ ముట్టించి, గట్టిగా దమ్ము పీల్చాడు. రవి తేజ కోసం చేస్తున్న లైన్ చెప్పేద్దామా? కల్యాణ్ బాబుకి బావుంటుంది. అప్పటి కప్పుడు టైటిల్ కూడా అనేసుకున్నాడు ‘రొమాంటిక్ రిషి’.
   
ఫామ్ హౌస్. కల్యాణ్ వర్కర్స్‌తో ఏదో మాట్లాడుతున్నాడు. పక్కనే బండ్ల గణేశ్. హరీశ్ అక్కడికెళ్లాడు. ‘‘ఈ రోజు నాకు మూడ్ సరిగ్గా లేదు. ఇంకోరోజు కథ వింటా’’ చెప్పాడు కల్యాణ్. ‘‘బాబూ! ఈ రోజు ఏకాదశి. మంచి రోజు. అతనికి సెంటిమెంట్స్ ఎక్కువ. ఒక అయిదు నిమిషాలైనా కథ వింటే..?’’ అని గణేశ్ తటపటాయిస్తూ చెప్పాడు. ‘‘ఓకే... మీ సెంటిమెంట్స్‌ని నేనెందుకు కాదనాలి’’ అని అక్కడే చెట్టు దగ్గర కూర్చున్నాడు పవన్‌కల్యాణ్.
 
హరీశ్ కథ చెబుతున్నాడు. గంటం పావు గడిచింది. అప్పటికి ఇంటర్వెల్ దాకా చెప్పడం పూర్తయింది. హరీశ్ కథ చెబుతున్నంతసేపూ పగలబడి నవ్వుతూనే ఉన్నాడు కల్యాణ్. ‘‘ఇక చాలు’’ అన్నాడు. హరీశ్ టెన్షన్‌గా చూస్తున్నాడు. ‘‘వియ్ డూ దిస్ ఫిల్మ్’’ అని హరీశ్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి లేచాడు కల్యాణ్. కాస్సేపటి తర్వాత గణేశ్ వచ్చి హరీశ్‌ను హగ్ చేసుకుని కంగాట్స్ చెప్పాడు.  
 హరీశ్ స్క్రిప్టు వర్క్ మొదలెట్టాడు. కల్యాణ్‌కు ఇంకా సెకండాఫ్ చెప్పాలి.

ఛేంజెస్ చెప్పాలి. బెటర్‌మెంట్స్ చెప్పాలి. కానీ అక్కడేమో కల్యాణ్ ఫుల్ బిజీ. అపాయింట్‌మెంట్ కూడా దొరకని స్థితి.
 ఆ టైమ్‌లో ఓ న్యూస్. హిందీ సినిమా ‘లవ్ ఆజ్ కల్’ బేస్‌తో కల్యాణ్ ఓ సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. బండ్ల గణేశ్ ప్రొడ్యూసర్. త్రివిక్రమ్ స్క్రిప్టు రాస్తున్నాడు. డెరైక్టర్ ఎవరో తెలియదు. హరీశ్‌నే చేయమంటారని టాక్. కానీ జయంత్. సి.పరాన్జీ డెరైక్షన్‌లో ‘తీన్‌మార్’ మొదలెట్టారు కల్యాణ్. హరీశ్ పరిస్థితేంటి?
   
కల్యాణ్ ప్రాజెక్ట్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్న టైమ్‌లో రవితేజ నుంచి పిలుపు. అక్కడ ‘కందిరీగ’ ప్రాజెక్ట్ క్యాన్సిల్. హరీశ్ రెడీ అంటే ఇక్కడ సినిమా స్టార్ట్. కల్యాణ్ కోసం తీర్చిదిద్దిన ‘రొమాంటిక్ రిషి’  రవి తేజకు షిఫ్ట్. ‘‘మరీ క్లాస్ టైటిల్లా ఉంది. ‘మిరపకాయ్’ అని పెడదాం’’ రవితేజ సలహా. ఓకే. 2011 సంక్రాంతికొచ్చిన ఈ సినిమా హరీశ్ లైఫ్‌లో కొత్త క్రాంతి తీసుకొచ్చింది. వ్వాట్ నెక్స్‌ట్ హరీశ్?
   
ఫిబ్రవరి 21... తన ఫేవరెట్ డెరైక్టర్ ఈవీవీ చనిపోవడంతో హరీశ్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆయన డెడ్ బాడీని కొంత దూరం మోసి, విషాద హృదయంతో ఇలా ఇంటికొచ్చాడో లేదో... అలా ఫోన్ మోగింది. పవన్ కాలింగ్. స్నానం చేసి ఆదరాబాదరాగా కల్యాణ్ ఇంటికెళ్లేసరికి ఫొటో సెషన్ జరుగుతోంది. కల్యాణ్ పోలీసాఫీసర్ గెటప్‌లో ఉన్నాడు.
 
హరీశ్‌కేం అర్థం కాలేదు. ‘దబంగ్’ను తెలుగులో చేస్తున్నాం, సినిమా పేరు ‘గబ్బర్‌సింగ్’, డెరైక్టర్‌వి నువ్వే’’ చెప్పాడు కల్యాణ్ తాపీగా. ‘‘ఎంత రెమ్యునరేషన్ కావాలి?’’ కల్యాణ్ డెరైక్ట్ క్వశ్చన్. ప్రొడ్యూసర్ కూడా ఆయనే మరి. హరీశ్ మాత్రం డబ్బుల గురించి మాట్లాడటం లేదు. పూనకం వచ్చినవాడిలా ఉన్నాడతను.
 
‘‘దబంగ్‌కి జిరాక్స్‌లా దీన్ని తీయకూడదు సార్. మీ ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్పులూ చేర్పులూ, డైలాగ్స్ రాసే అవకాశమివ్వండి చాలు. అదే నాకు పెద్ద రెమ్యునరేషన్’’ చెప్పాడు నిజాయతీగా. కల్యాణ్ నవ్వుతూ అడ్వాన్స్ కవర్ అతని చేతికిచ్చాడు. నెక్స్ట్ మినిట్‌లో మీడియాకు న్యూస్ వెళ్లిపోయింది.
   
హరీశ్ ఓ ఉన్మాదంలో  ఉన్నాడు. గబ్బర్‌సింగ్ అంటే రెట్టమతంగా ఉండే పోలీసాఫీసర్. అతనా పేరెందుకు పెట్టు కున్నాడు లాంటి లాజిక్స్ మిస్ కాకుండా, కల్యాణ్‌ని మాస్ ఎలా చూడాలనుకుంటు న్నారో అలా స్క్రిప్ట్‌ని డిజైన్ చేసుకున్నాడు.
 కోల్‌కతాలో ‘పంజా’షూటింగ్ జరుగు తుంటే స్క్రిప్టు వినిపించడానికెళ్లాడు. కల్యాణ్ వెంటనే కనెక్టయిపోయాడు. టక టకా తన సజెషన్స్ చెప్పేశాడు. ‘‘పోలీస్ స్టేషన్లో రౌడీలతో అంత్యాక్షరి సీన్ పెడదాం. బాగా కామెడీ క్రియేట్ చేయొచ్చు. ‘పాడమంటే పాడేది పాట కాదు’ లాంటి మంచి మంచి పాటలు పెడదాం’’ అని హింట్ ఇచ్చాడు. ఓకే సార్ అన్నాడు హరీశ్.
 
‘గబ్బర్‌సింగ్’ స్టార్ట్. ప్రొడ్యూసర్ పవన్ కల్యాణ్ కాదు... బండ్ల గణేశ్. హీరో యిన్‌గా శ్రుతీహాసన్‌ను తీసుకుంటే? ఐరన్ లెగ్ అన్నారు చాలామంది. కల్యాణ్ మాత్రం ఆమెకే ఓటు. ఇంకెవరూ మాటా ్లడ్డానికి లేదు. 2011 డిసెంబర్ 4... మిట్ట మధ్యాహ్నం 12 గంటల 20 నిముషాలకు ఫస్ట్ షాట్ తీశారు.
 
అవతల ‘పంజా’ డిజాస్టర్. ఫ్యాన్స్ నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. ‘గబ్బర్ సింగ్’ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని రకరకాల డౌట్లు. ఫ్యాన్స్‌కు ఓ భరోసా ఇవ్వాలంటే టీజర్ రిలీజ్ చేయాలి. ఇంకా ఓ షెడ్యూలు కూడా ఫినిష్ కాకుండా టీజర్ చేయడమంటే కష్టమే.
 హరీశ్‌కో ఐడియా వచ్చింది. కల్యాణ్‌తో ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పించి, టీజర్ రిలీజ్ చేయిస్తే? ఐడియా బాగుంది. డైలాగ్ కూడా బాగా వచ్చింది. ‘‘నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది’’... ఇదీ డైలాగ్.
 
ఇబ్బంది పడుతూనే కల్యాణ్ దగ్గరకు వెళ్లాడు. డైలాగ్ చెప్పగానే కల్యాణ్  సంబరపడిపోయి, క్లాప్స్ కొట్టేశాడు. టీజర్ రెడీ. ఆ ఒక్క టీజర్‌తో ‘గబ్బర్‌సింగ్’ ఎలా ఉండబోతోందో ఆడియన్స్ స్మెల్ చేసేశారు.
 ‘దబంగ్’లోని ‘మున్నీ బద్‌నామ్’ తరహాలో ఐటమ్ సాంగ్ కావాలి. మిగతా పాటలన్నీ చిటికెలో చేసిచ్చేసిన మ్యూజిక్ డెరైక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఈ సాంగ్‌కి రాత్రింబవళ్లూ తలకొట్టుకుంటున్నాడు. దేవి ఫాదర్, రైటర్ సత్యమూర్తి ఆ టైమ్‌కి అక్కడే ఉన్నారు. ‘‘ఎందుకురా టెన్షన్. ‘కెవ్వు కేక’ అని మొదలుపెట్టు’’ అన్నా రాయన. దేవి చెలరేగిపోయాడు.
 
‘అంత్యాక్షరి’ ఎపిసోడ్ గురించి చాలా కసరత్తులే చేశారు. డెరైక్షన్ డిపార్ట్‌మెంట్ అంతా వర్క్ చేసి 300 పాటలు సెలక్ట్ చేశారు. వాటిల్లోంచి కొన్ని ఎంచుకున్నారు. పోలీస్ స్టేషన్ సెట్‌లో రౌడీ గ్యాంగ్‌తో రోజంతా తీయాలని ప్లాన్ చేశారు. కట్ చేస్తే - 4 గంటల్లోనే అయిపోయింది.
 సినిమా మొత్తం చాలా స్మూత్‌గా జరిగి పోయింది. డబ్బింగ్ సెషన్ కూడా హ్యాపీనే. అంతా కంప్లీట్ అయ్యాక డబ్బింగ్ ఫ్లోర్‌కి దణ్ణం పెట్టి, ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అవనుంది. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. టేక్ కేర్’’ అన్నాడు కల్యాణ్.
   
2012 మే 11. ఎండ దెబ్బకు రాళ్లు సైతం పగిలిపోతున్నాయి. ఇక్కడ ‘గబ్బర్‌సింగ్’ దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర పాత రికార్డులన్నీ బద్దలైపోతున్నాయి.
 ఆ థియేటర్ దగ్గర ఫుల్ ప్యాక్డ్‌గా జనం. పవన్ కల్యాణ్ కటౌట్‌కి క్షీరాభిషేకం చేస్తున్నారు. పక్కనే హరీశ్ శంకర్ కటౌట్. దానికీ క్షీరాభిషేకం.
 ఇదంతా చూసి హరీశ్ శంకర్ కళ్లు చెమర్చాయి. అతనికి తన ఫ్లాష్‌బ్యాక్ గుర్తొచ్చింది.
 
హిట్ డైలాగ్స్
* ‘‘నేను ఆయుధాలతో చంపను. వాయిదాలతో చంపుతా’’ అనే బ్రహ్మానందం డైలాగ్ రాసింది ఈ సినిమా కో-డెరైక్టర్ శంకరమంచి రాజశేఖర్. అందుకే టైటిల్స్‌లో ఆయన పేరు వేశారు.
* నేను ఆయుధాలతో చంపను... వాయిదాలతో చంపుతా
* నేను ఆకాశం లాంటోణ్ణి. ఉరు మొచ్చినా మెరుపొచ్చినా ఇలానే ఉంటాను ఠి నేను ట్రెండ్ ఫాలో అవ్వను... ట్రెండ్ సెట్ చేస్తా
* కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు
- పులగం చిన్నారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement